రుచికరమైన వంటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కొత్త ట్రెండ్
రానా దగ్గుబాటి వంటి సినీతారల నివాసాలు సైతం అదేబాటలో
అతిథులకు హోమ్లీ టచ్, ప్రశాంతమైన వాతావరణం
ప్రస్తుతం స్పెయిన్‌లో నివసిస్తూ ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగర్‌గానూ పాపులర్ అయిన ఆశ్రిత ప్రముఖ నటుడు వెంకటేష్ కుమార్తె. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటితో కలిసి ఆశ్రిత దగ్గుబాటి ఇటీవల తాము సందర్శించిన ఓ రెస్టారెంట్ గురించి తన యూట్యూబ్ ఛానెల్‌లోని కొత్త వీడియోలో పంచుకున్నారు. అది గతంలో తమ దగ్గుబాటి కుటుంబానికి చెందిన పాత నివాసగృహం కాగా ఇప్పుడు రెస్టారెంట్‌గా మారింది. నాటి దగ్గుబాటి నివాసం.. ఇప్పుడు సరికొత్త ఇంటీరియర్‌లతో శాంక్చురీ బార్ అండ్ కిచెన్ అనే అత్యాధునిక రెస్టారెంట్‌గా మారిన తర్వాత ఆ ఇంటిని సందర్శించడం ఇదే తొలిసారి అని ఆశ్రిత తెలిపారు. కళాశాలలో చదువుతున్న సమయంలో ఆ పాత ఇంటిలో నివసించినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.
ప్రకృతి మధ్యకు....
ఇళ్లను రెస్టారెంట్లుగా మార్చడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తమ పిల్లలు విదేశాల్లో నివసిస్తూ ఉండడంతో తాము ఇక్కడ ఒంటరిగా లంకంత ఇళ్ల నిర్వహణ చూడలేక లీజ్‌కి ఇస్తున్నట్టు కొందరు సంపన్న తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు ఈ రెస్టారెంట్లు.. పన్నులు విద్యుత్ బిల్లులతో సహా ఎంత అద్దె అయినా సరే చెల్లించడానికి వెనుకాడడం లేదు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ అన్వేషకులు అద్దె బదులు ఇఎమ్‌ఐలు చెల్లించడానికి ఇష్టపడతారు. కానీ ఈ కేఫ్స్ అద్దెలు ఎక్కువైనా సై అంటాయి. ‘అని ఓ ప్రాపర్టీ యజమాని చెప్పారు.
కరోనా తర్వాత కొన్ని కుటుంబాలు తమ ఆస్తులను లీజుకు ఇచ్చేసి నగరం నడిబొడ్డు నుంచి కాలుష్య రహిత ప్రాంతాలకు, శివార్లలోని విల్లాలకు తరలివెళ్లారు. ‘నా జీవితాంతం కష్టపడి పనిచేశాను. ఇప్పుడు నేను ప్రకృతి నీడలో నివసించాలని కోరుకుంటున్నాను. అందుకే గండిపేటలోని మా అర ఎకరం స్థలంలో చిన్న ఇంటిని నిర్మించుకుని అక్కడకు మారాను’ అని ఐదేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో నివసించిన వ్యాపారి దినకర్ చెబుతున్నారు. మరికొందరు సినిమా సెలబ్రిటీలు.. గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకు తమ నివాసాలను మారుస్తూ.. హిల్స్‌లోని తమ ఇళ్లను రెస్టారెంట్స్‌కి అద్దెకు ఇవ్వడం లేదా తామే రెస్టారెంట్స్, బ్రూవరీ.. వంటివి ఏర్పాటు చేయడం కనిపిస్తోంది.
నాటి ఇంట్లో.. నేటి రెస్టారెంట్లో..
‘మా ఇంటికి స్వాగతం. నేను 20 సంవత్సరాల పాటు ఇక్కడే నివసించాను’ అంటూ రానా సైతం గుర్తు చేసుకున్నారు. రానా, ఆశ్రిత ఆ రెస్టారెంట్లో తిరుగుతున్నప్పుడు గోడలపై రంగురంగుల కళాఖండాలు కనిపించాయి. కుటుంబ సభ్యులకు చెందిన వేర్వేరు గదుల్లో కలియ తిరిగారు. ఆ తర్వాత ఇద్దరూ తాము చాలా కాలం క్రితం నడిచిన బ్లాక్ రైలింగ్‌తో కూడిన స్పైరల్ చెక్క మెట్ల మీద నడిచారు. ఇంటి మొదటి అంతస్తు’ అని రానా గుర్తు చేసుకున్నారు. మొదటి అంతస్తులో చాలా గాజు తలుపులు కనిపించాయి. ఇప్పుడు బార్‌గా ఉన్న ఆ ప్రదేశం గురించి చెబుతూ ‘ఈ బార్ ఉన్న ప్లేస్‌లోనే అప్పట్లో నేను సినిమాలు చూసేవాడిని’ అని రానా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన పాత బెడ్‌రూమ్‌లో బ్లాక్ షాండ్లియర్లు, రెస్టారెంట్ అతిథుల కోసం సీటింగ్స్ ఏర్పాటు చేశారు. రానాకు ఇష్టమైన బాల్కనీ ఇప్పుడు ‘పిజ్జా ప్లేస్’ గా మారింది.
హిల్స్‌లో.. ఇవే ట్రెండ్స్..
ఒక్క దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఇల్లు మాత్రమే కాదు జూబ్లీహిల్స్‌లోని పలు ఇండిపెండెంట్ ఇళ్లు రెస్టారెంట్స్‌గా మారిపోతున్నాయి. రోడ్డు నెం.1, 10, 36, 45, 92లు మినహాయిస్తే మిగిలినవన్నీ నివాసప్రాంతాలే అయినప్పటికీ.. దాదాపు 350 దాకా వ్యాపార సంస్థలు నడుస్తున్నాయి. వాటిలో ఎక్కువ భాగం పబ్‌లు, బార్‌లు, కాఫీ హౌస్‌లు కాగా కొన్ని మాత్రం బొటిక్స్. జూబ్లీ హిల్స్‌లోని అనేక నివాసాలు ఇప్పుడు భారతీయ, ఇటాలియన్ జపనీస్ తదితర దేశ విదేశీ రుచికరమైన వంటకాలకు కేరాఫ్ అడ్రెస్.
నగరంలో విశాలమైన స్థలంలో విలాసవంతంగా నిర్మించిన పలు నివాసాలకు ఒకేఒక చిరునామా జూబ్లీహిల్స్ అని చెప్పాలి. మరెక్కడా అంత చల్లటి, ప్రశాంతమైన వాతావరణం కనిపించదు.రెస్టారెంట్స్‌తో పాటు కేఫ్స్ సందర్శకులు, కేఫ్స్‌లో ఆఫీస్ వర్క్ చేసుకునే కార్పొరేట్ ఉద్యోగులు తరచూ ప్రశాంతమైన, హోమ్లీ వాతావరణాన్ని కోరుకుంటారు. అందుకే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కెఫేలు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఐదారేళ్ల క్రితం ఒకటో రెండో కేఫ్స్ ఉండే పరిస్థితి నుంచి పదుల సంఖ్యకు విస్తరించడానికి ఈ పీస్‌ఫుల్ వాతావరణమే దోహదం చేసింది.
ఇళ్లను మారుస్తున్నారు.. : గత కొంత కాలంగా ఈ ట్రెండ్ ఊపందుకుంది. మా రెస్టారెంట్ సైతం అలా ఏర్పాటు చేసిందే. మాలాంటి కొందరు పూర్తిగా రూపురేఖలు మారుస్తుంటే.. మరికొందరు మాత్రం స్వల్ప మార్పులకు మాత్రమే పరిమితమై ఇంటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చూస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫుడ్‌ని ఎంజాయ్ చేయడానికి జూబ్లీహిల్స్ ఒక మంచి ప్లేస్. -సంపత్, స్పైస్ అవెన్యూ రెస్టారెంట్
ఆపాతమధురం
Comments
Please login to add a commentAdd a comment