వైఎస్సార్ జిల్లా: అప్పుల బాధ తాళలేక వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దెకుంటలో రైతు నాగేంద్ర కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఈ విషాదాన్ని కూటమి ప్రభుత్వం అవహేళన చేసింది. నాగేంద్ర వద్ద డబ్బులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, వేరే కారణాలతో బలవన్మరణానికి పాల్పడి ఉంటారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలపై రైతులు, రైతుల సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కౌలుకు వేసిన పంటలు పండక రైతు నాగేంద్ర రూ. 15 లక్షల అప్పుల్లో కూరుకుపోయారు. దీంతో ఇటీవలే లోన్ ద్వారా తీసుకున్న ట్రాక్టర్ జప్తుకు గురి కావడం, కౌలు యజమాని డబ్బు అడిగితే ఏం చెప్పాలోనని ఆవేదన, అప్పు ఇచ్చిన వాళ్ళ ఒత్తడితో నాగేంద్ర తీవ్ర మనోవేదనకు గురయ్యారు. భార్య, కుమార్తె, కుమారుడికి ఉరి వేసి తానూ ఆత్మహత్య పాల్పడ్డారు.
అయితే, ఇంతటి విషాదంలో రైతు కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవహేళన చేస్తూ మాట్లాడారు. రైతు నాగేంద్ర మరణంపై పోలీసుల విచారణ పూర్తిగాక ముందే పవన్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘రైతు నాగేంద్ర వద్ద డబ్బులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, వేరే కారణాలతో బలవన్మరణానికి పాల్పడి ఉంటారంటూ’ బుకాయించే ప్రయత్నం చేశారు.
మరోవైపు రైతు నాగేంద్ర, అతని కుటుంబ సభ్యుల ఆత్మహత్యలపై డీఎస్పీ విచారణ చేపట్టారు. విచారణలో అప్పుల బాధతోనే రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ రైతు కుటుంబానికి డబ్బు సమస్య కాదంటూ అవహేళనగా కూటమి నేతలు వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment