1 నుంచి కేబీఆర్ పార్కు రోడ్డులో లేజర్ గన్ ఏర్పాటు
18 రోజుల్లో 1324 మందిపై కేసు
ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా
రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారుల చర్యలు
హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో బైక్ రైడర్లు రయ్..రయ్ అంటూ దూసుకెళ్తున్నారు.. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వీరి స్పీడ్‌కు అద్దూఅదుపు లేకుండాపోతోంది. దీంతో తరచూ వీరు ప్రమాదాల బారీనపడటమే కాకుండా ఇతరుల ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో వీరికి ముకుతాడు వేసేందుకు ట్రాఫిక్ అధికారులు లేజర్‌గన్లను ఏర్పాటు చేసి 60కి మించి వేగంతో వెళ్లిన వారికి జరిమానాలు విధిస్తూ ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులపై రయ్.. రయ్‌మంటూ మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న స్పీడ్ రైడర్లకు ట్రాఫిక్ పోలీసులు ‘లేజర్ గన్’తో ముకుతాడు పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అదుపుతప్పిన వేగంతో దూసుకెళ్లిన వాహనదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. లేజర్ గన్ ద్వారా స్పీడ్ లిమిట్ దాటిన వాహనాలను గుర్తించి వారికి జరిమానాలు కూడా విధిస్తున్నారు. ఇటీవల కాలంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ రహదారులపై అతి స్పీడ్ కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వీటిని అదుపు చేసేందుకు రోడ్డు పక్క న సీక్రెట్‌గా స్పీడ్‌ను నమోదు చేస్తూ హద్దులు దాటిన వారిని గుర్తిస్తున్నారు.
1324 మందిపై కేసులు
దీనిలో భాగంగానే బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు లేజర్ గన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి స్పీడ్ లిమిట్ దాటిన వారిని గుర్తించి చలాన్లు విధిస్తున్నారు. ఈ రోడ్డులో స్పీడ్ లిమిట్ 60కి మించరాదని నిబంధనలు విధించారు. 18 రోజుల్లో ఇప్పటి వరకు లిమిట్ 60 దాటిన 1324 మందిపై కేసులు కూడా నమోదు చేశారు. ఒక్కొక్కరికీ రూ.1000 చొప్పున జరిమానా విధించారు.
చదవండి: ప్యారడైజ్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్..!
ప్రతిరోజూ 100 నుంచి 150 మంది వరకు మితిమీరిన వేగంతో లిమిట్ 60 దాటి దూసుకుపోతున్నట్లుగా లేజర్ గన్ ద్వారా తేలింది. ఈ రోడ్లలో స్పీడ్ లిమిట్ 60 దాటితే జరిమానాలు విధిస్తామని పోలీసులు వెల్లడించారు. ప్రతిరోజూ ఇక్కడ ఉంటే ట్రాఫిక్ పోలీసు స్పీడ్‌గా వెళ్లే వాహనాలపై నిఘా పెడతారని పేర్కొన్నారు. కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్లే వాహనాలు ఇక నుంచి నిర్దేశించిన స్పీడ్‌లోనే వెళ్లాలని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment