
నిబంధనల సవరణకు ఆర్థిక శాఖ ప్రతిపాదన
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతానికి పెంచడంతో పాటు పెయిడప్ క్యాపిటల్‌ను తగ్గించే దిశగా బీమా చట్టం 1938 నిబంధనలను సవరించేలా కేంద్ర ఆర్థిక శాఖ పలు ప్రతిపాదనలు చేసింది. ప్రజలందరికీ బీమాను అందుబాటులోకి తెచ్చేందుకు, పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు, పరిశ్రమ అభివృద్ధికి, వ్యాపార ప్రక్రియలను క్రమబదీ్ధకరించేందుకు ఇవి దోహదపడతాయని ఆర్థిక సేవల విభాగం తెలిపింది.
ప్రతిపాదనల ప్రకారం బీమాలో ఎఫ్‌డీఐల పరిమితిని ప్రస్తుతమున్న 74 శాతం నుంచి 100 శాతానికి పెంచనున్నారు. అలాగే, కాంపోజిట్ లైసెన్సు జారీ కోసం నిర్దిష్ట నిబంధనను చేర్చనున్నారు. ప్రతిపాదిత సవరణలపై సంబంధిత వర్గాలు డిసెంబర్ 10లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. దేశీయంగా ప్రస్తుతం 25 జీవిత బీమా కంపెనీలు, 34 సాధారణ బీమా కంపెనీలు ఉన్నాయి. మరిన్ని సంస్థలు రావడం వల్ల బీమా విస్తృతికి, అలాగే మరిన్ని ఉద్యోగావకాశాల కల్పనకు దోహదపడగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి.