
ఆమోదించిన దరఖాస్తులకు ఫీజులు చెల్లించేందుకు అవకాశం
ఏర్పాట్లు పూర్తి చేసిన పురపాలక శాఖ.. రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్‌తో ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్ అనుసంధానం
మొత్తం 25.67 లక్షల దరఖాస్తుల్లో 9.21 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తి
నీటి వనరులకు 200 మీ. లోపు స్థలాలకు నో చాన్స్
పూర్తిస్థాయి విధివిధానాలు నేడు ప్రకటించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. మంగళవారం నుంచి ఇప్పటికే ఆమోదించిన దరఖాస్తులకు ఫీజులు చెల్లించడం ద్వారా క్రమబద్ధీకరించుకునేందుకు పురపాలక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ శాఖ పరిధిలో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్‌ను ఫీజు చెల్లింపులకు వీలుగా రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌కు అనుసంధానం చేసే ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియకు సంబంధించి పూర్తి విధి విధానాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు ఒకటీ, రెండురోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఆన్‌లైన్ పద్ధతిలోనే చెల్లింపులు
ఆమోదం పొందిన వెంచర్లకు సంబంధించి ప్లాట్ల వారీగా ఫీజులను రిజిస్ట్రేషన్ల శాఖకు ఆన్‌లైన్‌లో నేరుగా చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, గ్రామ పంచాయతీల్లో.. ఎల్‌ఆర్‌ఎస్ కోసం వచ్చిన 25.67 లక్షల దరఖాస్తుల సమాచారంతో కూడిన ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్‌తో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్‌ను అనుసంధానిస్తున్నారు. దీంతో ఎల్‌ఆర్‌ఎస్‌కు ఆమోదం పొందిన ప్లాట్ల వివరాలు సబ్ రిజి్రస్టార్ల వద్ద కనిపిస్తాయి.
ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్‌లో క్రమబద్ధీకరించాల్సిన ప్లాట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే దరఖాస్తుదారుడే నేరుగా ఇంటి నుంచే ఆన్‌లైన్, యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖకు ఫీజు చెల్లించేలా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తున్నారు. అనుసంధాన ప్రక్రియ సోమవారం రాత్రి కల్లా పూర్తి చేసి, మంగళవారం నుంచి ఫీజులు చెల్లించేలా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్‌లు కృషి చేస్తున్నాయి.
ఇప్పటికే రూ.107.01 కోట్ల చెల్లింపులు
2020 ఆగస్టు 26కు ముందు ఎల్‌ఆర్‌ఎస్ కోసం చేసుకున్న 25.67 లక్షల దరఖాస్తుల్లో 9.21 లక్షల దరఖాస్తుల పరిశీలన ఇప్పటికే పూర్తయింది. వీటిలో ఎలాంటి అభ్యంతరాలు లేని 1.74 లక్షల దరఖాస్తుదారులకు ఫీజుల చెల్లింపు కోసం పురపాలక శాఖ గతంలోనే సమాచారం ఇచ్చింది. వీరిలో 13,844 దరఖాస్తులకు సంబంధించి రూ.107.01 కోట్ల చెల్లింపులు కూడా గతంలో జరిగాయి.
4 లక్షల దరఖాస్తులకు ‘నీటి వనరుల’ లింక్
ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులకు 200 మీటర్ల పరిధిలోపు ఉన్న వెంచర్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కుదరదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. నీటి వనరులను ఆనుకుని ఏర్పాటు చేసిన లే అవుట్లు, వ్యక్తిగత ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఇప్పటికే ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్‌లకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను కూడా తిరస్కరించనున్నారు.
వచ్చిన 25 లక్షల దరఖాస్తుల్లో ఇలాంటివి 4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఇక ఒక వెంచర్‌లో 100 ప్లాట్లు ఉంటే అందులో 10 ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తులు చేసుకుని ఉంటే, మిగతా 90 ప్లాట్లకు దరఖాస్తు చేసుకోకపోయినా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నారు. ఈ మేరకు విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది.
14% ఓపెన్ స్పేస్ చార్జీలు
– మార్చి 31వ తేదీ లోపు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు చెల్లించి అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరించుకుంటే, ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. మొత్తం స్థలం విలువలో 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీల కింద చెల్లించాల్సి ఉంటుంది.
– వెంచర్‌తో సంబంధం లేని వ్యక్తిగత ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు దరఖాస్తులు అవసరం లేదు. వాటిలో భవన నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నప్పుడే ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
– వారసత్వ ఆస్తిని పిల్లలకు పంచినప్పుడు భాగస్వామ్య ఒప్పంద పత్రాలను రిజిస్ట్రేషన్ చేయిస్తే, ఎల్‌ఆర్‌ఎస్‌తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్‌తో పాటు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు కడితే, భవన నిర్మాణాలకు గ్రీన్‌సిగ్నల్ లభిస్తుంది.
– ఫాం లాండ్స్ పేరుతో ఎకరాల కొద్దీ భూమిని 150, 200 గజాలుగా విభజించి ప్లాట్లుగా విక్రయించారు. నాలా కన్వర్షన్ లేకుండా ఇందులో రోడ్లు వంటివి వేసినప్పటికీ, ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేయనప్పుడు..క్రమబద్ధీకరణ ప్రక్రియ వర్తించదు. 2020 ఆగస్టుకు ముందు లేఅవుట్ వేసి, 10 శాతం ప్లాట్లను విక్రయిస్తేనే క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment