రాష్ట్రంలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) కింద దరఖాస్తు చేసుకున్న ఎంతోమంది గత మూడున్నరేళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
2020లో స్వీకరించిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు సంబంధించి లేఅవుట్‌ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. 2024 మార్చి 31లోపు దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణ అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లేఅవుట్‌లు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 20 లక్షల మంది దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరనుంది.
నగర, పురపాలికలు, పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 20 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విషయమై రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ విధానం ఏమిటన్నది ఇప్పటివరకు సందిగ్ధంగా ఉంది. తాజా ప్రకటనతో దరఖాస్తుదారులకు ఊరట లభించినట్లయింది.
బడ్జెట్ సమయంలోనే వివరాల సేకరణ
రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పెండింగుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై స్పష్టతనిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆ పథకాన్ని కార్యరూపంలోకి తీసుకువస్తే ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు సైతం ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. అనధికారిక అంచనాల ప్రకారం అందిన దరఖాస్తులను క్రమబద్ధీకరించడం ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: 2024లో హైదరాబాద్‌లో పూర్తికానున్న ఇళ్లు ఎన్నంటే..
మూడు దశల్లో పరిశీలన
దరఖాస్తుల పరిశీలనకు న్యాయస్థానాల నుంచి అప్పట్లో అనుమతి లభించడంతో గతంలో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తిచేశారు. ఆ ప్రక్రియను మూడు దశల్లో చేపట్టారు. తొలిదశలో దరఖాస్తుల పరిశీలన రెండో దశలో ఆయా స్థలాలు క్రమబద్ధీకరణకు అర్హమైనవా? కాదా? అని గుర్తించడం.. అర్హతలు ఉన్నట్లు భావిస్తే సిఫార్సు చేయడం.. మూడో దశలో సంబంధిత అధికారి నిబంధనల మేరకు ఫీజు చెల్లించాలంటూ నోటీసుల జారీకి అనుమతించడం. ఈ మేరకు పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేశారు. 2020లో కేవలం రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. కానీ నోటీసులు అందుకున్నవారు అయోమయంలో ఉన్నారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో వారికి ఉపశమనం కలిగినట్లయింది.
క్రమబద్ధీకరణ ఛార్జీలు ఇలా..
- చదరపు గజం రూ. 3,000 కంటే తక్కువ ఉన్న సబ్-రిజిస్ట్రార్ విలువ 20 శాతం ఉంటుంది.
- రూ. 3,001 -రూ. 5,000 మధ్య 30 శాతం
- రూ. 5,001 -రూ. 10,000 మధ్య 40 శాతం
- రూ. 10,001 -రూ. 20,000 50 శాతం
- రూ. 20,001 -రూ. 30,000 మధ్య 60 శాతం
- రూ. 30,001 -రూ. 50,000 మధ్య 80 శాతం
- చదరపు గజం సబ్-రిజిస్ట్రార్ విలువ రూ. 50,000 పైన 100 శాతం ఉంటుంది.
పై ఛార్జీలకు అదనంగా ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణలో నాలా(వ్యవసాయ భూమిని వ్యవసాయేతర వినియోగానికి మార్చడానికి) రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఆమోదం పొందని లేఅవుట్‌లో 10 శాతం ఖాళీ స్థలం అందుబాటులో లేనట్లైతే ఆగస్టు 26 నాటికి ఉన్న ధరకు బదులుగా, ప్లాట్ రిజిస్ట్రేషన్ తేదీ నాటికి ఉన్న ప్లాట్ విలువలో 14 శాతం చొప్పున ప్రో-రేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తుదారులు పాటించాల్సిన నిబంధనలు
- రోడ్డు వెడల్పు కనీసం తొమ్మిది మీటర్లు ఉండాలి. బలహీన వర్గాలకు చెందిన వారి లేఅవుట్‌లు లేదా 100 చదరపు మీటర్ల కంటే తక్కువ ఉన్న ప్లాట్‌ల్లో రహదారి వెడల్పు ఆరు మీటర్లు ఉండవచ్చు.
- అవసరమైన రహదారి వెడల్పు అందుబాటులో లేకపోతే రెండు వైపులా సమానంగా వెడల్పు చేయడానికి అవసరమైన భూమి ఉండాలి.
- ల్యాండ్ సీలింగ్ చట్టాలు, భూ వివాదాలు లేదా టైటిల్, సరిహద్దు వివాదాలు, కోర్టు వ్యవహారాలు ఉంటే లేఅవుట్‌లు క్రమబద్ధీకరణ చేయబడవు.
- అసైన్డ్ భూములకు సంబంధించి జిల్లా కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
- ఆమోదంలేని లేఅవుట్‌లో క్రమబద్ధీకరణకు కొంతమంది ప్లాట్ హోల్డర్లు ఆసక్తి చూపినా కాంపిటెంట్ అథారిటీ ఆమోదించిన లేఅవుట్ నమూనానే పరిగణిస్తారు.
- దరఖాస్తుదారులు సేల్ డీడ్/ టైటిల్ డీడ్ కాపీలను మాత్రమే అందించాలి.
- విక్రయ ఒప్పందం లేదా లీగల్ నోటరీ పరిగణించరు.
- నీటి వనరులకు సంబంధించిన చెరువు, కుంట, షికం భూముల్లోని లేఅవుట్‌లను క్రమబద్ధీకరించరు. నీటి వనరులు ఉన్న ప్రాంతాన్ని గ్రీన్ బఫర్ జోన్‌గా నిర్ణయిస్తారు.
- 10 హెక్టార్లు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోని లేఅవుట్లు నదీ ప్రవాహం/ సరస్సుల సరిహద్దు నుంచి 30 మీటర్లు ఉండాలి. కాలువ సరిహద్దుల నుంచి 9 మీటర్లు ఉండాలి. 'నాలా' లేదా మురికినీటి కాలువ నుంచి రెండు మీటర్లు ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment