సాక్షి, హైదరాబాద్: జీవో 111 పరిధి నిర్ధారణకు సంబంధించిన హైపవర్ కమిటీ సమావేశాలకు సంబంధించిన మినిట్స్, నోట్‌ఫైల్స్‌ను విచారణకు కొన్ని గంటల ముందే సమర్పించడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణకు కొన్ని గంటల ముందు రెండు బండిళ్ల సమాచారం రిజిస్ట్రీలో వేస్తే తామెలా పరిశీలిస్తామంటూ ప్రశ్నించింది. విచారణకు కనీసం ఒక రోజు ముందు సమాచారం అందజేస్తే పరిశీలించడానికి వీలుంటుందని స్పష్టం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోకాపేటలో ఇటీవల ప్రభుత్వ భూములను ఎన్ని భాగాలుగా వేలం వేశారు? ఈ వేలంలో ఎంతమంది పాల్గొన్నారో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం వట్టినాగులపల్లిలో క్యాచ్‌మెంట్ ఏరియా వెలుపల ఎన్ని ఎకరాల భూమి ఉందో చెప్పాలని సూచించింది. ఈ వ్యవహారంపై పూర్తి అవగాహన, సమాచారం ఉన్న అధికారులు ఆయా ప్రభుత్వ న్యాయవాదుల కార్యాలయాల్లో ప్రత్యక్షంగా అందుబాటులో ఉండాలని, తాము అడిగే సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. జీవో 111 పరిధి నుంచి వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లను తొలగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. హైపవర్ కమిటీ సమావేశానికి సంబంధించిన మినిట్స్, నోట్‌ఫైల్స్‌ను సమర్పించామని హెచ్‌ఎండీఏ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి నివేదించారు. ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం ఉదయం సమర్పించామని తెలిపారు. వట్టినాగులపల్లిలో క్యాచ్‌మెంట్ వెలుపల ఎన్ని ఎకరాల భూమి ఉందని అదనపు ఏజీ రామచందర్‌రావును ధర్మాసనం ప్రశ్నించగా, రికార్డులు పరిశీలించి చెబుతామన్నారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment