నరేంద్ర మోదీ మూడోసారి భారత ప్రధానిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు (జూన్ 10) మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో కొత్త మంత్రుల శాఖలను కూడా ప్రకటించారు. ఈ తరుణంలోనే పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సొంతింటి కలను నిజం చేయడానికి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
నరేంద్ర మోదీ.. ఇతర కేంద్ర మంత్రుల మంత్రివర్గ సమావేశంలో పీఎం ఆవాస్ యోజన కింద ఏకంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దేశంలో సొంతింటి కలను నిజం చేసుకునే వారికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఓ గొప్ప వరం అనే చెప్పాలి.
పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయాలనే సదుద్దేశ్యంతో.. 2015-16 బడ్జెట్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రకటించారు. అర్హత కలిగిన పేద ప్రజలు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుంది. గడిచిన 10 సంవత్సరాల్లో పీఎం ఆవాస్ యోజన కింద 4.21 కోట్ల ఇల్లు పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఇళ్ల నిర్మాణాలు మాత్రమే కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరుగుదొడ్లు, ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్, విద్యుత్తు కనెక్షన్, కుళాయి (నల్లా) కనెక్షన్ వంటివి కూడా ఉన్నాయి. ఇవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలు చేయడం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment