మరోసారి చాన్స్‌! ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు ఓకే | GO 14:TS Government Give One More Chance To Regularization Of Lands | Sakshi
Sakshi News home page

మరోసారి చాన్స్‌! ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు ఓకే

Published Tue, Feb 15 2022 2:27 AM | Last Updated on Tue, Feb 15 2022 2:59 PM

GO 14:TS Government Give One More Chance To Regularization Of Lands - Sakshi

2014 జూన్‌ 2 నాటికి ముందు ఆక్రమణలో ఉన్నట్టు రుజువులున్న స్థలాలనే క్రమబద్ధీకరిస్తారు.

దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్‌కార్డు/ఏదైనా డాక్యుమెంట్‌)తోపాటు.. స్థలం తమ అధీనంలో ఉన్నట్టు నిరూపించే ఆస్తిపన్ను రశీదు/విద్యుత్‌ బిల్లు/తాగునీటి బిల్లు/రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ వంటివాటిలో ఏదైనా ఒకటి జత చేయాలి. 

ఖాళీ భూములను క్రమబద్ధీకరించరు. నివాసేతర వినియోగంలో ఉన్న స్థలాల్లో కూడా ఏదో ఒక నిర్మాణం ఉండాలి. 

ఎలాంటి వివాదాల్లేని ప్రభుత్వ భూములు, పట్టణ భూగరిష్ట పరిమితి చట్టంలోని మిగులు భూములను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు. 

సాక్షి, హైదరాబాద్‌:  ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అవకాశం కల్పించింది. 2014 డిసెంబర్‌లో జారీ చేసిన జీవో నంబర్‌.58, 59కు అనుగుణంగా.. భూముల అసైన్‌మెంట్, క్రమబద్ధీకరణ, హక్కుల బదలాయింపు కోసం దరఖాస్తులకు గడువిస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సోమవారం జీవో నంబర్‌ 14ను జారీ చేశారు. దీనికి అనుగుణంగా భూపరిపాలన ప్రధాన కమిషనర్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఈ నెల 21 నుంచి మార్చి 31 వరకు మీసేవ కేంద్రాల్లో క్రమబద్ధీకరణ దరఖాస్తు చేసుకోవచ్చు. 2014 జూన్‌ 2వ తేదీకి ముందే ఆక్రమణకు గురైన స్థలాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 

పెండింగ్‌తోపాటు కొత్తగా కూడా.. 
గతంలో జారీచేసిన నంబర్‌ 58, 59 జీవోల కింద రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 2లక్షల వరకు దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం రెండు వాయిదాల్లో నిర్దేశిత ఫీజును చెల్లించకపోవడం, తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో మిగతా 1.5 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి.

అయితే.. ఎన్ని దరఖాస్తులు, ఏయే కారణాలతో పెండింగ్‌లో పడ్డాయన్న వివరాలను ప్రభుత్వం ఇటీవలే అన్ని జిల్లాల నుంచి సేకరించింది. పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం ఆ వివరాలను పరిశీలించి.. మరోమారు క్రమబద్ధీకరణ అవకాశం కల్పించాలని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పెండింగ్‌లో ఉన్నవాటిని పరిష్కరించడంతోపాటు గతంలో దరఖాస్తు చేసుకోలేనివారు కూడా జీవో 14 ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చని.. వ్యక్తిగత ధ్రువీకరణతోపాటు సదరు భూమి కబ్జాలో ఉన్నట్టు తగిన ఆధారాలను సమర్పించాలని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమని పేర్కొన్నాయి. 

58, 59 జీవోల్లోని అంశాలివే.. 
– 125 చదరపు గజాల్లోపు స్థలాలను ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమద్ధీకరిస్తారు. 
– 250 చదరపు గజాల్లోపు ఆక్రమణలకు ప్రభుత్వ కనీస ధరలో 50శాతం.. 250–500 చదరపు గజాల స్థలాలకు కనీస ధరలో 75 శాతం సొమ్మును ఫీజుగా కట్టాలి. 
– 500 నుంచి 1000 చదరపు గజాల స్థలాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకున్నవారు ప్రభుత్వ కనీస ధరను పూర్తిగా చెల్లించాలి. 
– విస్తీర్ణంతో సంబంధం లేకుండా.. నివాసేతర వినియోగ భూములకు ప్రభుత్వ కనీస ధర పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. 
– ఈ భూముల క్రమబద్ధీకరణ కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. 
– క్రమబద్ధీకరణపై ఆర్డీవో చైర్మన్‌గా, సంబంధిత తహశీల్దార్‌ సభ్యులుగా ఉండే కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. 
– తహసీల్దార్లు సదరు దరఖాస్తుదారుల కుటుంబాల్లోని మహిళల పేరు మీదే కన్వేయన్స్‌ డీడ్‌ను చేసి ఇవ్వాల్సి ఉంటుంది. 
– ఏవైనా సమస్యలు తలెత్తితే జాయింట్‌ కలెక్టర్‌ సంబంధిత కమిటీకి తగిన సూచనలు చేస్తారు. 
– ఏ దరఖాస్తునైనా ఎలాంటి కారణం చూపకుండానే తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని జీవోల్లో పేర్కొన్నారు. 

చార్జీలు/ఫీజులపై స్పష్టత కరువు! 
2014 నాటి 58, 59 జీవోల ప్రకారం తాజా క్రమబద్ధీకరణ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించినా.. చార్జీలు/ఫీజుల విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. గతంలో పెండింగ్‌లో పడ్డ 1.5 లక్షల దరఖాస్తులకు అప్పటి ధరలే వర్తింపజేయవచ్చని అధికారవర్గాలు చెప్తున్నా.. ఒకవేళ ప్రస్తుత మార్కెట్‌ ధరలను ఏమైనా పరిగణనలోకి తీసుకుంటారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇక కొత్తగా చేసుకునే దరఖాస్తులకు సంబంధించి.. ఇటీవల పెంచిన భూములు/స్థలాల ధరలే వర్తిస్తాయని అధికారులు అంటున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదని పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement