![Heavy Public At Mee Seva Counters To Apply Ration Card](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/23.jpg.webp?itok=PbXWRtuy)
కిటకిటలాడిన బంజారాహిల్స్, ఖైరతాబాద్ సెంటర్లు
సరైనా పత్రాలతో రావాలని అధికారుల సూచన
బంజారాహిల్స్: కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో దరఖాస్తుదారులు మీ–సేవా కేంద్రాలకు క్యూ కట్టారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్–7లోని మీ–సేవా కేంద్రంతో పాటు ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయ ఆవరణలోని సెంటర్ల వద్ద ఉదయం నుంచే బారులుదీరారు. కొత్త కార్డుతో పాటు ప్రస్తుత కార్డులో కొత్తపేర్లు చేర్చాలని ఆధార్‌తో పాటు కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లును జతచేసి దరఖాస్తు చేసుకున్నారు. సిబ్బంది సైతం అప్పటికప్పుడే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. బంజారాహిల్స్‌లోని మీ–సేవా కేంద్రానికి ఒక్కరోజే దాదాపు 1000 మంది వరకు, అలాగే బస్తీలు, కాలనీల్లోని మీ–సేవా కేంద్రాలకు కూడా దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
మరికొద్ది రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సిబ్బంది తెలిపారు. రేషనింగ్ ఖైరతాబాద్ సర్కిల్–7 పరిధి కిందికి వచ్చే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వేంకటేశ్వరకాలనీ, సోమాజీగూడ, ఖైరతాబాద్, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్‌నగర్, అమీర్‌పేట డివిజన్ల పరిధిలోని 81 రేషన్ షాపుల పరిధిలో కొత్తగా రేషన్ కార్డు కోసం మీ–సేవా కేంద్రాలకు వెళ్లి సదరు దరఖాస్తు ఫారానికి సంబంధిత డాక్యుమెంట్లు జతపరిచి ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
సర్కిల్–7 పరిధిలో 83,013 రేషన్‌కార్డులు..
ఖైరతాబాద్ సర్కిల్–7 పరిధిలో 81 రేషన్ షాపులు ఉండగా ప్రస్తుతం వీటి పరిధిలో ఆహార భద్రత కార్డులు 79,531, అంత్యోదయ అన్నయోజన కార్డులు 3481, ఒక అన్నపూర్ణ కార్డు కలిపి మొత్తం 83,013 కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో 2,92,882 మంది లబి్ధదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. సర్కిల్ పరిధిలో మొత్తం ప్రతినెలా 18,19,011 కిలోల రేషన్ బియ్యం అందిస్తున్నారు.
కొత్తవారికి ఈ నెల రేషన్ లేనట్లే..!
ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల్లో గత నెల 6,093 మందిని అర్హులుగా గుర్తించి సర్వే చేయగా ఇందులో 2,938 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలో నూతన లబ్ధిదారులకు ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. ఈనెల కూడా వారికి రేషన్ లేనట్లేనని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment