సాక్షి, హైదరాబాద్: అక్రమ ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద దరఖాస్తు చేసి.. క్లియరెన్స్ పొంది.. ఫీజు కట్టాలంటూ ఎస్‌ఎంఎస్‌లు అందుకున్నవారు డబ్బులు చెల్లించడంలో నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. ఫీజు కట్టాలంటూ ఎస్‌ఎంఎస్ అందుకున్న 15 రోజుల్లో ఫీజు కట్టాల్సి ఉండగా అవేమీ పాటించడంలేదు. గడువు ముగిసినా ఫీజు కట్టని వారి సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొడిగించే అవకాశం లేదని హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
హెచ్‌ఎండీఏకు వచ్చిన 1,75,464 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 77,319 మందికి ఫీజు కట్టాలంటూ ఎస్‌ఎంఎస్ పంపితే, 47వేల మంది మాత్రమే చెల్లించారు. మిగిలిన 30 వేల మంది ఫీజు కట్టే సమయం మించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తించిన హెచ్‌ఎండీఏ అధికారులు అవసరమైతే వారి ఎల్‌ఆర్‌ఎస్‌ను తిరస్కరించాలని యోచిస్తున్నారు. ఈ విషయమై హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు మాట్లాడుతూ... ‘ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు కట్టాలంటూ దరఖాస్తుదారుల సెల్ నంబర్లకు సంక్షిప్త సమాచారం పంపించాం. దాదాపు 77వేల మందిలో 40వేలపైచిలుకు మంది వరకు ఆన్‌లైన్ పద్ధతిలో ఫీజు చెల్లించారు. మిగతావారు ఇంతవరకు కట్టలేదు. ఇప్పటికే రెండు, మూడు సార్లు గడువు పొడిగించాం. మరో వారంలో వీరు ఫీజు కట్టకపోతే ఎల్‌ఆర్‌ఎస్ తిరస్కరిస్తామ’ని స్పష్టం చేశారు.
షార్ట్‌ఫాల్ నోటీసులు జారీ...
ఎల్‌ఆర్‌ఎస్ లేఅవుట్ కాపీ, వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి ఎన్‌వోసీలు... ఇలా ఇతరత్రా డాక్యుమెంట్లు సమర్పించని వారికి చివరిసారిగా షార్ట్‌ఫాల్ నోటీసులు జారీ చేశారు. గత వారం నుంచి ఈ ప్రక్రియ ఊపందుకుంది. 15 రోజుల్లో సంబంధిత డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయకపోతే తిరస్కరిస్తామంటూ సెల్ నంబర్లకు ఎస్‌ఎంఎస్ పంపిస్తున్నారు. ఇలా 7,555 మందికి షార్ట్‌ఫాల్ నోటీసులు పంపినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. షార్ట్‌ఫాల్‌కు అవకాశం ఇదే చివరిసారని, చేయని పక్షంలో తిరస్కరిస్తామని స్పష్టం చేస్తున్నారు.
మరో 12,298 వేల దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయని చెబుతున్నారు. దీనికితోడు ఇప్పటికే వివిధ కారణాలతో తిరస్కరణకు గురైన 68,035 మందికి అప్పీల్‌కు మరో అవకాశం కల్పించడంతో దాదాపు పదివేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీటిని తిరిగి పరీక్షించేందుకు నలుగురు తహసీల్దార్‌లు, నలుగురు టెక్నికల్ ఆఫీసర్లతో ఇప్పటికే కమిషనర్ టి.చిరంజీవులు నియమించిన బృందం పనిచేస్తోంది. వీటిలో 703 దరఖాస్తులను తిరస్కరించాయి. అయితే ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు చేసుకునే సమయంలో తొలి వాయిదా చెల్లించనివారు 9,554 మంది ఉన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు కట్టకపోతే తిరస్కరణ!
Published Tue, Nov 7 2017 3:40 AM | Last Updated on Tue, Nov 7 2017 5:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment