సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్(సీఎల్‌ఎస్‌ఎస్) కింద వడ్డీ రాయితీలకు అర్హులైన వారందరికీ కార్పెట్ ఏరియాని పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎంఏవై కింద మధ్యతరగతి ఆదాయ గ్రూప్(ఎంఐజీ) ప్రజలకు ఇది అందుబాటులోకి వస్తుంది. 2017 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు తెలిసింది. ఎంఐజీ-1 కేటగిరీ కింద గృహాల కార్పెట్ ఏరియాను 90 చదరపు మీటర్ల నుంచి 120 చదరపు మీటర్లకు పెంచారు. ఎంఐజీ-11 కేటగిరీ కింద ప్రస్తుతమున్న కార్పెట్ ఏరియా 110 చదరపు మీటర్లను 150 చదరపు మీటర్లకు పెంచినట్టు తెలిసింది.
ఎంఐజీ-1 కేటగిరీ కింద రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్యలో ఆదాయం ఉన్నవారికి రూ.9 లక్షల రుణం అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఈ లబ్దిదారులకు 4 శాతం వడ్డీ రాయితీలు అందుతాయి. ఎంఐజీ-2 కేటగిరీ కింద రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వార్షికాదాయం ఉన్నవారి రూ.12 లక్షల వరకు రుణాన్ని 3 శాతం వడ్డీ రాయితీలతో అందించనున్నారు. 2022 నాటికి అందరికీ గృహాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కార్పెట్ ఏరియా ఇంట్లో గదుల్లోని గచ్చు పరిధి వరకు విస్తరించిన ప్రాంతం. గోడలను మినహాయించి దీన్ని లెక్కిస్తారు. బిల్డర్లు ప్రస్తుతం సూపర్ బిల్డప్ ఏరియాకు కలిపి కొనుగోలుదారులకు ఛార్జీలు వేస్తున్నారు. కానీ రెరా దీనికి వ్యతిరేకం.
Comments
Please login to add a commentAdd a comment