రెండంతస్తుల్లో చర్లపల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి రైల్వేస్టేషన్ ఆధునికీకరణపై దక్షిణమధ్య రైల్వే మరో ముందడుగు వేసింది. ఎయిర్‌పోర్టు తరహాలో చర్లపల్లి రైల్వేస్టేషన్ పునర్నిర్మాణానికి తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా విమానాశ్రయం తరహాలో తిరుపతి, సికింద్రాబాద్ స్టేషన్ల పునర్ అభివృద్ధికి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. తిరుపతి స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్‌కు ఒకట్రెండు రోజుల్లో టెండర్లు ఖరారు కానున్నాయి.
ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్‌లో 4వ టర్మినల్‌గా ఇప్పటికే విస్తరణ పనులు చేపట్టిన చర్లపల్లి స్టేషన్‌ను సైతం ఎయిర్‌పోర్టు తరహాలో అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2023 జూన్ నాటికి చర్లపల్లి స్టేషన్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు పనుల్లో వేగం పెంచినట్లు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వేమేనేజర్ అభయ్‌కుమార్ గుప్తా తెలిపా రు. అన్ని సదుపాయాలతో వినియోగంలోకి రానున్న చర్లపల్లి స్టేషన్ నుంచి కాజీపేట్, విజయవాడ రూట్లో వెళ్లే రైళ్లను నడుపనున్నట్లు పేర్కొన్నారు.
సేవలు ఇలా....
చర్లపల్లి స్టేషన్‌ను రెండంతస్తుల్లో పునర్ నిర్మించనున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రయాణికుల విశ్రాంతి గదులు, హోటళ్లు, రైల్వే అధికారుల కార్యాలయాలు తదితర సదుపాయాలు ఉంటాయి. విమానాశ్రయంలో లాగా ప్రయాణికులు ప్రవేశద్వారం నుంచి నేరుగా ప్లాట్‌ఫామ్‌కు చేరుకొనేలా మొదటి అంతస్తు ఉంటుంది. మొదటి విడతలో మొత్తం 8 లైన్లతో ప్లాట్‌ఫాంలను విస్తరిస్తారు. దశలవారీగా ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరగనుంది. అన్ని ప్లాట్‌ఫాంలకు చేరుకొనేలా ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేస్తారు.
“రైళ్ల నిర్వహణకు పిట్లైన్లు, ఇక్కడి నుంచి రైళ్లను నడిపేందుకు ప్రత్యేక మార్గాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. చర్లపల్లి నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా అప్రోచ్ రోడ్ల నిర్మాణం కూడా తుది దిశకు వచ్చింది’ అని డీఆర్ఎం వివరించారు. ఎయిర్‌పోర్టు తరహాలో స్టేషన్ పునర్ అభివృద్ధికి ఇటీవల నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సికింద్రాబాద్ స్టేషన్ పునర్ అభివృద్ధి కోసం ఒకట్రెండు రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు.
చర్లపల్లి నుంచే వందేభారత్...
సెమీ హైస్పీడ్‌గా పేరొందిన వందేభారత్ రైళ్లను చర్లపల్లి నుంచే నడపనున్నారు. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చర్లపల్లి నుంచి విశాఖ, ముంబై తదితర మార్గాల్లో వందేభారత్ నడపాలని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైల్వేలోని అన్ని జోన్లకు దశలవారీగా వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.