ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కోకాపేట్ భూముల వ్యవహారం సీబీఐ ముందుకు చేరింది. కోకాపేట్, ఖానామెట్ భూముల విక్రయం ద్వారా రూ.వెయ్యి కోట్ల కుంభ కోణం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీబీఐ డైరెక్టర్‌ను కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. ఐదు పేజీల ఫిర్యాదు లేఖను సీబీఐ డైరెక్టర్‌కు అందించారు. అనంతరం నార్త్‌బ్లాక్ వద్ద రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, భూముల అమ్మకాల పేరుతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన అనుయాయులకు, పార్టీ నేత లకు చవక ధరలకే విలువైన భూముల్ని కట్టబెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలోనే అత్యంత విలువైన భూములున్న కోకాపేట్‌లో ఎకరం భూమిని రూ. 25 కోట్లకు అమ్మారని, అంతకన్నా తక్కువ రేట్లున్న పుప్పాలగూడ, ఖానామెట్‌లో మాత్రం ఎకరం భూమిని రూ.40 కోట్లకు అమ్మారన్నారు. పుప్పాల్‌గూడకు చెందిన 125 ఎకరాల భూకుంభకోణం వివరాలను త్వరలో బయటపెడతానని చెప్పారు.
ప్రైవేట్ బిల్డర్లకు లాభం
భూముల వేలం వ్యవహారంలో ఎంఎస్‌టీసీ క్రియాశీల సహకారంతో సిండికేట్ ఏర్పడినందున, వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.2,500 కోట్లు మాత్రమే వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. రివర్స్ టెండరింగ్, స్విస్ చాలెంజ్ పద్ధతి వంటి పారదర్శక వేలం విధానాన్ని చేపట్టి ఉంటే కచ్చితమైన విలువ తెలిసి ఉండేదన్నారు. ఎంఎస్‌టీసీ ప్రోద్బలంతో ప్రభుత్వ ఉద్యోగులు ఖజానాకు నష్టాన్ని కలిగించి, ముఖ్యమంత్రి సన్నిహితులైన ప్రైవేట్ బిల్డర్లకు లాభాన్ని చేకూర్చారని ఆరోపించారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఐటీ, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు జయేష్ రంజన్, అరవింద్ కుమార్ నిబంధనలను ఉల్లంఘించి, కేసీఆర్ చెప్పినవారికే వేలంలో భూములు వచ్చేలా కుట్ర చేశారని ఆరోపించారు. మధ్యవర్తిగా వేలంలో పాల్గొన్న ఎంఎస్‌టీసీ నియోపోలిస్, కోకాపేట్, గోల్డెన్ మైల్ బిడ్డర్ల పేర్లను బహిర్గతపరచలేదన్నారు.
ప్రధానికి ఫిర్యాదు చేస్తా..
భూకుంభకోణంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డిల కుటుంబ సభ్యులు, మైహోం సంస్థకు చెందిన వారు ఉన్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇదే వ్యవహారంపై త్వరలో ప్రధాని, కేంద్ర హోం మంత్రులను కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగిన అవినీతిపై ఏదైనా కోర్టు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉంటే తప్ప విచారణకు ఆదేశించే అవకాశం సీబీఐకి చాలా తక్కువగా ఉంటుందని డైరెక్టర్ చెప్పారన్నారు. కానీ, ఐఏఎస్, ఐపీఎస్‌లు అవినీతికి పాల్పడితే నేరుగా సీబీఐ విచారణ చేపట్టవచ్చన్న విçషయాన్ని డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు రేవంత్ తెలిపారు. అడిగిన 24 గంటల్లోనే కేసీఆర్‌కు అపాయింట్‌మెంట్ దొరికినప్పుడు, కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలకు ప్రధాని అపాయింట్‌మెంట్ దొరికే పరిస్థితి లేదా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment