సాక్షి, హైదరాబాద్: ఒకేవైపు చూస్తూ భోజనం చేయడం బోర్... చుట్టూ అన్ని వైపుల ప్రదేశాలను చూస్తూ తింటే అదో కిక్కు. అదీ 60 మీటర్ల ఎత్తున. అదే రివాల్వింగ్ రెస్టారెంట్ అంటే. అంతేనా.. భోజనంతో పాటు అందించే మద్యం మరింత కిక్కునిస్తుంది. అంతేనా.. రోజంతా నీళ్లలోనే సేదతీరేలా హౌస్ బోటింగ్‌లు.. రంగు రంగుల పక్షుల కిలకిలారావాలు. కేబుల్ కార్లు, రాక్ క్లైంబింగ్, జిప్‌లైన్, గోల్ఫ్ కోర్టులు, స్విమ్మింగ్ ఫూల్ ఇలా ఎన్నో ఎన్నెన్నో అన్ని ఒకేచోట నగరవాసులకు అందుబాటులోకి రానున్నాయి. నిత్యం సమయంతో పాటు పరిగెత్తే సిటిజనులకు ఉల్లాసాన్ని పంచనున్నాయి. దీనికి హైదరాబాద్‌లోని గండిపేట చెరువు వేదిక కానుంది. 2020 నాటికి గండిపేట చెరువు ఏర్పడి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పర్యాటకులను ఆకర్షించేందుకు టూరిజం విభాగంతో కలసి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సరికొత్త ప్రణాళికలతో ముందుకెళుతోంది. గండిపేట చెరువు సమీపంలో 60 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయనున్న ఈ ‘స్కై టవర్ రెస్టారెంట్’అటుఇటు కదులుతూ పర్యాటకులకు వినోదాన్ని అందించనుంది. భోజనంతో పాటు మద్యం కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. కేరళ, అహ్మదాబాద్‌లో కదులుతున్న రెస్టారెంట్ల మాదిరిగానే దాదాపు 20 అంతస్తుల్లో నిర్మాణంచేసి ‘ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ జోష్’అందిస్తామని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు.
నీళ్ల మధ్యలోనే సేద తీరేలా హౌస్ బోటింగ్...
గండిపేట చెరువు మధ్యలో పర్యాటకులు పగలు, రాత్రంతా సేద తీరేలా హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక్కడికి వచ్చిన వారు రాత్రంతా నీళ్ల మధ్యలో బోట్‌లోనే ఉండేలా ఇళ్లు (హౌస్ బోటింగ్), కాటేజెస్‌ల్లో కాలక్షేపం చేయడంతో పాటు ఆనందంగా గడిపేలా అన్ని వసతులు సమకూర్చాలని నిర్ణయించింది. దాదాపు 10 కిలోమీటర్ల వరకు నీళ్ల పైభాగంలో రోపింగ్ వే మాదిరిగానే కేబుల్ కారును ఏర్పాటుచేసి పర్యాటకులు ఒకచోట నుంచి మరోచోటికి ప్రయాణిస్తూ థ్రిల్‌గా ఫీలయ్యేలా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయనుంది. ప్రతిపాదిత 47 కిలోమీటర్లలో తొలుత 25 కిలోమీటర్లలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ గండిపేట చెరువు అభివృద్ధి పనులకు త్వరలోనే మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పక్షులతో హాయిగా గడిపేలా...
జనావాసాలతో పాటు అడవుల్లో చక్కర్లు కొట్టే పక్షులు కూడా గండిపేటలో ఆకర్షణగా ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దాదాపు కిలోమీటర్ మేర ఏర్పాటుచేసే ఫెన్సింగ్‌లో విభిన్న జాతుల పక్షుల మధ్యలో నుంచి పర్యాటకులు నడుచుకుంటూ వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నారు. పిల్లాపాపలతో వచ్చే కుటుంబసభ్యులకు ఈ పక్షులతో కాలక్షేపం హాయినిస్తుందని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఇవేకాకుండా ప్రతి 5 కిలోమీటర్లకు ఒక రిక్రియేషనల్ సెంటర్ ఉండేలా మెరుగులు దిద్దనున్నారు. వారాంతాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం శివారు ప్రాంతాలకు వెళ్లే నగరవాసులు జాగింగ్, స్కేటింగ్, సైక్లింగ్, బురదలో పరిగెత్తేలా ఏర్పాట్లు, గుట్టలు చకచక ఎక్కేలా రాక్ క్లైంబింగ్, నడుంకు తాడుకట్టుకొని రోప్‌వే సాయంతో ముందుకెళ్లేలా జిప్‌లైన్, అవుట్‌డోర్ జిమ్, గోల్ఫ్ కోర్టులు, స్విమ్మింగ్ ఫూల్ తదితర సౌకర్యాలు ఏర్పాటుచేయడంపై హెచ్‌ఎండీఏ అధికారులు దృష్టి సారించారు. అవసరమైతే డ్రోన్ కెమెరాలతో సర్వే చేసి గండిపేట అభివృద్ధికి తుదిరూపు ఇవ్వనున్నారు.
అహ్మదాబాద్‌లోని పతంగ్ రివాల్వింగ్ రెస్టారెంట్
Comments
Please login to add a commentAdd a comment