Land regularization
-
గందరగోళం ఉంది గడువు ఇవ్వండి.. టైమ్ ప్లీజ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ భూములు/స్థలాల క్రమబద్ధీకరణపై గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం జీవో 58, 59ల అమలును పొడిగించినా.. దరఖాస్తుల స్వీకరణలో ఇబ్బందులు, ఇప్పటికీ మార్గదర్శకాల అంశం తేల్చకపోవడం, రెవెన్యూ అధికారులకు లాగిన్ ఇవ్వకపోవడం, గతంలో పెండింగ్‌లో పడ్డ దరఖాస్తుల విషయంగా స్పష్టత రాకపోవడం వంటివి సమస్యగా మారాయి. ఇవేవీ తేలకుండానే దరఖాస్తుల గడువు ముగుస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువును పెంచాలని.. మార్గదర్శకాలు ఇచ్చి, ఇతర సమస్యలను సరిదిద్దాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. దరఖాస్తుల స్వీకరణ చేపట్టినా.. రాష్ట్రంలో పేదలు ఆక్రమించుకుని, నివాసముంటున్న ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం గతంలోనే జీవో 58, 59లను జారీ చేసింది. అప్పట్లో మూడున్నర లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకోగా.. రెండు లక్షలకుపైగా దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. మిగతావి వివిధ కారణాలతో పెండింగ్‌లో పడ్డాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఇటీవలే మరోసారి క్రమబద్ధీకరణ దరఖాస్తులకు అవకాశమిచ్చింది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించింది. ఈ గడువు గురువారంతో ముగిసిపోతోంది. 50 రోజులకుపైగా అవకాశమిచ్చినా 1.47 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీనికి పలు సమస్యలు, ఇబ్బందులకు తోడు ప్రభుత్వం మార్గదర్శకాలపై స్పష్టత ఇవ్వకపోవడం కూడా కారణమని విమర్శలు వస్తున్నాయి. గడువు ఇవ్వాల్సిందే.. భూముల క్రమబద్ధీకరణకు ఇది చివరి అవకాశమని, మరోమారు అవకాశం ఇచ్చేది లేదని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జనంలో ఆందోళన వ్యక్తమవుతోంది. అన్ని సందేహాలను నివృత్తి చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేయాలని, ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకునేందుకు మరికొంత సమయం ఇవ్వాలని డిమాండ్ వస్తోంది. ఈ సమస్యలు తేలేదెలా? కేవలం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భూముల క్రమబద్ధీకరణ కోసం జీవో 58, 59లను విడుదల చేశారు. ఆ జీవోలకు అనుగుణంగా 2014లో దరఖాస్తులు స్వీకరించినప్పడు.. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని భూములకూ వర్తింపజేశారు. కానీ ఈసారి దరఖాస్తులను కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం చేశారు. గ్రామాల పరిధిలోని భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. పోర్టల్‌లో ఆ ఆప్షనే కనిపించడం లేదు. కేవలం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఆప్షన్ మాత్రమే చూపిస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని వారెవరూ తాజాగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోలేకపోయినట్టు రెవెన్యూ వర్గాలే చెప్తున్నాయి. అధికారులకు లాగిన్ ఏదీ? దరఖాస్తుల స్వీకరణ గడువు ముగింపునకు వచ్చినా.. రెవెన్యూ వర్గాలకు ఇంతవరకు లాగిన్ అధికారం ఇవ్వలేదు. ఏదైనా మండలంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే వివరాలు కూడా రెవెన్యూ వర్గాలకు తెలియడం లేదు. ఇక అందిన దరఖాస్తులను పరిశీలించి, తగిన విధంగా లేకుంటే మార్చుకునేలా ప్రజలకు సూచనలు చేసే అవకాశం లేకుండా పోయిందని అధికారులు చెప్తున్నారు. దీనివల్ల ఏవైనా పొరపాట్లు ఉన్న దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మార్గదర్శకాలపై స్పష్టత లేక.. క్రమబద్ధీకరణ దరఖాస్తులను ఎవరు పరిశీలించాలి? ఎవరు పరిష్కరించాలనే విషయంలోనూ స్పష్టత లేదు. దీనిపై గతంలో ఉన్న మార్గదర్శకాలను అనుసరిస్తారా, లేక కొత్త మార్గదర్శకాలు ఇస్తారా అన్నది ఇప్పటికీ తేలలేదు. ‘పెండింగ్’ సందేహాలు తీర్చేదెవరు? 2014లో చేసుకున్న దరఖాస్తుల్లో లక్షన్నర వరకు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అందులో కొందరు దరఖాస్తులు మాత్రమే చేసుకోగా, మరికొందరు మొదటి, రెండో పేమెంట్ కూడా చెల్లించి ఉన్నారు. ఇప్పుడు వారంతా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా? పాతవాటినే పరిగణనలోకి తీసుకుంటారా అన్నది తేలలేదు. ఇక ప్రభుత్వం ఇటీవల రెండుసార్లు భూముల ధరలను సవరించింది. ఈ క్రమంలో పాత దరఖాస్తులకు కొత్త ధరలు వర్తింపజేస్తారా, పాత రేట్లతోనే క్రమబద్ధీకరిస్తారా అన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. బుధవారం నాటికి వచ్చిన దరఖాస్తులివీ.. జీవో 58 కింద అందినవి 87,520 జీవో 59 కింద అందినవి 59,748 మొత్తం దరఖాస్తులు 1,47,268 -
మరోసారి చాన్స్! ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు ఓకే
2014 జూన్ 2 నాటికి ముందు ఆక్రమణలో ఉన్నట్టు రుజువులున్న స్థలాలనే క్రమబద్ధీకరిస్తారు. దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్‌కార్డు/ఏదైనా డాక్యుమెంట్)తోపాటు.. స్థలం తమ అధీనంలో ఉన్నట్టు నిరూపించే ఆస్తిపన్ను రశీదు/విద్యుత్ బిల్లు/తాగునీటి బిల్లు/రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వంటివాటిలో ఏదైనా ఒకటి జత చేయాలి. ఖాళీ భూములను క్రమబద్ధీకరించరు. నివాసేతర వినియోగంలో ఉన్న స్థలాల్లో కూడా ఏదో ఒక నిర్మాణం ఉండాలి. ఎలాంటి వివాదాల్లేని ప్రభుత్వ భూములు, పట్టణ భూగరిష్ట పరిమితి చట్టంలోని మిగులు భూములను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అవకాశం కల్పించింది. 2014 డిసెంబర్లో జారీ చేసిన జీవో నంబర్.58, 59కు అనుగుణంగా.. భూముల అసైన్మెంట్, క్రమబద్ధీకరణ, హక్కుల బదలాయింపు కోసం దరఖాస్తులకు గడువిస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ సోమవారం జీవో నంబర్ 14ను జారీ చేశారు. దీనికి అనుగుణంగా భూపరిపాలన ప్రధాన కమిషనర్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఈ నెల 21 నుంచి మార్చి 31 వరకు మీసేవ కేంద్రాల్లో క్రమబద్ధీకరణ దరఖాస్తు చేసుకోవచ్చు. 2014 జూన్ 2వ తేదీకి ముందే ఆక్రమణకు గురైన స్థలాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. పెండింగ్‌తోపాటు కొత్తగా కూడా.. గతంలో జారీచేసిన నంబర్ 58, 59 జీవోల కింద రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 2లక్షల వరకు దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం రెండు వాయిదాల్లో నిర్దేశిత ఫీజును చెల్లించకపోవడం, తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో మిగతా 1.5 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. అయితే.. ఎన్ని దరఖాస్తులు, ఏయే కారణాలతో పెండింగ్‌లో పడ్డాయన్న వివరాలను ప్రభుత్వం ఇటీవలే అన్ని జిల్లాల నుంచి సేకరించింది. పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం ఆ వివరాలను పరిశీలించి.. మరోమారు క్రమబద్ధీకరణ అవకాశం కల్పించాలని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెండింగ్‌లో ఉన్నవాటిని పరిష్కరించడంతోపాటు గతంలో దరఖాస్తు చేసుకోలేనివారు కూడా జీవో 14 ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చని.. వ్యక్తిగత ధ్రువీకరణతోపాటు సదరు భూమి కబ్జాలో ఉన్నట్టు తగిన ఆధారాలను సమర్పించాలని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమని పేర్కొన్నాయి. 58, 59 జీవోల్లోని అంశాలివే.. – 125 చదరపు గజాల్లోపు స్థలాలను ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమద్ధీకరిస్తారు. – 250 చదరపు గజాల్లోపు ఆక్రమణలకు ప్రభుత్వ కనీస ధరలో 50శాతం.. 250–500 చదరపు గజాల స్థలాలకు కనీస ధరలో 75 శాతం సొమ్మును ఫీజుగా కట్టాలి. – 500 నుంచి 1000 చదరపు గజాల స్థలాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకున్నవారు ప్రభుత్వ కనీస ధరను పూర్తిగా చెల్లించాలి. – విస్తీర్ణంతో సంబంధం లేకుండా.. నివాసేతర వినియోగ భూములకు ప్రభుత్వ కనీస ధర పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. – ఈ భూముల క్రమబద్ధీకరణ కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. – క్రమబద్ధీకరణపై ఆర్డీవో చైర్మన్‌గా, సంబంధిత తహశీల్దార్ సభ్యులుగా ఉండే కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. – తహసీల్దార్లు సదరు దరఖాస్తుదారుల కుటుంబాల్లోని మహిళల పేరు మీదే కన్వేయన్స్ డీడ్‌ను చేసి ఇవ్వాల్సి ఉంటుంది. – ఏవైనా సమస్యలు తలెత్తితే జాయింట్ కలెక్టర్ సంబంధిత కమిటీకి తగిన సూచనలు చేస్తారు. – ఏ దరఖాస్తునైనా ఎలాంటి కారణం చూపకుండానే తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని జీవోల్లో పేర్కొన్నారు. చార్జీలు/ఫీజులపై స్పష్టత కరువు! 2014 నాటి 58, 59 జీవోల ప్రకారం తాజా క్రమబద్ధీకరణ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించినా.. చార్జీలు/ఫీజుల విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. గతంలో పెండింగ్‌లో పడ్డ 1.5 లక్షల దరఖాస్తులకు అప్పటి ధరలే వర్తింపజేయవచ్చని అధికారవర్గాలు చెప్తున్నా.. ఒకవేళ ప్రస్తుత మార్కెట్ ధరలను ఏమైనా పరిగణనలోకి తీసుకుంటారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక కొత్తగా చేసుకునే దరఖాస్తులకు సంబంధించి.. ఇటీవల పెంచిన భూములు/స్థలాల ధరలే వర్తిస్తాయని అధికారులు అంటున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదని పేర్కొంటున్నారు. -
పని భారం!
♦ రెవెన్యూ ఖాళీల భర్తీపై శ్రద్ధ చూపని సర్కారు ♦ రోజురోజుకూ పెరుగుతున్న పనిఒత్తిడి ♦ సతమతమవుతున్న ఉద్యోగులుz ♦ కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తే మరింత గందరగోళం రెవెన్యూ శాఖ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. పహాణీల కంప్యూటరీకరణ, భూముల క్రమబద్ధీకరణ, ఫార్మాసిటీ భూసేకరణ, ఓటర్ల ముసాయిదా రూపకల్పన ఇలా ఒకేసారి పనులను మోపడంతో యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న రెవెన్యూ విభాగాన్ని ప్రభుత్వం పటిష్టం చేయకుండా ఏకకాలంలో అద నపు విధులు అప్పగిస్తుండడం ఉద్యోగులను ఊపిరిపీల్చుకోకుండా చేస్తోంది. రాష్ట్ర బడ్జెట్లో సింహాభాగం నిధులు సమకూర్చిపెడుతున్న ఈ శాఖను బలోపేతం చేయకుండా చేతులెత్తేసింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాలో రెవెన్యూ విభాగంలో సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సర్వేయర్లు, జూనియర్/ సీనియర్ అసిస్టెంట్లు, వీఆర్ఓలు ఇలా ప్రతి కేటగిరీలోనూ ఉద్యోగుల సంఖ్య అరకొరగానే ఉంది. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా.. ఉన్నవారితో సర్దుబాటు చేసుకోవాలని సూచించింది. ఇది ఉద్యోగులపై పనిభారాన్ని మోపుతోంది. ఈ ప్రభావం ప్రభుత్వం నిర్దేశించే పనుల మీద కనిపిస్తోంది. నగరీకరణ నేపథ్యంలో జిల్లాలో భూముల విలువలు ఆకాశన్నంటుతుండడంతో భూ వివాదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో కోర్టు కేసులు, లోకాయుక్తలో పిటిషన్లు నమోదు కావడం.. వీటికి కౌంటర్లు దాఖలు చేయడంతో పుణ్యకాలం పూర్తవుతోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు మొదలు దిగువశ్రేణి న్యాయస్థానాల వరకు సుమారు వేయి కేసులు పెండి ంగ్‌లో ఉన్నాయి. వీటిని కొలిక్కి తెచ్చేందుకు రెవెన్యూ యంత్రాంగం తలమునకలవుతున్నా.. కిందిస్థాయిలో జరుగుతున్న పొరపాట్లతో కోర్టు ధిక్కారం, జైలు శిక్షలు తప్పడంలేదు. ఇక సాధారణ అర్జీల సంగతి సరేసరి. సమ్మెట పోటు! ప్రతి మండలంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు ఆర్ఐలు, సర్వేయరు, స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులుండాలి. అయితే, వీటిలో తహసీల్దార్, డీటీ పోస్టులు మినహా మిగతా వాటిలో చాలావరకు ఖాళీగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 43 మంది సర్వేయర్లు ఉండాల్సివుండగా.. కేవలం 20 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ (జీఓ 58,59), ఔషధనగరి, భూదాన్, మెట్రో, ఎంఎంటీఎస్ రైల్వే లైన్ల సర్వే, ఆక్రమణకు గురయ్యే భూములకు హద్దులను నిర్దేశించే ఈ విభాగాన్ని ఉద్యోగుల కొరత పట్టిపీడిస్తోంది. మరోవైపు 22ఏ భూముల పరిశీలన కూడా భారంగా మారింది. గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులకు కీలకంగా వ్యవహరించే వీఆర్ఓల సంఖ్య కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 557 పోస్టులు ఉండగా.. దీంట్లో 428 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మండలానికి ఇద్దరు ఆర్ఐలను నిర్దేశించినా.. కేవలం పట్టణ మండలాల్లోనే ఇది అమలవుతోంది. దీంతో వెబ్‌ల్యాండ్ అప్డేషన్ నత్తనడకన సాగుతోంది. ఇక సీనియర్ అసిస్టెంట్లను నియమించక పోవడం కూడా మండల కార్యాలయాల్లో పనులకు తీవ్ర విఘాతం కలుగుతోంది. 144 పోస్టులు మంజూరు కాగా.. దీంట్లో సగం కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. ఇక జూనియర్ అసిస్టెంట్ల పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని భావించవచ్చు. బ్యాక్లాగ్, పదోన్నతులతో ఈ పోస్టులను నింపుతుండడంతో కేవలం ఆరు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. నిరంతరం ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా కొనసాగుతుండడంతో రెవెన్యూ పనులపై ప్రభావం చూపుతోంది. ఓటర్ల నమోదు వ్యవహారంలో రాజకీయ పక్షాలు కోర్టుకెక్కిన నేపథ్యంలో.. పని ఒత్తిడితో ఈ విధులు ఎక్కడ తమ మెడకు పడతాయోననే బెంగ ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రెవెన్యూ శాఖలో ఖాళీలను భర్తీ చేయకుండా.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే ఉద్యోగుల నడ్డివిరగడం ఖాయంగా కనిపిస్తోంది. నిర్దేశించిన పోస్టుల్లో ఉద్యోగులను నియమించిన తర్వాతే.. నయా జిల్లాల గురించి ఆలోచించాలని ఉద్యోగసంఘాలు సూచిస్తున్నాయి. అప్పుడే ఏయే జిల్లాకు ఎంత మంది అవసరమవుతారో తేలుతుందని అంటున్నాయి. -
అర్జీలకు దిక్కేది?
► జిల్లాలో అపరిష్కృత దరఖాస్తులు 1,33,220 ► గడువు ముగిసినా పరిష్కారం కానివి 80,994 ► రెండు, మూడురోజుల్లో గడువు ముగిసేవి 52,226 ► తహసీల్దార్ కార్యాలయాల్లో భారీగా పెండింగ్ దరఖాస్తులు ► గడువు ముగిసినా పరిష్కరించని రెవెన్యూ అధికారులు ► చెప్పులరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అర్జీదారులు జిల్లాలో పౌరసేవలు పడకేశాయి. తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్ దరఖాస్తులు గుట్టల్లా పేరుకుపోతున్నాయి. నిర్దేశిత గడువులోగా పరిష్కరించాల్సిన వాటిని పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఫలితంగా అర్జీదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలోని 37 మండలాల రెవెన్యూ కార్యాలయాల్లో గడువు దాటినా పరిష్కరించని దరఖాస్తులు 80,994 ఉన్నాయి. ఇవికాక మరో రెండు,మూడు రోజు ల్లోనే పరిష్కరించాల్సిన అర్జీలు 52,226 ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో 1,33,220 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ సాధారణ పాలనపై ప్రభావం చూపుతోంది. వివిధ పథకాల్లో లబ్ధికోసం అర్జీదారులు పెట్టుకున్న దరఖాస్తులు కార్యాలయాల్లో వేలల్లో మూలుగుతున్నాయి. అయితే వాటిని సకాలంలో పరిష్కరించాల్సిన అధికారులు భూ క్రమబద్ధీకరణ పనుల్లో భాగంగా చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో తలమునకలై ఉన్నారు. ఆయా మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నగర శివారు మండలాల్లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. దీంతో తహసీల్దార్ కార్యాలయాలు ఖాళీ కావడంతో క్షేత్రస్థాయిలో వచ్చే అర్జీల పరిష్కారం అటకెక్కింది. దాదాపు మూడు నెలలుగా రెవెన్యూ ఉద్యోగులంతా భూక్రమబద్ధీకరణ బిజీ పేరిట విధులు నిర్వహిస్తుండడంతో రోజువారీగా వచ్చే దరఖాస్తులన్నీ కార్యాలయాల్లో గుట్టల్లా పేరుకుపోయాయి. కులధ్రువీకరణ అర్జీలే ఎక్కువ.. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో పరిష్కారానికి నోచుకోని దరఖాస్తుల్లో అధికంగా కుల, ఆదాయ, అడంగల్ దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 9,904 కుల ధ్రువీకరణ దరఖాస్తులకు నిర్దేశిత గడువు ముగిసినా పరిష్కారం కాలేదు. అదేవిధంగా మరో 30,709 దరఖాస్తులకు త్వరలో గడువు ముగియనుంది. జిల్లాలో 6,867 ఆదాయ ధ్రువీకరణ దరఖాస్తుల పరిష్కారం కావాల్సి ఉండగా.. మరో 6,375 దరఖాస్తులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. వీటితోపాటు అడంగల్, పహాణీల దరఖాస్తులు మరో 15వేలు ఉన్నాయి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో పలువురు విద్యార్థులు పోటీ పరీక్షలు, కోర్సులలో ప్రవేశాలకు దూరమవుతున్నారు. ఇబ్రహీంపట్నం మండలం మండల్పల్లి గ్రామానికి చెందిన మహేందర్ ఇటీవల ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకుగాను కులధ్రువీకరణ కోరగా.. అధికారుల నిర్లక్ష్యంతో చివరకు జనరల్ కోటాలో ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. తనకు వచ్చిన మార్కులతో రిజర్వ్డ్ కోటాలో ఉద్యోగం దక్కేదని, స్థానిక అధికారుల నిర్లక్ష్యంతోనే ఉద్యోగానికి దూరమైనట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.