న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో వారసత్వ పార్టీలు ఉద్యోగాల పేరిట ‘రేటు కార్డ్‌ల’తో యువతను దోచుకుంటున్నాయని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం యువత ప్రయోజనాల పరిరక్షణ కోసం(సేఫ్‌గార్డ్) పని చేస్తోందని ఉద్ఘాటించారు. వారసత్వ పార్టీలా? లేక మంచి చేసే ప్రభుత్వమా? యువత భవిష్యత్తు ఎవరిపై ఆధారపడాలన్నది దేశమే తేల్చుకుంటుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ మంగళవారం రోజ్‌గార్ మేళాలో పాల్గొన్నారు.
వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన 70,000 మందికిపైగా యువతీ యువకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఇప్పటి విపక్షాలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డాయని పరోక్షంగా కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. పథకాల పేరిట ప్రజాధనం దోచుకున్నాయని ఆరోపించారు. ఉద్యోగాల నియామకాల్లోనూ అవినీతి, అవకతవకలు జరిగాయన్నారు.
రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని ప్రోత్సహించడం ద్వారా వారసత్వ పార్టీలు యువతను దగా చేస్తున్నాయని ఆక్షేపించారు. తమ ప్రభుత్వం వచ్చాక పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు ప్రజా సాధికారతే లక్ష్యంగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. గతంలో నియామక ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాదికిపైగా సమయం పట్టేదని, ఇప్పుడు నెలల వ్యవధిలోనే పారదర్శకంగా పూర్తి చేస్తున్నామని గుర్తుచేశారు.
నిర్ణయాత్మకత.. మన గుర్తింపు
సమాజంలో విభజన తెచ్చేందుకు, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని పార్టీలు భాషను ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాంటి పెడపోకడలు కనిపిస్తున్నాయని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీని, హిందీ భాషను బూచిగా చూపిస్తూ పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.
ప శ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు రేటు కార్డులు, కట్ మనీ వంటివి కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ రేటు కార్డులు యువత కలలను, సామర్థ్యాలను ఛిద్రం చేస్తున్నాయని చెప్పారు. ఉద్యోగాలు ఇప్పించినందుకు బదులుగా పేద రైతుల నుంచి భూములు తీసుకున్నందుకు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు.
ఆర్థిక వ్యవస్థకు కొత్త ధీమా
దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ముద్రా యోజన, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యక్రమాలతో స్వయం ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. ఆర్థికంగా వేగంగా ముందుకు సాగుతున్నామని, మన దేశ ఆర్థిక వ్యవస్థకు గతంలో ఇలాంటి విశ్వాసం, ధీమా ఎన్నడూ లభించలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment