హైకోర్టు ఆదేశాలా.. అయితే మాకేంటి! | Discretion of the authorities in teacher appointments | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఆదేశాలా.. అయితే మాకేంటి!

Published Mon, Oct 28 2024 8:25 AM | Last Updated on Mon, Oct 28 2024 8:25 AM

Discretion of the authorities in teacher appointments

జిల్లాకో తీరు నియామకాలతో స్పోర్ట్స్‌ కోటా’కు అన్యాయం 

టీచర్‌ నియామకాల్లో అధికారుల ఇష్టారాజ్యం 

అనర్హులకు పోస్టింగ్‌.. అర్హులకు మొండిచేయి

హైకోర్టు ఫలితాలు ఆపమన్నా.. బేఖాతర్‌ చేస్తూ ఏకంగా నియామకాలు   

 సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు ఆదేశాలన్నా కొందరు అధికారులు లెక్కలేనట్లు వ్యవహరిస్తున్నారు. తాము ఆదేశాలిచ్చే వరకు ఫలితాలు ప్రకటించవద్దని చెప్పినా బేఖాతర్‌ చేశారు. ఫలితాలు వెల్లడించడమే కాదు ఏకంగా పోస్టింగ్‌లు కూడా ఇచ్చేశారు. ఇదేమని అడిగితే అసలు కోర్టు ఆదేశాలే లేవంటూ విద్యాశాఖ అధికారులు సెలవిస్తున్నారు. దీంతో టీచర్ల నియామకంలో అన్యాయం జరిగిందని కోర్టుకెక్కిన స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్‌ పోస్టుల భర్తీ కోసం 2024, ఫిబ్రవరి 29న ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. 

వీటిలో స్పోర్ట్స్‌ కోటాకు సంబంధించి 2018లో ప్రభుత్వం జీవో 107ను విడుదల చేసింది. దీని ప్రకారం ఫామ్‌–1.. ఇంటర్నేషనల్‌ గేమ్స్, ఫామ్‌–2.. నేషనల్‌ గేమ్స్‌(అసోసియేషన్‌), ఫామ్‌–3.. నేషనల్‌ గేమ్స్‌(యూనివర్సిటీ లెవెల్‌), ఫామ్‌–4.. నేషనల్‌ గేమ్స్‌(సూ్కల్‌/స్టేట్‌ లెవెల్‌)గా పరిగణిస్తారు. ఆయా ఆటల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు నియామకాల్లో సంబంధిత ఫామ్‌లను సమరి్పంచాల్సి ఉంటుంది. దీన్ని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (శాట్‌) పరిశీలించి డైరెక్టరేట్‌కు పంపిస్తుంది. ప్రాధాన్యత ఆధారంగా స్పోర్ట్‌ కోటాలో వీరిని భర్తీ చేశారు. 

అయితే తాజా డీఎస్సీలో ఫామ్‌–1, ఫామ్‌–2 ఉన్న అభ్యర్థులకు మాత్రమే కొన్ని జిల్లాల్లో పోస్టింగ్‌ ఇవ్వగా.. మరికొన్ని జిల్లాల్లో ఫామ్‌–3, ఫామ్‌–4 వారికి కూడా ఇచ్చారని, ఫామ్‌–3, ఫామ్‌–4 ఉన్నా తమకు ఇవ్వలేదనేది బాధితుల ప్రధాన ఆరోపణ. ఇంకొందరు రాష్ట్రస్థాయి క్రీడాకారులే అయినా జాతీయ స్థాయి ఫామ్‌ అందజేశారని.. శాట్‌ పరిశీలించకుండానే డైరెక్టరేట్‌కు అందజేయడంతో అలాంటి వారు కూడా ఉద్యోగాలు పొందారని అంటున్నారు. టీచర్‌ పోస్టులకు సంబంధించి శాట్‌కు దాదాపు 390 దరఖాస్తులు వచ్చాయి. వీటిని సమగ్రంగా పరిశీలించి నిజంగా వారు ఆయా రంగాల్లో ప్రతిభ కనబరిచారా? లేదా? అనేది చూడాలి. కానీ శాట్‌ వచ్చినవి వచ్చినట్లు పంపేయడంతో అవకతవకలు చోటుచేసుకున్నాయని వారు చెబుతున్నారు.   

నవంబర్‌ 21 వరకు..

జీవో సరిగా లేదంటూ నల్లగొండ జిల్లా కేతేపల్లికి చెందిన ఆర్‌.రమేశ్‌తోపాటు మరో 9 మంది హైకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్‌ పుల్ల కార్తీక్‌ ధర్మాసనం వీరి పిటిషన్‌పై సెపె్టంబర్‌ 25న విచారణ చేపట్టింది. ఎస్‌జీటీ పోస్టుల భర్తీకి పిటిషనర్ల నుంచి సరి్టఫికెట్లన్నీ తీసుకుని పరిశీలించాలని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పిటిషనర్ల ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్‌ 21కి వాయిదా వేసింది. అయినా ఈలోపే ఫలితాలు వెల్లడించారు. పిటిషనర్లలో ఒక్కరు మాత్రమే ఎంపికైనట్లు ప్రకటించి ఉద్యోగం ఇచ్చారు.

ఎలాంటి జీవో లేకుండా..
ప్రభుత్వంగానీ, శాట్‌గానీ, నియామక డైరెక్టరేట్‌గానీ ఫామ్‌–1, ఫామ్‌–2 ఉన్న వాళ్లకే స్పోర్ట్స్‌ కోటా కింద పోస్టింగ్‌లు ఇస్తామని చెప్పలేదు. ఎలాంటి జీవో ఇవ్వలేదు. ప్రాధాన్యత ఆధారంగా మొదట ఫామ్‌–1 వారికి.. లేకుంటే ఫామ్‌–2 వారికి.. లేకుంటే ఫామ్‌–3 వారికి.. లేకుంటే ఫామ్‌–4 వారికి ఉద్యోగం ఇవ్వాలి. మాకు హైకోర్టు ఉత్తర్వులిచి్చనా వాటిని డైరెక్టరేట్‌ పాటించలేదు. నల్లగొండ జిల్లాలో స్పోర్ట్స్‌ కోటాలో లేరంటూ ఆ పోస్టులు జనరల్‌ అభ్యర్థులకు ఇచ్చారు.  
– ఆర్‌.రమేశ్, బాధితుడు

ఇదెక్కడి న్యాయం... 
ఎంసెట్‌ లాంటి వాటికే స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లను ఫిజికల్‌గా తనిఖీ చేస్తున్నప్పుడు.. పోస్టింగ్‌లకు దాన్ని ఎందుకు అమలు చేయరు? ఆన్‌లైన్‌లో ఎవరు ఏది పెడితే అది పంపిస్తారా? స్కూల్‌ అసిస్టెంట్‌ను గ్రూప్‌–1 స్థాయిగా, ఎస్‌జీటీని గ్రూప్‌–2 స్థాయి పోస్టులుగా ప్రభుత్వం పేర్కొంటోంది. మరి ఇంత ప్రాధాన్యమున్న ఉద్యోగాల భర్తీలో పారదర్శకత ఏదీ? ప్రభుత్వం బాధితులతో మాట్లాడి పరిష్కారం చూపాలి.  
– కృష్ణమూర్తి, బాధితుడు  

శాట్‌ పరిశీలన ప్రకారమే..  
స్పోర్ట్స్‌ అథారిటీ ఫైనల్‌ చేసిన తర్వాతే మేం నిర్ణయం తీసుకుంటాం. 393 దరఖాస్తులను పంపిస్తే శాట్‌ పరిశీలన చేసి 35 మంది అర్హులను మాకు పంపారు. ఫామ్‌–1, ఫామ్‌–2 వారికి అవకాశం ఇచ్చారు. ఇద్దరు నాన్‌ లోకల్, 33 మంది లోకల్‌ వారికి పోస్టింగ్‌లు వచ్చాయి. ఇతరులు కూడా తమకు అర్హత ఉందని చెబుతున్నారు. అనుమానం ఉంటే మరోసారి అప్లికేషన్లు ఇస్తే శాట్‌కు పంపించి పరిష్కరిస్తాం. హైకోర్టు నుంచి మాకు ఎలాంటి ఆదేశాల్లేవు. పోస్టింగ్‌లు ఇచ్చాక ఇప్పుడు చేసేదేం లేదు. 
– డైరెక్టర్, పాఠశాల విద్య   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement