భారత్‌లోనూ ఊపందుకున్న గ్యాస్ట్రోనమీ టూరిజం
ఇక్కడి పాకశాస్త్ర సంస్కృతి, వంటకాలపై విదేశీయుల్లో మక్కువ
మన స్ట్రీట్ ఫుడ్‌కు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆదరణ
గత ఏడాది 15.6 శాతం పెరిగిన విదేశీ పర్యాటకులుపాకశాస్త్ర పర్యాటకంలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న టర్కీ
గాజియాంటెప్‌ను ‘సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ’గా యునెస్కో గుర్తింపు
ప్రజల్లో విభిన్న ఆహారపు అలవాట్లపై ఆసక్తి పెరుగుతోంది. ప్రపంచ పర్యాటకం కొత్త రుచులను అన్వేషిస్తోంది. ఫలితంగా భారతదేశంలో పాకశాస్త్ర సంస్కృతిని ఆస్వాదించే పర్యాటకం (గ్యాస్ట్రోనమీ టూరిజం) ఊపందుకుంటోంది. విదేశీ పర్యాటకులు భారత పాకశాస్త్ర సంస్కృతి, కొత్త వంటకాల తయారీపై మక్కువతో మన దేశానికి క్యూ కడుతున్నారు.
2023లో విదేశీ పర్యాటకుల రాకపోకలు 15.6 శాతం పెరిగాయి. ఈ పర్యాటకులలో అత్యధికులు తమ ప్రయాణంలో భాగంగా పాకశాస్త్ర అనుభవాలను కోరుకుంటారు. దేశంలోని సుసంపన్నమైన అహారం, వంటల సంప్రదాయాలు, విభిన్న ప్రాంతీయ వంటకాలు, ప్రామాణికమైన ఆహార అనుభవాలపై విదేశీ పర్యాటకులు ఆసక్తి పెంచుకుంటున్నారు. – సాక్షి, అమరావతి
పాకశాస్త్ర పర్యాటకంలో టర్కీదే అగ్రస్థానం
ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ట్రోనమీ పర్యాటకులను ఆకట్టుకోవడం, సరికొత్త అనుభూతులను అందించడంలో టర్కీ ముందంజలో ఉంది. గతేడాది రూ.1.52 లక్షల కోట్లుగా నమోదైన అక్కడి పాకశాస్త పర్యాటక మార్కెట్ నుంచి 2025 నాటికి రూ.2.10 లక్షల కోట్లకు విస్తరిస్తుందని అక్కడి మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అక్కడ దేశవ్యాప్తంగా 2,200 కంటే ఎక్కువ స్థానిక ఆహార, పానీయాల వెరైటీలున్నాయి. ముఖ్యంగా గాజియాంటెప్, అదావా, హటే, ఇజ్మీర్ వంటి నగరాల్లో గ్యాస్ట్రోనమీ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే 41 రకాల విభిన్న ఆహార పదార్థాల తయారీ విధానంపై ప్రత్యేక కోర్సుల, శిక్షణను అందిస్తోంది. ఒక్క ఇస్తాంబుల్‌లోనే 16 శిక్షణ కేంద్రాలున్నాయి.
స్థానిక ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించడానికి టర్కీ ఏకంగా 34 గ్యాస్ట్రోనమీ మ్యూజియాలను ఏర్పాటు చేయడం విశేషం. మరోవైపు దేశవ్యాప్తంగా 360 కంటే ఎక్కువ గ్యాస్ట్రోనమీ పండుగలను చేపడుతూ దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. అందుకే గాజియాంటెప్‌ను ‘సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ’గా యునెస్కో గుర్తించింది.
మసాలా వంటకాల నుంచి మొఘలాయ్ వరకు..
దక్షిణాదిలోని మసాలా కూరల నుంచి ఉత్తరాదిలోని మొఘలాయ్ వంటకాల వరకు భారతీయ హోటళ్లు విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయి. దీనికితోడు వీధుల్లో అమ్మే ఆహారాలు (స్ట్రీట్ ఫుడ్) సైతం అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాలు గ్యాస్ట్రోనమీకి అడ్డాలుగా మారాయి. ఈశాన్య భారతదేశం అత్యంత స్థిరంగా అభివృద్ధి చెందుతున్న పాకశాస్త్ర గమ్యస్థానాలలో ఒకటిగా ఉంది.
ఆ తర్వాత చెట్టినాడ్ విభిన్న ఆహార రుచులను అందిస్తోంది. ఇక గోవా కేవలం స్థానిక వంటకాలకు మాత్రమే కాకుండా అంతర్జాతీయ వంటకాలను కూడా ప్రవేశపెడుతోంది. వీధి వంటకాల్లో లక్నోలో లభించే నెహారీ కుల్చా, షీర్మల్, మలై మఖాన్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అమృత్‌సర్‌లో లభించే చోలే–కుల్చే, జిలేబీ, గులాబ్ జామూన్, పొడవాటి గ్లాసుల్లో ఇచ్చే లస్సీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
ఆహారోత్సవాలతో ఆకర్షణ
వివిధ నగరాల్లో అనేక సంస్థల భాగస్వామ్యంతో ఆహారోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఢిల్లీలో నార్త్–ఈస్ట్ స్లో ఫుడ్ అండ్ ఆగ్రో బయోడైవర్సిటీ సొసైటీ (నెస్పాస్) ఏటా నేషనల్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. మేఘాలయ రాష్ట్రంలోని మావ్‌లాంగ్‌లో నిర్వహించే ‘సేక్రేడ్ గ్రోవ్’ (మతపరమైన తోట చెట్ల పండుగ) ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, నోరూరించే రుచికరమైన ఆహార పదార్థాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
ఈశాన్య భారతదేశంలోని స్థానికులు తయారుచేసి వడ్డించే వివిధ అటవీ, స్థానిక ఆహార వంటకాలను సంరక్షించేందుకు, ఆయా వంటకాలపై ప్రచారానికి ఈ ఉత్సవాలు దోహదం చేస్తున్నాయి. ఇలా వివిధ రాష్ట్రాల్లో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ పర్యాటకుల జిహ్వ చాపల్యాన్ని తీరుస్తూ గ్యాస్ట్రోనమీ టూరిజానికి ఊతమిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment