Hmda officials
-
ఓఆర్ఆర్ టు ఆర్ఆర్ఆర్.. రేడియల్ రోడ్లు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్పై సమీక్ష జరిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం.. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్కు అనుసంధానంగా రేడియల్ రోడ్లు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం ఆదేశించారు. -
జీ+2 పర్మిషన్ తీసుకుని.. అయిదారు అంతస్తులు వేసారా?
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టిన భారీ అక్రమ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించిన హెచ్ఎండీఏ తాజాగా తక్కువ విస్తీర్ణంలోని అక్రమ భవనాలపై దృష్టి సారించింది. హెచ్ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో, అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరపంచాయతీలలో అక్రమ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టింది. వివిధ జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగాలు, మున్సిపల్ అధికారులు, పోలీసులు తదితర విభాగాలకు చెందిన ప్రత్యేక బృందాలతో త్వరలోనే విస్తృత స్థాయిలో దాడులు చేపట్టనున్నారు. పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించనున్నారు. గత నెల 17 నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగించారు. నగర శివార్లలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 202 అక్రమ భవనాలను గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. చట్టవిరుద్ధమని తెలిసినా.. గ్రామ పంచాయతీలలో జీ+2 కోసం అనుమతులు తీసుకొన్న భవన యజమానులు నిబంధనలకు విరుద్ధంగా అయిదారు అంతస్తుల భవనాలను నిర్మించారు. హెచ్ఎండీఏ ఇప్పటి వరకు చేపట్టిన కూల్చివేతలలో చాలా వరకు 600 నుంచి1000 గజాల విస్తీర్ణం కలిగిన స్థలాలు. ఇక నుంచి 600 చదరపు గజాల లోపు స్థలాల్లోనూ చేపట్టిన అక్రమ నిర్మాణాలే టార్గెట్‌గా దాడులు కొనసాగించనున్నారు. 150 గజాల నుంచి 250 గజాల వరకు ఉన్న స్థలాల్లో కూడా చాలా చోట్ల బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం చేపట్టారు. ఇలాంటివి పూర్తిగా చట్టవిరుద్ధం. (క్లిక్: ఫ్లాట్ కొంటున్నారా? ఏం చేస్తే బెటర్!) అక్రమాలు వేల సంఖ్యలో.. నగర శివారు ప్రాంతాల్లో వేలాది అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వీటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం పారదర్శకమైన అనుమతులను అందుబాటులోకి తెచ్చింది. చాలామంది నిర్మాణదారులు నిబంధనలను ఉల్లంఘించి గ్రామపంచాయతీల అనుమతులతోనే బహుళ అంతస్తులు చేపట్టారు. కోవిడ్ కాలంలో ఇలాంటి అక్రమ భవనాలను ఎక్కువగా నిర్మించినట్లు అధికారులు అంచనా వేశారు. తక్కువ విస్తీర్ణంలో చేపట్టిన అక్రమ కట్టడాలు వేల సంఖ్యలో ఉంటాయని అంచనా. కొరవడిన నిఘా... హెచ్ఎండీఏ ఇప్పటి వరకు చేపట్టిన కూల్చివేతల్లో తిరిగి అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కూల్చిన కట్టడాలను ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, ఎమ్మెల్యేల అండతో తిరిగి నిర్మిస్తున్నారు. నిజాంపేట్, తుర్కయంజాల్, పోచారం, ఘట్కేసర్, అన్నోజీగూడ తదితర చోట్ల ఇలా పునర్నిర్మించి కొనుగోలుదారులకు అప్పగించారు. (క్లిక్: హైదరాబాదీలకు శుభవార్త! నగరంలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు) -
HMDA:మార్టిగేజ్ చేశాకే తాత్కాలిక లేఔట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధి అవతల కొత్త లేఔట్ల అనుమతులకు పురపాలక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. తాత్కాలిక లే ఔట్‌కు అనుమతి ఇచ్చే సమయంలోనే.. ఆ స్థలంలో 15 శాతాన్ని సంబంధిత మున్సిపాలిటీ/ కార్పొరేషన్‌కు మార్టిగేజ్(తనఖా) చేయాలని స్పష్టం చేసింది. అలా చేస్తేనే తాత్కాలిక లేఔట్ అనుమతి ఇవ్వాలని, తుది లే ఔట్ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే తనఖా పెట్టిన ప్లాట్లను విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో అపార్ట్మెంట్ల నిర్మాణానికి సంబంధించి మార్టిగేజ్ నిబంధన ఉంది. ఇప్పుడు హెచ్ఎండీఏ అవతల జిల్లాల్లోనూ దీనిని అమలు చేయనున్నారు. ఖాళీ స్థలాన్ని ముందే చూపాలి లే ఔట్ల విస్తీర్ణం ఆధారంగా వదలాల్సిన ఖాళీ స్థలా లను ముందుగానే గుర్తించి.. అనుమతికి దరఖాస్తు చేసుకునే సమయంలోనే తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. జిల్లాల్లోని లే ఔట్లలో కనీస ప్లాటు విస్తీర్ణం 50 చదరపు మీటర్లుగా నిర్ణయించారు. తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో.. 1965, 1970ల నాటి లేఔట్ నిబంధనలన్నీ రద్దవుతాయని, కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని పురపాలక శాఖ స్పష్టం చేసింది. లేఔట్ కు వెళ్లే రహదారి కనీసంగా 18 మీటర్ల వెడల్పు ఉండాలని.. అంతకన్నా తక్కువగా ఉంటే ఆ రో డ్డును 18 మీటర్లకు విస్తరించే విధంగా వందశాతం రోడ్ ఇంపాక్ట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పే ర్కొంది. జిల్లాల్లో లే ఔట్ల అనుమతిపై కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు తుది నిర్ణయం తీసుకుంటాయని తెలిపింది. లే ఔట్లో ఖాళీగా వదిలే స్థలాలను సంబంధిత స్థానిక సంస్థకు రిజిస్టర్ చేయాలని సూచించింది. ప్రభుత్వ ఉత్తర్వుల్లోని మరిన్ని కీలక అంశాలు ♦ జిల్లాల్లో కలెక్టర్ చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) మెంబర్ కన్వీనర్‌గా, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నీటి పారుదల, డీటీసీపీవో, కలెక్టర్ నియమించే మరో నామినీ సభ్యులుగా ఉంటారు. ♦ లే ఔట్‌కు దరఖాస్తు చేసుకునే వారు వంద రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్‌పై సెల్ప్ సర్టిఫికేషన్ ఇవ్వాలి. ♦ దరఖాస్తు సమయంలో రూ. పదివేలు ఫీజు చెల్లించాలి. తాజా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, భూమార్పిడి సర్టిఫికెట్, అనుమతించిన మాస్టర్‌ప్లాన్/డీటెయిల్డ్ టౌన్ ప్లానింగ్ స్కీమ్ కాపీ జత చేయాలి. ♦ నది/సరస్సు/చెరువు/కుంట/నాలాకు 200 మీటర్ల దూరంలో లేఔట్ ఉన్నట్టు నీటిపారుదల శాఖ ఎన్వోసీ తీసుకోవాలి. ♦ 50 హెక్టార్లపైబడిన లే ఔట్‌కు పర్యావరణ అనుమతులు తప్పనిసరి. ♦ లేఔట్‌కు రోడ్డు పొడవు ఆధారంగా.. రోడ్డు వెడల్పు ఎంత ఉండాలన్నది వర్తిస్తుంది. 300 మీటర్ల రోడ్డు అయితే 9 మీటర్ల వెడల్పు, 500 మీటర్లలోపు ఉంటే 12 మీటర్లు, 1000 మీటర్లలోపు ఉంటే 18 మీటర్లు, వెయ్యి మీటర్ల కంటే ఎక్కువ పొడవైన రోడ్డు ఉంటే 24 మీటర్ల వెడల్పుతో రహదారి ఉండాలి. ♦ లే ఔట్లో కనీసం పది శాతం ఖాళీ స్థలం ఉండాలి. అందులో 9 శాతం పచ్చదనానికి, ఒక శాతం ఇతర అవసరాల కోసం వినియోగించాలి. ♦ సామాజిక మౌలిక సదుపాయాల కోసం అదనంగా 2.5శాతం కేటాయించాలి ♦ కనీస ప్లాటు విస్తీర్ణం 50 చదరపు మీటర్లు.. వెడల్పు కనీసం ఆరు మీటర్లు ఉండాలి. ♦ ప్లాటెడ్ ఏరియాలో 15 శాతాన్ని మున్సిపాలిటీ/కార్పొరేషన్‌కు తనఖా చేయాలి. 50 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో లే ఔట్ ఉంటే.. విద్య, ఆరోగ్య, వాణిజ్య అవసరాలకు అదనంగా స్థలాలు కేటాయించాలి. ♦ నీటి వనరులకు దగ్గర ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్)లో ఎలాంటి అనుమతులు ఇవ్వరు. ♦ నదులు/వాగులకు 50 మీటర్లలోపు అనుమతులు ఇవ్వరు. చెరువులు/కుంటలు/ట్యాంకులకు కనీసం 30 మీటర్ల దూరంలో ఉంటేనే 10 హెక్టార్ల లే ఔట్లకు అనుమతిస్తారు. పదిహెక్టార్లలోపు ఉంటే 9 మీటర్ల సరిహద్దు ఉండాలి. ♦ నాలాలు, కాలువలు, వాగు, వరద నీటి కాలువల (పది మీటర్ల వెడల్పు ఉన్నవి)కు రెండు మీటర్ల కనీస సరిహద్దు ఉంటే అనుమతిస్తారు. ♦ హైటెన్షన్ విద్యుత్ స్తంభాలు ఉంటే.. కింద స్థలాన్ని గ్రీన్‌ఫీల్డ్ జోన్‌గా గుర్తిస్తారు. వాటిలో రహదారులు వేసుకోవచ్చు, లేదా గ్రీనరీ పెంచాలి. గ్రీన్‌ఫీల్డ్ జోన్‌కు కనీసం మూడు దూరంలోనే ప్లాట్లు చేయాలి. ♦ రైల్వే ఆస్తులకు సమీపంలో కనీసం 30 మీటర్లు దూరంలో లే ఔట్ అభివృద్ధి చేయాలి. ♦ రక్షిత పురాతన నిర్మాణాల నుంచి కనీసం 100 నుంచి 200 మీటర్ల దూరంలోపు ఉంటే సంబంధిత శాఖ నుంచి ఎన్వోసీ తీసుకోవాలి. ఆయిల్, నేచురల్ గ్యాస్ పైపులైన్లకు సమీపంలో లేఔట్లు ఉంటే వారి దగ్గర నుంచి ఎన్వోసీ తీసుకోవాలి. ♦ లే ఔట్ కోసం అన్ని పత్రాలతో సరిగా దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లో తాత్కాలిక అనుమతులు ఇస్తారు. లేని పక్షంలో అనుమతులు లభించినట్లు భావించాలి. ♦ దరఖాస్తులో ఏవైనా లోపాలు ఉంటే.. 10 రోజుల్లోగా సంబంధిత అధికారులు వాటిని వివరిస్తూ ఆన్లైన్లోనే సమాచారం ఇస్తారు. లే ఔట్ చేసే సంస్థలు/వ్యక్తులు వాటిని ఏడు రోజుల్లోగా సవరించి సమర్పించాలి. ♦ తాత్కాలిక లేఔట్‌ను ఆమోదించిన రెండేళ్లలో అన్ని సౌకర్యాలతో లేఔట్ పూర్తి చేయాలి. తాత్కాలిక లేఔట్ కోసం చెల్లించిన ఫీజులో అదనంగా 20 శాతం ఫీజు చెల్లిస్తే మరో సంవత్సరం పొడిగింపు ఇస్తారు. ♦ అన్నీ సక్రమంగా ఉంటే తుది లేఔట్ మంజూరు చేసి. తనఖా పెట్టిన స్థలాలను 21 రోజుల్లోగా విడుదల చేస్తారు. -
తేల్చరు.. తీర్చరు
భరత్ అనే వ్యక్తి శంకర్‌పల్లిలో 200 గజాల స్థలం కొనుగోలు చేశారు. లే అవుట్ రెగ్యులేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) లేని ఆ ప్లాట్‌లో భవన నిర్మాణం చేపట్టేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు ఆన్లైన్లో డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు కావాల్సిన సేల్‌డీడ్, లింక్ డాక్యుమెంట్లు, పహాణీలు, పాస్‌బుక్, 13 ఏళ్ల ఈసీ, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్, సైట్ ఫొటోలు, లేఅవుట్ కాపీలు, ఆర్కిటెక్ట్ సేవలతో నిక్షిప్తం చేశారు. చివరకు ఎల్ఆర్ఎస్ ఫీజుపై 33 శాతం అదనంగా తీసుకొని భవన నిర్మాణానికి అనుమతి వస్తుందనుకున్న భరత్‌కు నాలా రూపంలో షార్ట్‌ఫాల్ వచ్చింది. ఏముందిలే.. 15 రోజుల్లో వస్తుందనుకున్నారు. కానీ.. రెండు నెలలు గడిచినా నాలా సర్టిఫికెట్ ఆయన చేతికి అందలేదు. సాక్షి, హైదరాబాద్: ఈ పరిస్థితి ఒక్క భరత్‌కే పరిమితం కాలేదు. వందలాది మంది దరఖాస్తుదారులు నాలా సర్టిఫికెట్ తెచ్చుకునేందుకు రెవెన్యూ విభాగం చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నారు. ఆన్లైన్ ప్రక్రియ కాకపోవడంతో ఆ ఫైల్ ఎవరి వద్ద.. ఏ సమయంలో ఉందో తెలుసుకోవడం కష్టంగా పరిణమిస్తోంది. నాలా సర్టిఫికెట్ కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందన్న విషయం రెండేళ్ల క్రితం హెచ్ఎండీఏ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. జీఓ 151 ప్రకారం లేఅవుట్ రెగ్యులేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల క్లియరెన్స్‌లో భాగంగా నాలా ఫీజు వసూలు చేసుకునే వీలును కల్పించినట్టుగానే భవన నిర్మాణ అనుమతుల విషయంలోనూ కల్పించాలంటూ రెవెన్యూ విభాగానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ రాసి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు మాత్రం నాలా ఫీజు వసూలుపై స్పష్టత ఇవ్వలేకపోయింది. దీంతో దరఖాస్తుదారులకు వెతలు తప్పడం లేదు. నెలలు గడుస్తున్నా.. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చుకునేందుకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ కింద చెల్లించేదే నాలా పన్ను. దరఖాస్తు చేసుకున్న పక్షం రోజుల్లోనే రెవెన్యూ విభాగం సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉండగా ఇదేమీ పట్టించుకోవడం లేదు. నెలల కొద్దీ దరఖాస్తుదారులను తిప్పించుకొంటోంది. ఫలితంగా సొంతింటి కలను సాకారం చేసుకునే క్రమంలో సామాన్యుడు బోల్తా పడుతున్నాడు. బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆమ్యామ్యాలు చూపుతుండడంతో దరఖాస్తు చేసుకున్న పదిరోజుల్లోనే చేతికి అందిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలా సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆర్టీఓ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి నివేదికను తహసీల్దార్‌కు రాస్తున్నారు. మళ్లీ తహసీల్దార్ పూర్తిస్థాయిలో తనిఖీ చేశాక తిరిగి నాలా సర్టిఫికెట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఆర్టీఓకు నివేదిక పంపుతున్నారు. అక్కడి నుంచి అన్నీ తనిఖీ చేశాక దరఖాస్తుదారు నాలా పన్ను చెల్లించి సర్టిఫికెట్ తీసుకుంటున్నారు. ఈ సమయానికే మీకు పంపిన షార్ట్‌ఫాల్స్ నిక్షిప్తం చేయకపోవడంతో మీ డీపీఎంఎస్ ఫైల్ తిరస్కరణకు గురయ్యిందంటూ ఎస్ఎంఎస్లు రావడంతో ఏమీ చేయాలో పాలుపోక దరఖాస్తుదారులు తలలు పట్టుకుంటున్నారు. ఆ వెసులుబాటు కల్పించాలి.. 2015 అక్టోబర్ 20 నాటికి ప్లాట్ మీద రిజిస్టర్డ్ సేల్‌డీడ్ ఉంటేనే 33 శాతం ఎల్ఆర్ఎస్ రుసుంతో హెచ్ఎండీఏ బిల్డింగ్ పర్మిషన్ ఇస్తోంది. జీఓ 151 ప్రకారం లేఅవుట్ రెగ్యులేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల క్లియరెన్స్‌లో భాగంగా నాలా ఫీజులు వసూలు చేసుకునే వీలును ప్రభుత్వం హెచ్ఎండీఏకు కల్పించింది. ఇదే విధానాన్ని భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చేవారికి కల్పించాలని, నాలా సర్టిఫికెట్ కోసం రెవెన్యూ విభాగం చుట్టూ తిరగాలంటే చాలా సమయంలో పడుతోందని, ఆలోపు హెచ్ఎండీఏలో దరఖాస్తు చేసుకున్న డీపీఎంఎస్ ఫైల్ తిరస్కరణ గురవుతోందని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టి సారించి హెచ్ఎండీఏలో సింగిల్ విండోలోనే పని పూర్తయ్యేలా వెసులుబాటు కల్పించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. -
సుందర‘సాగరం’.. పర్యాటక ‘దుర్గం’
హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువులకు పర్యాటక హంగులు అద్దేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మాస్టర్ప్లాన్లు రూపొందించింది. ఈ రెండు చెరువులను దశలవారీగా సుందరీకరించాలని నిర్ణయించింది. అలాగే వందేళ్లు పూర్తి చేసుకుంటున్న గండిపేట జలాశయం సుందరీకరణపై కూడా మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ) కార్యాలయంలో హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్, ఇంజనీరింగ్ విభాగాధిపతి బీఎల్ఎన్ రెడ్డి, ఇతర విభాగాధికారులతో మంత్రి కేటీఆర్ గురువారం ఆయా ప్రాజెక్టులపై సమీక్షించారు. వాటికి సంబంధించిన, అనుసరించాల్సిన విధానాలపై సూచనలిచ్చారు. -
ట్రాఫిక్ చిక్కులు.. తీర్చే దిక్కులు!
సాక్షి, హైదరాబాద్: కోటి జనాభా దాటిన మహా నగరంలో ‘ట్రాఫిక్’తీర్చలేని ప్రధాన సమస్య. 10 కిలోమీటర్ల ప్రయాణానికి 30 నుంచి 45 నిమిషాలు సమయం వెచ్చించాల్సిందే. రద్దీ సమయాల్లో గంట కంటే ఎక్కువే పడుతుంది. దీన్ని తగ్గించడం కోసం హైదరాబాద్ మహానగరాభి వృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పలు కార్యక్రమాలు చేపడు తూనే ఉంది. ఇందులో భాగంగా వచ్చిన ఆలో చనే.. వస్తు నిల్వ కేంద్రాలు (లాజిస్టిక్ హబ్స్). నగరంలోకి భారీ వాహనాలు రాకుండా శివారు ప్రాంతాల్లోని హబ్స్‌లోనే ఆపేసి, వస్తువులను అక్కడే నిల్వ చేస్తారు. చిన్న వాహనాల్లో నగరంలోకి తీసుకొస్తారు. ఇలా మహా నగరం నలువైపులా నయా హబ్స్ రానున్నాయి. మంగల్‌పల్లి, బాటసిం గారం ప్రాంతాల్లో లాజిస్టిక్ హబ్స్ పనుల్లో వేగిరం పెరగగా... పటాన్చెరులో భూమిని చదును చేసి పనులు చేస్తున్నారు. అలాగే మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌పై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు మియాపూర్‌లో ఇంటర్సిటీ బస్‌టెర్మినల్ (ఐసీబీటీ) పనులపై కూడా హెచ్ఎండీఏ దృష్టి సారించింది. ఈ నాలుగు అందుబాటులోకొస్తే నగ రంపై పడే సగం ట్రాఫిక్ తగ్గడంతో పాటు రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశముందని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఇవేకాక పెద్దఅం బర్‌పేటలో ఐసీబీటీ, శంషాబాద్‌లో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు సాధ్యాసాధ్యాలపైనా దృష్టిసారిం చారు. శంషాబాద్, మనోహరాబాద్, పటాన్చెరు, శామీర్‌పేటలోనూ లాజిస్టిక్ హబ్‌లపై అధ్యయనం చేసి అందుకయ్యే వ్యయాన్ని అంచనా వేసే పనిలో హెచ్ఎండీఏ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ ప్రైవేట్భాగస్వామ్యంతో చేపడితే 200 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా. ప్రయోజనాలు ఇవి.... బాటసింగారం, మంగల్పల్లిల్లోని లాజిస్టిక్ హబ్‌ల్లో అన్ని రకాల వస్తువులను నిల్వ చేయొచ్చు. పెద్దెత్తున సరుకులు తీసుకొచ్చిన భారీ వాహనాలు ఇక్కడే ఆగిపోతాయి. అక్కడి నుంచి నగర వ్యాపారులకు కావల్సినప్పుడు చిన్న వాహనాల్లో తీసుకెళ్లవచ్చు. తద్వారా కొంత వరకు రవాణా చార్జీలు తగ్గి సరుకుల ధరలూ తగ్గుతాయి. మినీ ట్రక్కులు, ఆటోలు, చిన్న వాహనాలకు గిరాకీ పెరుగుతుంది. భారీ వాహనాలు రాక ఆగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలు తప్పుతాయి. ఐసీబీటీ ప్రత్యేకతలు ఇవి... - మంగల్‌పల్లి, బాటసింగారంలో ఒకేసారి 500 ట్రక్కులు పార్క్ చేయవచ్చు. - 2 లక్షల చ.అ. గోదాములు, 10 వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్. - ఆటోమొబైల్ సర్వీస్కేంద్రం, పరికరాల నిల్వకు 10 వేల టన్నుల సామర్థ్యంతో గోదాములు. - 100 మంది ఉండటానికి వీలుగా డార్మిటరీ, 5 వేల చ.అ. విస్తీర్ణంలో రెస్టారెంట్, 2,500 చ.అ.ల్లో పరిపాలన కార్యాలయం. 2011లోనే ఆలోచన... ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నగరానికి వస్తున్న వందలాది ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో ఎంజీ బీ ఎస్పై రద్దీ పెరిగింది. దీన్ని నియంత్రిం చేందుకు మియాపూర్‌లో భారీ బస్టాండ్‌ను నిర్మిం చాలని 2011లో అప్పటి ప్రభుత్వం ఆలోచించిం ది. రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఐసీబీటీకి వచ్చివెళ్లే ప్రజలు నగరంలోకి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు మెట్రో సర్వీసులు కూడా ఉండేలా చూసుకున్నారు. మంగల్‌పల్లి(లాజిస్టిక్ హబ్) ప్రాంతం: నాగార్జునసాగర్ హైవేపై ఓఆర్ఆర్ బొంగళూరు జంక్షన్ నుంచి 500 మీటర్ల దూరంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంగల్‌పల్లి. విధానం: పబ్లిక్ ప్రేవేట్ భాగస్వామ్యం, విస్తీర్ణం: 22 ఎకరాలు, వ్యయం: రూ.20 కోట్లు, ప్రారంభం: 2017, ప్రస్తుత స్థితి: 40 శాతం పూర్తి మరో మూడు నెలలు పట్టే అవకాశం బాటసింగారం(లాజిస్టిక్ హబ్) ప్రాంతం: విజయవాడ హైవేపై ఓఆర్ఆర్కి 7కి.మీ. దూరంలోని హయత్‌నగర్ మండలం బాటసింగారం. విధానం: పబ్లిక్ ప్రేవేట్ భాగస్వామ్యం విస్తీర్ణం:40 ఎకరాలు వ్యయం:రూ.35 కోట్లు ప్రారంభం:2017 ప్రస్తుత స్థితి:70 శాతం పూర్తి కమర్షియల్ ఆపరేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ పటాన్చెరు(లాజిస్టిక్ హబ్) విధానం: పబ్లిక్ ప్రేవేట్ భాగస్వామ్యం, విస్తీర్ణం: 17 ఎకరాలు ప్రస్తుత స్థితి: 5 ఎకరాల్లో పార్కింగ్ పనులు పూర్తి, చేసిన ఖర్చు: రూ.5 కోట్లు -
మా భూమి ఇస్తాం... తీసుకోండి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన ‘ఉప్పల్ భగాయత్’ను శివారు రైతులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆ తరహాలోనే తమ ప్రాంతాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేయాలంటూ కోరుతున్నారు. భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ‘మీ భూమి ఇవ్వండి.. అభివృద్ధి చేస్తామం’టూ ఈ నెల ఐదున హెచ్ఎండీఏ మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసిన క్రమంలో శివారు ప్రాంతరైతులు భూములివ్వడం వల్ల కలిగే ఫలితాలను తెలుసుకుంటున్నారు. ఘట్కేసర్, కీసర, శంషాబాద్, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, శామీర్‌పేట, కొహెడ... ఇలా వివిధ ప్రాంతాల రైతులు తార్నాకలోని హెచ్ఎండీఏ కేంద్ర కార్యాలయంలో ల్యాండ్‌పూలింగ్ అధికారులను కలసి మాట్లాడుతున్నారు. ఈ నెల 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయా రైతులు చెప్పిన భూముల్లో పర్యటించి లేఅవుట్‌కు పనికొస్తాయా, లేదా అని అధికారులు నిర్ధారించుకొని ముందుకెళ్లనున్నారు. 50 ఎకరాలకు తగ్గకుండా... హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత ల్యాండ్‌పూలింగ్ పథకం, ఏరియా డెవలప్మెంట్ ప్లాన్, డెవలప్మెంట్ స్కీం 2017 జీవో ప్రకారం కనీసం 50 ఎకరాలకు తగ్గకుండా భూమి ఉండాలి. భూమిపై సంపూర్ణంగా భూయాజమాన్యపు పట్టా(టైటిల్ క్లియర్) ఉండాలి. ప్రతిపాదిత భూమి మాస్టర్‌ప్లాన్ ప్రకారం బఫర్‌జోన్, చెరువులు, ఫుల్ ట్యాంక్ లెవల్, ఓపెన్ స్పేస్‌లో ఉండరాదు. ఉప్పల్ భగాయత్ లేఅవుట్ తరహాలోనే అంతా అభివృద్ధి చేసిన స్థలంలోని ప్లాట్లలో సగం మేర రైతులకు కేటాయించనుంది. మిగతాసగం ప్లాట్లను హెచ్ఎండీఏనే వేలం వేసి ఆదాయాన్ని సమకూర్చుకోనుంది. మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చంతా హెచ్ఎండీఏనే భరిస్తుందన్నారు. స్వతహాగా... పట్టాదారుల అంగీకారంతో... హెచ్ఎండీఏ స్వతహాగా గుర్తించిన ప్రాంతాల్లో భూమి సేకరించి లేఅవుట్ అభివృద్ధి తీసుకునే అధికారం కూడా ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు ఇరువైపులా కిలోమీటర్ పరిధిలో మినీ నగరాలు అభివృద్ధి చేసేందుకు ఈ అధికారాలు ఉపయోగించుకునే దిశగా హెచ్ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంగీకరించిన రైతులతో అభివృద్ధి ఒప్పందం–జీపీఏ కుదుర్చుకుంటారు. ఇది ఆమోదం పొందిన ఆరునెలల్లోగా రోడ్లు, పాఠశాలలు, పార్కులు, పచ్చదనం, రవాణాసౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేసిన ప్లాట్లను సంబంధిత యజమానికి అప్పగిస్తారు. రోడ్డుకు అనుకొని ఉన్న భూముల యజమానులకు అక్కడే స్థలాన్నిచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తారు. మిగతాభూములకు లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. ప్లాట్లు కేటాయించిన తర్వాత ఆరునెలల్లోగా అక్కడ మౌలిక సదుపాయాల నిర్వహణ బాధ్యతను యజమానుల సంఘానికి అప్పగించేలా ల్యాండ్‌పూలింగ్ పథకంలో నిబంధనలు పొందుపరిచారు. మూడేళ్లలోగా మౌలిక సదుపాయాలను కల్పించకపోతే ప్రతినెలా ఆ భూమి మూల విలువ(బేసిక్ వాల్యూ)పై 0.5 శాతం పరిహారాన్ని చెల్లిస్తారు. మినీ నగరాలతోపాటే లాజిస్టిక్ హబ్‌లు... ల్యాండ్ పూలింగ్ పథకం కింద ఉదాహరణకు ఒక ప్రాంతంలో 100 ఎకరాలను రైతులు ఇచ్చారు. ఇందులో వస్తువు నిల్వ కేంద్రాలు(లాజిస్టిక్ హబ్)ల కోసం 20 ఎకరాలు పక్కన పెడితే, మిగతా 80 ఎకరాల్లో లే అవుట్‌ను అభివృద్ధి చేయాలి. మొత్తం మౌలిక వసతులు కల్పించగా 2,45,000 గజాలు ప్లాట్ల రూపంలో ఉంటుంది. రైతులతో కుదుర్చుకున్న అవగాహన ప్రకారం ఎకరాకు 1,500 గజాలు కేటాయించాలి. అంటే 2,45,000 గజాలలో 100 మంది రైతులకు 1,50,000 గజాలను ఇవ్వనుంది. మిగిలిన 90,000 గజాలలో ఉన్న ప్లాట్లను విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును అదే ప్రాంతంలో ఉన్న లాజిస్టిక్ హబ్‌కు కేటాయించి అభివృద్ధి చేయడం ద్వారా ఆ ప్రాంతానికి మంచి డిమాండ్ రానుంది. అటు నగరంపై పడుతున్న రవాణా, ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడం, ఇటు శివారు ప్రాంతాలను అభివృద్ధి వైపు తీసుకెళ్లేలా చేయడంలో ఈ ల్యాండ్ పూలింగ్ పథకం ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. -
ఫుల్ జోష్.. యమా కిక్కు
సాక్షి, హైదరాబాద్: ఒకేవైపు చూస్తూ భోజనం చేయడం బోర్... చుట్టూ అన్ని వైపుల ప్రదేశాలను చూస్తూ తింటే అదో కిక్కు. అదీ 60 మీటర్ల ఎత్తున. అదే రివాల్వింగ్ రెస్టారెంట్ అంటే. అంతేనా.. భోజనంతో పాటు అందించే మద్యం మరింత కిక్కునిస్తుంది. అంతేనా.. రోజంతా నీళ్లలోనే సేదతీరేలా హౌస్ బోటింగ్‌లు.. రంగు రంగుల పక్షుల కిలకిలారావాలు. కేబుల్ కార్లు, రాక్ క్లైంబింగ్, జిప్‌లైన్, గోల్ఫ్ కోర్టులు, స్విమ్మింగ్ ఫూల్ ఇలా ఎన్నో ఎన్నెన్నో అన్ని ఒకేచోట నగరవాసులకు అందుబాటులోకి రానున్నాయి. నిత్యం సమయంతో పాటు పరిగెత్తే సిటిజనులకు ఉల్లాసాన్ని పంచనున్నాయి. దీనికి హైదరాబాద్‌లోని గండిపేట చెరువు వేదిక కానుంది. 2020 నాటికి గండిపేట చెరువు ఏర్పడి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పర్యాటకులను ఆకర్షించేందుకు టూరిజం విభాగంతో కలసి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సరికొత్త ప్రణాళికలతో ముందుకెళుతోంది. గండిపేట చెరువు సమీపంలో 60 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయనున్న ఈ ‘స్కై టవర్ రెస్టారెంట్’అటుఇటు కదులుతూ పర్యాటకులకు వినోదాన్ని అందించనుంది. భోజనంతో పాటు మద్యం కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. కేరళ, అహ్మదాబాద్‌లో కదులుతున్న రెస్టారెంట్ల మాదిరిగానే దాదాపు 20 అంతస్తుల్లో నిర్మాణంచేసి ‘ఫుల్ ఎంటర్టైన్మెంట్ జోష్’అందిస్తామని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. నీళ్ల మధ్యలోనే సేద తీరేలా హౌస్ బోటింగ్... గండిపేట చెరువు మధ్యలో పర్యాటకులు పగలు, రాత్రంతా సేద తీరేలా హెచ్ఎండీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక్కడికి వచ్చిన వారు రాత్రంతా నీళ్ల మధ్యలో బోట్లోనే ఉండేలా ఇళ్లు (హౌస్ బోటింగ్), కాటేజెస్‌ల్లో కాలక్షేపం చేయడంతో పాటు ఆనందంగా గడిపేలా అన్ని వసతులు సమకూర్చాలని నిర్ణయించింది. దాదాపు 10 కిలోమీటర్ల వరకు నీళ్ల పైభాగంలో రోపింగ్ వే మాదిరిగానే కేబుల్ కారును ఏర్పాటుచేసి పర్యాటకులు ఒకచోట నుంచి మరోచోటికి ప్రయాణిస్తూ థ్రిల్‌గా ఫీలయ్యేలా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయనుంది. ప్రతిపాదిత 47 కిలోమీటర్లలో తొలుత 25 కిలోమీటర్లలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ గండిపేట చెరువు అభివృద్ధి పనులకు త్వరలోనే మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పక్షులతో హాయిగా గడిపేలా... జనావాసాలతో పాటు అడవుల్లో చక్కర్లు కొట్టే పక్షులు కూడా గండిపేటలో ఆకర్షణగా ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దాదాపు కిలోమీటర్ మేర ఏర్పాటుచేసే ఫెన్సింగ్‌లో విభిన్న జాతుల పక్షుల మధ్యలో నుంచి పర్యాటకులు నడుచుకుంటూ వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నారు. పిల్లాపాపలతో వచ్చే కుటుంబసభ్యులకు ఈ పక్షులతో కాలక్షేపం హాయినిస్తుందని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఇవేకాకుండా ప్రతి 5 కిలోమీటర్లకు ఒక రిక్రియేషనల్ సెంటర్ ఉండేలా మెరుగులు దిద్దనున్నారు. వారాంతాల్లో ఎంటర్టైన్మెంట్ కోసం శివారు ప్రాంతాలకు వెళ్లే నగరవాసులు జాగింగ్, స్కేటింగ్, సైక్లింగ్, బురదలో పరిగెత్తేలా ఏర్పాట్లు, గుట్టలు చకచక ఎక్కేలా రాక్ క్లైంబింగ్, నడుంకు తాడుకట్టుకొని రోప్‌వే సాయంతో ముందుకెళ్లేలా జిప్‌లైన్, అవుట్డోర్ జిమ్, గోల్ఫ్ కోర్టులు, స్విమ్మింగ్ ఫూల్ తదితర సౌకర్యాలు ఏర్పాటుచేయడంపై హెచ్ఎండీఏ అధికారులు దృష్టి సారించారు. అవసరమైతే డ్రోన్ కెమెరాలతో సర్వే చేసి గండిపేట అభివృద్ధికి తుదిరూపు ఇవ్వనున్నారు. అహ్మదాబాద్‌లోని పతంగ్ రివాల్వింగ్ రెస్టారెంట్ -
ఇలాగేనా.. అక్రమాలను అరికట్టలేరా..
అక్రమ లేఅవుట్లపై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కన్నెర్ర జేసింది. అక్రమార్కులకు ముకుతాడు వేయడంలో పంచాయతీ కార్యదర్శులు నిర్లిప్త వైఖరి అవలంభిస్తున్నారని ఆక్షేపించింది. అనధికార లేఅవుట్లలో అనుమతులు మంజూరు చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తప్పుబట్టింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారికి లేఖ రాసింది. దీంతో తేరుకున్న జిల్లా యంత్రాంగం.. అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని కార్యదర్శులను హెచ్చరించింది. అక్రమ లేఅవుట్ల ఏర్పాటును ప్రోత్సాహించినా.. అనధికార బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చినా ఊరుకునేదిలేదని స్పష్టం చేసింది. ఎక్కడైనా ఇలాంటి లేఅవుట్లు వెలుస్తున్నట్లు తెలిస్తే తక్షణమే హెచ్ఎండీఏ దృష్టికి తేవాలని సూచించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్, ఘట్కేసర్ గ్రామ పంచాయతీల్లో జరిగిన అవకతవకలను ఎత్తిచూపిన హెచ్ఎండీఏ.. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సహించేదిలేదని తేల్చిచెప్పింది. మాజీ సర్పంచ్‌లు పాత తేదీలతో అనుమతులు ఇస్తున్నారని.. కొందరు కార్యదర్శులు బిల్డింగ్ పర్మిషన్ల దరఖాస్తులను వేర్వేరు రిజిష్టర్లలో నమోదు చేస్తూ తెరచాటు వ్యవహారాలు నెరుపుతున్నట్టు నిగ్గు తేల్చింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారని హెచ్ఎండీఏ గుర్తించింది. లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా చోద్యం చూస్తున్న కార్యదర్శులు.. వెంచర్లు వెలవకముందే నిర్మాణ అనుమతులు ఇచ్చినట్లు రికార్డులు సృష్టించినట్లు విచారణలో తేలింది. చట్టవిరుద్ధ లేఅవుట్లు, అనధికార నిర్మాణాలను నివారించడానికి సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కోరింది. బిల్డర్/డెవలపర్ చేసే అక్రమ కట్టడాలను గుర్తించి తక్షణమే సదరు సంస్థలు/వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని సూచించింది. అంతేగాకుండా అనధికార నిర్మాణాలను కూల్చివేసే సమయంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా మొత్తం తంతును రికార్డింగ్ చేయాలని జిల్లా యంత్రాంగానికి రాసిన లేఖలో కోరింది. కాగా, తమ పరిధిలోని కార్యదర్శుల వ్యవహారశైలిపై పెదవివిరిచిన హెచ్ఎండీఏ.. అక్రమాలపై మేల్కొనకపోతే ప్రభుత్వం రాబడి కోల్పోవడమేగాకుండా కనీస సౌకర్యాల కల్పన కష్టమని స్పష్టం చేసింది. ఇదేం కిరికిరి.. అక్రమ లేఅవుట్లపై జిల్లా యంత్రాంగం ద్వంద్వ విధానాన్ని అవలంభిస్తోంది. చట్ట విరుద్ధంగా వెలిసిన లేఅవుట్లపై కొరడా ఝళిపించమని ఒకవైపు చెబుతూ.. మరోవైపు వాటిలో పది శాతం స్థలాన్ని గిఫ్ట్‌డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకోమనడం విడ్డూరంగా ఉంది. ఇది పంచాయతీ కార్యదర్శులకు తలనొప్పిగా తయారైంది. స్థల స్వాధీనంతో లేఅవుట్‌కు ఒక విధంగా మనమే చట్టబద్ధత కల్పించి.. మరోవైపు ఆ లేఅవుట్లో బిల్డింగ్ అనుమతులు నిరాకరించడం ఎంతవరకు సబబనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంశంపై డెవలపర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే లేనిపోని సమస్యలు కొనితెచ్చుకోవాల్సిందేనని కొందరు కార్యదర్శులు అంటున్నారు. -
ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టకపోతే తిరస్కరణ!
సాక్షి, హైదరాబాద్: అక్రమ ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద దరఖాస్తు చేసి.. క్లియరెన్స్ పొంది.. ఫీజు కట్టాలంటూ ఎస్ఎంఎస్లు అందుకున్నవారు డబ్బులు చెల్లించడంలో నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. ఫీజు కట్టాలంటూ ఎస్ఎంఎస్ అందుకున్న 15 రోజుల్లో ఫీజు కట్టాల్సి ఉండగా అవేమీ పాటించడంలేదు. గడువు ముగిసినా ఫీజు కట్టని వారి సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొడిగించే అవకాశం లేదని హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. హెచ్ఎండీఏకు వచ్చిన 1,75,464 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 77,319 మందికి ఫీజు కట్టాలంటూ ఎస్ఎంఎస్ పంపితే, 47వేల మంది మాత్రమే చెల్లించారు. మిగిలిన 30 వేల మంది ఫీజు కట్టే సమయం మించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తించిన హెచ్ఎండీఏ అధికారులు అవసరమైతే వారి ఎల్ఆర్ఎస్ను తిరస్కరించాలని యోచిస్తున్నారు. ఈ విషయమై హెచ్ఎండీఏ అధికారి ఒకరు మాట్లాడుతూ... ‘ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టాలంటూ దరఖాస్తుదారుల సెల్ నంబర్లకు సంక్షిప్త సమాచారం పంపించాం. దాదాపు 77వేల మందిలో 40వేలపైచిలుకు మంది వరకు ఆన్లైన్ పద్ధతిలో ఫీజు చెల్లించారు. మిగతావారు ఇంతవరకు కట్టలేదు. ఇప్పటికే రెండు, మూడు సార్లు గడువు పొడిగించాం. మరో వారంలో వీరు ఫీజు కట్టకపోతే ఎల్ఆర్ఎస్ తిరస్కరిస్తామ’ని స్పష్టం చేశారు. షార్ట్‌ఫాల్ నోటీసులు జారీ... ఎల్ఆర్ఎస్ లేఅవుట్ కాపీ, వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి ఎన్వోసీలు... ఇలా ఇతరత్రా డాక్యుమెంట్లు సమర్పించని వారికి చివరిసారిగా షార్ట్‌ఫాల్ నోటీసులు జారీ చేశారు. గత వారం నుంచి ఈ ప్రక్రియ ఊపందుకుంది. 15 రోజుల్లో సంబంధిత డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకపోతే తిరస్కరిస్తామంటూ సెల్ నంబర్లకు ఎస్ఎంఎస్ పంపిస్తున్నారు. ఇలా 7,555 మందికి షార్ట్‌ఫాల్ నోటీసులు పంపినట్లు హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. షార్ట్‌ఫాల్‌కు అవకాశం ఇదే చివరిసారని, చేయని పక్షంలో తిరస్కరిస్తామని స్పష్టం చేస్తున్నారు. మరో 12,298 వేల దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయని చెబుతున్నారు. దీనికితోడు ఇప్పటికే వివిధ కారణాలతో తిరస్కరణకు గురైన 68,035 మందికి అప్పీల్‌కు మరో అవకాశం కల్పించడంతో దాదాపు పదివేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీటిని తిరిగి పరీక్షించేందుకు నలుగురు తహసీల్దార్లు, నలుగురు టెక్నికల్ ఆఫీసర్లతో ఇప్పటికే కమిషనర్ టి.చిరంజీవులు నియమించిన బృందం పనిచేస్తోంది. వీటిలో 703 దరఖాస్తులను తిరస్కరించాయి. అయితే ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకునే సమయంలో తొలి వాయిదా చెల్లించనివారు 9,554 మంది ఉన్నారు. -
ఎల్ఆర్ఎస్తో ఎసరు..!
- హెచ్ఎండీఏ రక్షణలో ఉన్న భూములనే ఎల్ఆర్ఎస్ చేసిన వైనం - విశ్రాంత తహసీల్దార్ల నిర్వాకంతో తెల్లాపూర్‌లో భూములకు ఎసరు - 250 మంది దరఖాస్తు చేసుకుంటే 50 మందికి ఎల్ఆర్ఎస్ క్లియర్ - హెచ్ఎండీఏ అధికారుల పర్యవేక్షణ లోపంతో అక్రమంగా అనుమతులు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) రక్షణలో ఉన్న ప్రభుత్వ భూములకే లేఅవుట్ రెగ్యులరైజేషన్ పథకం(ఎల్ఆర్ఎస్) కింద క్లియరెన్స్ ఇచ్చిన అంశం వివాదాస్పదమవుతోంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ సర్వే నంబర్ 323లోని కోట్ల విలువ చేసే కొన్ని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ మంజూరు చేశారన్న అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2008లోనూ.. అలాగే 2015లోనూ దాదాపు 50 నుంచి 90 మంది తెల్లాపూర్ సర్వే నంబర్ 323లోని ప్లాట్లను క్రమబద్ధీకరించాలంటూ డాక్యుమెంట్లు సమర్పించగా.. ఇందు లో దాదాపు 50 వరకు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ చేసినట్టు తెలిసింది. క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకున్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుడు ఒకరు సదరు భూమిని జేసీబీలతో చదును చేస్తుండగా చూసిన హెచ్ఎండీఏ ల్యాండ్ విభాగం అధికారులు రామచంద్రపురం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తనకు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ ఉం దని అతను పోలీసులు, హెచ్ఎండీఏ అధికారులకు చూపడంతో అధికారులు షాక్ తిన్నా రు. దీంతో అధికారులు ఆరా తీస్తే తెల్లాపూర్ సర్వే నంబర్ 323తో 250 మంది వరకూ ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారని తెలిసింది. కమిషనర్ టి.చిరంజీవులు ఆదేశాల మేరకు క్లియర్ అయిన ఎల్ఆర్ఎస్లను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిసింది. ఎవరు బాధ్యత వహించాలి.. ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం విశ్రాంత తహసీల్దార్లను హెచ్ఎండీఏ నియమించుకుంది. టైటిల్ క్లియరెన్స్‌లో భాగంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు సమర్పించిన భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను వీరు నిశితంగా పరిశీలించి ఓకే చేయాలి. హెచ్ఎండీఏకు వచ్చిన 1.75 లక్షలకు పైగా దరఖాస్తుల్లో సగానికిపైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు షార్ట్‌ఫాల్ పంపిస్తున్నారు. అయితే హెచ్ఎండీఏ రక్షణలోనే ఉన్న సర్వే నంబర్ 323లోని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి టైటిల్ క్లియరెన్స్‌లో అంతా బాగానే ఉందని క్లియర్ చేశారు. టెక్నికల్ స్క్రూటినీలో హెచ్ఎండీఏ అధికారులు ఆ భూమి మాస్టర్ ప్లాన్‌లో రోడ్డులో వస్తుంది, ల్యాండ్ యూజ్ సమస్యలు ఉన్నాయా.. వాటర్ బాడీస్ కింద వస్తుందా అని చెక్ చేసి అంతా బాగుందనుకుని ఇక్కడా క్లియర్ చేసి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలంటూ ఎస్ఎంఎస్ పంపించారు. దీంతో వారు వచ్చి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ తీసుకున్నారు. ‘టైటిల్ క్లియరెన్స్ చేసేటప్పుడే అధికారులు జాగ్రత్తగా గమనించి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. రెవెన్యూ అధికారులను సమన్వయం చేసి భూమి పత్రాలున్న ఆ సర్వే నంబర్ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ తప్పిదం జరిగి ఉండేది కాదు’అని హెచ్ఎండీఏ అధికారులు అంటున్నారు. గతంలోనూ వివాదాస్పదమే.. 1985–88 మధ్యలో ఎంప్లాయ్ హౌసింగ్ కో–ఆపరేటివ్ సొసైటీ పేరుతో వాలా నారాయణరావు ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు కలిపి దాదాపు 380 ఎకరాలు లేఅవుట్ చేసి అమ్మారు. బీహెచ్ఈఎల్కు సమీపంలో ఉండే ఈ భూములకు ధర బాగా ఉండటంతో కరీంనగర్, వరం గల్, నల్లగొండలకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ల పేరు మీద అసైన్మెంట్ చేశారు. ఆ తర్వాత ఆ భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించాడు. ఇది వెలుగులోకి రావడంతో 2006లో నారాయణరావును పోలీసులు అరెస్టు చేశారు. తెల్లాపూర్ సర్వే నం.323లోని 224 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ శాఖ హెచ్ఎండీఏకు అప్పగించింది. ఇదే సర్వే నంబర్లో సమర యోధులకు కేటాయించిన 118 ఎకరాల భూమికి రక్షణగా ఉండాలని 2006లో హెచ్ఎండీఏకు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ 380 ఎకరాలు హెచ్ఎండీఏ రక్షణలోనే ఉన్నాయి. కొంతమంది సమరయోధుల నుంచి భూమి కొనుగోలు చేసినట్టుగా డాక్యుమెంట్లు సృష్టించి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేశారు. -
మీరు..కాదు మీరే!
సాక్షి, సిటీబ్యూరో : హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనమవుతోన్న వినాయక విగ్రహ వ్యర్థాల తొలగింపు వ్యవహారం ఎవరికీ పట్టని అంశంగా మారింది. సాగర్‌లో నిమజ్జనమైన విగ్రహాలను వెలికి తీయకపోవడంతో అవి సాగర గర్భంలోకి జారిపోతూ జలాశయాన్ని మరింత కలుషితం చేస్తున్నాయి. చవితినాడు మంటపాల్లో కొలువుదీరి పూజలందుకొన్న గణనాథుని మూడోరోజు నుంచే హుస్సేన్‌సాగర్‌లో జలప్రవేశం చేయించడం పరిపాటి. నిమజ్జనమైన విగ్రహాలు నీటి లోతుల్లోకి జారిపోకుండా ఏరోజుకారోజు వెలికితీసి బయటకు తరలిస్తుంటారు. ఏటా ఈ క్రతువును హెచ్ఎండీఏ నిర్వహించేది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా నిమజ్జన వ్యర్థాల తొలగింపు కోసం ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకొని రూ.22 లక్ష ల వ్యయ అంచనాలతో టెండర్లు కూడా ఆహ్వానించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకొంది. ఈ నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలపై ఇటీవల హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వద్ద జరిగిన సమావేశంలో నిమజ్జన వ్యవహారంపై చర్చించారు. సాగర్‌లో నిమజ్జనమయ్యే వినాయక విగ్రహ వ్యర్థాలను బయటకు తరలించే బాధ్యతను ఈసారి తామే నిర్వహిస్తామంటూ జీహెచ్ఎంసీ అధికారులు హామీ ఇచ్చారు. దీంతో హెచ్ఎండీఏ అధికారులు నిమజ్జన వ్యర్థాల తొలగింపు వ్యవహారం నుంచి పక్కకు తప్పుకొన్నారు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో ఇప్పటికే పిలిచిన టెండర్‌ను సైతం హెచ్ఎండీఏ అధికారులు పక్కకు పెట్టేశారు. మూడోరోజైన శనివారం నుంచే వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం మొదలైంది. ఎన్టీఆర్ మార్గ్ వైపు 3 భారీ క్రేన్లు ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. అయితే.... వీటి తాలూకు వ్యర్థాలను ఆదివారం నుంచే తొలగించాల్సి ఉండగా అటు జీహెచ్ఎంసీ కానీ, ఇటు హెచ్ఎండీఏ అధికారులుగానీ పట్టించుకోకపోవడంతో గణేష్ ప్రతిమలు నీటిలో మునిగిపోతున్నాయి. ఏరోజుకారోజు నిమజ్జన వ్యర్థాలను తొలగించకపోవడంతో వాటికి వినియోగించిన విష రసాయనాలు నీటిలో కరిగిపోయి సాగర్‌ను కాలుష్య కాసారంగా మార్చేస్తున్నాయంటూ పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎడ మొహం... పెడ మొహం : హైదరాబాద్ నగరాన్ని అందంగా తీర్చిదిద్ది పౌర వసతులు కల్పించాల్సిన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు పరస్పర అవగాహనా రాహిత్యంతో సమస్యలు సృష్టించుకొంటున్నాయి. ప్రజలకు ప్రాథమిక వసతులు, సౌకర్యాలు కల్పించాల్సిన రెండు ప్రధాన ప్రభుత్వ విభాగాల మధ్య సఖ్యత కొరవడటం హుస్సేన్‌సాగర్‌కు శాపంగా మారింది. అధికార పరిధులు, పరిమితులు, అనుమతుల విషయంలో నువ్వా... నేనా... అంటూ తలపడుతున్న ఈ రెండు విభాగాలు ఇప్పుడు గణేశ్ నిమజ్జన సందర్భాన్ని ఓ వేదికగా మార్చుకొన్నాయి. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు లేవంటూ హెచ్ఎండీఏ భావిస్తుండగా, ఏటా జరుగుతున్న ప్రకారమే సాగర్ శుద్ధి ప్రక్రియ సాగుతుందని జీహెచ్ఎంసీ అధికారులు ఎవరికి వారు భీష్మించుకు కూర్చున్నారు. ఇలాంటి తరుణంలో పరస్పరం సహకరించుకోవాల్సిన జీహెచ్ఎంసీ - హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు ఎడ మొహం... పెడ మొహంగా ఉంటున్నారు. అయితే... హెచ్ఎండీఏ మాత్రం ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకుండా సాగర్ శుద్ధి విషయంలో జోక్యం చేసుకోరాదనుకొంటోంది. కానీ ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే రంగంలోకి దిగేందుకు అందరూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ శాలినీ మిశ్రా అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. నిమజ్జన వ్యర్థాలను కవాడీగూడలోని డంపింగ్ యార్డ్‌కు తరలించేందుకు జీహెచ్ఎంసీ అంగీకరించట్లేదని, ఫలితంగానే ఈ వ్యవహారం గందరగోళంగా మారిందని తెలుస్తోంది. -
మహా నగరి... ఐటీఐఆర్‌పై గురి!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)గా ఆవిష్కరించే ప్రక్రియ జోరందుకుంది. నగర శివారులో సుమారు 202 చ.కి.మీ. పరిధిలో ‘ఐటీఐఆర్ మాస్టర్ ప్లాన్’ను రూపొందించేందుకు 6 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతున్నాయి. వీటిలో ప్రధానంగా ఫీడ్ బ్యాక్ ఇన్ఫ్రా లిమిటెడ్, ఆర్వీ అసోసియేట్స్, లీ అసోసియేట్స్, ఎ.ఇ. కాన్ లిమిటెడ్, బీడీఎస్, యాట్కిన్స్ సంస్థలు ఉన్నాయి. ‘ఐటీఐఆర్ మాస్టర్‌ప్లాన్’ రూపకల్పనకు కన్సల్టెంట్‌ను నియమించేందుకు ఇటీవల హెచ్ఎండీఏ టెండర్లు పిలవగా.. 6 సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. ప్రస్తుతం వీటిని పరిశీలిస్తున్నారు. ఇందులో అర్హత సాధించిన సంస్థల సమక్షంలోనే ఫైనాన్షియల్ బిడ్స్ తెరవాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు. ఎవరు తక్కువ మొత్తానికి (ఎల్-1) కోట్ చేస్తే... ఆ సంస్థకు అవకాశం ఉంటుంది. అర్హత గల ఎల్-1, ఎల్-2 సంస్థల జాబితాను హెచ్ఎండీఏ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి...ఆయన అనుమతించాక సచివాలయంలోని ృన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ఐటీసీ) విభాగానికి పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. అటునుంచి అనుమతి వచ్చాకఎల్-1 సంస్థను ఖరారు చేస్తామని తెలిపారు. ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాక 6 నెలల వ్యవధిలో ఐటీఐఆర్ మాస్టర్‌ప్లాన్ ముసాయిదాను హెచ్ఎండీఏకు అందజేయాల్సి ఉంటుందని అంటున్నారు. సమగ్ర అధ్యయనం... మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు ఎంపికైన సంస్థ హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ అభివృద్ధిపై సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రపంచంలో అత్యుత్తమమైన ఐటీ సంస్థలు ఏవి? వాటిని హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు ఏమేరకు అవకాశం ఉంది? ఏయే సంస్థలకు అనుమతి ఇవ్వవచ్చనే ది కన్సల్టెన్సీ సంస్థ సూచించవచ్చు. కొత్తగా ఏయే సంస్థలు వచ్చే అవకాశం ఉంది? వాటికి ఇక్కడ ఎంత భూమి అందుబాటులో ఉంది? ఇప్పటికే ఉన్న వాటిని విస్తరించేందుకు గల అవకాశాలు? వంటి అంశాలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నగరం చుట్టూ 202 చ.కి.మీ. పరిధిలో ప్రస్తుతం ఏయే మాస్టర్ ప్లాన్లు అమలులో ఉన్నాయి? ప్రభుత్వ భూమి ఎంత ఉంది? అనే విషయమై ఆసంస్థ క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక రూపొందించాల్సి ఉంది. ఐటీ విప్లవం ఐటీఐఆర్ తొలి దశ (2018)లో రూ.800 కోట్లు రాబట్టుకోవడం ద్వారా హైదరాబాద్‌లో ఐటీ విప్లవాన్ని తేవాలని సీఎం కేసీఆర్ ‘విశ్వ’ ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్లో ప్రస్తుతం అమల్లో ఉన్న హుడా, హడా, సీడీఏ, తదితర మాస్టర్ప్లాన్లకు అవసరమైన మార్పులు చేసి, ఐటీఐఆర్‌కు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని హెచ్ఎండీఏ అధికారులను సీఎం ఆదేశించారు. ఆ తరువాత దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు తీసుకొని వాటిని కమిటీ ముందు పెట్టి... అవసరమైతే మార్పులు, చేర్పులు చేసి అంతిమంగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని సూచించారు. నిర్ణీత సమయంలోగా అంటే 2016 నాటికి దీన్ని అమలులోకితేవాలని అధికారులకు లక్ష్యంగా నిర్దేశించారు. -
ఓఆర్ఆర్కు గ్రహణం
ఘట్కేసర్-పెద్ద అంబర్పేట్ * మధ్య ప్రారంభం కాని ఔటర్ రింగ్ రోడ్డు పనులు * పూర్తయి నెలన్నర దాటిన వైనం * రోడ్డు ప్రారంభించాలని వాహనదారుల వేడుకోలు * మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు ఘట్కేసర్: ఔటర్ రింగ్ రోడ్డు ప్రారంభానికి నోచుకోవడం లేదు. పెద్ద అంబర్పేట్-ఘట్కేసర్ మధ్య ‘ఔటర్’ పనులు పూర్తయి నెలన్నర కావస్తున్నా రోడ్డు ప్రారంభానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్ద అంబర్పేట్- ఘట్కేసర్ మధ్య ఉన్న 20 కిలోమీటర్ల దూరం రహదారికి ఆగస్టులోనే తుదిమెరుగులు కూడా దిద్దారు. జంతువులు ప్రవేశించకుండా కంచె, సిగ్నల్స్, సూచికలు ఏర్పాటు చేశారు. గత ఆగస్టు చివరి వారంలోనే ఈ రోడ్డును ప్రారంభించనున్నట్లు హెచ్‌ఎండీఎం అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత రోడ్డు ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వాహనదారులకు షాకినిచ్చారు. వాహనదారుల పాట్లు.. పెద్ద అంబర్పేట్-ఘట్కేసర్ల మధ్య ఔటర్ రింగ్ రోడ్డును ప్రారంభిస్తే వాహనదారులకు తీవ్ర వ్యయప్రయాసాలు తప్పనున్నాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారికి, వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారికి మధ్య దూరంతోపాటు సుమారు 45 నిమిషాల ప్రయాణ సమయం తగ్గుతుంది. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఉన్న లింగాపూర్, కొర్రెముల, బాచారం, హయాత్‌నగర్ గ్రామాలకు నేరుగా వెళ్లే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం వాహనదారులు ఘట్కేసర్ నుంచి పెద్ద అంబర్‌పేటకు వెళ్లాలంటే ప్రయాణికులు మొదటగా ఉప్పల్‌కు చేరుకొని అక్కడినుంచి ఎల్బీనగర్ మీదుగా గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. దీంతో ఇక్కడ దూర భారంతోపాటు ట్రాఫిక్ రద్దీతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదే ఘట్కేసర్-పెద్ద అంబర్పేట్ రోడ్డు అందుబాటులోకి వస్తే ఈ వ్యయప్రయాసాలు లేకుండా నేరుగా చేరుకోవచ్చు. ఔటర్ రింగు రోడ్డు వెంట ఉన్న గ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్నిసార్లు తెలియక వాహనదారులు ఔటర్ దారి ఎక్కి ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటీవల ఒక బైకిస్టు ఔటర్ రోడ్డుకు అడ్డంగా ఉన్న మట్టిదిబ్బను బైక్ ఎక్కించబోయి ప్రమాదానికి గురై మృతిచెందాడు. గతంలో రాష్ట్ర సీఎం చేతుల మీదుగా రోడ్డు ప్రారంభానికి అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రయత్నాలు చేశారు. చివర్లో ఇక్కడి నుంచి ఆయన బదలీపై వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో ఇన్చార్జిగా రమేష్ చంద్ర బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో కూడా రోడ్డును ప్రారంభించకుంటే నేరుగా వెళ్లి రమేష్ చంద్రను కలుసుకోవాలని స్థానికులు యోచిస్తున్నారు. -
‘కోకాపేట్’ కేసు మళ్లీ వాయిదా
బెంచ్‌కి రాకుండానే నవంబర్ 11కు విచారణ సిటీబ్యూరో : కోకాపేట భూముల వేలం వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు. సుప్రీం కోర్టులో మంగళవారం బెంచ్‌పైకి రావాల్సిన ఈ కేసు నవంబర్ 11కు వాయిదా పడినట్లు హెచ్ఎండీఏ అధికారులు స్పష్టం చేశారు. సుధీర్ఘకాలంగా నడుస్తున్న ఈ కేసు మంగళవారం బెంచ్‌పైకి వస్తే అటో ఇటో తేలిపోతుందని అధికారులు ఉత్కంఠ తతో ఎదురు చూశారు. అయితే...అనూహ్యంగా వాయిదాపడడంతో ఉసూరుమంటున్నారు. అసలే పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన హెచ్ఎండీఏ ఎలాగైనా ఈ కేసులో గెలిస్తే రూ.1500 కోట్లు అదనపు ఆదాయం ఖజానాకు వస్తుందని కొండంత ఆశతో ఉంది. ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వస్తే మాత్రం వెయ్యి కోట్లు చెల్లించక తప్పదేమోనని ఉత్కంఠకు గురవుతోంది. కాగా కోకాపేట భూముల వేలం కేసులో తమ వాదనలను బలంగా విన్పించేందుకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్, సొలిసిటర్ జనరల్, పలువురు సుప్రీం న్యాయవాదులతో హెచ్ఎండీఏ సర్వసన్నద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హెచ్ఎండీఏ అధికారులు సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసుకున్నారు. 26న టైటిల్ కేసు... కోకాపేటలో 1650 ఎకరాల భూమికి సంబంధించిన టైటిల్ కేసు కూడా నవంబర్ 26న బెంచ్ పైకి రానుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. కోకాపేటలోని 1650 ఎకరాల భూమి ప్రభుత్వానిది కాదనీ, మహ్మద్ నస్రత్ జంగ్ బహద్దూర్-1 వారసులదనీ, వారి ప్రతినిధిని తానంటూ గతంలో కె.ఎస్.బి.అలీ కోర్టులో రిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదోపవాదనల అనంతరం ఆ భూమి ప్రభుత్వానిదేనంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ 2012 జులైలో తీర్పునిచ్చింది. ఆ తీర్పును ఛాలెంజ్ చేస్తూ కె.ఎస్.బి.అలీ సుప్రీం కోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేయడంతో సుప్రీం కోర్టు స్టేటస్ కోను కొనసాగించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై హెచ్ఎండీఏ కౌంటర్ దాఖలు చేయడంతో పాటు వెకేషన్ పిటిషన్ కూడా వేసింది.