
ఏప్రిల్ నెలలో 3.4 శాతం తగ్గిన రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు
దేశవ్యాప్తంగా 10.72 శాతం వృద్ధితో రికార్డుస్థాయి జీఎస్టీ వసూళ్లు
తమిళనాడులో 13 శాతం, తెలంగాణలో 12 శాతం, కర్ణాటకలో 11 శాతం వృద్ధి
చంద్రబాబు అధికారం చేపట్టిన నాటినుంచి జీఎస్టీ నేలచూపులు
గత ప్రభుత్వ హయాంలో ఏటా రెండంకెల వృద్ధి నమోదు
సాక్షి, అమరావతి: నూతన ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్ర ఆదాయం తిరోగమనంలోనే పయనిస్తోంది. ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొదటి నెల ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు రికార్డులు సృష్టిస్తుంటే, మన రాష్ట్రంలో మాత్రం నేలచూపులు చూస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో రాష్ట్ర జీఎస్టీ మొత్తం వసూళ్లు 3.4 శాతం క్షీణించి రూ.4,850 కోట్ల నుంచి రూ.4,686 కోట్లకు పడిపోయినట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేశాయి.
అదే సమయంలో కేంద్ర జీఎస్టీ వసూళ్లలో ఏకంగా 10.72 శాతం వృద్ధి నమోదైంది. మన పొరుగు రాష్ట్రాలు తమిళనాడు 13 శాతం, తెలంగాణ 12 శాతం, కర్ణాటక 11 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి గత ఏడాది జూన్‌లో అధికారం చేపట్టినప్పటి నుంచి జీఎస్టీ వసూళ్ల క్షీణత ప్రవాహం ఆగడం లేదు. అంతకుముందు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జీఎస్టీ ఆదాయం ఏటా రెండంకెల వృద్ధిని నమోదు చేసింది.
అయితే, కూటమి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందించడం లేదు. ప్రచార ఆర్భాటం తప్ప వాస్తవంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. అందువల్లే 2024–25 ఆర్థిక సంవత్సరంలో జూలై నుంచి మార్చి వరకు 9నెలల్లో ఏకంగా 6 నెలలు 2023–24 ఆర్థిక ఏడాది కన్నా జీఎస్టీ తక్కువగా వచి్చనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.