న్యూఢిల్లీ: భారత్ విదేశీ రుణ భారం 2021 మార్చి నాటికి వార్షికంగా 2.1 శాతం పెరిగి 570 బిలియన్ డాలర్లకు చేరిందని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకటన ప్రకారం 2020 మార్చి ముగిసే నాటికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో విదేశీ రుణ భారం 20.6 శాతం ఉంటే, 2021 మార్చి నాటికి ఈ విలువ 21.1 శాతానికి చేరింది. ఒక్క సావరిన్ డెట్ వార్షికంగా 6.2 శాతం పెరిగి 107.2 బిలియన్ డాలర్లకు చేరింది. నాన్ సావరిన్ రుణాలు 1.2 శాతం పెరిగి 462.8 బిలియన్ డాలర్లకు ఎగసింది.
నాన్ సావరిన్ డెట్‌లో వాణిజ్య రుణాలు, ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు, స్వల్ప కాలిక వాణిజ్య రుణ అకౌంట్ వెయిటేజ్ 95 శాతం కావడం గమనార్హం. ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు వార్షికంగా 8.7 శాతం పెరిగి 141.9 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య రుణాల విలువ 0.4 శాతం తగ్గి 197 బిలియన్ డాలర్లకు చేరింది. స్వల్పకాలిక వాణిజ్య రుణ అకౌంట్ 4.1 శాతం తగ్గి 97.3 బిలియన్ డాలర్లకు చేరింది. 2021 మార్చి నాటికి దీర్ఘకాలిక రుణం (ఏడాది దాటి వాస్తవ మెచ్యూరిటీ ఉన్నవి) 468.9 బిలియన్ డాలర్లు. వార్షికంగా ఈ విభాగంతో 17.3 బిలియన్ డాలర్లు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment