SGB scheme
-
గోల్డ్ బాండ్లకు చెక్..!
ఫిజికల్‌గా పసిడి కొనుగోలుకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ల పథకానికి తెరతీసింది. యూనిట్ల(ఒక గ్రాము)లో జారీ చేయడం ద్వారా నెమ్మదిగా రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. తద్వారా దిగుమతుల భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలు వేసింది. అయితే బంగారం ధర ప్రతీ ఏడాది రేసు గుర్రంలా పరుగు తీయడంతో బాండ్ల గడువు ముగిసేసరికి రుణ భారం భారీగా పెరిగిపోతూ వచ్చింది. వెరసి ఇకపై వీటికి ఫుల్స్టాప్ పెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాల అంచనా. వివరాలు చూద్దాం.. కేంద్ర ఆర్థిక శాఖ వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26) నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ల(ఎస్‌జీబీలు) జారీని నిలిపివేసే అవకాశముంది. ప్రభుత్వ రుణాలను తగ్గించుకునే బాటలో ప్రభుత్వం ఎస్‌జీబీల జారీని నిలిపివేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఫిజికల్‌గా బంగారం దిగుమతులను తగ్గించుకునే యోచనతో ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా ఈ ఏడాది జూలైలో వెలువడిన బడ్జెట్లో రూ. 18,500 కోట్ల విలువైన ఎస్‌జీబీల జారీకి ప్రణాళికలు వేసింది. అయితే గతేడాది జారీ చేసిన రూ. 26,852 కోట్లతో పోలిస్తే అంచనాలను భారీగా తగ్గించింది. ఎస్‌జీబీల గడువు ముగిశాక ప్రభుత్వం బంగారం మార్కెట్ ధరకు అనుగుణంగా ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా వీటిపై నిరంతరంగా వడ్డీని సైతం చెల్లిస్తుంది. ఫలితంగా ప్రభుత్వంపై అదనపు రుణభారానికి ఆస్కారం ఏర్పడుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం 2026–27కల్లా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో రుణ(డెట్) నిష్పత్తిని తగ్గించుకునే ప్రణాళికల్లో ఉంది. దీంతో ఇకపై ఎస్జీబీలను జారీ చేసే యోచనకు ప్రభుత్వం స్వస్తి పలకవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 14.7 కోట్ల యూనిట్లు జారీ2015 మొదలు ఆర్బీఐ 67 ఎస్జీబీ పథకాల ద్వారా మొత్తం 14.7 కోట్ల యూనిట్లను జారీ చేసినట్లు అంచనా. అయితే పసిడి విలువ ఎప్పటికప్పుడు పరుగు తీస్తుండటంతో వీటి విలువ సైతం పెరుగుతూ వస్తోంది. ఉదాహరణకు 2016లో గ్రాము(యూనిట్)కు రూ. 3,007 ధరలో ఎస్జీబీలను విడుదల చేసింది. వీటి గడువు తీరేసరికి విలువ రూ. 4,781 జంప్‌చేసి రూ. 7,788కు చేరింది. అంటే 8 ఏళ్లలో 159% వృద్ధి. అంతేకాకుండా వార్షికంగా 2.5% వడ్డీ కూడా లభించింది. దీంతో ఆర్బీఐ 2017 మే నెలలో, 2020 మార్చిలో జారీ చేసిన ఎస్జీబీలను ముందుగానే చెల్లించేందుకు ఈ ఏడాది ఆగస్ట్‌లో నిర్ణయించింది. తద్వారా ప్రభు త్వ రుణభారాన్ని తగ్గించేందుకు సంకలి్పంచింది. మరోవైపు ప్రభుత్వం సైతం జూలై బడ్జెట్లో పసిడిపై దిగుమతుల సుంకాన్ని 15% నుంచి 6 శాతానికి భారీగా తగ్గించింది.ఎస్‌జీబీలంటే కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఎస్జీబీలను జారీ చేస్తుంది. ఒక గ్రాము బంగారాన్ని ఒక యూనిట్‌గా జారీ చేస్తుంది. అప్పటి మార్కెట్ ధర ఆధారంగా వీటిని కేటాయిస్తుంది. అంటే ఇది పేపర్ గోల్డ్. కాలపరిమితి 8 ఏళ్లుకాగా.. ఐదేళ్ల తదుపరి ఎప్పుడైనా వీటిని విక్రయించేందుకు వీలుంటుంది. అప్పటి బంగారం మార్కెట్ ధర ఆధారంగా మెచ్యూరిటీ విలువ ఉంటుంది. అంతేకాకుండా వీటిపై తొలి ఏడాది నుంచి 2.5 శాతం వార్షిక వడ్డీ అందుతుంది. ఈ బాండ్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ట్రేడవుతాయి. పసిడి మెరుపులు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు నిరంతరం బలపడుతూనే ఉన్నాయి. భవిష్యత్‌లోనూ మరింత పెరిగే అవకాశముంది. ఇందుకు రాజకీయ, భౌగోళిక అనిశి్చతులు, ప్రభుత్వాల విధానాలు, యుద్ధ భయాలు వంటి అంశాలు కారణంకానున్నట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశీయంగా 2015లో ఎస్జీబీలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఫిజికల్‌గా పసిడి కొనుగోళ్లకు చెక్ పెట్టే యోచనతో రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు వీటిని తీసుకువచి్చంది. తద్వారా ఫిజికల్ గోల్డ్ నుంచి పేపర్ గోల్డ్‌కు ఇన్వెస్టర్లను మళ్లించే ప్రయత్నం చేసింది. తొలుత 8 ఏళ్ల కాలపరిమితితో వీటికి శ్రీకారం చుట్టింది. ఐదేళ్ల గడువు తదుపరి మార్కెట్ ధరలకు అనుగుణంగా రిడీమ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. 2017–18లో వ్యక్తులు, కుటుంబాలకు ఒక ఆర్థిక సంవత్సరంలో 4 కేజీలవరకూ పెట్టుబడులకు అనుమతించింది. ట్రస్ట్‌లు, సంబంధిత సంస్థలు 20 కేజీలవరకూ ఇన్వెస్ట్ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. 2015–16లో జారీ చేసిన బాండ్ల ముఖ విలువపై 2.75 శాతం, తదుపరి కాలంలో జారీ చేసిన బాండ్లపై 2.5 శాతం వడ్డీ చెల్లింపునకు తెరతీసింది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 21న రూ. 8,008 కోట్ల విలువైన ఎస్జీబీలను జారీ చేసింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
గోల్డ్ బాండ్ @ రూ. 6,199
ముంబై: తదుపరి దశ సావరిన్ గోల్డ్ బాండ్ల(ఎస్జీబీ)కు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తాజాగా ధరను ప్రకటించింది. ఒక గ్రాము బాండుకు రూ. 6,199ను నిర్ణయించింది. వీటి సబ్‌్రస్కిప్షన్ ఈ నెల సోమవారం(18న) ప్రారంభమై ఐదు రోజులపాటు కొనసాగనుంది. ఎస్జీబీ పథకం 2023–24– సిరీస్–3లో భాగంగా ఆర్బీఐ ఈ నెల 18–22 మధ్య పసిడి బాండ్ల సబ్ర్స్కిప్షన్కు తెరతీస్తోంది. స్మాల్, పేమెంట్, గ్రామీణ బ్యాంకులు మినహా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు వీటిని విక్రయిస్తాయి. వీటితోపాటు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, క్లియరింగ్ కార్పొరేషన్, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పూర్తి స్వచ్ఛత(999)గల పసిడి సగటు ముగింపు ధర ఆధారంగా గ్రాముకు రూ. 6,199 ధరను నిర్ధారించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఆర్బీఐతో చర్చల తదుపరి కేంద్ర ప్రభుత్వం గ్రాముకు రూ. 50 చొ ప్పున ఇన్వెస్టర్లకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేసేందుకు నిర్ణయించింది. అయితే ఇందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడంతోపాటు.. డిజిటల్ విధానంలో చెల్లింపులు చేపట్టవలసి ఉంటుంది. వెరసి గోల్డ్ బాండ్ రూ. 6,149కు లభించనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. కాగా.. ఎస్జీబీ సిరీస్–4లో భాగంగా వచ్చే (2024) ఫిబ్రవరి 12–16 మధ్య బాండ్లను ఆఫర్ చేయనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. -
వీటిపై ఇన్వెస్ట్ చేస్తే లాభాలపై ఎలాంటి పన్ను ఉండదు..!
బంగారం ధరల్లో కాస్త ఒడిదుడుకులు నెలకొన్నప్పటికీ పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి వెనకాడడం లేదు.ఎందుకంటే బంగారం ఎప్పుడు బంగారమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్ల కోసం 2015లో సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. సావరిన్ బంగారు బాండ్ నాలుగో దశ సబ్స్రిప్షన్ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పథకంలో భాగంగా గోల్డ్ బాండ్ ఇష్యూ ధరను ఒక గ్రాముకు రూ. 4,807గా నిర్ణయించింది. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే గ్రాముకి రూ. 50 రూపాయల తగ్గింపు రానుంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ -2021-22 నాలుగో దశ సబ్స్క్రిప్షన్ జూలై 16తో ముగియనుంది. గోల్డ్ బాండ్లపై ఇన్వెస్టర్లకు 2.5 శాతం వార్షిక వడ్డీరేటును అందించనుంది. బాండ్లపై వచ్చే మెచ్చూరిటీ తరువాత వచ్చే లాభాలపై ఏలాంటి పన్ను ఉండదు. కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2015 నుంచి సుమారు రూ. 25 వేల కోట్లను రాబట్టింది. సావరిన్ గోల్డ్ బాండ్ పథకం ముఖ్యమైన విషయాలు.. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే డిజిటల్ రూపంలో లేదా పేపర్ రూపంలో బ్యాంకులు బాండ్లను ఇస్తాయి. కరోనా వైరస్ కారణంగా యూఎస్ ట్రెజరీ దిగుబడి 4 నెలల కనిష్టానికి పడిపోవడంతో బంగారం ధర గత మూడు నెలల నుంచి పెరుగుతూ వస్తోంది. ఈ బాండ్లను దగ్గరలో ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్), సెలక్టెడ్ పోస్టాఫీసుల్లో, బాంబే స్టాక్ ఎక్స్చేంజీ, నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి కొనుగోలు చేయవచ్చును. గోల్డ్ బాండ్లకు 8 సంవత్సరాల టైం పీరియడ్ ఉంటుంది. బాండ్లను తీసుకొని ఐదు సంవత్సరాలు గడిస్తే వీటిని వెనక్కి తీసుకోవచ్చును. అయితే ఆ సమయంలో ఉన్న బంగారానికి ఉన్న రేట్లను పొందుతారు. ఈ బాండ్లపై ఒక వ్యక్తి చేసే కనిష్ట పెట్టుబడి విలువ ఒక గ్రాము, గరిష్ట పెట్టుబడి విలువ 4 కిలోలుగా ఉంటుంది. కాగా హెచ్‌యూఎఫ్‌కు 4 కిలోలు, ట్రస్ట్‌లకు 20 కిలోల వరకు కొనుగోలు చేయవచ్చును. మీరు కొనుగోలు చేసే గోల్డ్బాండ్లపై ప్రభుత్వ షురిటీ ఉంటుంది. -
గోల్డ్ బాండ్ల ఆన్లైన్ బిడ్డింగ్‌కు బీఎస్ఈకి అనుమతి
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్(ఎస్జీబీ) స్కీమ్‌కు సంబంధించి ఆన్లైన్ బిడ్డింగ్ ప్లాట్ఫార్మ్ ఏర్పాటు చేయడానికి బీఎస్ఈకి ఆర్బీఐ నుంచి ఆమోదం లభించింది. ఈ గోల్డ్ బాండ్లకు రిసీవింగ్ కార్యాలయంగా వ్యవహరించడానికి తమకు ఆర్బీఐ ఆమోదం లభించిందని బీఎస్ఈ సేర్కొంది. ఇంటర్నెట్ బేస్డ్ బుక్ బిల్డింగ్ సిస్టమ్(ఐబీబీఎస్-బీఎస్ఈ ప్రస్తుత వెబ్-ఆధారిత ఆన్లైన్ బిడ్డింగ్ ప్లాట్ఫార్మ్)లో ఈ గోల్డ్ బిడ్డింగ్ ప్లాట్ఫార్మ్ ఒక భాగమని వివరించింది. ఈ సిస్టమ్ పనితీరును పరీక్షించడానికి శుక్రవారం మాక్ బిడ్డింగ్ సెషన్ నిర్వహించామని పేర్కొంది. ఎస్‌జీబీలు.. గ్రామ్స్ డినామినేషన్లో ఉన్న ప్రభుత్వ పుత్తడి బాండ్లు... భౌతికంగా బంగారం కొనుగోళ్లకు ఇవి ప్రత్యామ్నాయాలు.