సాక్షి, అమరావతి : సహజ వనరులైన ఇసుక, మట్టి నుంచి భారీఎత్తున దోపీడీకి పాల్పడిన చంద్రబాబు సర్కారు ఆఖరికి పట్టణ పేదలనూ వదలకుండా వారి ఇళ్ల నిర్మాణాల్లో భారీ దోపిడీకి పాల్పడింది. పట్టణ ప్రాంత పేదలకు కేంద్రం మంజూరు చేసిన ఇళ్ల వ్యయాన్ని భారీగా పెంచేసి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలను కమీషన్ల రూపంలో సీఎం చంద్రబాబు కాజేశారు.
రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ వ్యయం... ఏపీలో నిర్మాణ వ్యయానికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసాలే ఇందుకు నిదర్శనం. ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రంలో చేపట్టిన ఐదు లక్షల నిర్మాణాల్లో ఏకంగా రూ.13,170.75 కోట్లు కాజేశారు. ఒక పక్క యూనిట్ వ్యయం పెంచి ఆ మొత్తాన్ని ఖజానా నుంచి తీసుకుంటూ, మరోపక్క పేదలపై ఏకంగా రూ.17,730 కోట్ల అప్పుల భారం మోపుతూ ఈ దోపిడీ ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో సాగింది. దీనిని అధికార వర్గాలు సైతం ధ్రువీకరిస్తున్నాయి.
ఇది ఖజానా దోపిడీ..
వాస్తవానికి ఈ నిర్మాణాలను షీర్‌వాల్ టెక్నాలజీతో చేపట్టారు. దీనిప్రకారం యూనిట్ వ్యయం బాగా తక్కువగా ఉండాలి. కానీ సంప్రదాయ నిర్మాణాలకు మించిన యూనిట్ ధరను షీర్‌వాల్ టెక్నాలజీకి నిర్ణయించారు.వ్యూహాత్మకంగా రూ.పదితో అయ్యే పనికి కాంట్రాక్టర్లకు తొలుతే రూ.20 ఇచ్చేసి... వారి నుంచి ఆ పది రూపాయలను తిరిగి తీసుకున్నారు.
దీన్ని ‘ఖజానా నుంచి దోపిడీ’గా ఓ ఉన్నతాధికారి పేర్కొనడం గమనార్హం. పొరుగున ఉన్న కర్ణాటకలో సంప్రదాయంగా 367 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణ యూనిట్ వ్యయం రూ.3.80 లక్షలు మాత్రమే. అంటే చదరపు అడుగుకు రూ.1,356. ఇందులోనే విద్యుత్ సహా అంతర్గత, బాహ్య మౌలిక సదుపాయాలన్నీ కలిపి ఉంటాయి.
ఏపీ ప్రభుత్వం మాత్రం 300 చదరపు అడుగుల ఇంటి యూనిట్ వ్యయం రూ.5.98 లక్షలుగా, 365 చదరపు అడుగుల ఇంటి వ్యయం రూ.6.83 లక్షలుగా, 430 చదరపు అడుగుల యూనిట్ వ్యయం రూ.7.68 లక్షలుగా నిర్ధారించింది. షీర్ వాల్ టెక్నాలజీ పేరుతో చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.2,134.77గా నిర్ధారించింది. కర్ణాటక కంటే అదనంగా నిర్ధారించిన రూ.734 మొత్తం సొంత ఖాతాల్లోకి వేసుకోవడానికే అని తెలుస్తోంది.
పేదలపై రూ.17,730.88 కోట్ల రుణ భారం..
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు సబ్సిడీగా ఇస్తున్నాయి. ఈ మూడు లక్షల రూపాయలతోనే పట్టణ పేదలకు చక్కటి ఇళ్లు కట్టించి ఇవ్వొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పేదలపై అప్పుల భారం మోపి యూనిట్ వ్యయాన్ని భారీగా పెంచేసింది. ఒక్కో పేదవాడిపై రూ.2.65 లక్షల నుంచి రూ.4.65 లక్షల వరకు రుణ భారం మోపారు. ఈ ఇళ్ల నిర్మాణాలను కూడా చంద్రబాబు సర్కారు అస్మదీయ సంస్థలకే అప్పగించింది.
ఇందులో ఎల్‌అండ్‌టీకి రూ.12 వేల కోట్లపైగా విలువైన పనులు, రూ.26 వేల కోట్ల పనులను షాపూర్ జీ పల్లోంజీ, ఎన్‌సీసీ, కనకమేడల వరప్రసాద్ సంస్థలకు ఇచ్చారు. మొత్తం ఐదు లక్షల ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.38,265.88 కోట్లుగా (మౌలిక వసతులతో కలిసి మొత్తం 17,92,50,000 చదరపు అడుగులు) నిర్ధారించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.7,500 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.13,035 కోట్లు. లబ్ధిదారుల (అప్పు) వాటా రూ.17,730.88 కోట్లుగా పేర్కొన్నారు.
అయితే, చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.734 మేర పెంచడం ద్వారా ఈ ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వం రూ.17,730.88 కోట్లను దోచేసింది. 15 నెలల్లో నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్దిష్ట సమయం పెట్టుకున్నా అస్మదీయ కాంట్రాక్టర్లకు మరింత ఆర్థిక ప్రయోజనం కల్పించడానికి ఎస్కలేషన్ క్లాజ్‌ను టెండర్ నిబంధనల్లో పొందుపర్చారు.
రుణమంతా మాఫీ చేస్తాం
కమీషన్ల కోసం పట్టణ పేదల ఇళ్ల నిర్మాణాన్నీ వదల్లేదని, వాటి అంచనాలను అక్రమంగా పెంచేశారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రలో, ఎన్నికల్లో సభల్లో ఇప్పటికే పలుసార్లు ప్రస్తావించారు. అంతేకాక పట్టణ పేదలను అప్పుల పాల్జేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్లను తీసుకోవాలని సూచిస్తూనే, వారిపై మోపిన ఈ అప్పుల భారాన్ని తమ పార్టీ అధికారంలోకి రాగానే తొలగిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీనిప్రకారం చూస్తే... ఐదు లక్షల మంది పట్టణ పేదల ఇళ్ల అప్పుల భారం మొత్తం రూ.17,730.88 కోట్లు రద్దయి ఉపశమనం కలగనుంది.
Comments
Please login to add a commentAdd a comment