PM Awas Yojana
-
ఇళ్ల నిర్మాణ వ్యయంలో భారీ కోత..?
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామీణ గృహనిర్మాణ పథకం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G)కు 2025 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత వ్యయం కంటే తక్కువ ఖర్చు చేయనున్నట్లు అంచనా. ఈ పథకం అమలుకు గతంలో అంచనా వేసిన దానికంటే రూ.20,000 కోట్లు కోత విధించబోతున్నట్లు తెలిసింది. ఈ పథకానికి సంబంధించి 2025-26 ఏడాదికి వాస్తవ వ్యయం సుమారు రూ.35,000 కోట్లు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని గత బడ్జెట్(Budget) అంచనా రూ.54,500 కోట్ల కంటే చాలా తక్కువ.2025 నుంచి వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని, గ్రామీణ కుటుంబాలకు అందుబాటు ధరల్లో గృహాలను అందించాలని పీఎంఏవై-జీ లక్ష్యంగా పెట్టుకుంది. పక్కా గృహాల నిర్మాణానికి యూనిట్‌కు రూ.2.39 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. అయితే, రాబోయే ఆర్థిక సంవత్సరానికి ముందుగా అనుకున్న మేరకు ఖర్చు చేయలేరనే అంచనాలు వెలువడుతున్నాయి. దాంతో ఈ పథకం లక్ష్యం నీరుగారినట్లువుతుందని లబ్ధిదారులు, మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పథకం రెండో దశ ప్రారంభంలో ఆర్థిక సాయం అందించడంలో తీవ్రంగా జాప్యం జరగడమే ఈ అంచనాకు ప్రధాన కారణం. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు సర్వే కొనసాగుతోందని, 2025 మార్చి వరకు ఈ సర్వే జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దాంతో సర్వే పూర్తై, నిధులు విడుదలై, ఇళ్ల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా 2025-26లో పథకం అమలు వ్యయంలో కోత విధిస్తారనే అంచనాలతో ఇళ్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారుతుంది.ఇదీ చదవండి: చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలిపీఎం జన్‌మన్‌కు రూ.3.06 లక్షల కోట్లు2025 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లలో 20 లక్షల పక్కా గృహాలను నిర్మించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM JANMAN)ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం పీఎంఏవై-జీ 2.0లో భాగంగా ఉంది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం రూ.3.06 లక్షల కోట్లు కేటాయించింది. ఇలా ప్రధానంగా పీఏంఏవై-జీ అమలులో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అదే తరహా కొత్త పథకాలు ప్రవేశపెట్టి లబ్ధిదారులను తగ్గిస్తుండడం పట్ల విమర్శలు వస్తున్నాయి. -
2.70 లక్షల ఇళ్లు ఇవ్వండి: సీఎం రేవంత్ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో తెలంగాణకు బీఎల్సీ మోడల్లో 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రికి వివరించారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. తెలంగాణలో రాష్ట్ర సర్కారు నిర్మించ తలపెట్టిన 25 లక్షల ఇళ్లలో 15 లక్షల ఇళ్లు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని కేంద్ర మంత్రికి తెలిపారు. వాటిని లబ్ధిదారు ఆధ్వర్యంలో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం (బీఎల్సీ) విధానంలో నిర్మించనున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ)– పీఎంఏవై (యూ) పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద మంజూరు చేసే ఇంటి నిర్మాణ వ్యయం నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాము నిర్మించే ఇళ్లను పీఎంఏవై (యూ) మార్గదర్శకాల ప్రకారం నిర్మిస్తామని వివరించారు. పీఎంఏవై (యూ) కింద ఇప్పటివరకు తెలంగాణకు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి, రూ.2,390.58 కోట్లు గ్రాంటుగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇందులో ఇప్పటివరకు రూ.1,605.70 కోట్లే ఇచ్చారని, మిగతా నిధులు విడుదల చేయాలని కోరారు. స్మార్ట్‌సిటీ మిషన్ కాలపరిమితి పొడిగించండి స్మార్ట్‌సిటీ మిషన్ కింద చేపట్టిన పనులు పూర్తికానందున మిషన్ కాలపరిమితిని 2025 జూన్ వరకు పొడిగించాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ నగరాల్లో పనులు చేపట్టినట్టు తెలిపారు. వరంగల్‌లో 45 పనులు పూర్తయ్యాయని, రూ.518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతున్నాయని.. కరీంనగర్లో 25 పనులు పూర్తయ్యాయని, రూ.287 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయని వివరించారు. స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితి ఈ ఏడాది జూన్ 30తో ముగుస్తోందని.. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనులు ముగిసేందుకు వీలుగా మరో ఏడాది పొడిగించాలని కోరారు. రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి బదలాయించండి హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాల కోసం 2,500 ఎకరాల రక్షణశాఖ భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో రాజ్‌నాథ్‌సింగ్‌ను రేవంత్ కలిశారు. ర్యావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం ఉపయోగించుకుంటున్న విషయాన్ని రక్షణ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ భూములు కీలకమని చెప్పారు. ఆర్సీఐ రాష్ట్ర ప్రభుత్వ భూములను వినియోగించుకుంటున్నందున.. బదులుగా రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పగించాలని కోరారు. భూముల పరస్పర బదిలీకి అంగీకరించాలని విజప్తి చేశారు. వరంగల్ సైనిక్ స్కూల్ ఇవ్వండి.. వరంగల్ నగరానికి కేంద్రం సైనిక్ స్కూల్ మంజూరు చేసినా.. గత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం తెలిపారు. ఆ సైనిక్ స్కూల్ అనుమతుల గడువు ముగిశాయని.. ఆ అనుమతులను పునరుద్ధరించాలని లేదా తాజాగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, రామసహాయం రఘురాంరెడ్డి, బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. నీట్‌పై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి: రేవంత్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించామని సీఎం రేవంత్ తెలిపారు. రక్షణ భూముల బదలాయింపు, మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో రైలు, పీఎంఏవై ఇళ్ల విషయంలో విజ్ఞప్తులు అందజేశామని చెప్పారు. కేంద్ర మంత్రులను కలసిన తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాం«దీలతో భేటీ రేవంత్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. డిఫెన్స్ శాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరామని.. సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని చెప్పారు. యూపీలో మూడు, ఏపీలో రెండు సైనిక్ స్కూళ్లు ఉన్నాయని.. కానీ తెలంగాణలో ఒక్కటి కూడా లేదని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ పదేళ్ల పాటు అడగలేదని, ప్రధాని మోదీ ఇవ్వలేదని విమర్శించారు. నీట్ పరీక్ష నిర్వహణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఈ కేసును సీబీఐతో కాకుండా జ్యుడీషియల్ విచారణ జరిపించాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. ఆ కేసును ఖతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘నీట్ పరీక్ష నిర్వహణలో మోదీ గ్యారంటీ ఏదీ? యువతకు మోదీ భరోసా ఏది?’అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తోనే నా రాజకీయ జన్మ ప్రారంభమైంది: పోచారం శ్రీనివాసరెడ్డి తన రాజకీయ జన్మ కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైందని, చివరికి ముగిసేది కూడా కాంగ్రెస్‌లోనే అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం సీఎం రేవంత్‌రెడ్డితోపాటు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డికి ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత పోచారం మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు ఎన్టీఆర్ పిలుపుతో తాను టీడీపీలో చేరానని, కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లు పనిచేశానని చెప్పారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమర్థ పాలన అందిస్తున్నారని.. రైతులకు మంచి జరగాలనే ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నానని చెప్పారు. -
మోదీ కేబినెట్ తొలి నిర్ణయం: పేద ప్రజలకు శుభవార్త
నరేంద్ర మోదీ మూడోసారి భారత ప్రధానిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు (జూన్ 10) మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో కొత్త మంత్రుల శాఖలను కూడా ప్రకటించారు. ఈ తరుణంలోనే పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సొంతింటి కలను నిజం చేయడానికి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.నరేంద్ర మోదీ.. ఇతర కేంద్ర మంత్రుల మంత్రివర్గ సమావేశంలో పీఎం ఆవాస్ యోజన కింద ఏకంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దేశంలో సొంతింటి కలను నిజం చేసుకునే వారికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఓ గొప్ప వరం అనే చెప్పాలి.పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయాలనే సదుద్దేశ్యంతో.. 2015-16 బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రకటించారు. అర్హత కలిగిన పేద ప్రజలు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుంది. గడిచిన 10 సంవత్సరాల్లో పీఎం ఆవాస్ యోజన కింద 4.21 కోట్ల ఇల్లు పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఇళ్ల నిర్మాణాలు మాత్రమే కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరుగుదొడ్లు, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, విద్యుత్తు కనెక్షన్, కుళాయి (నల్లా) కనెక్షన్ వంటివి కూడా ఉన్నాయి. ఇవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలు చేయడం జరిగింది. -
Interim Budget 2024: మధ్య తరగతికి...సొంతింటి వరం!
న్యూఢిల్లీ: దేశ హౌసింగ్ రంగానికి మరింత ఊతమిచ్చే దిశగా ఆర్థిక మంత్రి సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కరోనా అనంతరం సొంతిళ్ల కోసం డిమాండ్ పెరగ్గా.. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా హౌసింగ్ రంగానికి, పేద, మధ్య తరగతి వాసులకు మంత్రి తీపి కబురు చెప్పారు. ముఖ్యంగా కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు అందుబాటు ధరల ఇళ్లకు ప్రోత్సాహంపై దృష్టి సారించారు. ‘‘అద్దె ఇళ్లల్లో లేదా మురికివాడలు, అనధికారిక కాలనీల్లో నివసించే అర్హత కలిగిన మధ్యతరగతి ప్రజలు.. ఇంటి కొనుగోలుకు లేదా ఇంటి నిర్మాణానికి వీలుగా ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభిస్తుంది’’అని మంత్రి సీతారామన్ తెలిపారు. అలాగే, వచ్చే ఐదేళ్ల కాలంలో పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం కింద గ్రామీణ పేదల కోసం మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇది రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి దోహదం చేస్తుందని, ఉపాధి కల్పనకు దారితీస్తుందని ప్రాపర్టీ డెవలపర్లు, కన్సల్టెంట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరి ఇళ్లు ‘‘కరోనా వల్ల అవరోధాలు ఎదురైనప్పటికీ పీఎం ఆవాస్ యోజన పథకం అమలును కొనసాగించాం. మూడు కోట్ల ఇళ్ల లక్ష్యానికి చేరువలో ఉన్నాం. వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించి ఇస్తాం’’అని మంత్రి సీతారామన్ ప్రకటన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఇళ్లు సమకూర్చడమనే లక్ష్యంతో కేంద్ర సర్కారు 2016లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకాన్ని ప్రారంభించింది. 2024 మార్చి నాటికి 2.95 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. పరిశ్రమ డిమాండ్లు.. షాపూర్జీ పల్లోంజీ రియల్ ఎస్టేట్ ఎండీ, సీఈవో వెంకటేష్ గోపాలకృష్ణన్ ప్రభుత్వ చర్యలను గుర్తిస్తూనే.. ఈ రంగం పూర్తి సామర్థ్యాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు వచ్చే బడ్జెట్లో లకి‡్ష్యత చర్యలను ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘పట్టణ, సుస్థిరాభివృద్ధికి ప్రకటించిన చర్యలు దేశీయ రియల్ ఎస్టేట్‌పై దీర్ఘకాలంలో సానుకూల ప్రభావం చూపిస్తాయి’’ అని గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎండీ, సీఈవో గౌరవ్ పాండే పేర్కొన్నారు. మూలధన వ్యయాలను పెంచడం , అందుబాటు ధరల ఇళ్లపై ప్రభుత్వం మరింతగా దృష్టి సారించడాన్ని టాటా రియల్టీ ఎండీ, సీఈవో సంజయ్ దత్ ప్రస్తావించారు. ‘‘ఊహించినట్టుగానే బడ్జెట్లో భారీ ప్రకటనలు ఏవీ లేవు. కానీ, మౌలిక వసతులను మెరుగు పరచడానికి, దేశవ్యాప్త అనుసంధానతపై దృష్టిని కొనసాగించడం.. రియల్ ఎస్టేట్ వృద్ధికి మేలు చేస్తుంది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. ప్రోత్సాహకరం.. బడ్జెట్ ప్రతిపాదనలపై క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు బొమాన్ ఇరానీ స్పందించారు. ఈ తరహా చర్యలు ప్రోత్సాహకరమని, హౌసింగ్ మార్కెట్ వృద్ధికి సాయపడతాయన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిపై స్థిరమైన దృక్పథం హౌసింగ్ రంగానికి ఊతమిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ పథకం ద్వారా హౌసింగ్ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తన మద్దతు కొనసాగించడం ప్రశంసనీయమని నరెడ్కో ప్రెసిడెంట్ జి.హరిబాబు పేర్కొన్నారు. పట్టణ మధ్యతరగతి వాసులకు కొత్త పథకాన్ని ప్రకటించడం సామాన్యుల్లోనూ, రియల్ ఎస్టేట్ పరిశ్రమలోనూ విశ్వాసాన్ని పెంచుతుందన్నారు. నూతన పథకానికి సంబంధించి మరింత స్పష్టత కోసం చూస్తున్నట్టు చెప్పారు. ఎన్నో సానుకూలాంశాలు.. ఆర్థిక వ్యవస్థగా, అపార వాగ్దాన వ్యవస్థగా, అభివృద్ధి చెందిన దేశం వైపు భారత్ పయనిస్తున్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది. గ్రామీణ, పర్యాటకం, మహిళా సాధికారత, సాంకేతికతపై దృష్టి సారించి ప్రజా పనుల కోసం మూలధన వ్యయాన్ని నిరంతరం పెంచడం పట్ల సంతోషిస్తున్నాము. రూ.1 లక్ష కోట్ల నిధి వంటి ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. ఇది గొప్ప బడ్జెట్. – సంజీవ్ పురీ, చైర్మన్, ఐటీసీ. ప్రజాకర్షక చర్యలు ప్రకటించలేదు.. సీతారామన్ ప్రెజెంటేషన్ అతిచిన్న ప్రసంగాల్లో ఒకటి. తక్కువ మాటల్లో ఎక్కువ విషయాలు ఉన్నాయి. ఇది స్వాగతించదగినది. నిశ్శబ్ద విశ్వాసాన్ని తెలియజేస్తుంది. ఎన్నికల ముందు బడ్జెట్లలో సంప్రదాయంగా ఊహించినట్లుగా ఎలాంటి ప్రజాకర్షక చర్యలు ప్రకటించలేదు. ఆర్థిక లోటు లక్ష్యం అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంది. – ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్ భవిష్యత్తును ప్రతిబింబించేలా.. 60 బిలియన్ డాలర్ల వార్షిక ఎఫ్‌డీఐ స్థాయిని మరింత పెంచడానికి కొన్ని సాహసోపేతమైన చర్యలు అవసరం. డిజిటల్ అవస్థాపనపై మరింత ఊపుతో పాటు బ్యాంకింగ్, విద్యుత్ రంగ సంస్కరణలు మెరుగైన వికసిత్ భారత్‌కు ఆవశ్యకమైనవి. మధ్యంతర బడ్జెట్ ప్రజాకర్షక చర్యలకు దూరంగా ఉన్నందున వర్తమానాన్ని చాకచక్యంగా నిర్వహిస్తూ భవిష్యత్తును ప్రతిబింబించే సమయం, దృక్పథం రెండింటినీ సూచిస్తుంది. – జి.పి.హిందూజా, చైర్మన్, హిందూజా గ్రూప్ ఆవిష్కరణలకు దన్ను.. దేశీ ఫార్మా 2030 నాటికి 120–130 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో వర్ధమాన రంగాల్లో పరిశోధనల కోసం రూ. 1 లక్ష కోట్ల కేటాయింపనేది ఆవిష్కరణలకు దన్నుగా నిలవగలదు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, స్థానికంగా తయారీని ప్రోత్సహించే చర్యలు స్వాగతించతగ్గవి. – సతీష్ రెడ్డి, చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.. వివేకవంతమైన, సమ్మిళిత బడ్జెట్. సబ్కా సాథ్ సబ్కా వికాస్‌కు అనుగుణంగా అవసరాలు, ఆకాంక్షలకు ప్రాధాన్యతనిస్తూ గరీబ్ కళ్యాణ్, నారీ శక్తి, యువ (యువ సాధికారత), అన్నదాత (రైతుల సాధికారత) గురించి ఉద్ఘాటించడం ప్రభుత్వ దార్శనికత, అందరి సమగ్ర అభివృద్ధికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. – çపవన్ ముంజాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హీరో మోటో -
ఇల్లు కట్టుకునేవారికి గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త పథకం!
New Housing Loan Subsidy Scheme: పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త వడ్డీ రాయితీ పథకాన్ని సెప్టెంబర్ నెలలోనే ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ పథకాన్ని ప్రకటించారు. “మధ్యతరగతి కుటుంబాలు సొంత ఇల్లు కొనాలని, కట్టుకోవాలని కలలు కంటున్నాయి. నగరాల్లోని మురికివాడల్లో, అద్దె ఇళ్లల్లో నివసిస్తూ కాలం వెల్లదీస్తున్న కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే కొత్త పథకాన్ని రాబోయే సంవత్సరాల్లో తీసుకురాబోతున్నాం. వారు సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు వడ్డీ రాయితోపాటు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తాం ” అని మోదీ చెప్పారు. పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలకు సెప్టెంబర్ నెలలో తీసుకొచ్చే కొత్త పథకం ఇప్పుడున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి పొడిగింపు. అయితే కొత్త పథకంలో వడ్డీ రాయితీని పొందే అర్హతను పెంచనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
బడ్జెట్ 2023: ఇళ్ల కొనుగోలుదారులకు శుభవార్త.. ఆ పథకానికి భారీగా నిధులు పెంపు!
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్లో సొంతింట కలను సాకారం చేసుకోవాలనుకున్న వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం ఆవాస్ యోజన పథకానికి ( PMAY) ఈ సారి బడ్జెట్లో నిధులు భారీగా పెంచింది. గత బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజనకు 48 వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79వేల కోట్లు కేటాయించారు. ఇప్పటికే వడ్డీ రేట్లు పెరిగి సామాన్యుల ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ పెంపు నేపథ్యంలో గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశం. పీఎంఏవై కేటాయింపుల పెంపు గృహ రుణాలకు డిమాండ్‌ను పెంచడమే కాకుండా, సిమెంట్ రంగానికి కూడా సానుకూలాంశమని చెప్పచ్చు. దేశ ప్రజలకు పక్కా ఇళ్లను అందించాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2015లో ప్రధన మంత్రి ఆవాస యోజన ని ప్రారంభించింది. మధ్య ఆదాయం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS), తక్కువ-ఆదాయ సమూహాలు (LIG) వారికి సహాయం చేసేందుకు ఈ పథకం ప్రారంభించారు. -
ప్రధాని ‘ఇంటి ప్రకటన’పై రాజకీయ దుమారం
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఇచ్చిన ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భారీగా ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెబుతూ ఓ ఇంటి ముందు ఒక మహిళ నిలబడి ఉన్న ఫొటోను ప్రకటనగా చేసి ప్రచురించారు. ప్రధాన పత్రికలతో పాటు సోషల్ మీడియాలో ఆ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనపై రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రకటనలో ఉన్న మహిళ పేరు లక్ష్మిదేవి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత్తాలోని బౌబజార్‌లో మలాంగలో ఆమె నివసిస్తోంది. ‘ఆమె ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా లక్ష్మీదేవికి ఇల్లు వచ్చింది’ అని ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనను చూసిన లక్ష్మి షాక్‌కు గురైంది. ఆ ఫొటో ఎవరూ తీసుకున్నారో.. ఎప్పుడు తీసుకున్నారో తెలియదని మీడియాకు చెప్పింది. ఇంకా ఆమె చెప్పిన వివరాలు తెలుసుకుంటే అవాక్కయ్యే పరిస్థితి. లక్ష్మీదేవి ఉండేది అద్దె ఇంట్లో. అది కూడా ఒకే ఒక గది ఉన్న ఇంటిలో కుటుంబసభ్యులు మొత్తం ఆరుగురు ఉంటారు. ఆ ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేదు. ఉంటున్న గదికి నెలకు రూ.500 అద్దెగా చెల్లిస్తున్నారు. బాబుఘాట్‌లో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి వెళ్లామని.. అప్పుడు ఆ ఫొటో తీసి ఉండొచ్చని లక్ష్మి తెలిపింది. తాను చదువుకోలేదని.. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని పేర్కొంది. తనను బీజేపీ నాయకులు ఎవరు కలవలేదని చెప్పింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ నాయకుడు రాహూల్ గాంధీ కూడా స్పందించి దానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. మళ్లీ మళ్లీ అబద్ధాలు చెప్పడానికి కూడా జ్ఞానం ఉండాలి అని ట్వీట్ చేశారు. ఈ అబద్ధపు ప్రచారంపై తృణమూల్ కాంగ్రెస్ కూడా తీవ్రంగా స్పందిస్తోంది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇవ్వడాన్ని తృణమూల్ కాంగ్రెస్ తప్పు పట్టింది. बार-बार दोहराने पर भी, झूठ झूठ ही रहता है!#FactCheck pic.twitter.com/yvl6tf7yCW — Rahul Gandhi (@RahulGandhi) March 22, 2021 -
పేదల సొంతింటి కల సాకారానికి శ్రీకారం
సాక్షి, అమరావతి: పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ముందడుగు వేసింది. అందరికీ ఇళ్లు ఏర్పాటు చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన ప్రతిపాదన లకు ఆమోదం లభించింది. నవరత్నాలు, పీఎం ఆవాస్ యోజన కింద తొలిదశలో రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో 1,24,624 ఇళ్ల నిర్మాణానికి పేదలకు ఆర్థిక సహాయం చేసే ప్రతిపాదనలను ఆమోదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు/ మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో లబ్ధిదారుడికి రూ.2.50 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్ వెలుపల పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఒక్కో లబ్ధిదారుడికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాయి. ఇదే రీతిలో తరువాతి దశల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలనేది ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో... రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు అన్నవారు లేకుండా అందరికీ సొంతిల్లు ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. ఇప్పటికే రాష్ట్రంలో ఇళ్లులేని పేదలకు 25 లక్షల ఇళ్ల స్థలాలను ఉగాది పండుగ నాటికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో కూడా పేదలకు సొంత గూడు ఉండాలనే ఉద్దేశంతో నవరత్నాల పథకాల కింద ఆర్థిక సహాయం అందజేసేలా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళిక(డీపీఆర్) రూపొందించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి నివేదించి, నిధులు సమీకరిద్దామని చెప్పారు. నవరత్నాల పథకాలు, పీఎం ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణ ప్రాజెక్టులు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీ దీనిపై కసరత్తు చేసింది. మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో పేదలకు గృహ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకుంది. రాష్ట్రంలో మొదటి దశలో 85 ప్రాజెక్టుల కింద రూ.3 వేల కోట్లతో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదించిన తరువాత ఆ నివేదిను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థకు సమర్పించారు. తొలిదశలో 1,24,624 ఇళ్లకు ఆమోదం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పట్టణాల్లో గృహనిర్మాణ ప్రాజెక్టులపై ఢిల్లీలో గురువారం నిర్వహించిన సెంట్రల్ శాంక్షన్ మానిటరింగ్ కమిటీ(సీఎస్ఎంసీ) సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించింది. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొన్నారు. పట్టణ గృహనిర్మాణ పథకం కింద రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో 1,24,624 ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఆ ప్రకారం నవరత్నాల పథకాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల కింద సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునే పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.1,870 కోట్ల గ్రాంటును రాష్ట్రానికి కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. డిసెంబర్ నాటికి ఈ నిధులను రాష్ట్రానికి విడుదల చేయనుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కూడా కలిపి లబ్ధిదారులకు అందజేస్తుంది. మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఎంపికైన లబ్ధిదారులకు రాష్ట్ర పట్టణగృహ నిర్మాణ సంస్థ ఈ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తుంది.గృహ నిర్మాణాలను పరిశీలించి దశల వారీగా లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేస్తారు. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు పొందినవారు ఇళ్లు కట్టుకోడానికి ఇదే రీతిలో ఆర్థిక సహాయం చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. అందుకోసం ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. -
ఎట్టకేలకు మోసగాళ్ల అరెస్ట్
సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం) : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ పథకం పేరుతో నిరక్షర్యాసులు, అమాయక గిరిజనుల నుంచి పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడిన మోసగాళ్లను సోమవారం స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి సత్తుపల్లి కోర్టుకు తరలించారు. కొద్ది రోజులుగా సాగుతున్న ఈ అక్రమ వసూళ్ల దోపిడీపై సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘డబ్బులిస్తే డబుల్ ఇప్పిస్తాం’ అనే శీర్షికన కథనం వెలువడిన సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ కథనంతో ఈ మోసగాళ్ల కేసు దర్యాప్తు వేగవంతంచేసి కొంతమంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ అబ్బయ్య సోమవారం వివరాలను వెల్లడించారు. మండలంలోని రెడ్డిగూడెం, తిరుమల కుంట, దురదపాడు, గాండ్లగూడెం, కన్నాయిగూడెం, దిబ్బగూడెం (రామన్నగూడెం), కావడిగుండ్లతో పాటు మరికొన్ని గ్రామాల్లో పదిహేను రోజులుగా కొంత మంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన్’ పథకం ద్వారా రూ.2500, రూ.2000వేలు చెల్లిస్తే రూ.3 .50 లక్షల విలువగల డబుల్ ఇళ్లు మంజూరు చేయిస్తామని చెప్పి గిరిజనుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారు. దీనిపై దురదపాడు వీఆర్ఓ కండికట్టు కాళిదాసు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా తొమ్మిది మంది బృందం ముఠా వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోసగాళ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, రిపబ్లిక్ పార్టీ పేరుతో నకిలీ దరఖాస్తులు సృష్టించి, వీటిని గిరిజనులకు చూపించి డబుల్ ఇళ్లు మంజూరు చేయిస్తామని మాయ మాటలు చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి ఆన్లైన్ కమిషన్ పేరుతో రూ.2500 నుంచి రూ.2000, రూ.1500 చొప్పున వసూళ్లకు పాల్పడ్డారు. ఇది చదవండి : డబ్బులిస్తే డబుల్ ఇప్పిస్తాం.. ఇలా ఒక్క అశ్వారావుపేట మండలంలోని 164 మంది నుంచి రూ.2.90 లక్షలు వసూళ్లకు పాల్పడినట్లు కేసు దర్యాప్తులో తేలింది. వసూళ్లకు పాల్పడిన వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన గ్రంది ఉదయ్‌కిరణ్ కుమార్, తాడేపల్లి మండలానికి చెందిన రేపాన పద్మారావు, క్రోసూరు మండలానికి చెందిన పగడాల ఆగస్టిన్, సత్తుపల్లి మండలం బేతుపల్లికి చెందిన కాకాని నాగేశ్వరరావు, అశ్వారావుపేట మండలం నందమూరినగర్‌కు చెందిన గుండేటి సీతారామస్వామి, కావడిగుండ్ల గ్రామానికి చెందిన కుంజా ప్రేమ్‌కుమారి, గాండ్లగూడేనికి చెందిన మలోతు నాగేశ్వరరావు, తిరుమలకుంట గ్రామానికి చెందిన కొత్తపల్లి సీతారాములు, ఏపీలోని ప్రకాశం జిల్లా ఉల్వపాడు మండలానికి చెందిన బాలాచంద్రా తో కలిసి ఓ ముఠాగా ఏర్పడి నకిలీ జీఓలు, దరఖాస్తులను సృష్టించి నిరుపేదలు, అమాయక గిరిజనులకు డబుల్ ఇళ్లు మంజూరు చేస్తామని వసూళ్లకు పాల్పడ్డారు. తొమ్మిది మంది నిందితుల్లో ఆరుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.25 వేల నగదును రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే మరో ముగ్గురు నిందితులైన పగడాల ఆగస్టిన్, కుంజా ప్రేమ్‌కుమారి, బాలాచంద్రా పరారీలో ఉన్నారు. వీరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని సీఐ తెలిపారు. ఈ మోసగాళ్ల బారిన పడిన బాధితులు నేరుగా 100 డయల్ చేసి లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. -
‘అందరికీ ఇళ్లు’ అందేదెప్పుడు?
సాక్షి, అమరావతి: టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టిడ్కో) ఇంజినీర్ల దోపిడీ కారణంగా ‘అందరికీ ఇళ్లు’ అందుబాటులోకి రావడం లేదు. ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థలు సకాలంలో ఇళ్లు నిర్మించకపోయినా ఇంజినీర్లు పట్టించుకోవడం లేదు. సరైన కారణం లేకుండా ఇళ్లను సకాలంలో నిర్మించని నిర్మాణ సంస్థలకు జరిమానా విధించాలి. కానీ, టిడ్కో ఇంజినీర్లు జరిమానా విధించకుండా నిర్మాణ సంస్థల నుంచి పర్సంటేజీలు దండుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణంలో జాప్యం వెనుక నిర్మాణ సంస్థల తప్పు లేదని, భూ సేకరణ పూర్తి కాలేదని, డిజైన్లు ఆమోదం పొందలేదని ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు. వీటి ఆధారంగా ఒప్పందం గడువును ప్రభుత్వం పొడిగిస్తోంది. రాష్ట్రంలో పట్టణాలు, నగరాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 5.24 లక్షల ఇళ్లు (ఫ్లాట్లు) నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ వ్యయం, విస్తీర్ణాన్ని బట్టి ఇంటి విలువను రూ.7.30 లక్షలు, రూ.8 లక్షలు, రూ.9 లక్షలుగా నిర్ణయించారు. లబ్ధిదారుడి వాటా, బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని బట్టి నెలకు రూ.2,500, రూ.2,900, రూ.3,500 వాయిదాగా చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన ప్రదేశంలో జీ+3 విధానంలో నిర్మాణాలు జరిపేందుకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం ప్రముఖ నిర్మాణ సంస్థలకు బాధ్యతలు అప్పగించింది. అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో పనులు పొందిన నిర్మాణ సంస్థలు ఒప్పందం ప్రకారం సకాలంలో ఇళ్లను నిర్మించలేకపోయాయి. 80,238 ఇళ్లకు గాను ఈ ఏడాది మార్చి నాటికి కేవలం 1,500 ఇళ్లనే నిర్మించాయి. నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయని సంస్థలకు ఈపీసీ విధానం ప్రకారం జరిమానా విధించాలి. కానీ, ప్రభుత్వం ఎలాంటి జరిమానా విధించకుండా ఒప్పందం గడువును పలుమార్లు పొడిగించింది. టిడ్కో ఇంజినీర్ల అవినీతి కారణంగానే నిర్మాణ సంస్థలు జరిమానా నుంచి తప్పించుకున్నాయన్నది బహిరంగ రహస్యమే. లబ్ధిదారులు నిర్మాణ సంస్థలు, ఇంజినీర్ల అవినీతిపై ప్రభుత్వానికి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అదనపు భారం రాష్ట్రంలో దాదాపు 65 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే, వాటిలో నాణ్యత అంతంతమాత్రంగానే ఉండడంతో చాలామంది లబ్ధిదారులు ఇంకా గృహప్రవేశం చేయలేదు. సొంత డబ్బులు వెచ్చించి, మరమ్మతులు చేయించుకుంటున్నారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు జరగలేదని టిడ్కోకు చెందిన క్వాలిటీ కంట్రోల్ విభాగం నివేదిక పంపినా ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వడ్డీతో సహా రాబట్టుకోవాలట! ఇతర ప్రభుత్వ శాఖల నుంచి టిడ్కోకు డిప్యూటేషన్‌పై వచ్చిన ఇంజినీర్లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. మూడేళ్ల డిప్యూటేషన్‌పై వచ్చిన ఇంజినీర్లు అందినంత దోచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక్కడకు రావడానికి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టామని, అదంతా వడ్డీతో సహా తిరిగి రాబట్టుకోవాల్సి ఉందని చెబుతున్నారు. -
హౌసింగ్ పేరుతో బాబు చీటింగ్...!
సాక్షి, విజయవాడ : పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఆవాస్‌యోజన పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసినా వాటిని పూర్తిస్థాయిలో నిర్మించలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. నిర్మించిన కొద్దిపాటి ఇళ్లను తెలుగుదేశం ఎమ్మెల్యేల ద్వారా కార్యకర్తలకు ఇప్పించడంతో అర్హులైన లబ్ధిదారులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్మించే ఇళ్లకు చంద్రన్న హౌసింగ్‌గా పంపిణీ చేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాకు మంజూరైనవి 57 వేల ఇళ్లు కృష్ణాజిల్లాకు మొత్తం 57 వేల ఇళ్లు మంజూరయ్యాయి. విజయవాడ నగరంతో పాటు మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు, గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేట, నూజీవీడు, తిరువూరు, మున్సిపాలిటీలలో ఈ ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అయితే ఇళ్ల నిర్మాణం పూర్తిగా కాలేదు. హడావుడిగా గృహప్రవేశాలు చేయించి అందరికీ ఇళ్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. వాల్ టెక్నాలజీతో భారం పేదలకు కట్టించే ఇళ్లను షియర్ వాల్ టెక్నాలజీతో ప్రభుత్వం నిర్మించింది. ఈ షియర్ వాల్ టెక్నాలజీ వల్ల ఒక్కొక్క లబ్ధిదారుడుపైనా సుమారు రూ.2 లక్షల వరకు ఆర్ధి్దక భారం çపడుతోంది. ఈ ఇళ్లు అంత గొప్ప నాణ్యత ఏమీ ఉండబోమని, సాధారణ ఇళ్లకంటే ఏమాత్రం భిన్నంగా ఉండవని కాంట్రాక్టర్లు, సివిల్ ఇంజనీర్లు చెబుతున్నారు. షియర్‌వాల్ టెక్నాలజీ అంటే... గోడలను ఏ విధంగా నిర్మిస్తారో స్లాబ్ కూడా అదే మెటీరియల్‌తో నిర్మిస్తారు. దూరం.. భారం! జీ+3 పద్ధతిలో ఈ ఇళ్లు నిర్మిస్తున్నారు. నిళ్ల నిర్మాణానికి కావాల్సిన స్థలం ప్రభుత్వమే సమకూర్చాల్సి రావడంతో ఊరుకుదూరంగా మూడు నాలుగు కి.మీ దూరంలో నిర్మిస్తున్నారు. దీంతో అక్కడ ఉండలేక ఇళ్లు వదులుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో జక్కంపూడిలో నిర్మించడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థలం కొనుగోలుకు నిధులు నిల్ విజయవాడలో ఇంకా 20వేల ఇళ్లు నిర్మించాల్సి ఉంది. దీని కోసం సుమారు 100 ఎకరాల స్థలం అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీనికోసం జక్కపూడిలో సుమారు 106 ఎకరాల భూమిని రైతులు వద్ద నుంచి సేకరించాలని నిర్ణయించారు. ఈ రూ.100 కోట్లు మంజూరు కోసం ప్రభుత్వం ఆరు నెలల క్రితం జీవో కూడా ఇవ్వడంతో అధికారులు ఈ నిధులు విడుదల కాగానే రైతుల వద్ద నుంచి భూములు తీసుకుం టామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఒక్క రూపాయీ ఇవ్వలేదు. జగన్ హామీతో హర్షం పట్టణ పేదలకు ఇళ్లు రుణాలుగా తీసుకుంటే వాటిని తాను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తానని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో నిరుపేదలైన పేదలకు ఇళ్లమీద ఆశలు పెంచింది. తాను అధికారంలోకి వస్తే 25 లక్షలు ఇళ్లు నిర్మించి పేదలందరికీ ఇస్తామని హామీ ఇచ్చారు. అక్క చెల్లెమ్మలకు గృహప్రవేశం రోజునే రిజిస్ట్రేషన్ పట్టా ఇస్తామని, పావలా వడ్డీకే ఇంటి పై బ్యాంకు రుణం ఇప్పిస్తానని నవరత్నాల్లో ఇచ్చిన హామీల పట్ల పేద ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆయన ప్రకటనతో దీంతో జిల్లాలో దరఖాస్తులు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఎన్నికల తరువాత జగన్ వస్తే తమకు ఇళ్లు వస్తాయని మహిళలు ఆశతో ఎదురు చూస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు కాసులు కురిపించిన పేదల ఇళ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులతో నిర్మించిన ఇళ్లను టీడీపీ ఎమ్మెల్యేలు య«థే చ్ఛగా విక్రయించుకున్నారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు మూడేసి వేల ఇల్లు చొప్పున కేటాయించారు. దీంతో ఎమ్మెల్యేలు తమ అనుచరులు ద్వారా రూ.50 వేలు తీసుకుని ఇళ్లు కేటాయించారని చెబుతున్నారు. విజయవాడలో ఒక ఎమ్మెల్యే అనుచరులు రూ.40 లక్షలు ఇళ్లు ఇప్పిస్తామంటూ వసూలు చేశారు. క్రీస్తు రాజపురంలో ఒక మహిళ ఆటోస్టాండ్ అధ్యక్షురాలు ద్వారా 20 మందికి ఇళ్లు ఇప్పిస్తామంటూ రూ.10 లక్షలు వరకు వసూలు చేశారు. అలాగే బస్టాండ్‌లో ఉన్న ఒక ఆటోస్టాండ్ అధ్యక్షుడు ద్వారా మరో 25 మంది వద్ద నుంచి రూ.15 లక్షలు వసూలు చేశారు. సింగనగర్‌లో చిట్స్ నిర్వహించే ఒక మహిళ ద్వారా సుమారు 30 మంది నుంచి మరో రూ.15 లక్షలు వసూలు చేశారు. అయితే వీరికి ఇళ్లు మంజూరు కాలేదు. గుడివాడలో అయోమయం పట్టణంలో పేదలకు ఇళ్లు నిర్మించాలని అందుకు కావలసిన స్థలం కొనుగోలు చెయ్యాలని 2007లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) గుడివాడ నుంచి హైదరా బాద్‌కు పాదయాత్ర చేశారు. ఒక శాసన సభ్యుని పాదయాత్రకు స్పందించిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అందుకు కావలసిన నిధులు కేటాయించారు. దీంతో బొమ్ములూరు మలుపు వద్ద 74 ఎకరాలు భూమి కొనుగోలు చేశారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆ భూములు నిరుపయోగంగా మారిపోయాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం హౌస్ ఫర్ ఆల్ పథకం క్రింద పట్టణానికి ఆ పథకాన్ని వర్తింప చేసింది. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం రూ 1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ 1 లక్ష సబ్సిడీగా అందచేస్తుంది. లబ్ధిదారుడు డబుల్ బెడ్రూమ్ 430 చదరపు అడుగులకు లక్షరూపాయలు, డబుల్ బెడ్రూమ్ 365 చదరపు అడుగులకు రూ.50 వేలు, సింగిల్ బెడ్ రూమ్‌కు రూ.500 చెల్లించాలని నిబంధన చేశారు. మిగిలిన మొత్తాలను జాతీయ బ్యాంకుల ద్వారా రుణం అందచేసి లబ్ధిదారుడు నెలవారి తీర్చుకునేలా పథకం రూపొందించారు. దీనిని అవకాశంగా తీసుకున్న తెలుగుదేశం నాయకులు కేంద్ర ప్రభు త్వ పధకాన్ని పూర్తిగా చంద్రబాబు నాయుడే పట్టణ ప్రజలను కరుణించినంత ప్రచారం చేసుకున్నారు. ఈ పథకం నిమిత్తం ప్రతి లబ్ధిదారుని వద్ద నుంచి సొమ్ము వసూళ్లు చేసేశారు. పెడనలో అడుగు పడలేదు! పురపాలక సంఘంలోని అర్హులైన సొంత స్థలాలు లేని నిరుపేదలకు జీ ప్లస్ త్రి గృహాలు నిర్మించాలనే ప్రభుత్వం ప్రతిపాదనలు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్న చందాన పరిస్థితి ఏర్పడింది. చివరకు చేతులు ఎత్తిసేంది. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో జీ ప్లస్ త్రీ పరిస్థితి బాగున్న పెడనలో రిక్తహస్తం చూపింది. 2017లో ఈ పథకానికి అంకురార్పణ జరిగినా ఉన్నతాధికారులు మాత్రం ప్రైవేటు స్థలాలు కొనుగోలు చేసి ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. మరోపక్క పురపాలక శాఖామాత్యులు నారాయణ మాత్రం అవసరమైతే ఎకరానికి రూ.60 లక్షలు వెచ్చించి అయినా నిరుపేదల ఇంటి కలలను సాకారం చేస్తామని పేర్కొన్నా ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు. టీడీపీకి చెందిన నాయకులే స్వయంగా పలు ప్రైవేటు స్థలాలను పరిశీలించి రైతులను ఒప్పించి ప్రభుత్వ అధికారుల దృష్టిలో పెట్టినా ఆ స్థలాలను కొనుగోలు చేసేందుకు అధికారులు ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. అధికారులు మాత్రం పురపాలక సంఘానికి చెందిన డంపింగ్ స్థలం 6.27 ఎకరాలు స్థలం, తామర చెరువు 13 ఎకరాలను పరిశీలించారు. డంపింగ్ యార్డు స్థలం ఇచ్చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చుననే ఉద్దేశంతో డంపింగ్ యార్డు కోసం కొనుగోలు చేసిన స్థలాన్ని అప్పగించడానికి కౌన్సిల్ అంగీకరించలేదు. నందిగామలో అవిగో.. ఇవిగో... నందిగామ : నగర పంచాయతీ వాసులకు జీ ప్లస్ త్రీ నిర్మాణాలు అందని ద్రాక్షగా మారాయి. మూడేళ్లుగా ఈ ప్రాజెక్టు పనులు పునాదుల దశను దాటలేదంటే పథకం నిర్వహణ పట్ల పాలకులు, అధికారులకు ఎంత చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జీ ప్లస్ త్రి నిర్మాణాల పేరిట నందిగామ నగర పంచాయతీ వాసులను ఊరించడమే తప్ప ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చిత్తశుద్ధితో ప్రయత్నించిన దాఖలాలు లేవు. వాస్తవానికి ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం కింద నందిగామ నగర పంచాయతీకి 2,496 గృహాలు మంజూరయ్యాయి. స్థలా భావం వల్ల వేర్వేరుగా కాకుండా జీ ప్లస్ త్రి విధానంలో భవనాలు నిర్మించాలని సంకల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా. స్థల సేకరణ పెద్ద సమస్యగా మారింది. తొలుత డీవీఆర్ కాలనీలో వీటిని నిర్మిస్తామంటూ అధికార పార్టీ హడావుడి చేసింది. కొన్ని నెలలు తాత్సారం చేసిన తరువాత రాఘవాపురం గట్టు వద్ద స్థలం సేకరించేశామంటూ ఆర్భాటంగా ప్రకటించడంతోపాటు సదరు స్థలాన్ని చదును చేసేందుకు హడావుడిగా పనులు మొదలు పెట్టారు. దీనిపై అనేక ఆరోపణలు రావడం, విజిలెన్స్ విచారణలు కూడా కొనసాగడంతో అక్కడ నుంచి కూడా స్థలాన్ని మార్చేశారు. ఈ క్రమంలోనే రెండేళ్లు గడచిపోయాయి. -
పేదోళ్లనూ వదల్లేదు
సాక్షి, అమరావతి : సహజ వనరులైన ఇసుక, మట్టి నుంచి భారీఎత్తున దోపీడీకి పాల్పడిన చంద్రబాబు సర్కారు ఆఖరికి పట్టణ పేదలనూ వదలకుండా వారి ఇళ్ల నిర్మాణాల్లో భారీ దోపిడీకి పాల్పడింది. పట్టణ ప్రాంత పేదలకు కేంద్రం మంజూరు చేసిన ఇళ్ల వ్యయాన్ని భారీగా పెంచేసి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలను కమీషన్ల రూపంలో సీఎం చంద్రబాబు కాజేశారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ వ్యయం... ఏపీలో నిర్మాణ వ్యయానికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసాలే ఇందుకు నిదర్శనం. ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రంలో చేపట్టిన ఐదు లక్షల నిర్మాణాల్లో ఏకంగా రూ.13,170.75 కోట్లు కాజేశారు. ఒక పక్క యూనిట్ వ్యయం పెంచి ఆ మొత్తాన్ని ఖజానా నుంచి తీసుకుంటూ, మరోపక్క పేదలపై ఏకంగా రూ.17,730 కోట్ల అప్పుల భారం మోపుతూ ఈ దోపిడీ ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో సాగింది. దీనిని అధికార వర్గాలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. ఇది ఖజానా దోపిడీ.. వాస్తవానికి ఈ నిర్మాణాలను షీర్వాల్ టెక్నాలజీతో చేపట్టారు. దీనిప్రకారం యూనిట్ వ్యయం బాగా తక్కువగా ఉండాలి. కానీ సంప్రదాయ నిర్మాణాలకు మించిన యూనిట్ ధరను షీర్వాల్ టెక్నాలజీకి నిర్ణయించారు.వ్యూహాత్మకంగా రూ.పదితో అయ్యే పనికి కాంట్రాక్టర్లకు తొలుతే రూ.20 ఇచ్చేసి... వారి నుంచి ఆ పది రూపాయలను తిరిగి తీసుకున్నారు. దీన్ని ‘ఖజానా నుంచి దోపిడీ’గా ఓ ఉన్నతాధికారి పేర్కొనడం గమనార్హం. పొరుగున ఉన్న కర్ణాటకలో సంప్రదాయంగా 367 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణ యూనిట్ వ్యయం రూ.3.80 లక్షలు మాత్రమే. అంటే చదరపు అడుగుకు రూ.1,356. ఇందులోనే విద్యుత్ సహా అంతర్గత, బాహ్య మౌలిక సదుపాయాలన్నీ కలిపి ఉంటాయి. ఏపీ ప్రభుత్వం మాత్రం 300 చదరపు అడుగుల ఇంటి యూనిట్ వ్యయం రూ.5.98 లక్షలుగా, 365 చదరపు అడుగుల ఇంటి వ్యయం రూ.6.83 లక్షలుగా, 430 చదరపు అడుగుల యూనిట్ వ్యయం రూ.7.68 లక్షలుగా నిర్ధారించింది. షీర్ వాల్ టెక్నాలజీ పేరుతో చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.2,134.77గా నిర్ధారించింది. కర్ణాటక కంటే అదనంగా నిర్ధారించిన రూ.734 మొత్తం సొంత ఖాతాల్లోకి వేసుకోవడానికే అని తెలుస్తోంది. పేదలపై రూ.17,730.88 కోట్ల రుణ భారం.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు సబ్సిడీగా ఇస్తున్నాయి. ఈ మూడు లక్షల రూపాయలతోనే పట్టణ పేదలకు చక్కటి ఇళ్లు కట్టించి ఇవ్వొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పేదలపై అప్పుల భారం మోపి యూనిట్ వ్యయాన్ని భారీగా పెంచేసింది. ఒక్కో పేదవాడిపై రూ.2.65 లక్షల నుంచి రూ.4.65 లక్షల వరకు రుణ భారం మోపారు. ఈ ఇళ్ల నిర్మాణాలను కూడా చంద్రబాబు సర్కారు అస్మదీయ సంస్థలకే అప్పగించింది. ఇందులో ఎల్అండ్టీకి రూ.12 వేల కోట్లపైగా విలువైన పనులు, రూ.26 వేల కోట్ల పనులను షాపూర్ జీ పల్లోంజీ, ఎన్సీసీ, కనకమేడల వరప్రసాద్ సంస్థలకు ఇచ్చారు. మొత్తం ఐదు లక్షల ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.38,265.88 కోట్లుగా (మౌలిక వసతులతో కలిసి మొత్తం 17,92,50,000 చదరపు అడుగులు) నిర్ధారించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.7,500 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.13,035 కోట్లు. లబ్ధిదారుల (అప్పు) వాటా రూ.17,730.88 కోట్లుగా పేర్కొన్నారు. అయితే, చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.734 మేర పెంచడం ద్వారా ఈ ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వం రూ.17,730.88 కోట్లను దోచేసింది. 15 నెలల్లో నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్దిష్ట సమయం పెట్టుకున్నా అస్మదీయ కాంట్రాక్టర్లకు మరింత ఆర్థిక ప్రయోజనం కల్పించడానికి ఎస్కలేషన్ క్లాజ్‌ను టెండర్ నిబంధనల్లో పొందుపర్చారు. రుణమంతా మాఫీ చేస్తాం కమీషన్ల కోసం పట్టణ పేదల ఇళ్ల నిర్మాణాన్నీ వదల్లేదని, వాటి అంచనాలను అక్రమంగా పెంచేశారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రలో, ఎన్నికల్లో సభల్లో ఇప్పటికే పలుసార్లు ప్రస్తావించారు. అంతేకాక పట్టణ పేదలను అప్పుల పాల్జేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్లను తీసుకోవాలని సూచిస్తూనే, వారిపై మోపిన ఈ అప్పుల భారాన్ని తమ పార్టీ అధికారంలోకి రాగానే తొలగిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీనిప్రకారం చూస్తే... ఐదు లక్షల మంది పట్టణ పేదల ఇళ్ల అప్పుల భారం మొత్తం రూ.17,730.88 కోట్లు రద్దయి ఉపశమనం కలగనుంది. -
గృహ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్!
పట్టణాల్లో కొత్త ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అఫార్డబుల్ హౌజింగ్ స్కీమ్ ప్రధాన్ మంత్రి అవాస్ యోజన-అర్బన్(పీఎంఏఐ-యూ)లో నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ మార్పుల ప్రకారం పీఎంఏఐ-యూ కింద వడ్డీ సబ్సిడీకి అర్హత పొందిన గృహాల కార్పెట్ ఏరియాను 33 శాతం పెంచేందుకు గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఎక్కువ మంది లబ్దిదారులను ఆకర్షించడానికి ప్రభుత్వం ఈ కార్పెట్ ఏరియాను పెంచింది. పీఎంఏఐ-యూ కింద పెంచిన కార్పెట్ ఏరియా అన్ని మధ్య తరగతి ఆదాయ వర్గాలకు వర్తించనుంది. దీంతో మధ్యతరగతి గ్రూప్-1 వారి కార్పెట్ ఏరియా 120 చదరపు మీటర్ల నుంచి 160 చదరపు మీటర్లకు పెరిగింది. అదేవిధంగా మధ్యతరగతి గ్రూప్-2 వర్గాల వారి కార్పెట్ ఏరియా 150 చదరపు మీటర్ల నుంచి 200 చదరపు మీటర్లకు పెంచింది. ఎంఐజీ-1 కేటగిరీ కింద రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్యలో ఆదాయం ఉన్నవారికి రూ.9 లక్షల రుణం అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఈ లబ్దిదారులకు 4 శాతం వడ్డీ రాయితీలు అందుతాయి. ఎంఐజీ-2 కేటగిరీ కింద రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి రూ.12 లక్షల వరకు రుణాన్ని 3 శాతం వడ్డీ రాయితీలతో అందిస్తున్నారు. 2022 నాటికి అందరికీ గృహాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కార్పెట్ ఏరియా ఇంట్లో గదుల్లోని గచ్చు పరిధి వరకు విస్తరించిన ప్రాంతం. గోడలను మినహాయించి దీన్ని లెక్కిస్తారు. -
ఇళ్లు కొనాలనుకుంటున్నారా? అయితే గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్(సీఎల్ఎస్ఎస్) కింద వడ్డీ రాయితీలకు అర్హులైన వారందరికీ కార్పెట్ ఏరియాని పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎంఏవై కింద మధ్యతరగతి ఆదాయ గ్రూప్(ఎంఐజీ) ప్రజలకు ఇది అందుబాటులోకి వస్తుంది. 2017 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు తెలిసింది. ఎంఐజీ-1 కేటగిరీ కింద గృహాల కార్పెట్ ఏరియాను 90 చదరపు మీటర్ల నుంచి 120 చదరపు మీటర్లకు పెంచారు. ఎంఐజీ-11 కేటగిరీ కింద ప్రస్తుతమున్న కార్పెట్ ఏరియా 110 చదరపు మీటర్లను 150 చదరపు మీటర్లకు పెంచినట్టు తెలిసింది. ఎంఐజీ-1 కేటగిరీ కింద రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్యలో ఆదాయం ఉన్నవారికి రూ.9 లక్షల రుణం అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఈ లబ్దిదారులకు 4 శాతం వడ్డీ రాయితీలు అందుతాయి. ఎంఐజీ-2 కేటగిరీ కింద రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వార్షికాదాయం ఉన్నవారి రూ.12 లక్షల వరకు రుణాన్ని 3 శాతం వడ్డీ రాయితీలతో అందించనున్నారు. 2022 నాటికి అందరికీ గృహాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కార్పెట్ ఏరియా ఇంట్లో గదుల్లోని గచ్చు పరిధి వరకు విస్తరించిన ప్రాంతం. గోడలను మినహాయించి దీన్ని లెక్కిస్తారు. బిల్డర్లు ప్రస్తుతం సూపర్ బిల్డప్ ఏరియాకు కలిపి కొనుగోలుదారులకు ఛార్జీలు వేస్తున్నారు. కానీ రెరా దీనికి వ్యతిరేకం. -
రాష్ట్రానికి అదనంగా 12,862 గృహాలు
⇒ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేటాయింపు ⇒ 60 శాతం గృహాలు ఎస్సీ, ఎస్టీలకు ప్రతిపాదించిన తెలంగాణ ⇒ 2016–17కు గాను రాష్ట్ర వార్షిక ప్రణాళికను ఆమోదించిన కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) కింద 2016–17కు గాను రాష్ట్రానికి అదనంగా 12,862 గృహాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించింది. ఇటీవల జరిగిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు చెందిన సాధికారిక కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు. 2016–17కు గాను ముందుగా నిర్ణయించిన లక్ష్యం 38,097 గృహాలకు అదనంగా 12,862 గృహాల నిర్మాణానికి తెలంగాణ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు సాధికారిక కమిటీ ఆమోద ముద్ర వేయడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర లక్ష్యం 50,959 గృహాలకు చేరుకుంది. ఈ మొత్తం గృహాలలో 30,575 గృహాలను (60 శాతం) ఎస్సీ, ఎస్టీలకు, 3,566 గృహాలను మైనారిటీలకు కేటాయిస్తామని రాష్ట్రం ప్రతిపాదించింది. గృహ నిర్మాణానికి సంబంధించిన అన్ని పథకాల నిధులు రాష్ట్ర నోడల్ ఖాతాకు బదిలీ చేయాలని, గత ఏప్రిల్ నాటికి వ్యయం కాని రూ.36.44 కోట్లను ఇందిరా ఆవాస్ యోజన కింద పెండింగ్‌లో ఉన్న గృహాల నిర్మాణానికి వినియోగించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారిస్తుందని సాధికారిక కమిటీ పేర్కొంది. రాష్ట్రంలో లబ్ధిదారులకు పథకం వివరాలు, స్థానిక వనరుల లభ్యత, శిక్షణ పొందిన మేస్త్రీల అవసరం తదితర విషయాలపై అవగాహన కల్పించడానికి క్యాంపులు నిర్వహించాలని ఆదేశించింది. ఆధార్ సీడింగ్‌కు లబ్ధిదారుడి అనుమతి తీసుకోవాలని సూచించింది. ‘ఉపాధి’ ద్వారా నిర్మించండి.. గృహాల నిర్మాణానికి కనీసం 90 నుంచి 95 దినాలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద కార్మికులను పనిలోకి తీసుకోవాలని సాధికారిక కమిటీ సూచించింది. మరోవైపు రాష్ట్రంలో పీఎంఏవై కింద గృహాల నిర్మాణంలో స్వచ్ఛ భారత్ మిషన్ లేదా జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.12 వేల చొప్పున వినియోగిస్తూ టాయిలెట్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పీఎంఏవై మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులు స్వయంగా గృహాన్ని నిర్మించుకోవాలి లేదా లబ్ధిదారుడి పర్యవేక్షణలో గృహ నిర్మాణం జరగాలి. ఇందులో కాంట్రాక్టర్ల ప్రమేయం ఉండరాదు. అయితే ఒక్కో ఇంటికి రూ.5 లక్షల వ్యయంతో తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌హెచ్‌సీఎల్) ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేపడుతున్నందున.. లబ్ధిదారులకు బదులుగా టీఎస్‌హెచ్‌సీఎల్ నిర్మాణం చేపట్టడానికి మినహా యింపు మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపించాలని సాధికారిక కమిటీ స్పష్టం చేసింది. -
ఆ ఇళ్లు ‘అందుబాటు’లోనే
అఫర్డబుల్ హౌసింగ్‌కు ఇన్ఫ్రా పరిశ్రమ హోదా ఆ రంగానికి చౌకగా దక్కనున్న రుణాలు బిల్టప్ ఏరియాను కార్పెట్ ఏరియాగా మార్చిన జైట్లీ దీంతో ఇంకాస్త పెద్ద ఇళ్లు కూడా అందుబాటు పరిధిలోకి పీఎంవైఏకు రూ.23 వేల కోట్లు కేటాయింపు సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేందుకు బడ్జెట్ మార్గం సుగమం చేసిందనే చెప్పాలి. 2019 నాటికి దేశంలో కోటి గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గతంలోనే ప్రధాని నరేంద్రమోదీ చెప్పగా... జైట్లీ దానికి రోడ్‌మ్యాప్ వేశారు. అందుకు అనుగుణంగానే అందుబాటు గృహాల విభాగానికి మౌలిక రంగ హోదానిచ్చారు. గతేడాది రూ.15 వేల కోట్లుగా ఉన్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంవైఏ) కేటాయింపును ఈసారి బడ్జెట్లో రూ.23 వేల కోట్లకు పెంచారు. అలాగే అందుబాటు గృహాలను నిర్మించే డెవలపర్లను ప్రోత్సహించేందుకు గాను 80–ఏబీఏ సెక్షన్‌ను సవరించారు కూడా. ప్రస్తుతం మూడేళ్లుగా ఉన్న అందుబాటు ఇళ్ల ప్రాజెక్ట్ నిర్మాణ గడువును 5 ఏళ్లకు పెంచారు. – హైదరాబాద్, బిజినెస్ బ్యూరో మెట్రోలో 30 చ.మీ., నాన్మెట్రోలో 60 చ.మీ. గతేడాది బడ్జెట్లో అందుబాటు ఇళ్లను ప్రోత్సహించేందుకు ఆదాయ పన్ను రాయితీలను కల్పించిన జైట్లీ.. ఈసారి అందుబాటు గృహాల బిల్టప్ ఏరియాలను కార్పెట్ ఏరియాలుగా మార్పు చేశారు. అంటే గతంలో 30 చ.మీ., 60 చ.మీ. బిల్టప్ ఏరియాలుంటే అందుబాటు గృహాలుగా పరిగణించేవి కాస్త తాజా బడ్జెట్‌తో మెట్రో నగరాల్లో 30 చ.మీ., నాన్‌మెట్రో నగరాల్లో 60 చ.మీ. కార్పెట్ ఏరియాలుగా ఉండాలన్నమాట. ఒక చదరపు మీటరంటే 9 చదరపు అడుగులు. ఈ లెక్కన 60 చదరపు మీటర్లంటే 540 చదరపు అడుగుల ఇళ్లన్న మాట. గతంలో సింగిల్ బెడ్ రూమ్ మాత్రమే అందుబాటు ఇళ్ల పథకం కిందకు వచ్చేది. ఎటూ చాలదనే భావనతో అల్పాదాయ, దిగువ మధ్య తరగతుల వారు కొనేవారు కాదు. దాంతో డిమాండ్ లేక వీటి నిర్మాణానికి సంస్థలు కూడా సాహసించలేని పరిస్థితి ఉంది. తాజా మార్పుతో దాదాపు 900 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా ( 650 – 700 అడుగుల కార్పెట్ ఏరియా) అవుతుంది. ఈ విస్తీర్ణంలో చిన్న డబుల్ బెడ్ రూమ్స్ వస్తాయి. దీంతో అల్పాదాయ, దిగువ మధ్య తరగతి వారు ఈ పథకం కింద ఇళ్ల కొనుగోలుకు ముందుకు వస్తారని, నిర్మాణ సంస్థలు ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తాయని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2001 నాటి మార్కెట్ రేటు ఆధారంగా ఇప్పటివరకు 1980 కంటే ముందుకొన్న ఫ్లాట్, ప్లాట్ ఏదైనా స్థిర, చరాస్తులను ఎప్పుడు విక్రయించినా సరే 1981 ఏప్రిల్ 1 నాటి మార్కెట్ రేటు ఆధారంగా మూలధన లాభాలు (క్యాపిటల్ గెయిన్) విలువలను లెక్కగట్టేవారు. కానీ, తాజా బడ్జెట్లో విలువ లెక్కింపు సంవత్సరాన్ని 2001 ఏప్రిల్ 1కి మార్చారు. దీంతో విక్రయదారుడికి సరైన మార్కెట్ రేటు వస్తుంది. గతంలో మూడేళ్లుగా ఉన్న దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ పన్ను ప్రయోజనాలను 2 ఏళ్లకు కుదించారు. మూడేళ్ల కంటే ఎక్కువున్న స్థిరాస్తుల దీర్ఘకాలిక మూలధన లాభాలు 20 శాతం చెల్లించాలి. మౌలిక రంగ హోదాతో ఏం జరుగుతుంది? మౌలిక రంగ హోదా ఇవ్వటం వల్ల అఫర్డబుల్ ఇళ్లను నిర్మించే కంపెనీలకు ఇన్ఫ్రా రంగానికిచ్చే వడ్డీ రేటుతో రుణాలు లభించే అవకాశముంటుంది. అంటే తక్కువ వడ్డీకే అన్నమాట. దీనివల్ల అవి నిర్మాణానికి ముందుకొస్తాయి. ఆ మేరకు కలిగే లాభాన్ని వినియోగదారులకు బదలాయించే అవకావం కూడా ఉంటుంది. రూ.20 వేల కోట్ల గృహ రుణాలు.. గృహ రుణాలు అందించే బ్యాంకులకు 2017–18కి గాను నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రూ.20 వేల కోట్ల రుణాలను అందించనున్నారు. మధ్య ఆదాయ వర్గాల కోసం కొత్తగా క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద రూ.1,000 కోట్లు కేటాయించారు. అలాగే నివాస విభాగంలో అమ్ముడుపోకుండా ఉండిపోయే ఇళ్లపై (ఇన్వెంటరీ) పన్ను రాయితీలను ప్రకటించారు. కంప్లీషన్ సర్టిఫికెట్ పొందిన తర్వాత ఖాళీగా ఉన్న ఇళ్లపై అద్దెను ఆదాయ పన్నుకు లోబడి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకోగానే ల్యాండ్ ఓనర్ చెల్లించే మూలధన రాబడిని కాస్త ప్రాజెక్ట్ పూర్తయ్యాక చెల్లించే వీలును కల్పించారు. కార్పెట్..బిల్టప్ అంటే.. సాధారణంగా కార్పెట్ ఏరియా అంటే గోడలు కాకుండా మనం ఉపయోగించే స్థలాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. కానీ బిల్టప్ ఏరియా అంటే గోడలు కలుపుకొని ఇంట్లోని మొత్తం స్థలాన్ని బిల్టప్ ఏరియాగా పరిగణిస్తారు. ఇందులో బాల్కనీ కూడా వస్తుంది. ఈ లెక్కన చూస్తే గతంలోకన్నా కాస్తంత పెద్ద ఇళ్లు ఇపుడు అందుబాటు గృహాల పరిధిలోకి వస్తాయన్న మాట. ఆ మేరకు వాటికి వర్తించే ప్రోత్సాహకాలు, రాయితీలు దీనికీ వర్తిస్తాయి. సూపర్ బిల్టప్ ఏరియా అంటే మాత్రం లాబీ, లిఫ్టు, మెట్లు, స్విమ్మింగ్ పూల్, గార్డెన్, క్లబ్‌హౌస్ వంటి అన్ని రకాల వసతులకు కేటాయించే స్థలాన్ని కూడా కలుపుతారు. -
పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు!
-
పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు!
న్యూఢిల్లీ: తాను ఈసారి ప్రవేశపెడుతున్న కేంద్ర బడ్జెట్లో పేదలకు, గ్రామీణ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్టు పేర్కొన్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.. బడ్జెట్లో పేదలకు పలు వరాలు ప్రకటించారు. పేదలు, అణగారిన వర్గాల బలోపేతానికి సామాజిక భద్రత కల్పిస్తామని, ఆరోగ్య సంరక్షణతోపాటు పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు రూ. 15వేల కోట్ల నుంచి రూ. 23వేల కోట్లకు బడ్జెట్లో నిధులు పెంచుతున్నట్టు చెప్పారు. 2019నాటికి ఇళ్లులేనివారు, దుర్బలమైన (కచ్ఛా) ఇళ్లలో ఉంటున్నవారి కోసం కోటి పక్కా గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు జైట్లీ వెల్లడించారు. 2018 మే 1 నాటికి 100శాతం గ్రామాలకు విద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పారు. వ్యవసాయ, గ్రామీణ, దాని అనుబంధ రంగాలకు ఈసారి బడ్జెట్లో రూ. 1,87,223 కోట్లు కేటాయించామని, ఇది గత ఏడాది బడ్జెట్ కంటే 24శాతం అధికమని జైట్లీ స్పష్టం చేశారు.