రాష్ట్రానికి అదనంగా 12,862 గృహాలు
⇒ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేటాయింపు
⇒ 60 శాతం గృహాలు ఎస్సీ, ఎస్టీలకు ప్రతిపాదించిన తెలంగాణ
⇒ 2016–17కు గాను రాష్ట్ర వార్షిక ప్రణాళికను ఆమోదించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) కింద 2016–17కు గాను రాష్ట్రానికి అదనంగా 12,862 గృహాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించింది. ఇటీవల జరిగిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు చెందిన సాధికారిక కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు. 2016–17కు గాను ముందుగా నిర్ణయించిన లక్ష్యం 38,097 గృహాలకు అదనంగా 12,862 గృహాల నిర్మాణానికి తెలంగాణ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు సాధికారిక కమిటీ ఆమోద ముద్ర వేయడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర లక్ష్యం 50,959 గృహాలకు చేరుకుంది.
ఈ మొత్తం గృహాలలో 30,575 గృహాలను (60 శాతం) ఎస్సీ, ఎస్టీలకు, 3,566 గృహాలను మైనారిటీలకు కేటాయిస్తామని రాష్ట్రం ప్రతిపాదించింది. గృహ నిర్మాణానికి సంబంధించిన అన్ని పథకాల నిధులు రాష్ట్ర నోడల్ ఖాతాకు బదిలీ చేయాలని, గత ఏప్రిల్ నాటికి వ్యయం కాని రూ.36.44 కోట్లను ఇందిరా ఆవాస్ యోజన కింద పెండింగ్‌లో ఉన్న గృహాల నిర్మాణానికి వినియోగించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారిస్తుందని సాధికారిక కమిటీ పేర్కొంది. రాష్ట్రంలో లబ్ధిదారులకు పథకం వివరాలు, స్థానిక వనరుల లభ్యత, శిక్షణ పొందిన మేస్త్రీల అవసరం తదితర విషయాలపై అవగాహన కల్పించడానికి క్యాంపులు నిర్వహించాలని ఆదేశించింది. ఆధార్ సీడింగ్‌కు లబ్ధిదారుడి అనుమతి తీసుకోవాలని సూచించింది.
‘ఉపాధి’ ద్వారా నిర్మించండి..
గృహాల నిర్మాణానికి కనీసం 90 నుంచి 95 దినాలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద కార్మికులను పనిలోకి తీసుకోవాలని సాధికారిక కమిటీ సూచించింది. మరోవైపు రాష్ట్రంలో పీఎంఏవై కింద గృహాల నిర్మాణంలో స్వచ్ఛ భారత్ మిషన్ లేదా జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.12 వేల చొప్పున వినియోగిస్తూ టాయిలెట్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పీఎంఏవై మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులు స్వయంగా గృహాన్ని నిర్మించుకోవాలి లేదా లబ్ధిదారుడి పర్యవేక్షణలో గృహ నిర్మాణం జరగాలి. ఇందులో కాంట్రాక్టర్ల ప్రమేయం ఉండరాదు. అయితే ఒక్కో ఇంటికి రూ.5 లక్షల వ్యయంతో తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌హెచ్‌సీఎల్) ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేపడుతున్నందున.. లబ్ధిదారులకు బదులుగా టీఎస్‌హెచ్‌సీఎల్ నిర్మాణం చేపట్టడానికి మినహా యింపు మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపించాలని సాధికారిక కమిటీ స్పష్టం చేసింది.