ఎల్‌ఆర్‌ఎస్‌తో ఎసరు..!
- హెచ్‌ఎండీఏ రక్షణలో ఉన్న భూములనే ఎల్‌ఆర్‌ఎస్ చేసిన వైనం
- విశ్రాంత తహసీల్దార్ల నిర్వాకంతో తెల్లాపూర్‌లో భూములకు ఎసరు
- 250 మంది దరఖాస్తు చేసుకుంటే 50 మందికి ఎల్‌ఆర్‌ఎస్ క్లియర్
- హెచ్‌ఎండీఏ అధికారుల పర్యవేక్షణ లోపంతో అక్రమంగా అనుమతులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) రక్షణలో ఉన్న ప్రభుత్వ భూములకే లేఅవుట్ రెగ్యులరైజేషన్ పథకం(ఎల్‌ఆర్‌ఎస్) కింద క్లియరెన్స్ ఇచ్చిన అంశం వివాదాస్పదమవుతోంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ సర్వే నంబర్ 323లోని కోట్ల విలువ చేసే కొన్ని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ మంజూరు చేశారన్న అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2008లోనూ.. అలాగే 2015లోనూ దాదాపు 50 నుంచి 90 మంది తెల్లాపూర్ సర్వే నంబర్ 323లోని ప్లాట్లను క్రమబద్ధీకరించాలంటూ డాక్యుమెంట్లు సమర్పించగా.. ఇందు లో దాదాపు 50 వరకు ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్ చేసినట్టు తెలిసింది.
క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకున్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారుడు ఒకరు సదరు భూమిని జేసీబీలతో చదును చేస్తుండగా చూసిన హెచ్‌ఎండీఏ ల్యాండ్ విభాగం అధికారులు రామచంద్రపురం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తనకు ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్ ఉం దని అతను పోలీసులు, హెచ్‌ఎండీఏ అధికారులకు చూపడంతో అధికారులు షాక్ తిన్నా రు. దీంతో అధికారులు ఆరా తీస్తే తెల్లాపూర్ సర్వే నంబర్ 323తో 250 మంది వరకూ ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారని తెలిసింది. కమిషనర్ టి.చిరంజీవులు ఆదేశాల మేరకు క్లియర్ అయిన ఎల్‌ఆర్‌ఎస్‌లను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిసింది.
ఎవరు బాధ్యత వహించాలి..
ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్ కోసం విశ్రాంత తహసీల్దార్లను హెచ్‌ఎండీఏ నియమించుకుంది. టైటిల్ క్లియరెన్స్‌లో భాగంగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు సమర్పించిన భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను వీరు నిశితంగా పరిశీలించి ఓకే చేయాలి. హెచ్‌ఎండీఏకు వచ్చిన 1.75 లక్షలకు పైగా దరఖాస్తుల్లో సగానికిపైగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు షార్ట్‌ఫాల్ పంపిస్తున్నారు. అయితే హెచ్‌ఎండీఏ రక్షణలోనే ఉన్న సర్వే నంబర్ 323లోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి టైటిల్ క్లియరెన్స్‌లో అంతా బాగానే ఉందని క్లియర్ చేశారు. టెక్నికల్ స్క్రూటినీలో హెచ్‌ఎండీఏ అధికారులు ఆ భూమి మాస్టర్ ప్లాన్‌లో రోడ్డులో వస్తుంది, ల్యాండ్ యూజ్ సమస్యలు ఉన్నాయా.. వాటర్ బాడీస్ కింద వస్తుందా అని చెక్ చేసి అంతా బాగుందనుకుని ఇక్కడా క్లియర్ చేసి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించాలంటూ ఎస్‌ఎంఎస్ పంపించారు. దీంతో వారు వచ్చి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ తీసుకున్నారు. ‘టైటిల్ క్లియరెన్స్ చేసేటప్పుడే అధికారులు జాగ్రత్తగా గమనించి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. రెవెన్యూ అధికారులను సమన్వయం చేసి భూమి పత్రాలున్న ఆ సర్వే నంబర్ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ తప్పిదం జరిగి ఉండేది కాదు’అని హెచ్‌ఎండీఏ అధికారులు అంటున్నారు.
గతంలోనూ వివాదాస్పదమే..
1985–88 మధ్యలో ఎంప్లాయ్ హౌసింగ్ కో–ఆపరేటివ్ సొసైటీ పేరుతో వాలా నారాయణరావు ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు కలిపి దాదాపు 380 ఎకరాలు లేఅవుట్ చేసి అమ్మారు. బీహెచ్‌ఈఎల్‌కు సమీపంలో ఉండే ఈ భూములకు ధర బాగా ఉండటంతో కరీంనగర్, వరం గల్, నల్లగొండలకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ల పేరు మీద అసైన్‌మెంట్ చేశారు. ఆ తర్వాత ఆ భూమిని ప్లాట్‌లుగా చేసి విక్రయించాడు. ఇది వెలుగులోకి రావడంతో 2006లో నారాయణరావును పోలీసులు అరెస్టు చేశారు. తెల్లాపూర్ సర్వే నం.323లోని 224 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ శాఖ హెచ్‌ఎండీఏకు అప్పగించింది.
ఇదే సర్వే నంబర్‌లో సమర యోధులకు కేటాయించిన 118 ఎకరాల భూమికి రక్షణగా ఉండాలని 2006లో హెచ్‌ఎండీఏకు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ 380 ఎకరాలు హెచ్‌ఎండీఏ రక్షణలోనే ఉన్నాయి. కొంతమంది సమరయోధుల నుంచి భూమి కొనుగోలు చేసినట్టుగా డాక్యుమెంట్లు సృష్టించి ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేశారు.