టోల్‌ట్యాక్స్ పెంచుతున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. పెరిగిన ఛార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. ఏటా ఏప్రిల్ 1న టోల్ రుసుం పెరుగుతుంది. ఈసారి పెరిగిన ధరలు 2025 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి. పెరిగిన ఛార్జీల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5, రానూపోనూ కలిపి రూ.10 అదనంగా చెల్లించాలి. తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒక వైపు రూ.10, ఇరు వైపులా అయితే రూ.20, బస్సు, ట్రక్కులకు వరుసగా రూ.25, రూ.35, భారీ రవాణా వాహనాలకు రూ.35 నుంచి రూ.50 చొప్పున పెంచారు. 24 గంటల లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు రుసుంలో 25 శాతం మినహాయింపు లభిస్తుంది. ఫాస్టాగ్ అమల్లోకి వచ్చాక టోల్ ప్లాజాల వద్ద వసూళ్లు కూడా భారీగా పెరిగాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు టోల్‌ట్యాక్స్ అంటే ఏమిటి..? దాన్ని ఎందుకు చెల్లించాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
రోడ్లను ఉపయోగించడానికి ప్రతి వాహనదారుడు ప్రభుత్వానికి రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. వాహనం కొనేపుడే వాహనం బరువు, తయారైన సంవత్సరం, సీటింగ్ కెపాసిటీ, ఇంజిన్ రకాలను బట్టి రోడ్ ట్యాక్స్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఇక ఈ ట్యాక్స్ చెల్లించాం కదా అని నేషనల్ హైవేపై వాహనంతో రౌండ్స్ కొట్టొచ్చని అనుకోవద్దు. ఎందుకంటే మళ్లీ ఆ రోడ్డుపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని టోల్ ట్యాక్స్ అంటారు. రవాణా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పని చేస్తుంది. ఇది ప్రైవేటు కాంట్రాక్టు సంస్థల సహాయంతో వివిధ రాష్ట్రాల మధ్య హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తుంది. రోడ్డు వేయడానికి చేసిన ఖర్చును టోల్ రూపంలో వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది. ఈ ప్రక్రియ కొన్నేళ్లపాటు సాగుతుంది. రోడ్డు వేయడానికి ఖర్చు చేసిన మొత్తం వసూలైన తరువాత టోల్ ఫీజును 40 శాతానికి తగ్గించాలనే నిబంధన ఉంది.
టోల్స్ మధ్య దూరం..
టోల్ ట్యాక్స్, టోల్ ఛార్జీలను కలిపి టోల్ అని సింపుల్‌గా పిలుస్తుంటారు. ఎక్స్‌ప్రెస్ వేస్, సొరంగ మార్గాలు, వంతెనలు, జాతీయ, రాష్ట్ర రహదారులపై రాకపోకలు సాగించే వాహనాల నుంచి ఈ టోల్ వసూలు చేస్తారు. ద్విచక్ర వాహనాలకు టోల్ నుంచి మినహాయింపు ఉంటుంది. మిగిలిన వాహనాల పరిమాణాన్ని బట్టి టోల్ వసూలు చేస్తారు. టోల్ చెల్లించే రహదారులను టోల్ రోడ్లని అంటారు. వీటి నిర్వహణ బాధ్యతను ఎన్‌హెచ్‌ఏఐ పర్యవేక్షిస్తుంటుంది. నిర్దేశిత ప్రదేశంలో టోల్ బూత్‌లు, ప్లాజాల పేరిట కౌంటర్లు ఏర్పాటు చేసి సంబంధిత మొత్తం చెల్లించిన తరువాతనే ఇక్కడ వాహనాలను రోడ్డుపైకి అనుమతిస్తారు. రెండు టోల్ బూత్‌ల మధ్య సాధారణంగా 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంతకంటే తక్కువ దూరంలోనూ ఉండే అవకాశముంది. ఆ దూరాన్ని బట్టి ట్యాక్స్ వసూలు చేస్తారు. ఏటా ఏప్రిల్ 1న అవసరాన్ని బట్టి టోల్ ధరలను పెంచుతున్నారు.
ప్రయాణం సాఫీగా సాగేలా..
నాణ్యమైన, గుంతలు లేని రహదారిని వినియోగించి ప్రయాణం సాఫీగా చేస్తున్నందుకు చెల్లించే రుసుమే టోల్. రోడ్ల మరమ్మతులు, నిర్వహణ కోసం కూడా టోల్ నిధులను ఖర్చు చేస్తారు. ఏళ్ల తరబడి టోల్ వసూలు చేయడం వల్ల ఆ రోడ్డు వేయడానికి చేసిన ఖర్చు వసూలవుతుంది. ఈ మొత్తాన్ని ఎన్‌హెచ్‌ఏఐ తీసుకొని రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు చెల్లింపులు చేస్తుంది. టోల్‌గేట్ వసూలు చేసే దగ్గర టో వెహికల్, తాగునీరు, మరుగుదొడ్లు, అత్యవసర సేవలు, అగ్నిప్రమాద నియంత్రణ సౌకర్యాలుంటాయి.
ఫాస్టాగ్‌తో తగ్గిన రద్దీ
టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టారు. నగదు రహిత లావాదేవీలు చేసేందుకు ఫాస్టాగ్ ఉపయోగపడుతుంది. ఒక స్టిక్కర్‌లా కనిపించే ఫాస్టాగ్‌ను మొబైల్ నంబర్‌లా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఫాస్టాగ్‌ను కొన్ని మొబైల్ యాప్‌లు, టోల్‌ప్లాజా కేంద్రాల వద్ద విక్రయిస్తారు. మనం టోల్‌గేట్ వద్దకు వెళ్లగానే అక్కడి స్కానర్లు ఫాస్టాగ్‌ను రీడ్ చేస్తాయి. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా నిర్దేశిత టోల్ మొత్తం అందులో నుంచి కట్ అవుతుంది. ఈ ఫాస్టాగ్‌ల కారణంగా టోల్‌గేట్ల వద్ద రద్దీ బాగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏవైనా కారణాల వల్ల టోల్ ప్లాజాల దగ్గర 100 మీటర్ల కన్నా ఎక్కువ క్యూ ఉన్నట్టైతే వాహనదారులు టోల్ ఫీజు చెల్లించకుండా ముందుకు వెళ్లిపోవచ్చు.
ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన ధరలు!
వీరికి టోల్ ఉండదు..
టోల్ ప్లాజాల వద్ద రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, స్పీకర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, ఆర్మీ, పోలీసు ఉన్నత అధికారులు ప్రయాణించే అధికారిక వాహనాలకు మినహాయింపు ఉంటుంది. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు, అంతిమయాత్ర వాహనాల నుంచి టోల్ తీసుకోరు. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో ఆర్టీవో ఆఫీసులో రిజిస్టర్ అయిన వాహనాలకు స్థానికులు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment