ఖాతాలు ఇచ్చిన ధీమా | Sakshi Guest Column On Jan Dhan Yojana | Sakshi
Sakshi News home page

ఖాతాలు ఇచ్చిన ధీమా

Published Wed, Aug 28 2024 4:46 AM | Last Updated on Wed, Aug 28 2024 4:46 AM

Sakshi Guest Column On Jan Dhan Yojana

అభిప్రాయం

ప్రధాని నరేంద్ర మోదీ తన తొలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో 2014 ఆగస్ట్‌ 15న ‘ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన’ పథక ప్రకటన చేశారు. ఈ పథకానికి ఇప్పుడు పదో వార్షికోత్సవం జరుపుకొంటున్నాం. ఆర్థిక వ్యవస్థకు వెలుపలే ఉండిపోయిన కోట్లాది మందిని అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చే ప్రతిష్ఠాత్మక, సవాలుతో కూడిన చర్యను అప్పటి కొత్త ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది. అందులో అది అద్భుతమైన విజయం సాధించింది. 2024 ఆగస్టు 14 నాటికి 53.13 కోట్ల మంది జన్‌ ధన్‌ యోజన లబ్ధిదారులుగా ఉండగా, వారు జమచేసిన మొత్తం రూ.2.31 లక్షల కోట్లు అయింది. ఈ లబ్ధిదారుల్లో దాదాపు ముప్పై కోట్ల మంది మహిళలు ఉండటం గమనార్హం.

అధికారం, హోదా, పలుకుబడి లేదా భౌతిక సంపద – ఏదైనా సరే, మనం వాటిని ఆశించి, సాధించే దిశగా బలంగా కృషి చేస్తే మన విజయంతో మనమే సంతోషిస్తాం. కానీ ఆ విజయానందం కొద్దికాలమే నిలుస్తుంది. తర్వాత మన మనసు మరోదానికి మారుతుంది. సాధించినది అప్పటికి ఒక ప్రమాణంగా మారిపోతుంది. ఇంకా అంతుచిక్కకుండా ఉన్నది మరో అన్వేషణకో లేదా అశాంతికో కారణం అవుతుంది. ఇది చాలామంది మనుషులకు వర్తిస్తుంది. 

ప్రజా విధానాల విషయంలోనూ ఇదే విధానాన్ని మనం అవలంబిస్తున్నాం. నిర్దిష్ట విధానాలు లేదా చర్యలు తీసుకోవాలని మనం గళమెత్తుతున్నాం. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక సమస్యను పరిష్కరిస్తే, ఇక ప్రమాణాల స్థాయి మరింతగా పెరుగుతుంది. దాంతో సాధించిన విజయానికి తగిన గుర్తింపు లేకపోవడమేగాక, వ్యతిరేక భావనతో దిగువ స్థాయిలో యథాతథ స్థితి కొనసాగుతోంది. పదో వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన (పీఎంజేడీవై) అలాంటి అంశాల్లో ఒకటి.

కోట్లాది మంది భారతీయులు ఆర్థిక వ్యవస్థకు వెలుపలే ఉండటం మీద చాలాకాలం మనం విచారం ప్రకటించాం. అందుకే వారిని అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చే ప్రతిష్ఠాత్మక, సవాలుతో కూడిన చర్యను 2014లో అప్పటి కొత్త ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది. అందులో అది అద్భుత విజయం సాధించింది. 2024 ఆగస్టు 14 నాటికి 53.13 కోట్ల మంది జన్‌ ధన్‌ యోజన లబ్ధిదారులుగా ఉండగా, వారు జమచేసిన మొత్తం రూ.2.31 లక్షల కోట్లు అయింది. ఈ లబ్ధిదారుల్లో దాదాపు ముప్పై కోట్ల మంది మహిళలు ఉండటం గమనార్హం.

ముందుకు జరిగిన అభివృద్ధి
‘‘2008లో ఆర్థిక సమ్మిళిత్వం, అధికారిక గుర్తింపు రెండూ తక్కువ స్థాయిలో ఉండడాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఓ దశాబ్దం క్రితం భారత్‌ అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంది. బ్యాంకు ఖాతాల గణాంకాలు, తలసరి జీడీపీతో సంబంధాల ఆధారంగా – భారత్‌ పూర్తి సాంప్రదాయక వృద్ధి ప్రక్రియలపైనే ఆధారపడి ఉంటే 80 శాతం మంది వయోజనులు బ్యాంకు ఖాతా సాధించడానికి 47 సంవ త్సరాలు పట్టేదన్నది ఒక స్థూల అంచనా’’ అని ‘బ్యాంక్‌ ఫర్‌ ఇంట ర్నేషనల్‌ సెటిల్మెంట్స్‌’ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు  ‘డిజిటల్‌ ఆర్థిక మౌలిక సదుపాయాల రూపకల్పన: భారత్‌ నుంచి పాఠాలు’ (బీఐఎస్‌ పేపర్స్‌ నం.106, డిసెంబర్‌ 2019) శీర్షికతో ఉన్న ఒక పరిశోధనా పత్రం వెలువరించారు. 

‘బ్యాంకింగ్‌లో లేనివారిని బ్యాంకులతో అనుసంధానించడం: 280 మిలియన్ల కొత్త బ్యాంకు ఖాతాలు ఆర్థిక ప్రాప్యత గురించి ఏం చెప్తున్నాయి?’ పేరుతో సెప్టెంబర్‌ 2023లో మరో పరిశోధనా పత్రం వెలువడింది. దొంగతనాల ముప్పు ఉన్న ప్రాంతాల్లో జన్‌ దన్‌ యోజన ఖాతాల వినియోగం ఎక్కువగా ఉండడంతో, వారికి సంపా దనను కాపాడుకోవడంలో అవి దోహదపడ్డాయని ఈ పరిశోధన వెల్లడిస్తోంది. సాధారణంగా అధిక వడ్డీ రేట్లు వసూలు చేసే అనధికారిక వనరుల నుంచి రుణాలు తీసుకోవడాన్ని కూడా ఇది తగ్గించింది.

కానీ ఇది తక్షణ తీర్పులిచ్చే లోకం. మినహాయింపుల స్థాయిని దాటి ఆ తీరే ఒక ప్రామాణికంగా మారింది. పీఎంజేడీవై ఖాతాలు ఎక్కువగా ‘జీరో బ్యాలెన్స్‌’ ఖాతాలేనంటూ కొందరు విమర్శకులు ఎత్తి చూపారు. వాస్తవం ఏమిటంటే, ఈ ఖాతాలన్నింటిలో మొత్తం రూ.2.31 లక్షల కోట్లు  జమ అయ్యాయి. ఈ ఖాతాల వల్ల ఉప యోగం ఎంత అమూల్యమైనదో కోవిడ్‌ విపత్తు సమయంలో రుజువైంది. 

ప్రయోజనాలను నేరుగా కేంద్ర ప్రభుత్వం ఈ ఖాతాలకు బదిలీ చేసింది. మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2020 నుంచి 2022 వరకు), దాదాపు 8.1 లక్షల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. డిజిటల్‌ చెల్లింపుల మౌలిక సదుపాయాల పరిణామం వల్ల కోవిడ్‌ విపత్తు కీలక సమయంలో నగదురహిత చెల్లింపులను ఇది సులభతరం చేసింది.

సార్వత్రిక బ్యాంకింగ్‌ను సాధ్యం చేయడంతోపాటు, వినియో గదారు అనుమతితో ఆర్థిక సంస్థకు సమాచార బదిలీలను పీఎంజేడీవై సులభతరం చేసిందని తాజా పరిశోధన (‘రుణ ప్రాప్యతను సార్వత్రిక బ్యాంకింగ్‌ విస్తరిస్తుందా?’, ఆగస్టు 2024) వెల్లడిస్తోంది. మరీ ముఖ్యంగా పీఎంజేడీవై ఖాతాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫిన్‌ టెక్‌ నేతృత్వంలో రుణ వృద్ధి పెరిగింది. చౌక, మెరుగైన ఇంటర్నెట్‌ అనుసంధానం ఉన్న ప్రాంతాలలో ఈ ప్రభావాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ‘ఖాతా సంకలనం’ అన్నది సార్వత్రిక బ్యాంకింగ్‌ వ్యక్తీకరణ. ప్రజలు మరిన్ని ఆర్థిక ఉత్పత్తులు, సేవలు పొందడానికి ఇది వీలు కల్పిస్తుంది.

మహిళలకు స్వావలంబన
మహిళలకు సొంత ఖాతాలు, వాటిలో డబ్బులతో పీఎంజేడీవై వారికి సాధికారత కల్పించింది. ఈ ఆర్థిక స్వావలంబనను అంచనా వేయడం కష్టం. కానీ ఇది ముఖ్యమైనది. సాధారణంగా భారత మహిళలు ఎక్కువగా పొదుపు చేయడానికి ఇష్టపడతారు. క్రమంగా, అది కుటుంబాల ఆర్థిక భద్రతను, జాతీయ పొదుపు రేటును పెంచుతుంది. ఇంకా, అది దేశంలో మహిళా వ్యవస్థాపకతను పెంచుతుంది. 

స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా ద్వారా వెల్లువెత్తిన వ్యవస్థాపకతలో మహిళల భాగస్వామ్యం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు స్టార్టప్‌ ఇండియానూ; మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి స్టాండప్‌ ఇండియా పథకాన్నీ ప్రభుత్వం ప్రారంభించింది. పీఎం ముద్ర యోజన కింద 68 శాతం రుణాలను మహిళా పారిశ్రామిక వేత్తలకు మంజూరు చేయడం జరిగింది. 

స్టాండప్‌ ఇండియా పథకం కింద 2024 మే నాటికి లబ్ధిదారుల్లో 77.7 శాతం మంది మహిళలు ఉన్నారు. 2024 జూలై 30 నాటికి, ‘ఉద్యమ్‌’, ‘యూఏపీ’ పథకాలలో నమోదైన దేశంలోని మహిళల యాజమాన్యంలోని ‘ఎంఎస్‌ఎంఈ’ల (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ)ల సంఖ్య 1.85 కోట్లకు పైగా ఉంది. పీఎంజేడీవై ఖాతాలు మహిళలను సాధికారులను చేసి, స్వయం ఉపాధి/వ్యవస్థాపకతల్లో ప్రవేశించేలా వారికి దోహదపడ్డా యన్న భావన గణనీయమైనది. ఇది అధికారిక పరిశోధనకు అర్హమైనది.

ఇక వ్యతిరేక భావనల సవాళ్లనూ పరిశీలిద్దాం. ప్రధానమంత్రి జన్‌ ధన్‌ యోజన ద్వారా ఖాతాదారులకు లభించిన ప్రయోజనాల ఆధారాల నేపథ్యంలో వాటిని పరిశీలించడం అంత కష్టమేం కాదు. పీఎంజేడీవైని ప్రారంభించడంపై దూరదృష్టితో నిర్ణయం తీసుకుని, తక్కువ వ్యవధిలో దానిని విజయవంతంగా అమలు చేయలేకపోతే గనక గత దశాబ్దపు అభివృద్ధిలో భారత్‌ సాధించిన విజయాలు గణనీ యంగా తక్కువగా ఉండేవి.

వి. అనంత నాగేశ్వరన్‌ 
వ్యాసకర్త ఆర్థికవేత్త;
భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement