ఎన్నికలవేళ అధికార, ప్రతిపక్షనేతలు ‘ఉచితాలు’పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఓటర్లు కూడా దీర్ఘకాలికంగా ఆర్థిక వెసులుబాటు కోసం ఆలోచించకుండా ఈ ‘ఉచితాలు’వైపే మొగ్గుతున్నారు. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నికలవేళ ఇచ్చిన హామీలు నేరవేర్చడానికి అప్పు చేయాల్సి వస్తోంది. పార్టీలకు అతీతంగా గతంలో కంటే మరింత మెరుగైన ‘ఉచిత’ పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మ్యానిఫెస్టో తయారు చేయించుకుని ప్రచారాలకు వెళ్తున్నారు. అధికారంలోకి వచ్చాక వాటికోసం తిరిగి అప్పు చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. విభిన్న పార్టీలకు చెంది వివిధ రాష్ట్రాల్లో పాగా వేసిన కొన్ని ప్రభుత్వాల ఆర్థిక స్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.
హిమాచల్‌ప్రదేశ్
హిమాచల్‌ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా అప్పు కలిగిన రాష్ట్రంగా నిలిచింది. దీనికి రూ.95,000 కోట్ల అప్పు ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. వచ్చే రెండు నెలలపాటు మంత్రులు తమ జీతాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. సరైన నిధులులేక ఎన్నికలవేళ ఇచ్చిన హామీలు నెరవేర్చడం సవాలుగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మధ్యప్రదేశ్
బీజేపీ గతేడాది రాష్ట్రంలో గెలుపొందడానికి ప్రధాన కారణం ‘లడ్లీ బెహనా’ పథకం అని ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. ఈ పథకం ప్రకారం వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలలోపు ఉండి 21-65 ఏళ్లు ఉన్న రాష్ట్ర మహిళలకు నెలకు రూ.1,000 నేరుగా తమ బ్యాంకులో జమ చేస్తారు. దీని అమలుకు ఈ ఏడాది రూ.18,984 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు ఒక్కనెలలోనే ఈ రాష్ట్రం రూ.10,000 కోట్లు అప్పు చేసింది. గతేడాది మొత్తంగా రూ.76,230 కోట్లు అప్పు పోగైంది. గడిచిన బడ్జెట్ సెషన్‌లో తెలిపిన వివరాల ప్రకారం మొత్తం రాష్ట్ర అప్పులు రూ.4.18 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది ప్రభుత్వ పథకాలు, ఇతర కార్యకలాపాల కోసం అదనంగా రూ.94,431 కోట్లు అప్పు తీసుకోవాలని నిర్ణయించుకుంది. వ్యవసాయ మోటార్ల కొనుగోలు కోసం రాయితీ రూపంలో రూ.4,775 కోట్లు చెల్లించాల్సి ఉంది. 100 యూనిట్లలోపు విద్యుత్తు వాడితే రూ.100 చెల్లించి బిల్లు మాఫీ చేసుకునే పథకానికి రూ.3,500 కోట్లు వెచ్చించాలి. రైతులు వాడే కరెంటు కోసం రూ.6,290 కోట్లు అవసరం అవుతాయి. బాలికల కోసం చేపట్టిన ‘లడ్లీ లక్ష్మీ’ పథకం కోసం రూ.1,231 కోట్లు కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, లోన్ల వడ్డీ చెల్లింపు కోసం రూ.1,17,945 కోట్లు అవసరం. ఈ ఏడాది రాష్ట్ర ద్రవ్యలోటు 4.1 శాతం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.
కర్ణాటక
కర్ణాటకలో కాంగ్రెస్ గతేడాది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మార్చిలో బోస్టన్ కన్సల్టింగ్ సంస్థను నియమించుకుని అదనంగా రూ.55 వేలకోట్లు-రూ.60 వేలకోట్లు ఎలా సమకూర్చుకోవాలో సలహాలు ఇవ్వాలని కోరింది. ఎన్నికలవేళ ప్రభుత్వం ప్రకటించిన ఐదు గ్యారంటీల అమలు ప్రస్తుతం ఆర్థికభారంగా మారుతుంది. గతేడాది ఐదు గ్యారంటీలకు రూ.36 వేలకోట్లు కేటాయించారు. ఈసారి దీన్ని రూ.53,674 కోట్లకు పెంచారు. కేవలం ‘గృహలక్ష్మీ’ పథకానికి అందులో సగం కంటే ఎక్కువ అంటే రూ.28,608 కోట్లు కేటాయించారు. పథకాల అమలు, ప్రభుత్వ కార్యకలాపాలకు ఈ ఏడాది కర్ణాటక రూ.1,05,246 కోట్ల అప్పు చేయాల్సి ఉంటుంది.
పంజాబ్
ఆమ్‌ఆద్మీపార్టీ రాష్ట్రంలోని రైతులు, గృహావసరాల కోసం రూ.17,110 కోట్లతో విద్యుత్‌ను అందిస్తోంది. మార్చి 2024 వరకు రాష్ట్ర అప్పులు మొత్తం రూ.3,51,130 కోట్లు ఉన్నట్లు ఆర్‌బీఐ డేటా తెలిపింది. రాష్ట్ర ద్రవ్యలోటు 3.8 శాతంగా ఉంది.
ఇదీ చదవండి: ఆన్‌లైన్‌లో క్లెయిమ్ స్టేటస్
తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చాలంటే ఏటా అదనంగా రూ.20,378 కోట్లు అవసరం అవుతాయి. రైతు రుణమాఫీ కోసం రూ.15,470 కోట్లు కావాల్సి ఉంది. మహాలక్ష్మీ ఉచిత బస్సు పథకానికి రూ.3,083 కోట్లు అవసరం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు కోసం రూ.1,825 కోట్లు కావాలి. వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12,000 హామీ ఇంకా అమల్లోకి రాలేదు. ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల కోసం రూ.5 లక్షలు-రూ.6 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇంకా దీనిపై స్పష్టత రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment