మోడిఫైడ్ సైలెన్సర్ వాహనాలు చెవులు దద్దరిల్లే శబ్దాలు
నియంత్రించాలంటున్న స్థానికులు
బంజారాహిల్స్: రాత్రీ పగలూ తేడా లేకుండా మోడిఫైడ్ సైలెన్సర్‌తో భీకర శబ్దాలతో దూసుకెళ్తున్న స్పోర్ట్స్ బైక్‌లు, కార్లపై అటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు దృష్టిపెట్టారు. గడిచిన నెల రోజుల కాలంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజగుట్ట, ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు మితిమీరిన వేగంతో చెవులు దద్దరిల్లే శబ్దంతో దూసుకెళ్తున్న వాహనాలను సీజ్ చేయడంతో పాటు సదరు వాహనదారులపై కేసులు నమోదు చేశారు.
ఇంత చేస్తున్నా ఇంకా కొంతమంది యువకులు స్పోర్ట్స్ బైక్‌లు, కార్లలో రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తూనే ఉన్నారు. రాత్రి 10 గంటల తర్వాతనే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, నెక్లెస్‌రోడ్డు, మాసబ్‌ట్యాంక్, మాదాపూర్, దుర్గం చెరువు ప్రాంతాల వైపు యువకులు రేసింగ్‌లకు పాల్పడుతూ బైక్‌లపై దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉదయం 11 నుంచి గంట పాటు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు రెండు గంటలు మాత్రమే వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. తమ దృష్టికి వస్తే మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు.
రాత్రి 7 తర్వాత తెల్లవారుజామున 6 గంటల వరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులపై బైక్‌లు, కార్లు మోత మోగిస్తూ దూసుకెళ్తుండగా వాహనదారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. చెవులు దద్దరిల్లే సౌండ్‌లతో నివాసితులు సైతం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కనీసం వారానికి రెండు సార్లైనా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు వేర్వేరుగా వాహన తనిఖీలు చేపడితే పెద్ద ఎత్తున మోడిఫైడ్ సైలెన్సర్ల వాహనాలను పట్టుకోవచ్చని స్థానికులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment