Kokapeta land auction affair
-
వెయ్యి కోట్ల కుంభకోణం
సాక్షి, న్యూఢిల్లీ: కోకాపేట్ భూముల వ్యవహారం సీబీఐ ముందుకు చేరింది. కోకాపేట్, ఖానామెట్ భూముల విక్రయం ద్వారా రూ.వెయ్యి కోట్ల కుంభ కోణం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీబీఐ డైరెక్టర్‌ను కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. ఐదు పేజీల ఫిర్యాదు లేఖను సీబీఐ డైరెక్టర్‌కు అందించారు. అనంతరం నార్త్‌బ్లాక్ వద్ద రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, భూముల అమ్మకాల పేరుతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన అనుయాయులకు, పార్టీ నేత లకు చవక ధరలకే విలువైన భూముల్ని కట్టబెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలోనే అత్యంత విలువైన భూములున్న కోకాపేట్లో ఎకరం భూమిని రూ. 25 కోట్లకు అమ్మారని, అంతకన్నా తక్కువ రేట్లున్న పుప్పాలగూడ, ఖానామెట్‌లో మాత్రం ఎకరం భూమిని రూ.40 కోట్లకు అమ్మారన్నారు. పుప్పాల్‌గూడకు చెందిన 125 ఎకరాల భూకుంభకోణం వివరాలను త్వరలో బయటపెడతానని చెప్పారు. ప్రైవేట్ బిల్డర్లకు లాభం భూముల వేలం వ్యవహారంలో ఎంఎస్టీసీ క్రియాశీల సహకారంతో సిండికేట్ ఏర్పడినందున, వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.2,500 కోట్లు మాత్రమే వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. రివర్స్ టెండరింగ్, స్విస్ చాలెంజ్ పద్ధతి వంటి పారదర్శక వేలం విధానాన్ని చేపట్టి ఉంటే కచ్చితమైన విలువ తెలిసి ఉండేదన్నారు. ఎంఎస్టీసీ ప్రోద్బలంతో ప్రభుత్వ ఉద్యోగులు ఖజానాకు నష్టాన్ని కలిగించి, ముఖ్యమంత్రి సన్నిహితులైన ప్రైవేట్ బిల్డర్లకు లాభాన్ని చేకూర్చారని ఆరోపించారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఐటీ, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు జయేష్ రంజన్, అరవింద్ కుమార్ నిబంధనలను ఉల్లంఘించి, కేసీఆర్ చెప్పినవారికే వేలంలో భూములు వచ్చేలా కుట్ర చేశారని ఆరోపించారు. మధ్యవర్తిగా వేలంలో పాల్గొన్న ఎంఎస్టీసీ నియోపోలిస్, కోకాపేట్, గోల్డెన్ మైల్ బిడ్డర్ల పేర్లను బహిర్గతపరచలేదన్నారు. ప్రధానికి ఫిర్యాదు చేస్తా.. భూకుంభకోణంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డిల కుటుంబ సభ్యులు, మైహోం సంస్థకు చెందిన వారు ఉన్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇదే వ్యవహారంపై త్వరలో ప్రధాని, కేంద్ర హోం మంత్రులను కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగిన అవినీతిపై ఏదైనా కోర్టు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉంటే తప్ప విచారణకు ఆదేశించే అవకాశం సీబీఐకి చాలా తక్కువగా ఉంటుందని డైరెక్టర్ చెప్పారన్నారు. కానీ, ఐఏఎస్, ఐపీఎస్‌లు అవినీతికి పాల్పడితే నేరుగా సీబీఐ విచారణ చేపట్టవచ్చన్న విçషయాన్ని డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు రేవంత్ తెలిపారు. అడిగిన 24 గంటల్లోనే కేసీఆర్‌కు అపాయింట్మెంట్ దొరికినప్పుడు, కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలకు ప్రధాని అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి లేదా అని ప్రశ్నించారు. -
‘కోకాపేట డబ్బులు’ ఎస్క్రో ఖాతాలో ఉంచేలా ఆదేశిస్తాం
సాక్షి, హైదరాబాద్: జీవో 111 పరిధికి సంబంధించి హైపవర్ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు మరో రెండు నెలల సమయం ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు నెలలు కాదు రెండేళ్లయినా సమయం ఇస్తామని, అయితే నివేదిక ఇచ్చేవరకూ ఇటీవలి కోకాపేట భూముల వేలానికి సంబం ధించిన డబ్బును ఎస్క్రో (మూడవ పార్టీ) బ్యాంకు ఖాతాలో ఉంచేలా ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. అలాగే వేలం వేసిన భూముల్లో మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ), ఇతర మౌలిక వసతులు కల్పించే వరకూ, అలాగే హైపవర్ కమిటీ నివేదిక సమర్పించే వరకు ఈ డబ్బును ము ట్టడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఆ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని కూడా పే ర్కొంది. ఈ అంశాలపై ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్రావును ఆదేశించింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లకు సమీపంలోని 84 గ్రామాల్లో భారీ నిర్మా ణాలు చేపట్టకూడదని జీవో 111 స్పష్టం చేస్తోంది. ఈ జీవో నుంచి వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. సీఎం అలా చెప్పలేదు... ‘జీవో 111ను ఉపసంహరించుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మీడియాకు చెప్పలేదు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ విషయాన్ని రాయకుండా మీడియా ఇతర విషయాలను ప్రస్తావించింది. వీలైనంత త్వరగా కమిటీ నివేదిక సమర్పి స్తుంది. మరో రెండు నెలలు ఆగితే కమిటీ నివేదిక వస్తుంది. అప్పటివరకు సమయం ఇవ్వండి’అని ధర్మాసనాన్ని ఏఏజీ అభ్యర్థించారు. 2 నెలల్లో ఇస్తామంటే ఎలా నమ్మాలి? ‘జీవో 111 పరిధిని నిర్ణయించాలంటూ 2006లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ రీసర్చ్ అండ్ ట్రై నింగ్ సెంటర్ (ఈపీటీఆర్ఐ)ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లు క్యాచ్మెంట్ ఏరియాలో లేవని, వాటిని జీవో 111 పరిధి నుంచి తొలగించవచ్చని ఈపీటీఆర్ఐ నివేదిక ఇచ్చింది. అయితే జీవో 111 పరిధిపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2016లో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇచ్చిన జీవోలో 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ కమిటీ నివేదిక ఇవ్వలేదు. పనిచేయని ఇటువంటి కమిటీలను వెంటనే రద్దు చేయాలి. ఇన్నేళ్లు పట్టనట్లుగా వ్యవహరించి ఇప్పుడు రెండు నెలల్లో నివేదిక ఇస్తామంటే ఎలా నమ్మాలి?..’అని ధర్మాసనం నిలదీసింది. తమ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతిస్తే రెండు నెలల సమయం ఇవ్వడానికి అభ్యంతరం లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం చెప్పేందుకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని ఏఏజీ అభ్యర్థించగా.. నిరాకరిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
‘కోకాపేట’ వేలంలో ఎంతమంది పాల్గొన్నారు?
సాక్షి, హైదరాబాద్: జీవో 111 పరిధి నిర్ధారణకు సంబంధించిన హైపవర్ కమిటీ సమావేశాలకు సంబంధించిన మినిట్స్, నోట్‌ఫైల్స్‌ను విచారణకు కొన్ని గంటల ముందే సమర్పించడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణకు కొన్ని గంటల ముందు రెండు బండిళ్ల సమాచారం రిజిస్ట్రీలో వేస్తే తామెలా పరిశీలిస్తామంటూ ప్రశ్నించింది. విచారణకు కనీసం ఒక రోజు ముందు సమాచారం అందజేస్తే పరిశీలించడానికి వీలుంటుందని స్పష్టం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోకాపేటలో ఇటీవల ప్రభుత్వ భూములను ఎన్ని భాగాలుగా వేలం వేశారు? ఈ వేలంలో ఎంతమంది పాల్గొన్నారో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం వట్టినాగులపల్లిలో క్యాచ్మెంట్ ఏరియా వెలుపల ఎన్ని ఎకరాల భూమి ఉందో చెప్పాలని సూచించింది. ఈ వ్యవహారంపై పూర్తి అవగాహన, సమాచారం ఉన్న అధికారులు ఆయా ప్రభుత్వ న్యాయవాదుల కార్యాలయాల్లో ప్రత్యక్షంగా అందుబాటులో ఉండాలని, తాము అడిగే సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. జీవో 111 పరిధి నుంచి వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లను తొలగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. హైపవర్ కమిటీ సమావేశానికి సంబంధించిన మినిట్స్, నోట్‌ఫైల్స్‌ను సమర్పించామని హెచ్ఎండీఏ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి నివేదించారు. ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం ఉదయం సమర్పించామని తెలిపారు. వట్టినాగులపల్లిలో క్యాచ్మెంట్ వెలుపల ఎన్ని ఎకరాల భూమి ఉందని అదనపు ఏజీ రామచందర్రావును ధర్మాసనం ప్రశ్నించగా, రికార్డులు పరిశీలించి చెబుతామన్నారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
‘కోకాపేట్’ కేసు మళ్లీ వాయిదా
బెంచ్‌కి రాకుండానే నవంబర్ 11కు విచారణ సిటీబ్యూరో : కోకాపేట భూముల వేలం వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు. సుప్రీం కోర్టులో మంగళవారం బెంచ్‌పైకి రావాల్సిన ఈ కేసు నవంబర్ 11కు వాయిదా పడినట్లు హెచ్ఎండీఏ అధికారులు స్పష్టం చేశారు. సుధీర్ఘకాలంగా నడుస్తున్న ఈ కేసు మంగళవారం బెంచ్‌పైకి వస్తే అటో ఇటో తేలిపోతుందని అధికారులు ఉత్కంఠ తతో ఎదురు చూశారు. అయితే...అనూహ్యంగా వాయిదాపడడంతో ఉసూరుమంటున్నారు. అసలే పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన హెచ్ఎండీఏ ఎలాగైనా ఈ కేసులో గెలిస్తే రూ.1500 కోట్లు అదనపు ఆదాయం ఖజానాకు వస్తుందని కొండంత ఆశతో ఉంది. ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వస్తే మాత్రం వెయ్యి కోట్లు చెల్లించక తప్పదేమోనని ఉత్కంఠకు గురవుతోంది. కాగా కోకాపేట భూముల వేలం కేసులో తమ వాదనలను బలంగా విన్పించేందుకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్, సొలిసిటర్ జనరల్, పలువురు సుప్రీం న్యాయవాదులతో హెచ్ఎండీఏ సర్వసన్నద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హెచ్ఎండీఏ అధికారులు సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసుకున్నారు. 26న టైటిల్ కేసు... కోకాపేటలో 1650 ఎకరాల భూమికి సంబంధించిన టైటిల్ కేసు కూడా నవంబర్ 26న బెంచ్ పైకి రానుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. కోకాపేటలోని 1650 ఎకరాల భూమి ప్రభుత్వానిది కాదనీ, మహ్మద్ నస్రత్ జంగ్ బహద్దూర్-1 వారసులదనీ, వారి ప్రతినిధిని తానంటూ గతంలో కె.ఎస్.బి.అలీ కోర్టులో రిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదోపవాదనల అనంతరం ఆ భూమి ప్రభుత్వానిదేనంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ 2012 జులైలో తీర్పునిచ్చింది. ఆ తీర్పును ఛాలెంజ్ చేస్తూ కె.ఎస్.బి.అలీ సుప్రీం కోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేయడంతో సుప్రీం కోర్టు స్టేటస్ కోను కొనసాగించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై హెచ్ఎండీఏ కౌంటర్ దాఖలు చేయడంతో పాటు వెకేషన్ పిటిషన్ కూడా వేసింది.