LRS clearance
-
ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణపై ప్రభుత్వం కీలక ప్రకటన
రాష్ట్రంలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకున్న ఎంతోమంది గత మూడున్నరేళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. 2024 మార్చి 31లోపు దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణ అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లేఅవుట్లు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 20 లక్షల మంది దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరనుంది. నగర, పురపాలికలు, పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 20 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విషయమై రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ విధానం ఏమిటన్నది ఇప్పటివరకు సందిగ్ధంగా ఉంది. తాజా ప్రకటనతో దరఖాస్తుదారులకు ఊరట లభించినట్లయింది. బడ్జెట్ సమయంలోనే వివరాల సేకరణ రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పెండింగుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎల్ఆర్ఎస్పై స్పష్టతనిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆ పథకాన్ని కార్యరూపంలోకి తీసుకువస్తే ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు సైతం ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. అనధికారిక అంచనాల ప్రకారం అందిన దరఖాస్తులను క్రమబద్ధీకరించడం ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఇదీ చదవండి: 2024లో హైదరాబాద్‌లో పూర్తికానున్న ఇళ్లు ఎన్నంటే.. మూడు దశల్లో పరిశీలన దరఖాస్తుల పరిశీలనకు న్యాయస్థానాల నుంచి అప్పట్లో అనుమతి లభించడంతో గతంలో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తిచేశారు. ఆ ప్రక్రియను మూడు దశల్లో చేపట్టారు. తొలిదశలో దరఖాస్తుల పరిశీలన రెండో దశలో ఆయా స్థలాలు క్రమబద్ధీకరణకు అర్హమైనవా? కాదా? అని గుర్తించడం.. అర్హతలు ఉన్నట్లు భావిస్తే సిఫార్సు చేయడం.. మూడో దశలో సంబంధిత అధికారి నిబంధనల మేరకు ఫీజు చెల్లించాలంటూ నోటీసుల జారీకి అనుమతించడం. ఈ మేరకు పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేశారు. 2020లో కేవలం రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. కానీ నోటీసులు అందుకున్నవారు అయోమయంలో ఉన్నారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో వారికి ఉపశమనం కలిగినట్లయింది. క్రమబద్ధీకరణ ఛార్జీలు ఇలా.. చదరపు గజం రూ. 3,000 కంటే తక్కువ ఉన్న సబ్-రిజిస్ట్రార్ విలువ 20 శాతం ఉంటుంది. రూ. 3,001 -రూ. 5,000 మధ్య 30 శాతం రూ. 5,001 -రూ. 10,000 మధ్య 40 శాతం రూ. 10,001 -రూ. 20,000 50 శాతం రూ. 20,001 -రూ. 30,000 మధ్య 60 శాతం రూ. 30,001 -రూ. 50,000 మధ్య 80 శాతం చదరపు గజం సబ్-రిజిస్ట్రార్ విలువ రూ. 50,000 పైన 100 శాతం ఉంటుంది. పై ఛార్జీలకు అదనంగా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణలో నాలా(వ్యవసాయ భూమిని వ్యవసాయేతర వినియోగానికి మార్చడానికి) రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఆమోదం పొందని లేఅవుట్లో 10 శాతం ఖాళీ స్థలం అందుబాటులో లేనట్లైతే ఆగస్టు 26 నాటికి ఉన్న ధరకు బదులుగా, ప్లాట్ రిజిస్ట్రేషన్ తేదీ నాటికి ఉన్న ప్లాట్ విలువలో 14 శాతం చొప్పున ప్రో-రేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు పాటించాల్సిన నిబంధనలు రోడ్డు వెడల్పు కనీసం తొమ్మిది మీటర్లు ఉండాలి. బలహీన వర్గాలకు చెందిన వారి లేఅవుట్లు లేదా 100 చదరపు మీటర్ల కంటే తక్కువ ఉన్న ప్లాట్ల్లో రహదారి వెడల్పు ఆరు మీటర్లు ఉండవచ్చు. అవసరమైన రహదారి వెడల్పు అందుబాటులో లేకపోతే రెండు వైపులా సమానంగా వెడల్పు చేయడానికి అవసరమైన భూమి ఉండాలి. ల్యాండ్ సీలింగ్ చట్టాలు, భూ వివాదాలు లేదా టైటిల్, సరిహద్దు వివాదాలు, కోర్టు వ్యవహారాలు ఉంటే లేఅవుట్లు క్రమబద్ధీకరణ చేయబడవు. అసైన్డ్ భూములకు సంబంధించి జిల్లా కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆమోదంలేని లేఅవుట్లో క్రమబద్ధీకరణకు కొంతమంది ప్లాట్ హోల్డర్లు ఆసక్తి చూపినా కాంపిటెంట్ అథారిటీ ఆమోదించిన లేఅవుట్ నమూనానే పరిగణిస్తారు. దరఖాస్తుదారులు సేల్ డీడ్/ టైటిల్ డీడ్ కాపీలను మాత్రమే అందించాలి. విక్రయ ఒప్పందం లేదా లీగల్ నోటరీ పరిగణించరు. నీటి వనరులకు సంబంధించిన చెరువు, కుంట, షికం భూముల్లోని లేఅవుట్లను క్రమబద్ధీకరించరు. నీటి వనరులు ఉన్న ప్రాంతాన్ని గ్రీన్ బఫర్ జోన్‌గా నిర్ణయిస్తారు. 10 హెక్టార్లు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోని లేఅవుట్లు నదీ ప్రవాహం/ సరస్సుల సరిహద్దు నుంచి 30 మీటర్లు ఉండాలి. కాలువ సరిహద్దుల నుంచి 9 మీటర్లు ఉండాలి. 'నాలా' లేదా మురికినీటి కాలువ నుంచి రెండు మీటర్లు ఉండాలి. -
ఎల్ఆర్ఎస్కు ఎన్ఓసీ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల క్లియరెన్స్‌కు రెవెన్యూ శాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు(ఎన్ఓసీ) తేవడం కష్టంగా మారింది. రెండు నెలలుగా ఆయా జిల్లాల్లోని తహసీల్దార్, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా కేవలం మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా నుంచి 183 ఎన్ఓసీలు రావడం తప్ప ఇతర జిల్లాల నుంచి కనీస స్పందన రాకపోవడం గమనార్హం. గత నెల 31న ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువు ముగియడంతో ప్రాసెస్‌లో ఉన్న 9 వేల ఎన్ఓసీల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మరోసారి అవకాశమివ్వాలంటూ హెచ్ఎండీఏ కమిషనర్ టి. చిరంజీవులు ప్రభుత్వానికి లేఖ రాయడంతో ఆగస్టు 31 వరకు గడువునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్ల మార్గదర్శనంలో తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులను కలిసి సాధ్యమైనంత తొందరగా ఎన్ఓసీలు తేవాలని హెచ్ఎండీఏ కమిషనర్ ప్లానింగ్ విభాగ సిబ్బందిని ఆదేశించారు. అయితే ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరత వల్ల పని వేగవంతం కావడం లేదు. వంద మందికిపైగా సిబ్బంది అవసరమున్నా ప్లానింగ్ విభాగంలో కేవలం 33 మందే పనిచేస్తున్నారు. వీరు అటు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం సేవలు, ఇటు ఎల్ఆర్ఎస్ పనులు చూసుకోవడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఇంత తీరిక లేని పనుల్లో ఉంటూ ఎన్ఓసీల కోసం తహసీల్దార్ల కార్యాలయాల చుట్టూ తిరుతుంటే అక్కడి సిబ్బంది రేపు, మాపు అంటూ తిప్పుకొంటూ కాలాయాపన చేస్తున్నారు. తప్పని ఆపసోపాలు హెచ్ఎండీఏ చొరవ తీసుకున్న తొమ్మిదివేల దరఖాస్తులకు నిరంభ్యతర ధ్రువీకరణ పత్రాలు(ఎన్ఓసీ) తెచ్చుకునే విషయంలో ఆ సంస్థ ఆపసోపాలు పడుతోంది. ఇన్నాళ్లు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఎదుర్కొన్న అనుభవాలే హెచ్‌ఎండీఏకూ ఎదురవుతుండడంతో సిబ్బందికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆయా జిల్లాల కలెక్టర్లు కింది స్థాయి సిబ్బంది ఆదేశించినా ఆశించిన స్థాయిలో వారి నుంచి స్పందన రావడం లేదు. సామాన్యుడి మాదిరిగానే హెచ్ఎండీఏ అధికారులు వారిచుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఒక్క మేడ్చల్ జిల్లా నుంచి తప్ప రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల నుంచి ఇప్పటి దాకా ఒక్క ఎన్ఓసీ కూడా తేలేకపోయారు. ఫీజు కట్టనివారికి అవకాశం గతంలో ఎల్ఆర్ఎస్ ఇనిషియల్ పేమెంట్ చెల్లించని కారణంతో తిరస్కరణకు గురైన 9,842 దరఖాస్తులను ప్రాసెస్ చేయాలంటూ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ దరఖాస్తుదారులు రూ.10 వేల ఫీజు చెల్లిస్తే దరఖాస్తులను ప్రాసెస్ చేస్తామని హెచ్ఎండీఏ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు హెచ్ఎండీఏకు ఎల్ఆర్ ఫీజుల రూపంలో రూ.691 కోట్లు, నాలా చార్జీల రూపంలో రూ.246 కోట్లు వచ్చాయి. -
రేపటితో ముగియనున్న ‘ఎల్ఆర్ఎస్’ గడువు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ అయి సంక్షిప్త సమాచారం అందుకున్న దరఖాస్తుదారులు దాదాపు 18,500 మంది వరకు ఇంకా ఫీజు చెల్లించాల్సి ఉంది. గేట్‌వే ద్వారా ఆన్లైన్ చెల్లింపులకు గడువు సోమవారం రాత్రితో ముగియనుంది. కాగా ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ రూపంలో హెచ్ఎండీఏకు ఇంకా రూ.120 కోట్లు రావాల్సి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ‘ఇప్పటికే రెండుసార్లు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ సమయాన్ని దాదాపు రెండు నెలల పాటు పెంచాం. అయినా కొందరు దరఖాస్తుదారులు ఫీజు కట్టేందుకు ముందుకు రాలేదు. ఇలాంటి వారు ఫీజు చెల్లించేలా ఆదివారం కూడా తార్నాకలోని బ్యాంక్ కౌంటర్లు పనిచేసేలా చొరవ తీసుకున్నాం. ఎల్ఆర్ఎస్ క్లియర్ అయిన వారంతా ఫీజు చెల్లించి ఫైనల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాల’ని హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు సూచించారు. లక్ష దరఖాస్తులు క్లియర్..: ఎల్ఆర్ఎస్ దరఖాస్తు పరిశీలన ప్రక్రియ టైటిల్ స్క్రూటిని, టెక్నికల్ స్క్రూటిని పూర్తయిన తర్వాత సక్రమమని తేలితే క్లియరెన్స్ ఇస్తారు. ఎల్ఆర్ఎస్, నాలా ఫీజు చెల్లించాలంటూ సదరు దరఖాస్తుదారుడి సెల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపుతారు. అది చెల్లించగానే ఫైనల్ ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. ఇలా హెచ్ఎండీఏకు వచ్చిన లక్షా 75వేల పైగా దరఖాస్తుల్లో దాదాపు లక్ష దరఖాస్తులకు ఆమోదముద్ర వేశారు. మిగిలిన 75 వేల దరఖాస్తులను తిరస్కరించారు. ఇలా ఎల్ఆర్ఎస్ క్లియర్ అయి ఫీజు సమాచారం అందుకున్న లక్ష దరఖాస్తుదారుల్లో దాదాపు 18,500 మంది ఫీజు చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. సోమవారం రాత్రి వరకు వేచిచూసి ఫీజు చెల్లించని వారి దరఖాస్తులను తిరస్కరిస్తామన్నారు. అయితే ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్ ఫీజు రూపంలో రూ.600 కోట్లు, నాలా ఫీజు రూపంలో రూ.150 కోట్ల వరకు హెచ్ఎండీఏ ఖజానాకు జమ అయ్యాయి. -
ఎల్ఆర్ఎస్తో ఎసరు..!
- హెచ్ఎండీఏ రక్షణలో ఉన్న భూములనే ఎల్ఆర్ఎస్ చేసిన వైనం - విశ్రాంత తహసీల్దార్ల నిర్వాకంతో తెల్లాపూర్‌లో భూములకు ఎసరు - 250 మంది దరఖాస్తు చేసుకుంటే 50 మందికి ఎల్ఆర్ఎస్ క్లియర్ - హెచ్ఎండీఏ అధికారుల పర్యవేక్షణ లోపంతో అక్రమంగా అనుమతులు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) రక్షణలో ఉన్న ప్రభుత్వ భూములకే లేఅవుట్ రెగ్యులరైజేషన్ పథకం(ఎల్ఆర్ఎస్) కింద క్లియరెన్స్ ఇచ్చిన అంశం వివాదాస్పదమవుతోంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ సర్వే నంబర్ 323లోని కోట్ల విలువ చేసే కొన్ని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ మంజూరు చేశారన్న అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2008లోనూ.. అలాగే 2015లోనూ దాదాపు 50 నుంచి 90 మంది తెల్లాపూర్ సర్వే నంబర్ 323లోని ప్లాట్లను క్రమబద్ధీకరించాలంటూ డాక్యుమెంట్లు సమర్పించగా.. ఇందు లో దాదాపు 50 వరకు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ చేసినట్టు తెలిసింది. క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకున్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుడు ఒకరు సదరు భూమిని జేసీబీలతో చదును చేస్తుండగా చూసిన హెచ్ఎండీఏ ల్యాండ్ విభాగం అధికారులు రామచంద్రపురం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తనకు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ ఉం దని అతను పోలీసులు, హెచ్ఎండీఏ అధికారులకు చూపడంతో అధికారులు షాక్ తిన్నా రు. దీంతో అధికారులు ఆరా తీస్తే తెల్లాపూర్ సర్వే నంబర్ 323తో 250 మంది వరకూ ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారని తెలిసింది. కమిషనర్ టి.చిరంజీవులు ఆదేశాల మేరకు క్లియర్ అయిన ఎల్ఆర్ఎస్లను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిసింది. ఎవరు బాధ్యత వహించాలి.. ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం విశ్రాంత తహసీల్దార్లను హెచ్ఎండీఏ నియమించుకుంది. టైటిల్ క్లియరెన్స్‌లో భాగంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు సమర్పించిన భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను వీరు నిశితంగా పరిశీలించి ఓకే చేయాలి. హెచ్ఎండీఏకు వచ్చిన 1.75 లక్షలకు పైగా దరఖాస్తుల్లో సగానికిపైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు షార్ట్‌ఫాల్ పంపిస్తున్నారు. అయితే హెచ్ఎండీఏ రక్షణలోనే ఉన్న సర్వే నంబర్ 323లోని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి టైటిల్ క్లియరెన్స్‌లో అంతా బాగానే ఉందని క్లియర్ చేశారు. టెక్నికల్ స్క్రూటినీలో హెచ్ఎండీఏ అధికారులు ఆ భూమి మాస్టర్ ప్లాన్‌లో రోడ్డులో వస్తుంది, ల్యాండ్ యూజ్ సమస్యలు ఉన్నాయా.. వాటర్ బాడీస్ కింద వస్తుందా అని చెక్ చేసి అంతా బాగుందనుకుని ఇక్కడా క్లియర్ చేసి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలంటూ ఎస్ఎంఎస్ పంపించారు. దీంతో వారు వచ్చి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ తీసుకున్నారు. ‘టైటిల్ క్లియరెన్స్ చేసేటప్పుడే అధికారులు జాగ్రత్తగా గమనించి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. రెవెన్యూ అధికారులను సమన్వయం చేసి భూమి పత్రాలున్న ఆ సర్వే నంబర్ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ తప్పిదం జరిగి ఉండేది కాదు’అని హెచ్ఎండీఏ అధికారులు అంటున్నారు. గతంలోనూ వివాదాస్పదమే.. 1985–88 మధ్యలో ఎంప్లాయ్ హౌసింగ్ కో–ఆపరేటివ్ సొసైటీ పేరుతో వాలా నారాయణరావు ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు కలిపి దాదాపు 380 ఎకరాలు లేఅవుట్ చేసి అమ్మారు. బీహెచ్ఈఎల్కు సమీపంలో ఉండే ఈ భూములకు ధర బాగా ఉండటంతో కరీంనగర్, వరం గల్, నల్లగొండలకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ల పేరు మీద అసైన్మెంట్ చేశారు. ఆ తర్వాత ఆ భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించాడు. ఇది వెలుగులోకి రావడంతో 2006లో నారాయణరావును పోలీసులు అరెస్టు చేశారు. తెల్లాపూర్ సర్వే నం.323లోని 224 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ శాఖ హెచ్ఎండీఏకు అప్పగించింది. ఇదే సర్వే నంబర్లో సమర యోధులకు కేటాయించిన 118 ఎకరాల భూమికి రక్షణగా ఉండాలని 2006లో హెచ్ఎండీఏకు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ 380 ఎకరాలు హెచ్ఎండీఏ రక్షణలోనే ఉన్నాయి. కొంతమంది సమరయోధుల నుంచి భూమి కొనుగోలు చేసినట్టుగా డాక్యుమెంట్లు సృష్టించి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేశారు.