గోల్డ్‌ బాండ్లకు చెక్‌..! | Sovereign Gold Bond scheme likely to be discontinued in 2025-26 | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ బాండ్లకు చెక్‌..!

Published Sat, Dec 14 2024 4:05 AM | Last Updated on Sat, Dec 14 2024 8:14 AM

Sovereign Gold Bond scheme likely to be discontinued in 2025-26

రుణాలను తగ్గించుకునే యోచన 

ద్రవ్యలోటు కట్టడి ప్రణాళికలకు దన్ను 

బంగారం ధరల పెరుగుదల ఎఫెక్ట్‌ 

2015లో తొలిసారి గోల్డ్‌ బాండ్ల జారీ 

ఫిజికల్‌గా పసిడి కొనుగోలుకు చెక్‌ పెడుతూ కేంద్ర ప్రభుత్వం సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల పథకానికి తెరతీసింది. యూనిట్ల(ఒక గ్రాము)లో జారీ చేయడం ద్వారా నెమ్మదిగా రిటైల్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. తద్వారా దిగుమతుల భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలు వేసింది. అయితే బంగారం ధర ప్రతీ ఏడాది రేసు గుర్రంలా పరుగు తీయడంతో బాండ్ల గడువు ముగిసేసరికి రుణ భారం భారీగా పెరిగిపోతూ వచ్చింది. వెరసి ఇకపై వీటికి ఫుల్‌స్టాప్‌ పెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాల అంచనా. వివరాలు చూద్దాం..  

కేంద్ర ఆర్థిక శాఖ వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26) నుంచి సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల(ఎస్‌జీబీలు) జారీని నిలిపివేసే అవకాశముంది. ప్రభుత్వ రుణాలను తగ్గించుకునే బాటలో ప్రభుత్వం ఎస్‌జీబీల జారీని నిలిపివేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఫిజికల్‌గా బంగారం దిగుమతులను తగ్గించుకునే యోచనతో ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా ఈ ఏడాది జూలైలో వెలువడిన బడ్జెట్‌లో రూ. 18,500 కోట్ల విలువైన ఎస్‌జీబీల జారీకి ప్రణాళికలు వేసింది. 

అయితే గతేడాది జారీ చేసిన రూ. 26,852 కోట్లతో పోలిస్తే అంచనాలను భారీగా తగ్గించింది. ఎస్‌జీబీల గడువు ముగిశాక ప్రభుత్వం బంగారం మార్కెట్‌ ధరకు అనుగుణంగా ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా వీటిపై నిరంతరంగా వడ్డీని సైతం చెల్లిస్తుంది. ఫలితంగా ప్రభుత్వంపై అదనపు రుణభారానికి ఆస్కారం ఏర్పడుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం 2026–27కల్లా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో రుణ(డెట్‌) నిష్పత్తిని తగ్గించుకునే ప్రణాళికల్లో ఉంది. దీంతో ఇకపై ఎస్‌జీబీలను జారీ చేసే యోచనకు ప్రభుత్వం స్వస్తి పలకవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.  

14.7 కోట్ల యూనిట్లు జారీ
2015 మొదలు ఆర్‌బీఐ 67 ఎస్‌జీబీ పథకాల ద్వారా మొత్తం 14.7 కోట్ల యూనిట్లను జారీ చేసినట్లు అంచనా. అయితే పసిడి విలువ ఎప్పటికప్పుడు పరుగు తీస్తుండటంతో వీటి విలువ సైతం పెరుగుతూ వస్తోంది. ఉదాహరణకు 2016లో గ్రాము(యూనిట్‌)కు రూ. 3,007 ధరలో ఎస్‌జీబీలను విడుదల చేసింది. వీటి గడువు తీరేసరికి విలువ రూ. 4,781 జంప్‌చేసి రూ. 7,788కు చేరింది. 

అంటే 8 ఏళ్లలో 159% వృద్ధి. అంతేకాకుండా వార్షికంగా 2.5% వడ్డీ  కూడా లభించింది. దీంతో ఆర్‌బీఐ 2017 మే నెలలో, 2020 మార్చిలో జారీ చేసిన ఎస్‌జీబీలను ముందుగానే చెల్లించేందుకు ఈ ఏడాది ఆగస్ట్‌లో నిర్ణయించింది. తద్వారా ప్రభు త్వ రుణభారాన్ని తగ్గించేందుకు సంకలి్పంచింది. మరోవైపు ప్రభుత్వం సైతం జూలై బడ్జెట్‌లో పసిడిపై దిగుమతుల సుంకాన్ని 15% నుంచి 6 శాతానికి భారీగా తగ్గించింది.

ఎస్‌జీబీలంటే 
కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్‌ బ్యాంక్‌ ఎస్‌జీబీలను జారీ చేస్తుంది. ఒక గ్రాము బంగారాన్ని ఒక యూనిట్‌గా జారీ చేస్తుంది. అప్పటి మార్కెట్‌ ధర ఆధారంగా వీటిని కేటాయిస్తుంది. అంటే ఇది పేపర్‌ గోల్డ్‌. కాలపరిమితి 8 ఏళ్లుకాగా.. ఐదేళ్ల తదుపరి ఎప్పుడైనా వీటిని విక్రయించేందుకు వీలుంటుంది. అప్పటి బంగారం మార్కెట్‌ ధర ఆధారంగా మెచ్యూరిటీ విలువ ఉంటుంది. అంతేకాకుండా వీటిపై తొలి ఏడాది నుంచి 2.5 శాతం వార్షిక వడ్డీ అందుతుంది. ఈ బాండ్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో ట్రేడవుతాయి.  

పసిడి మెరుపులు 
అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు నిరంతరం బలపడుతూనే ఉన్నాయి. భవిష్యత్‌లోనూ మరింత పెరిగే అవకాశముంది. ఇందుకు రాజకీయ, భౌగోళిక అనిశి్చతులు, ప్రభుత్వాల విధానాలు, యుద్ధ భయాలు వంటి అంశాలు కారణంకానున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశీయంగా 2015లో ఎస్‌జీబీలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఫిజికల్‌గా పసిడి కొనుగోళ్లకు చెక్‌ పెట్టే యోచనతో రిటైల్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు వీటిని తీసుకువచి్చంది. తద్వారా ఫిజికల్‌ గోల్డ్‌ నుంచి పేపర్‌ గోల్డ్‌కు ఇన్వెస్టర్లను మళ్లించే ప్రయత్నం చేసింది. తొలుత 8 ఏళ్ల కాలపరిమితితో వీటికి శ్రీకారం చుట్టింది. 

ఐదేళ్ల గడువు తదుపరి మార్కెట్‌ ధరలకు అనుగుణంగా రిడీమ్‌ చేసుకునేందుకు వీలు కల్పించింది. 2017–18లో వ్యక్తులు, కుటుంబాలకు ఒక ఆర్థిక సంవత్సరంలో 4 కేజీలవరకూ పెట్టుబడులకు అనుమతించింది. ట్రస్ట్‌లు, సంబంధిత సంస్థలు 20 కేజీలవరకూ ఇన్వెస్ట్‌ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచి్చంది. 2015–16లో జారీ చేసిన బాండ్ల ముఖ విలువపై 2.75 శాతం, తదుపరి కాలంలో జారీ చేసిన బాండ్లపై 2.5 శాతం వడ్డీ చెల్లింపునకు తెరతీసింది. రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 21న రూ. 8,008 కోట్ల విలువైన ఎస్‌జీబీలను జారీ చేసింది.

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement