ఈ పొద్దు.. ఆశల పద్దు! | Hyderabad Hopes On the Union Budget 2025 26 | Sakshi
Sakshi News home page

Union Budget 2025-26: ఈ పొద్దు.. ఆశల పద్దు!

Published Sat, Feb 1 2025 7:28 AM | Last Updated on Sat, Feb 1 2025 7:39 AM

Hyderabad Hopes On the Union Budget 2025 26

భాగ్య నగరాన్ని కేంద్రం కరుణించేనా?

మూసీ పునరుజ్జీవానికి సాయంపై ఎదురుచూపులు

ఐటీ రంగాన్ని ఆదుకునేలా చర్యలు ఉంటాయా..

బల్దియా కోరిన రూ.10 వేల కోట్లు అందేనా..

జలమండలికి దన్ను దక్కేనా..

నిర్మలమ్మ బడ్జెట్‌లో నిధులెన్ని వచ్చేనో..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై మహా నగరం ఆశలు పెట్టుకుంది. మౌలిక వసతులు, ఇతర రంగాలకు ప్రాధాన్యం ఉంటుందని, నిధుల కేటాయింపులు ఉంటాయని నగర వాసులు ఎదురుచూస్తున్నారు. ఎంఎంటీఎస్‌ కొత్త రైళ్లతో పాటు చర్లపల్లి టెర్మినల్‌ నుంచి పూర్తి స్థాయిలో నగరంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ, పుణ్య క్షేత్రాలకు మరిన్ని రైళ్లను అందుబాటులోకి తెస్తారని ఆశిస్తున్నారు. మూసీ పునరుజ్జీవానికి కేంద్రం నిధులు కేటాయించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి అనుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నారు. విశ్వ నగరిగా విస్తరిస్తున్న భాగ్యనగరంలో ఐటీ రంగానికి మరింత బూస్ట్‌ ఇచ్చేలా కేంద్రం కరుణిస్తుందని, బల్దియా పరిధిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పెద్దపీట వేస్తారని అంతా ఆశాభావంతో ఉన్నారు. –సాక్షి, సిటీబ్యూరో

బల్దియాను ఆదుకునేనా?
కేంద్ర బడ్జెట్‌లో జీహెచ్‌ఎంసీకి ఏ మేరకు కేటాయింపులుంటాయోనన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నగరంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్న జీహెచ్‌ఎంసీ పలు కార్యక్రమాలకు కేంద్రంపై ఆశలు పెంచుకుంది. గృహ నిర్మాణానికి పీఎంఏవై  నిధులతోపాటు ఫ్లై ఓవర్లు, రహదారుల అభివృద్ధి, వరద సమస్యల పరిష్కారం, విపత్తుల నిర్వహణ,  ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారం తదితరాల కోసం రూ. 10 వేల కోట్లకు పైగా కేంద్రాన్ని కోరింది. వరద ముంపు సమస్యల పరిష్కారంతో పాటు చెత్త సమస్య పరిష్కారానికి నిధులు అడిగింది. హైదరాబాద్‌ వారసత్వాన్ని పరిరక్షించేందుకు పురాతన కట్టడాల పరిరక్షణ తదితరమైన వాటి కోసం కోరింది. రోజురోజూకూ పరిధి పెరుగుతూ, విస్తృతమవుతున్న జనాభాకనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు నిధులవసరముంది. బల్దియా కోరికల్లో ఎన్నింటికి నిధులిస్తారోనని జీహెచ్‌ఎంసీ వర్గాలు వేచి చూస్తున్నాయి.

కొత్త రైళ్లకు పచ్చజెండా ఊపేనా? 
రెండో దశలో భాగంగా అటు మేడ్చల్‌ నుంచి ఇటు ఉందానగర్‌ వరకు. ఘట్కేసర్‌ నుంచి  తెల్లాపూర్‌ వరకు ఎంఎంటీఎస్‌ లైన్‌లు పూర్తయ్యాయి. నాంపల్లి, సికింద్రాబాద్‌ స్టేషన్‌ల నుంచి ప్రయాణికులు ఎక్కడికైనా అతి తక్కువ చార్జీలతో రాకపోకలు సాగించే సదుపాయం ఉంది. ప్రయాణికుల డిమాండ్‌ మేరకు రైళ్లు లేకుండాపోయాయి. కొత్త లైన్‌లతో  పాటు 9 బోగీలతో కూడిన కొత్త ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా కొనుగోలు చేయాలనే ప్రతిపాదన ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక్క రైలు కూడా కొనుగోలు చేయలేదు. దీంతో ఉన్న రైళ్లనే వివిధ ప్రాంతాల మధ్య నడుపుతున్నారు.

చర్లపల్లికి ఏదీ కనెక్టివిటీ..
మార్చి నుంచి పలు రెగ్యులర్‌ రైళ్లు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. చర్లపల్లి టెరి్మనల్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా పునరభివృద్ధి చేసి  ప్రారంభించినప్పటికీ  పూర్తిస్థాయి కనెక్టివిటీ లేదు. ప్రయాణికులు  వివిధ ప్రాంతాల నుంచి చర్లపల్లికి చేరుకొనేలా ఎంఎంటీఎస్‌ సేవలను పెంచాలి. కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్‌ స్టేషన్‌లతో పాటు  నగరంలోని  ఏ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ నుంచైనా బయలుదేరి చర్లపల్లికి వెళ్లేలా సరీ్వసులను విస్తరించాల్సి ఉంది.

యాదాద్రి ఎంఎంటీఎస్‌ నత్తడనక..
గత ఏడాది బడ్జెట్‌లో యాదాద్రికి ఎంఎంటీఎస్‌ పొడిగింపునకు రూ.10 కోట్లు కేటాయించారు. కానీ రైల్వేశాఖ, రాష్ట్రప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన  ఈ ప్రాజెక్టు నిర్మాణానికి  నిధులు, వనరులు, భూమి, తదితర మౌలిక సదుపాయాల కొరత వెంటాడుతోంది. ఘట్కేసర్‌ నుంచి రాయగిరి వరకు 33 కిలోమీటర్లు పొడిగించేందుకు 2015లో ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రూ. 430 కోట్లతో అంచనాలు రూపొందించారు.కానీ  రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదు. రైల్వేశాఖ ఇప్పటి వరకు రెండు దఫాలుగా రూ.60 కోట్లు మాత్రం కేటాయించింది. కానీ పనులు  ప్రారంభించలేదు.

పుణ్యక్షేత్రాలకు వెళ్లేదెలా?   
హైదరాబాద్‌ నుంచి అయోధ్య, షిరిడీ, శబరిమల తదితర పుణ్యక్షేత్రాలకు లక్షలాది మంది భక్తులు రాకపోకలు సాగించే అనేక ప్రాంతాలకు డిమాండ్‌కు సరిపడా రైళ్లు లేకపోవడంతో ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలపై ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు  ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తే తప్ప రైలెక్కడం సాధ్యం కాదు. షిరిడీకి ప్రస్తుతం అజంతా ఎక్స్‌ప్రెస్‌ ఒక్కటే ఉంది. శబరిమలకు  కూడా ఒక్క రైలే అందుబాటులో ఉంది. అయోధ్యకు వెళ్లేందుకు దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే ఉంది. పదేళ్లుగా రైళ్ల పెంపు లేకుండాపోయింది.

ఆశల మూసీ 
భాగ్యనగరానికి మణిహారమైన మూసీ నదికి పునరుజ్జీవం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూసీ శుద్ధి, వ్యర్థాలు, వరదల నియంత్రణ వ్యవస్థ, సుందరీకరణ, బృహత్‌ ప్రణాళిక రూపకల్పనలపై మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎంఆర్‌డీసీఎల్‌) దృష్టి సారించింది. మూసీ పునరుజ్జీవానికి రూ.14,100 కోట్ల బడ్జెట్‌ను అవసరం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు శనివారం కేంద్ర బడ్జెట్‌లో సహాయం అందుతుందని ఎంఆర్‌డీసీఎల్‌ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూసీ నదికి పునరుజ్జీవం కల్పించడంతో పాటు పట్టణ నీటి నాణ్యతను మెరుగుపర్చడం, సుస్థిర ప్రగతిని సాధించేందుకు దశల వారీగా నిధులు కేటాయించాలని కోరారు.

మూసీ పునరుజ్జీవంలో భాగంగా తొలిదశలో బాపూఘాట్, మీరాలం ట్యాంక్‌ వద్ద అభివృద్ధి పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. బాపూఘాట్‌ వద్ద రక్షణ శాఖకు చెందిన 220 ఎకరాల భూ సమీకరణతో పాటు రిజర్వాయర్, మురుగు నీటి అప్‌గ్రేడ్‌లు, మూసీ నదిపై హెరిటేజ్‌ వంతెనల నిర్మాణం తదితరాల వ్యయాలను బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని కోరారు.

మూసీని ఆదాయ వనరుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. పబ్లిక్, ప్రైవేట్‌ పార్ట్‌నర్‌íÙప్‌ (పీపీపీ) ద్వారా పర్యాటకం, ఆతిథ్యం, స్థిరాస్తి రంగాల నుంచి కార్పొరేట్‌ సోషల్‌ రెస్సాన్సిబులిటీ (సీఎస్‌ఆర్‌) కింద నిధులను సమీకరించనున్నారు. మూసీ చుట్టూ ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్ట్‌లు, రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్పానర్‌íÙప్‌లు, పేర్ల హక్కులు, పర్యాటక కార్యకలాపాలతో ఆదాయ వనరులను సృష్టించనున్నారు.

ఐటీ బూస్ట్‌..
‘సాఫ్ట్‌వేర్‌ ట్రయినింగ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’గా పిలిచే హైదరాబాద్‌ ఐటీ రంగం బడ్జెట్‌పై కోటి ఆశలు పెట్టుకుంది. దేశీయ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 31 శాతంఆ ఉంటుంది. ప్రధానంగా ఐటీ రంగం కేంద్రీకృతమైన హైదరాబాద్‌లో సుమారు 1,500లకు పైగా కంపెనీలలో 9 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారం చేపట్టాక గ్రేటర్‌లో నాల్గో నగరంగా ఫ్యూచర్‌ సిటీని నిర్మించాలని సంకల్పించారు. ఇందులో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సిటీతో పాటు ఐటీ రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఏఐ సిటీతో పాటు ఐటీ పార్క్‌లకు ప్రత్యేక కేటాయింపులు, పన్ను మినహాయింపులతో పాటు ఐటీ మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక కేటాయింపులు చేయాలని పరిశ్రమ నిపుణులు కోరుతున్నారు.

హైదరాబాద్‌లో ఐటీ, ఐటీఈఎస్‌ ఎగుమతులు 2023–24 ఆర్థిక సంవత్సరంలో 11.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్చి 31తో ముగియనున్న సంవత్సరానికి తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2.7 లక్షల కోట్లకు చేరుతాయని అంచనా వేశారు. మధ్య తరగతి జీతభత్యాలకు పన్ను మినహాయింపులతో కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్‌ కోసం పన్నులను హేతుబద్దీకరించాలని, నైపుణాభివృద్ధికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి దన్నుగా నిలిచేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలి

జలమండలిపై దయ చూపేనా..
లక్డీకాపూల్‌:  కేంద్ర బడ్జెట్‌పై జలమండలి ఆశలు పెట్టుకుంది. నలువైపులా విస్తరిస్తున్న çమహా హైదరాబాద్‌ పరిధిలో మురుగు నీటి నెట్‌వర్క్‌ సమగ్ర సీవరేజీ మాస్టర్‌ ప్లాన్‌ ప్రాజెక్టు కోసం సుమారు రూ.17,212.69 కోట్లు, మూసీ ప్రక్షాళనలో భాగంగా  నదిలో మురుగు నీరు చేరకుండా ఇరువైపులా 55 కి.మీ (మొత్తం 110 కి.మీ) కాల్వల ట్రంక్‌ సీవర్స్‌ మెయిన్స్, లార్జ్‌ సైజ్‌ బాక్స్‌ డ్రెయిన్స్, కొత్త సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల నిర్మాణాల ప్రాజెక్టు నిర్మాణాల కోసం మరో రూ.10 వేల కోట్లు కేటాయించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ రెండు పథకాలను అమృత్‌ పథకం– 2.0 కి చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.

రైల్వే బ్రిడ్జిల అభివృద్ధికి రూ.500 కోట్లు కావాలి

కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ ఈటల ప్రతిపాదనలు
దేశంలో అతిపెద్ద పార్లమెంట్‌ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో రైల్వే అండర్‌ బ్రిడ్జిలు, ఓవర్‌ బ్రిడ్జిలను అభివృద్ధి చేయటంతో పాటు రైల్వే క్రాసింగ్, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ తదితర పనులకు కేంద్ర బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించాలని కోరుతూ స్థానిక ఎంపీ ఈటల రాజేందర్‌ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. శనివారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈటల తన నియోజకవర్గ పరిధిలో రైల్వే అభివృద్ధి, ఆధునికీకరణ పనుల కోసం బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలతో కూడిన నివేదికను అందజేశారు.

మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని బోల్లారం నుంచి సికింద్రాబాద్‌ వరకు ఉన్న 12 అండర్, ఓవర్‌ సింగిల్‌ బ్రిడ్జిలను పెరుగుతున్న కాలనీలు,బస్తీలకు అనుగుణంగా.. మారుతున్న పట్టణీకరణకు తగ్గట్టుగా ట్రాఫిక్‌ సమస్య నుంచి ప్రజలను గట్టేక్కించేందుకు డబుల్‌ బ్రిడ్జిలుగా అభివృద్ధి చేయాలని కేంద్రానికి సమర్పించిన ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

యాభై ఏళ్ల క్రితం నాటి రైల్వే క్రాసింగ్‌లు, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాని ఎంపీ ఈటల కోరారు. ఈ నేపథ్యంలోనే రైల్వే అభివృద్ధి పనులకు సుమారు రూ.500 కోట్ల ని«ధులు అవసరమవుతాయని పేర్కొన్నారు.  హైదరాబాద్‌ నగరానికి సమాంతరంగా  శివారు మేడ్చల్‌ జిల్లాను అభివృద్ధి చేసేందుకు అమృత్‌ పథకంలో అత్యధిక నిధులు కేటాయిచాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement