
క్రమబద్ధీకరణకు అర్హత గల దరఖాస్తులు 20 లక్షలు.. ఆదాయం అంచనా రూ.20 వేల కోట్లు
ఇప్పటివరకు ఫీజు చెల్లించినది 30 వేల మంది మాత్రమే.. సర్కారుకు సమకూరినది రూ.50 కోట్లలోపే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) ద్వారా సుమారు రూ.20 వేలకోట్ల ఆదాయం పొందాలని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే ఎదురవుతోంది. మార్చి నెలాఖరుకల్లా ఎల్‌ఆర్‌ఎస్ పూర్తి చేయాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఎల్‌ఆర్‌ఎస్ పథకం కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, నిర్ణీత ఫీజు ద్వారా క్రమబద్ధీకరించాలని తీసుకున్న నిర్ణయం ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
పురపాలక శాఖలోని ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు సంబంధించిన పోర్టల్‌ను రిజిస్ట్రార్ కార్యాలయాల సర్వర్లతో అనుసంధానం చేసి.. స్థలాలను క్రమబద్ధీకరించే ప్రక్రియ ప్రారంభించారు. కానీ ఎల్‌ఆర్‌ఎస్‌కు కనీస స్పందన కూడా రావడం లేదు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించినవారు 336 మంది, వచ్చిన ఆదాయం రూ.1.16 కోట్లు మాత్రమే. హైదరాబాద్ జిల్లా పరిధిలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలలో కలిపి సోమవారం ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు చెల్లించినవారు 42 మంది, సమకూరిన మొత్తం రూ.34.25 లక్షలు మాత్రమేకావడం గమనార్హం.
11 రోజుల ఆదాయం రూ.47 కోట్లే!
రాష్ట్రంలో 2020లో వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు 25.67 లక్షలు.. అందులో 20లక్షల దరఖాస్తులను క్రమబద్ధీకరణకు అర్హమైనవిగా ప్రాథమికంగా గుర్తించారు. మరో 2.5 లక్షల దరఖాస్తులు చెరువులు, కుంటలకు 200 మీటర్ల పరిధిలో ఉన్నవికాగా, మిగతావాటిని ఇతర కారణాలతో తిరస్కరించారు.
మొత్తం దరఖాస్తుల్లో జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని 140 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి వచ్చిన దరఖాస్తులు 14.45 లక్షలు. ఇందులో 13,322 దరఖాస్తులకు సంబంధించి రూ.103.13 కోట్లను గతంలోనే చెల్లించారు. వీటిలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులను స్వీకరిస్తుండగా.. ఇప్పటివరకు 7,188 దరఖాస్తులకు సంబంధించి రూ.47 కోట్లు మాత్రమే సమకూరడం గమనార్హం.
దీనితో జీహెచ్‌ఎంసీ మినహా మిగతా పురపాలికల్లో.. 20,510 దరఖాస్తుల క్రమబద్ధీకరణతో ప్రభుత్వానికి రూ.151.31 కోట్లు అందాయి. ఇక హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీతోపాటు పట్టణాభివృద్ధి సంస్థలు, గ్రామ పంచాయతీల నుంచి కలిపి గతంలో 600 మంది వరకు ఫీజులు చెల్లించగా.. ఇప్పుడా సంఖ్య సుమారు 2వేల వరకు ఉండొచ్చని, సమకూరిన మొత్తం రూ.10 కోట్ల వరకే ఉంటుందని అంచనా.
భూముల విలువ, ఓపెన్ స్పేస్ చార్జీల్లో తేడాలతో..
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల పరిధిలో భూమి కొనుగోలు విలువ, ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటి విలువతోపాటు ఓపెన్ స్పేస్ చార్జీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన ధరల్లో తేడాలు వస్తున్నాయని తెలిసింది. దీనితో దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించడం లేదని సమాచారం.
అలాగే రెవెన్యూ గ్రామం పేరు, దరఖాస్తుదారు పేర్కొన్న కాలనీ, గ్రామం పేర్లు వేరుగా ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ శాఖ దరఖాస్తులను తిరస్కరించడం లేదా ఫీజుల్లో తేడా చూపించడం జరుగుతోంది. ఈ సమస్యను అధికారుల దృష్టికి తేవడంతో.. ఆన్‌లైన్ ద్వారా కాకుండా మ్యాన్యువల్‌గా సమస్యను పరిష్కరిస్తున్నట్టు డీటీసీపీ దేవేందర్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ఇకపై వేగం పుంజుకుంటుందని చెప్పారు.
ఇంకా 20 రోజులే గడువు!
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను క్రమబద్ధీకరించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని.. మార్చి 31వ తేదీలోపు పూర్తి చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, పురపాలికల కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పరిష్కారానికి అర్హమైన దరఖాస్తులు 20 లక్షలకుపైనే ఉండగా.. ఇప్పటివరకు లక్ష దరఖాస్తులకు కూడా మోక్షం లభించలేదు. మరో 20 రోజుల గడువే ఉన్న నేపథ్యంలో రోజుకు లక్ష దరఖాస్తులను పరిష్కరిస్తే తప్ప ప్రభుత్వం ఆశించిన రూ.20 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అక్రమ లేఅవుట్లలోని స్థల యజమానులకు మంచి అవకాశం..
అక్రమ లేఅవుట్లలో కనీసం 10శాతం స్థలాల సేల్‌డీడ్స్ పూర్తయిన చోట్లలో మిగతా వారికి ఎల్‌ఆర్‌ఎస్ పథకం మంచి అవకాశం. వారు గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోకపోయినా, ఇప్పుడు నేరుగా ఫీజు చెల్లించి తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవడంతోపాటు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు పొందే అవకాశం ఉంది. అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొన్న వ్యక్తులు రెగ్యులరైజ్ చేసుకునేందుకు ముందుకు రావాలి. ఈ నెల 31లోపు క్రమబద్ధీకరించుకుంటే 25శాతం రాయితీ పొందవచ్చు.
– కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, చైర్మన్, సుడా (కరీంనగర్)
Comments
Please login to add a commentAdd a comment