బెంచ్‌కి రాకుండానే నవంబర్ 11కు విచారణ
సిటీబ్యూరో : కోకాపేట భూముల వేలం వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు. సుప్రీం కోర్టులో మంగళవారం బెంచ్‌పైకి రావాల్సిన ఈ కేసు నవంబర్ 11కు వాయిదా పడినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు స్పష్టం చేశారు. సుధీర్ఘకాలంగా నడుస్తున్న ఈ కేసు మంగళవారం బెంచ్‌పైకి వస్తే అటో ఇటో తేలిపోతుందని అధికారులు ఉత్కంఠ తతో ఎదురు చూశారు. అయితే...అనూహ్యంగా వాయిదాపడడంతో ఉసూరుమంటున్నారు. అసలే పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన హెచ్‌ఎండీఏ ఎలాగైనా ఈ కేసులో గెలిస్తే రూ.1500 కోట్లు అదనపు ఆదాయం ఖజానాకు వస్తుందని కొండంత ఆశతో ఉంది. ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వస్తే మాత్రం వెయ్యి కోట్లు చెల్లించక తప్పదేమోనని ఉత్కంఠకు గురవుతోంది. కాగా కోకాపేట భూముల వేలం కేసులో తమ వాదనలను బలంగా విన్పించేందుకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్, సొలిసిటర్ జనరల్, పలువురు సుప్రీం న్యాయవాదులతో హెచ్‌ఎండీఏ సర్వసన్నద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హెచ్‌ఎండీఏ అధికారులు సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసుకున్నారు.
26న టైటిల్ కేసు...
కోకాపేటలో 1650 ఎకరాల భూమికి సంబంధించిన టైటిల్ కేసు కూడా నవంబర్ 26న బెంచ్ పైకి రానుందని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. కోకాపేటలోని 1650 ఎకరాల భూమి ప్రభుత్వానిది కాదనీ, మహ్మద్ నస్రత్ జంగ్ బహద్దూర్-1 వారసులదనీ, వారి ప్రతినిధిని తానంటూ గతంలో కె.ఎస్.బి.అలీ కోర్టులో రిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదోపవాదనల అనంతరం ఆ భూమి ప్రభుత్వానిదేనంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ 2012 జులైలో తీర్పునిచ్చింది. ఆ తీర్పును ఛాలెంజ్ చేస్తూ కె.ఎస్.బి.అలీ సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పి ఫైల్ చేయడంతో సుప్రీం కోర్టు స్టేటస్ కోను కొనసాగించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై హెచ్‌ఎండీఏ కౌంటర్ దాఖలు చేయడంతో పాటు వెకేషన్ పిటిషన్ కూడా వేసింది.
‘కోకాపేట్’ కేసు మళ్లీ వాయిదా
Published Wed, Oct 29 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM
Advertisement