
సాక్షి, హైదరాబాద్: జీవో 111 పరిధికి సంబంధించి హైపవర్ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు మరో రెండు నెలల సమయం ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు నెలలు కాదు రెండేళ్లయినా సమయం ఇస్తామని, అయితే నివేదిక ఇచ్చేవరకూ ఇటీవలి కోకాపేట భూముల వేలానికి సంబం ధించిన డబ్బును ఎస్క్రో (మూడవ పార్టీ) బ్యాంకు ఖాతాలో ఉంచేలా ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. అలాగే వేలం వేసిన భూముల్లో మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్‌టీపీ), ఇతర మౌలిక వసతులు కల్పించే వరకూ, అలాగే హైపవర్ కమిటీ నివేదిక సమర్పించే వరకు ఈ డబ్బును ము ట్టడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.
ఆ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని కూడా పే ర్కొంది. ఈ అంశాలపై ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావును ఆదేశించింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లకు సమీపంలోని 84 గ్రామాల్లో భారీ నిర్మా ణాలు చేపట్టకూడదని జీవో 111 స్పష్టం చేస్తోంది. ఈ జీవో నుంచి వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది.
సీఎం అలా చెప్పలేదు...
‘జీవో 111ను ఉపసంహరించుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మీడియాకు చెప్పలేదు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ విషయాన్ని రాయకుండా మీడియా ఇతర విషయాలను ప్రస్తావించింది. వీలైనంత త్వరగా కమిటీ నివేదిక సమర్పి స్తుంది. మరో రెండు నెలలు ఆగితే కమిటీ నివేదిక వస్తుంది. అప్పటివరకు సమయం ఇవ్వండి’అని ధర్మాసనాన్ని ఏఏజీ అభ్యర్థించారు.
2 నెలల్లో ఇస్తామంటే ఎలా నమ్మాలి?
‘జీవో 111 పరిధిని నిర్ణయించాలంటూ 2006లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ రీసర్చ్ అండ్ ట్రై నింగ్ సెంటర్ (ఈపీటీఆర్‌ఐ)ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లు క్యాచ్‌మెంట్ ఏరియాలో లేవని, వాటిని జీవో 111 పరిధి నుంచి తొలగించవచ్చని ఈపీటీఆర్‌ఐ నివేదిక ఇచ్చింది. అయితే జీవో 111 పరిధిపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2016లో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇచ్చిన జీవోలో 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ కమిటీ నివేదిక ఇవ్వలేదు. పనిచేయని ఇటువంటి కమిటీలను వెంటనే రద్దు చేయాలి.
ఇన్నేళ్లు పట్టనట్లుగా వ్యవహరించి ఇప్పుడు రెండు నెలల్లో నివేదిక ఇస్తామంటే ఎలా నమ్మాలి?..’అని ధర్మాసనం నిలదీసింది. తమ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతిస్తే రెండు నెలల సమయం ఇవ్వడానికి అభ్యంతరం లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం చెప్పేందుకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని ఏఏజీ అభ్యర్థించగా.. నిరాకరిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.