ఆ ఊరికి కొత్తగా వెళ్లినవారు, ఆ ఊరి మీదుగా ఇతర గ్రామాలకు వెళ్లేవారు అక్కడి ఇళ్లను చూసి ఆశ్చర్యపోతారు. కొద్దిసేపు అలాగే చూస్తుండిపోతారు. ప్రస్తుతం ఆధునిక ఇళ్లను నిర్మించుకుంటున్న కాలంలోనూ ఆ ఊళ్లో ఇప్పటికీ మిద్దె భవంతులే ఎక్కువగా ఉండడం గమనార్హం. వీటిని స్థానికంగా మిద్దె భవంతులని, మిద్దె ఇళ్లని, హవేలి బాలంగి అని, బంగళా అని పిలుస్తారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఆ ఇళ్లను యజమానులు అలాగే కాపాడుకుంటున్నారు. చిన్నచిన్న మరమ్మతులు చేయించుకుంటూ, ఆధునిక హంగులు సమకూర్చుకుంటూ ఆ ఇళ్లలోనే మూడు నాలుగు తరాలుగా నివసిస్తున్నారు.
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మారుమూల గ్రామమైన పేట్‌సంగంలో అడుగు పెట్టగానే రోడ్డుకు ఇరువైపులా మిద్దె భవంతులు (రెండంతస్తులు) కనిపిస్తాయి. ఈ గ్రామంలోని మొత్తం నివాస భవనాల్లో దాదాపు సగం మిద్దె ఇళ్లే. ఊళ్లో మూడు వందల పైచిలుకు కుటుంబాలు నివసిస్తుండగా.. ఆయా కుటుంబాల్లో చాలావరకు తమ తాతల కాలం నుంచి మిద్దె ఇళ్లల్లోనే ఉంటున్నాయి. కొన్ని కుటుంబాల్లోనైతే మూడు, నాలుగు తరాలవారు జీవిస్తున్నారు. కాగా వందల ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. గ్రామంలో పురాతన ‘శ్రీ సంగమేశ్వర దేవాలయం’ ఉంది. దీంతో గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది పేర్లు సంగయ్య, సంగవ్వ అని ఉంటాయి.
డూప్లెక్స్ మాదిరి ఇళ్లు..
ఈ పాత కాలం నాటి మిద్దె ఇళ్లకు లోపలి నుంచే (డూప్లెక్స్ మాదిరి) మెట్లు ఉంటాయి. ఇంటి గోడలు నిర్మించిన తర్వాత పెద్దపెద్ద దూలాలు ఏర్పాటు చేసి వాటిపై చెక్కలను కప్పి స్లాబ్‌కన్నా బలంగా తయారు చేశారు. దానిపైన మళ్లీ గోడలు నిర్మించి గదులు నిర్మించుకున్నారు. చాలా ఇళ్లల్లో కర్ర లేదా మట్టితో కట్టిన మెట్లు ఉన్నాయి. పూర్వ కాలంలో రైతులు పంట ఉత్పత్తులను మిద్దె పైన నిల్వ చేసేవారు. నివాసం కూడా ఉండేవారు. పై నుంచి కిందకు చిన్న రంధ్రం ఉండేది. అందులోంచి వడ్లు, మక్కలు, ఇతర పంట ఉత్పత్తులను కిందికి జారవిడిచేవారు. పంట ఉత్పత్తులే కాకుండా, ఇతర వస్తువుల్ని కూడా మిద్దె మీద దాచుకునేవారు. తర్వాతి కాలంలో అంటే ఆరేడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇళ్లకు మాత్రం ముందు భాగం స్లాబ్ వేసి, బయటి నుంచి మెట్లు ఇచ్చారు. పేట్‌సంగంలో నిర్మించిన మిద్దె ఇళ్లు ఎక్కువగా తూర్పు ముఖంతో నిర్మించగా, కొన్ని ఉత్తర(గంగ) ముఖంతో నిర్మించారు. పడమర, దక్షిణ ముఖంతో ఒక్క ఇల్లూ కనిపించదు.
చల్లగా వెచ్చగా..
మా నాన్న కట్టిన మిద్దె ఇంట్లోనే పుట్టి, పెరిగినం. మిద్దె ఇల్లు కావడం వల్ల వానాకాలం, చలి కాలంలో వెచ్చగా, ఎండాకాలంలో చల్లగా ఉంటుంది. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా ఇబ్బంది ఉండదు. ఇళ్లకు మంచి రంగులు వేయించుకుని కొత్తదనం తీసుకువచ్చాం.
– అన్నారం సంగాగౌడ్, పేట్‌సంగం
తరతరాలుగా ఉంటున్నాం..
మా తాతలు, తండ్రులు, మేము అందరం మిద్దె ఇళ్లల్లోనే పెరిగాం. మా పిల్లలు కూడా ఈ ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఊళ్లో చాలామందికి మిద్దె ఇళ్లు ఉన్నయి.
– కూచి హన్మాండ్లు, పేట్‌సంగం
చదవండి: ప్రియుడితో ఉండగా వాట్సాప్‌కి మెసేజ్.. కోపంగా ఇంటికి వెళ్లి
Comments
Please login to add a commentAdd a comment