
సాధారణంగా ఇల్లస్థలాలు చతురస్రంగానో దీర్ఘచతురస్రంగానో చూస్తుంటాం. కానీ డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్ నగర శివారు ప్రాంతానికి వెళ్తే, పచ్చదనంతో నిండిన పెద్దపెద్ద చక్రాలు కనువిందు చేస్తాయి. ఒక్కో చక్రంలో 16 ఇళ్లు సకల సౌకర్యాలతో, ఆవాసయోగ్యంగా అగుపిస్తాయి. ‘బ్రాండ్‌బై గార్డెన్ సిటీ’ అనే ఈ ప్రత్యేకమైన కమ్యూనిటీ.. ప్రకృతి జీవనానికీ దగ్గరగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు అందరి మనసుల్ని దోచేస్తుంటాయి. 1964లో ఎరిక్ మైగిండ్ అనే భవన నిర్మాణకర్త ఆలోచనల్లోంచి ఈ లేఔట్ పుట్టిందట. ఇలాంటి పచ్చని చక్రాలు ఈ ప్రదేశంలో చాలానే ఉంటాయి. ప్రతి సర్కిల్ మధ్యలో పార్కింగ్ స్థలం ఉంటుంది. సామాజిక సంబంధాలను పెంపొందించుకోవడానికి ఇలాంటి నిర్మాణాలు మరింత మేలు చేస్తాయని స్థానికుల నమ్ముతారు. చక్రంలోనే ప్లాట్ చూడటానికి కట్ చేసిన కేకుముక్కలా ఉంటుంది.
అయితే ఈ అందమైన ఇళ్ల నిర్మాణాలను డ్రోన్ వ్యూలో చూసిన వారు ఎవరైనా ‘అబ్బా భలే ఉంది, ఇలాంటి చోట ప్రశాంతంగా బతకొచ్చు’అంటుంటారు. అయితే కొందరు ‘చూడటానికి బాగున్నా, నివాసానికి అసౌకర్యంగా ఉంటుంది, అగ్ని ప్రమాదాలు లాంటివి జరిగినప్పుడు తప్పించుకోవడం కష్టమవుతుంది’ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
(చదవండి: అతిచిన్న అంతర్జాతీయ వారధి..!)