సంక్రాంతి రద్దీ.. ప్రయాణికులకు చుక్కలే! | Special Trains For Sankranti Has Been Delayed, Public Waiting For Hours In Many Routes | Sakshi
Sakshi News home page

ఎటు చూసినా సంక్రాంతి రద్దీ.. ప్రత్యేక రైళ్లతో ప్రయాణికులకు చుక్కలే

Published Sat, Jan 11 2025 9:36 AM | Last Updated on Sat, Jan 11 2025 12:40 PM

Special Train Delay of Sankranti Train

వివిధ మార్గాల్లో గంటల తరబడి ఆలస్యం 

పట్టాలపైనే రైళ్లు.. పడిగాపుల్లో ప్రయాణికులు 

సంక్రాంతికి అరకొరగా ప్రత్యేక రైళ్లు 

ప్రైవేట్‌ బస్సుల్లో దారి దోపిడీ    

ఆర్టీసీ 50 శాతం అదనపు వసూళ్లు  

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి రద్దీ మొదలైంది. విద్యా సంస్థలకు సెలవులు  ప్రకటించడంతో నగర వాసులు సొంత ఊళ్లకు తరలివెళ్తున్నారు. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్‌ రైళ్లలో రిజర్వేషన్‌లు  పూర్తిగా నిలిచిపోయి రిగ్రేట్‌ దశకు చేరాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి టెర్మినల్ నుంచి కాకినాడ, తిరుపతి, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాలకు కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్తుండగా.. అరకొరగా ఏర్పాటు చేసిన  ప్రత్యేక రైళ్లు ఏ మాత్రం ప్రయాణికుల డిమాండ్‌లను భర్తీ చేయడం లేదు. 

మరోవైపు అన్ని ప్రత్యేక రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అతికష్టంగా బెర్తులు సంపాదించి రైలెక్కినా గంటల తరబడి పట్టాలపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి  సాయంత్రం 6 గంటలకు బయలుదేరితే  మరుసటి రోజు మధ్యాహ్నం 12 దాటినా విశాఖకు చేరుకోలేకపోయామని  కూకట్‌పల్లికి చెందిన కృష్ణారావు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి శబరిమలకు నడిచే రైళ్లు కూడా అయ్యప్ప భక్తులకు నరకం చూపుతున్నాయి. రెండు రోజులు గడిచినా హైదరాబాద్‌ నుంచి శబరిమలకు, తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోలేకపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

చార్జీలు కూడా ‘ప్రత్యేకమే’..  
నగరం నుంచి ప్రతి రోజు సుమారు వందకు పైగా రెగ్యులర్‌ రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 2.5 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం రోజుకు మరో 50 వేల మంది అదనంగా బయలుదేరే అవకాశం ఉంది. ఈ డిమాండ్‌ మేరకు అదనపు రైళ్లు లేవు. కొన్ని రైళ్లలో బెర్తులు, అదనపు బోగీలు ఏర్పాటు చేశారు. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మాత్రం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. కానీ ఈ రైళ్లలో చార్జీలు కూడా ఎక్కువే. సాధారణ చార్జీలపై 25 శాతం వరకు అదనపు చార్జీలు విధిస్తారు. అయినప్పటికీ మరో గత్యంతరం లేక ప్రత్యేక రైళ్లను ఆశ్రయించే ప్రయాణికులకు రైళ్లలో పడిగాపులు తప్పడం లేదు.  

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పట్టాలపై రైళ్ల ఒత్తిడి పెరిగిందని, దీంతో సకాలంలో సిగ్నల్స్‌ లభించకపోవడం వల్ల  జాప్యం చోటుచేసుకుంటోందని  అధికారులు చెబుతున్నారు. కానీ ఈ ఆలస్యం  ప్రయాణికుల పండగ సంతోషాన్ని ఆవిరి చేస్తోంది. కనిష్టంగా 3 నుంచి గరిష్టంగా 12 గంటల వరకు కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గతంలో ఇలాంటి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెల్లువెత్తినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. సంక్రాంతి సందర్భంగా బయలుదేరిన ప్రయాణికులు భోగి పండగ రోజు కూడా సొంత ఊళ్లకు చేరుకోలేకపోయారు. ప్రస్తుతం మరోసారి అదే పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. 

ఆర్టీసీ సైతం అదే బాటలో.. 
ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సుల పేరిట 50 శాతం అదనపు దోపిడీకి దిగింది. ఏపీతో పాటు, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కూడా 25 శాతం నుంచి 50 శాతం వరకు అదనపు వసూళ్లకు పాల్పడుతోంది. చివరకు దివ్యాంగుల పాస్‌లను అనుమతించకుండా ఇష్టారాజ్యంగా చార్జీలు విధిస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు 6 వేలకు పైగా అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజులుగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఎల్‌బీనగర్, ఉప్పల్, హయత్‌నగర్, ఎంజీబీఎస్, జేబీఎస్‌ తదితర ప్రాంగణాలుప్రయాణికులతో సందడిగా మారాయి.

ప్రైవేట్‌ బస్సుల దోపిడీ.. 
సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్‌  ట్రావెల్స్‌ అడ్డగోలుగా దారి దోపిడీకి  పాల్పడుతున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి విశాఖకు లగ్జరీ రూ.1800 వరకు ఉంటుంది. ఇప్పుడు ఆ చార్జీ రూ.3000 వరకు చేరింది. అలాగే ఏసీ బస్సుల్లో రూ.2500 నుంచి ఏకంగా రూ.5000 వరకు పెరిగినట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిల్లిపాదీ కలిసి వెళితే చార్జీల కోసమే రూ.వేలల్లో  ఖర్చు చేయాల్సి వస్తోందని  ఏఎస్‌రావు నగర్‌కు చెందిన మల్లికార్జున్‌రావు చెప్పారు. అలాగే.. హైదరాబాద్‌ నుంచి కాకినాడ, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాలకు సైతం ప్రైవేట్‌ బస్సుల దోపిడీ విమాన చార్జీలను తలపిస్తోంది.

సాక్షి ఎఫెక్ట్‌.. బస్సులు సీజ్‌
అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తున్నప్రైవేట్‌ వాహనాల దందాపై సాక్షి వరుస కథనాలు ఇచ్చింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఎల్బీనగర్ లో ప్రైవేట్ వాహనాలపై ఆర్టిఏ అధికారుల కొరడా జులిపించారు. సంక్రాంతికి అధిక బస్సు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ వాహనాలపై ఆర్టిఏ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలోని టీం అడ్డుకుంది. దాదాపు 20 బస్సులపై కేసు నమోదు చేశారు. 

ఇక.. పెద్ద అంబర్ పేట్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారుల సీజ్ చేశారు. మరోవైపు.. రాజేంద్రనగర్‌ ఆరాంఘడ్‌ చౌరస్తా వద్ద రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల ఈ ఉదయం 4 గంటల నుంచే తనిఖీ చేపట్టారు. చెన్నై, తిరువంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి నుండి హైదరాబాద్ వస్తున్న బస్సులను తనిఖీలు చేస్తున్నారు .  ఈ క్రమంలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నట్రావెల్స్‌పై కేసులు నమోదు చేస్తున్నారు. 11 బస్సుల పై కేసు నమోదు అయినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement