
ఇన్ బాక్స్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, అలాగే 55 సంవత్స రాల నుంచి ఉన్న బల్కంపేట ‘గాంధీ ప్రకృతి వైద్యశాల’కు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పేరు పెట్టడానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. వైశ్యులకు ప్రాధాన్యం తగ్గకుండా కొత్తగా చర్లపల్లిలో నిర్మించిన రైల్వే టెర్మినల్‌కు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘అమరజీవి పొట్టి శ్రీరాములు టెర్మినల్’గా నామకరణం చేయాలని ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నట్టు ప్రకటించారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు వైశ్యుల ప్రతినిధి కాదు. ఆయనను కులం గాటికి కట్టకూడదు. ఆయన విశ్వమానవుడు. ప్రకృతి వైద్యం అంటే గాంధీ అనీ, గాంధీ అంటే ప్రకృతి వైద్యం అనే భావన చాలామంది మదిలో ఉంది. అటువంటి జాతిపిత పేరు తీసి రోశయ్య పేరు పెట్టడం సముచితం కాదు. 55 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్, కళాశాల ఏమాత్రం పురోగతి లేకుండా ఉంది. అప్పుడు మొదలుపెట్టిన బిఎన్‌వైఎస్ కోర్సు తప్ప కొత్తగా పెట్టిన డిప్లొమా, పీజీ కోర్సులు ఏవీ లేవు. ఈ ఆస్పత్రి ఎప్పుడూ పేషంట్స్ తాకిడితో రద్దీగా ఉంటుంది. అయితే తొంభై శాతం డాక్టర్లు, సహాయ సిబ్బంది పదవీ విరమణ చేయడంతో ఔట్ సోర్సింగ్ స్టాఫ్‌తో ఆస్పత్రి నడుస్తోంది. సిబ్బంది నియామకం, పరిశోధనను పోత్సహించడం, పీజీ కోర్సును ఏర్పాటు చేయడం వంటి అభివృద్ధికరమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి... పేర్ల మార్పు వ్యవహారాన్ని తెర మీదకు తీసుకు రావడం సరైనదేనా అనేది ప్రభుత్వం ఆలోచించాలి.
చదవండి: సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!
గాంధీ నేచర్ క్యూర్ ఆస్పత్రికి తోడు జిల్లా స్థాయి ప్రకృతి వైద్యశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ఈ యాంత్రిక ప్రపంచంలో ప్రజలకు సహజ (ప్రకృతి) వైద్యాన్ని అందుబాటులోకి తెస్తుందని ఆశించడం అత్యాశ కాబోదు. ప్రస్తుతం పేర్ల మార్పిడి తతంగాన్ని అలా వదిలేసి కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకూ, సంస్థలకూ ఇప్పుడు నామకరణం చేయాలనుకున్న పేర్లను పెట్టవచ్చు.
– డా.యం. అఖిల మిత్ర, ప్రకృతి వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment