TS government
-
మహాలక్ష్మి పథకానికి స్పష్టత ఇచ్చిన పరేషాన్! రెండుంటే చాలు..
మహబూబాబాద్: ప్రభుత్వం గ్యారంటీ పథకాల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తులకు ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ ప్రతులను జత చేస్తే సరిపోతుందని అధికారులు వెల్లడించారు. అయితే కొంతమంది ఆధార్, రేషన్‌కార్డుతో పాటు కులం, ఆదాయం, నివాసం తదితర సర్టిఫికెట్లను కూడా జత చేసేందుకు మీసేవ, ఆధార్ కేంద్రాల వద్ద బారులుదీరుతున్నారు. ఇదిలా ఉండగా గ్యాస్ ఏజెన్సీల ఎదుట ఈ–కేవైసీ కోసం సైతం జనం క్యూ కడుతున్నారు. రెండుంటే చాలు.. ప్రభుత్వం ఐదు గ్యారంటీల (మహాక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు) అమలుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని గత డిసెంబర్ 28న ప్రారంభించి.. ఈనెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు గడువు పెట్టింది. కాగా దరఖాస్తులకు ఆధార్, రేషన్‌కార్డుల జిరాక్స్‌లు జత చేస్తే సరిపోతుంది. అయితే ప్రజలు అన్ని పథకాల కోసం అన్ని రకాల సర్టిఫికెట్లు అవసరమని భావించి ఆయా సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా పింఛన్, రైతుబంధు వచ్చిన వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవద్దని చెప్పినా ప్రజలు వినడం లేదు. మీసేవ కేంద్రాల వద్ద రద్దీ.. జిల్లాలో 98 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. కాగా ఆరు గ్యారంటీల అమలు విషయంలో చాలా మంది కులం, ఆదాయం, నివాసం, ఆహార భద్రత కార్డుల కోసం ఆయా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో అక్కడ రద్దీ పెరిగింది. కాగా మహా లక్ష్మి పథకానికి ఆదాయం, ఇతర సర్టిఫికెట్లు అడుగుతారని ప్రచారం జరగడంతో దరఖాస్తు చేసుకుంటున్నారు. అలాగే జిల్లాలో కొనసాగుతున్న ఆరు ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు బారులుదీరుతున్నారు. ముఖ్యంగా గ్యారంటీ పథకాల కోసం ఆధార్‌కార్డులో అడ్రస్ మార్పు, బయో మెట్రిక్, పుట్టిన తేదీ, ఇతర మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద.. జిల్లాలో 13 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా 2.14 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కాగా ఈ–కేవైసీ చేయించుకుంటేనే ప్రభుత్వం ప్రకటించిన విధంగా రాయితీపై సిలిండర్ సరఫరా చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల ఎదుట బారులుదీరుతున్నారు. ఈ–కేవైసీతో రాయితీ సిలిండర్‌కు సంబంధం లేదని అధికారులు చెబుతున్నా.. ప్రజలు వినడం లేదు. వసూళ్ల పర్వం.. జనాల తాకిడిని ఆసరాగా చేసుకొని ఆధార్, మీ సేవ, జిరాక్స్ సెంటర్లలో అధికంగా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే పలు గ్యాస్ ఏజెన్సీలు ఈ–కేవైసీకి రూ.200వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇవి చదవండి: ‘గృహలక్ష్మి’కి గుడ్‌బై.. చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం! వాటి స్థానంలో.. -
ప్రజలు గుండెల్లో పెట్టుకుని గెలిపించారు! అందరినీ కాపాడుకుంటాం.. : మంత్రి తుమ్మల
ఖమ్మం: గుండెల్లో పెట్టుకుని గెలిపించిన సత్తుపల్లి ప్రజలు రుణం తీర్చుకున్నారు... ఈ తీర్పును మనసులో పెట్టుకుని పనిచేస్తాం.. కష్టపడిన ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం... అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి బుధవారం బాధ్యతలు స్వీకరించగా, మంత్రి పాల్గొన్నారు. తొలుత డాక్టర్ మట్టా దయానంద్ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్‌చేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ దయానంద్ కష్టం, శ్రమ, సేవా కార్యక్రమాలే రాగమయిని ఎమ్మెల్యేగా గెలి పించాయని తెలిపారు. కాంగ్రెస్ కోసం దయానంద్ కుటుంబం ఎన్నో కష్టాలు పడిందని, వారి శ్రమ ఊరికే పోలేదని చెప్పారు. రాగమయిని గెలిపించాలని తాను పిలుపునిస్తే ప్రజలు ఆశీర్వదించి రుణం తీర్చుకున్నారని తెలిపారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లి నియోజకవర్గాన్ని శక్తిమేరకు అభివృద్ధి చేస్తానని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆశీర్వదించి మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. తానెప్పుడు గెలిచినా మంత్రిని చేస్తున్నారని, నలుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసే అవకాశం తనకు లభించిందని చెప్పారు. కాగా, సత్తుపల్లి వేశ్యకాంతల చెరువుకు గోదావరి జలాలను తరలించి తన రాజకీయ లక్ష్యం పూర్తి చేస్తానని తుమ్మల వివరించారు. అద్భుతమైన బహుమతి.. ఎమ్మెల్యేగా తనను గెలిపించి దయానంద్‌కు అపూర్వమైన బహుమతి ఇచ్చారని ఎమ్మెల్యే రాగమయి తెలిపారు. కష్టసుఖాల్లో తమ వెంట ఉన్నవారిని వదలబోమని చెప్పారు. ఏ అభివృద్ధి పనైనా సత్తుపల్లి నుంచే ప్రారంభిస్తామని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారన్నారు. అనంతరం దయానంద్ మాట్లాడుతూ పార్టీలో కష్టించి పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తామని, కొత్తవాళ్లను నెత్తిన పెట్టుకోబోమని తెలిపారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణితో పాటు చల్లగుళ్ల నర్సింహారావు, ఉడతనేని అప్పారావు, పసుమర్తి చందర్రావు, నున్నా రామకృష్ణ, రావి నాగేశ్వరరావు, కూసంపూడి నర్సింహారావు, గాదె చెన్నారావు, వందనపు సత్యనారాయణ, దొడ్డా శ్రీనివాసరావు, నారాయణవరపు శ్రీని వాస్, ఎస్.కే.మౌలాలీ, ఎండీ.కమల్‌పాషా, సోమిశెట్టి శ్రీధర్, రామిశెట్టి మనోహర్, దూదిపాల రాంబాబు, గోలి ఉషారాణి పాల్గొన్నారు. ఇవి చదవండి: నామినేటెడ్ పోస్టు.. మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల చుట్టూ ప్రదక్షిణ! -
జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ
-
నోటరీ ‘క్రమబద్ధీకరణ’పై సర్కారుకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నోటరీ ఆస్తుల క్రయవిక్రయాలను చట్టబద్ధం చేసి, క్రమబద్ధీకరించడంపై పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్లను ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. రాష్ట్రంలోని నోటరీ ఆస్తుల క్రయవిక్రయాలను చట్టబద్ధం చేసి, క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా పలువురు వ్యక్తులు చట్టవిరుద్ధంగా ఇలాంటి భూములను క్రమబద్ధీకరణ చేయించుకునే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. కష్టపడి డబ్బు కూడబెట్టుకుని తక్కు వ మొత్తంలో భూమి కొన్న పేదలకు ఇలాంటి చర్యలు తప్పుడు సంకేతాలనిస్తాయన్నారు. 125 చదరపు గజాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో నిర్మించిన ఆస్తులకు స్టాంప్ డ్యూటీ, పెనాల్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తే రాష్ట్ర ఖజానా ఆదాయం కోల్పోతుందని చెప్పారు. నోటరీ భూ విక్రయ లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి సంబంధించి జూలై 26న ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 84 కొట్టివేయాలని ‘ది భాగ్యనగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్’పిల్లో కోరింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన ఈ సడలింపు అక్రమ మార్గాల్లో ఆస్తులు సంపాదించే వారికి మార్గం సుగమం చేస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. -
అన్ని అలవెన్సులు పెంపు.. 14 జీవోలు జారీచేసిన ఆర్థికశాఖ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై సర్కారు వరాల జల్లు కురిపించింది. వారికి ఇచ్చే అన్ని రకాల అలవెన్సులు, అడ్వాన్సులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ మొత్తం 14 జీవోలను శుక్రవారం విడుదల చేసింది. 2020 పేస్కేల్ ఆధారంగా మొదటి వేతన సవరణ కమిషన్ ఇచి్చన సిఫారసుల మేరకు ఈ పెంపుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా 2008, 2011లో అలవెన్సుల సవరణ జరగలేదని అంతర్గతంగా పలుమార్లు చేసిన విజ్ఞ ప్తుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇక ఈ అలవెన్సుల పెంపుపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన కానుకగా ఆయన దీనిని అభివరి్ణంచారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రూ. 4 లక్షల వరకు పెళ్లి అడ్వాన్సులు దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే భత్యాన్ని నెలకు రూ.2 వేల నుంచి, రూ.3 వేలకు, ఇళ్ల నిర్మాణ అడ్వాన్సును రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు, కారు కొనుగోలు అడ్వాన్సు పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షలకు, ఉద్యోగుల కుమార్తెలు, కుమారుల పెళ్లిళ్ల అడ్వాన్సులను రూ.4 లక్షల వరకు పెంచింది. ఉద్యోగుల ప్రయాణ భత్యాన్ని, బదిలీపై వెళ్లినప్పుడు ఇచ్చే రవాణా భత్యాన్ని 30 శాతం చొప్పున పెంచగా, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్సును రూ.650 నుంచి రూ.1,280 వరకు పెంచింది. డ్రైవర్లు, లిఫ్టు ఆపరేటర్ల రోజువారీ గౌరవ వేతనాన్ని రూ.125 నుంచి రూ.150కి పెంచింది. వివిధ ప్రభుత్వ శిక్షణా సంస్థలు, పోలీసు విభాగం, ప్రొటోకాల్ సిబ్బందికి ఇచ్చే పలు రకాల అలవెన్సులు కూడా పెరిగాయి. విమాన ప్రయాణాల్లో వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికారిక పనుల నిమిత్తం విమానాల్లో ప్రయాణించడానికి సంబంధించిన నిబంధనలను కొంతమేర సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణాన్ని ఎకానమీ క్లాస్‌లోనే చేయాల్సి ఉంటుంది. అయితే 15వ స్థాయి, అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉండే ఐఏఎస్ అధికారులకు మాత్రం బిజినెస్ క్లాస్‌లోనూ ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. ఇక విమాన ప్రయాణ అనుమతి ఉన్న అధికారులందరికీ ఏసీ ఫస్ట్‌క్లాస్ రైలు ప్రయాణ సౌకర్యం కొనసాగనుంది. రోజువారీ భత్యం పెంపు అధికారిక పనులపై వెళ్లిన సందర్భంగా ఇచ్చే ఉద్యోగుల రోజువారీ భత్యాన్ని కూడా ప్రభుత్వం సవరించింది. ఇందుకోసం వేతన శ్లాబుల ఆధారంగా ఉద్యోగులను గ్రేడ్–1, 2, 3లుగా విభజించింది. అంతర్రాష్ట్ర ప్రయాణాల సందర్భంగా ఇచ్చే రోజువారీ భత్యాన్ని గ్రేడ్–1 ఉద్యోగులకు రూ.450 నుంచి రూ.600కు, గ్రేడ్–2 ఉద్యోగులకు రూ.300 నుంచి రూ.400కు, గ్రేడ్–3 ఉద్యోగులకు రూ.225 నుంచి రూ.330కు పెంచింది. అదే రాష్ట్రం బయటకు వెళ్లాల్సి వస్తే ఇవే గ్రేడ్ల ఆధారంగా భత్యాన్ని రూ.800, 600, 400కు పెంచారు. అదే విధంగా లాడ్జింగ్ చార్జీలను కూడా సవరించారు. రాజధానిలో ప్రయాణ భత్యం కూడా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోని ఉద్యోగులు అధికారిక పనుల నిమిత్తం చేసే ప్రయాణాలకు గాను కిలోమీటర్‌కు రూ.3 చొప్పున గరిష్టంగా రూ.60 వరకు క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కలి్పంచారు. తిరుగు ప్రయాణంలోనూ విడిగా క్లెయిమ్ చేసుకోవచ్చు. హైకోర్టు, ఇతర కోర్టులకు వెళ్లిన సందర్భంగా ప్రతి ఉద్యోగి రూ.75 క్లెయిమ్ చేసుకోవచ్చు. నెలలో గరిష్టంగా రూ.1,500 తీసుకోవచ్చు. కోర్టు సిబ్బంది న్యాయమూర్తుల నివాసాలకు వెళ్లినప్పుడు ప్రతిసారీ రూ.110, నెలకు గరిష్టంగా రూ.4.400 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ అదనపు భత్యం కార్యాలయాలకు త్వరగా వచి్చ, ఆలస్యంగా వెళ్లినప్పుడు, సెలవు రోజుల్లో విధులకు వచ్చినప్పుడు వర్తించదు. బదిలీ రవాణా భత్యం సవరణ ప్రభుత్వ ఉద్యోగులు బదిలీ అయిన సందర్భంలో ఇచ్చే రవాణా భత్యాన్ని కూడా సవరించారు. ఇందుకోసం వేతన స్కేల్ ఆధారంగా జోనల్, ఇతర జోన్లు, ఇతర రాష్ట్రాలకు బదిలీ సందర్భంగా రవాణా చార్జీలను నిర్ధారించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ట్రావెల్ గ్రాంట్‌ను కూడా సవరించారు. డ్రైవర్లు, లిఫ్ట్ ఆపరేటర్లకు గౌరవ వేతనం పెంపు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే డ్రైవర్లు, లిఫ్ట్ ఆపరేటర్ల రోజువారీ గౌరవ వేతనాన్ని రూ.125 నుంచి రూ.150కు పెంచారు. ఈ జీవో ప్రకారం అధికారుల ప్రైవేటు పనులపై ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు కూడా డ్రైవర్లకు రూ.150 చెల్లిస్తారు. అయితే తొలిసారి మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది. ఆ తర్వాతి నుంచి సదరు అధికారి నుంచి వసూలు చేస్తారు. ఇక షెడ్యూల్డ్ ఏరియాల్లో పనిచేసే ఉద్యోగుల ప్రత్యేక పరిహార భత్యం (స్పెషల్ కాంపన్సేటరీ అలవెన్స్) కూడా పెరిగింది. మండల కేంద్రాల్లో ఈ ప్రత్యేక భత్యాన్ని వేతన శ్లాబుల ఆధారంగా రూ. 650 నుంచి రూ.1,280 వరకు పెంచారు. మండల కేంద్రాలు కాని గ్రామాలు, హామ్లెట్లలో రూ.780 నుంచి రూ.1,430 వరకు, కొండ ప్రాంతాల్లోని గ్రామాల్లో రూ.950 నుంచి రూ.1,660 వరకు పెంచారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగించే కార్లు, మోటారు సైకిళ్లు, సైకిళ్ల నెలవారీ నిర్వహణ ఖర్చులను కూడా సవరించారు. మోటార్ కారు లేదా సైకిల్ నిర్వహణకు నెలకు ఇస్తున్న మొత్తాన్ని రూ.1,050 నుంచి రూ.1,500కు పెంచారు. వికలాంగ ఉద్యోగులకు రవాణా భత్యం బేసిక్ పేపై 10 శాతం, గరిష్టంగా రూ.3 వేలకు పెరిగింది. వడ్డీపై ఇంటి నిర్మాణ అడ్వాన్సు కట్టిన ఇళ్ల కొనుగోలు, స్థలం కొని ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే అడ్వాన్సును ప్రభుత్వం పెంచింది. ఆయా స్కేళ్ల పరిధిలోనికి వచ్చే ఉద్యోగులకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అడ్వాన్సు ఇవ్వనుంది. గరిష్టంగా ఈ మొత్తాన్ని లేదంటే బేసిక్ పేపై 72 ఇంతల మొత్తాన్ని ఇవ్వనుంది. ఇందుకోసం గ్రూప్–4 ఉద్యోగుల నుంచి సాలీనా 5 శాతం, ఇతరుల నుంచి 5.50 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. ఐఏఎస్ అధికారులకు రూ.35 లక్షల వరకు అడ్వాన్సు ఇవ్వనుంది. వారి నుంచి కూడా 5.5 శాతం వడ్డీ వసూలు చేయనుంది. ఇంటి నిర్మాణ అడ్వాన్సును 300 విడతల్లో, మరమ్మతుల అడ్వాన్సును 90 విడతల్లో, స్థలం కొనుగోలు అడ్వాన్సును 72 విడతల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కారు కొనుగోలు, పెళ్లి అడ్వాన్సులు.. రూ.54,220 బేసిక్, ఆ పైన వేతనం ఉన్న ఉద్యోగులకు కారు కొనుగోలు కోసం రూ.9 లక్షల అడ్వాన్సు ఇస్తుంది. ఈ మొత్తాన్ని 135 విడతల్లో 5–5.5 శాతం వడ్డీతో తిరిగి వసూలు చేస్తుంది. బేసిక్‌పే రూ.32,810 పైన ఉన్న ఉద్యోగులకు మోటార్‌సైకిల్ కొనుగోలుకు రూ.లక్ష అడ్వాన్సు ఇస్తుంది. ఇక కుమారుల వివాహానికి క్లాస్–4 ఉద్యోగులైతే రూ. 2 లక్షలు, ఇతరులకు రూ.3 లక్షలు, కుమార్తెల వివాహానికి రూ.2.5 లక్షలు, రూ.4 లక్షల చొప్పున ఇస్తుంది. వ్యక్తిగత కంప్యూటర్ అడ్వాన్సు కింద రూ.50 వేలు, పండుగ అడ్వాన్సు కింద క్లాస్–4 ఉద్యోగులకు రూ.6 వేలు, ఇతరులకు రూ.8,500, నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ఎడ్యుకేషన్ అడ్వాన్సు కింద రూ.15,500 ఇస్తారు. ప్రొటోకాల్ ఉద్యోగులకు 15 శాతం స్పెషల్ పే ప్రొటోకాల్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్పెషల్ పే కింద బేసిక్‌పే మీద 15 శాతాన్ని అదనంగా చెల్లిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల పరిధిలోని శిక్షణా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, శిక్షకులకు స్పెషల్ పే, ప్రోత్సాహకాలను మొదటి వేతన సవరణ కమిషన్ సిఫారసు చేసిన విధంగా వేతనాలను పెంచి చెల్లించనుంది. ఉద్యోగుల ప్రయాణ భత్యాన్ని (టీఏ) కూడా ప్రభుత్వం సవరించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రూ.26,410–రూ.78,820 వేతన స్కేల్ పరిధిలోనికి వచ్చే ఉద్యోగులు కనీసం నెలలో 15 రోజుల పాటు పర్యటిస్తే మండల కేంద్రాల్లో అయితే రూ. 600, ఒకే రెవెన్యూ డివిజన్ పరిధిలోని మూడు మండలాల పరిధిలో పర్యటిస్తే రూ. 700, రెవెన్యూ డివిజన్ మొత్తానికి రూ. 800 చొప్పున చెల్లిస్తారు. 20 రోజుల పాటు పర్యటిస్తే రూ.800, 900, 1,000 చొప్పున చెల్లిస్తారు. రూ.27,130–80,960 వేతన స్కేల్ పరిధిలోనికి వచ్చే ఉద్యోగులు నెలలో కనీసం 15 రోజులు పర్యటిస్తే రూ.800, 900, 1,000 చొప్పున, 20 రోజులు పర్యటిస్తే రూ.900, 1,000, 1,200 చొప్పున టీఏ చెల్లిస్తారు. పోలీసు కానిస్టేబుళ్లు, ఆక్టోపస్, యాంటీ నక్సల్స్ స్క్వాడ్, కౌంటర్ ఇంటిలిజెన్స్, ఎస్ఐబీ, ఏసీబీ తదితర విభాగాల్లో పని చేస్తున్న పోలీసు సిబ్బందికి స్పెషల్ అలవెన్సులు పెంచారు. పింఛన్‌దారులు మరణిస్తే... రాష్ట్ర ప్రభుత్వ పింఛన్‌దారులు మరణిస్తే తక్షణ సాయం కింద ఇప్పటివరకు ఇస్తున్న రూ.20 వేలను రూ.30 వేలకు పెంచుతూ జీవో నం 65 విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం సర్వీసు పింఛన్‌దారులు లేదా ఫ్యామిలీ పింఛన్‌దారులు మరణిస్తే వారి నామినీలకు అదే రోజున ఈ తక్షణ సాయాన్ని అందిస్తారు. -
తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసుపై సుప్రీంలో పూర్తయిన విచారణ
-
ఆరుశాతం వడ్డీ చెల్లించండి: హైకోర్టు
కోవిడ్ సమయంలో ఆపిన ఉద్యోగుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్ల బకాయిలపై 6 శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ కాలం కొనసాగే వరకు 50 శాతం వేతనం, పింఛన్లలో కోత విధిస్తూ 2020, మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 27ను తీసుకొచ్చింది. తర్వాత దీనిపై ఆర్డినెన్స్ కూడా తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టు విశ్రాంత అధికారులు, ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతలు, తెలంగాణ పింఛనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో పాటు మరికొందరు రిట్ పిటిషన్లు, ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది సత్యంరెడ్డి రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. వీటన్నింటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు చైతన్య మిత్ర వాదనలు వినిపించారు. కోవిడ్ సమయంలో ఉద్యోగుల వేతనాలతో పాటు పింఛన్లు కూడా ఆపారన్నారు. మూడు నెలలు ఇబ్బందులు పడ్డారు.. మూడు నెలలపాటు 50 శాతం వేతనాలు, పింఛన్లు నిలిపేయడంతో వారు ఇబ్బందులు పడ్డారని నివేదించారు. మూడు నెలలు ఆపిన మొత్తాన్ని కూడా ఒకేసారి చెల్లించలేదని, వాటిని కూడా విడతల వారీగా చెల్లించారని చెప్పారు. ఈ మొత్తానికి 12 శాతం వడ్డీ చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. కోవిడ్ సమయంలో ఆపిన వేతనాలు, పింఛన్లకు 6 శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాదనలు ముగించింది. 2020, మార్చిలో జీవో విడుదల చేసిన తర్వాత మార్చి, ఏప్రిల్, మే నెల వేతనాల్లో కోత విధించారు. వీటిని ఇదే సంవత్సరం నవంబర్, డిసెంబర్, 2021 జనవరి, ఫిబ్రవరిలో విడతలవారీగా చెల్లించారు. -
సమగ్ర భూచట్టం..రెవెన్యూ కోడ్ తేవాలంటున్న నిపుణులు!
రాష్ట్రంలో భూముల వివాదాలు, సమస్యలను పరిష్కరించడం కోసం సమగ్ర చట్టాన్ని అమల్లోకి తెచ్చే అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న 124 భూ చట్టాలన్నింటినీ కలిపి.. రెవెన్యూ కోడ్ (ఒకే చట్టం)గా రూపొందించాలని భూచట్టాల నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని.. ఇది అమల్లోకి వస్తేనే రాష్ట్రంలోని భూముల పరిపాలన, హక్కుల కల్పన, వివాదాల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో రెండేళ్ల క్రితం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చినా.. దాన్ని కేవలం ఒక్క భూహక్కుల రికార్డుల చట్టం–1971ని సవరించి తెచ్చుకున్నామని గుర్తు చేస్తున్నారు. దీనితోపాటు ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని భూచట్టాలను కలిపి కొత్తగా సమగ్ర చట్టాన్ని తెస్తేనే ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా ‘కోడ్’ ప్రయత్నాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2016లోనే రెవెన్యూ కోడ్‌ను అమల్లోకి తెచ్చారు. అది దేశంలోనే మార్గదర్శకంగా నిలిచిందని.. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కూడా దాదాపు ఒకే తరహా చట్టంతో రెవెన్యూ పాలన చేస్తున్నాయని భూచట్టాల నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఒడిశాలోనూ కొత్త సమగ్ర చట్టం కోసం ఇటీవలే మంత్రులు, సీనియర్ అధికారులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేస్తున్నారు. దేశమంతా రెవెన్యూ కోడ్ వైపు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో.. తెలంగాణలోనూ ఆ దిశలో ప్రయత్నాలు మళ్లీ ప్రారంభం కావాలని కోరుతున్నారు. ప్రస్తుతమున్న ఆర్ఓఆర్, కౌలుచట్టం, ఇనామ్‌ల రద్దు, అసైన్డ్ భూముల చట్టం వంటివన్నీ రద్దు చేసి ఒకే చట్టాన్ని తీసుకుని రావాలని ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక కూడా అందించారు. రాష్ట్రం ఏర్పాటైన మొదట్లోనే.. వాస్తవానికి తెలంగాణలో సమగ్ర రెవెన్యూ చట్టాన్ని రూపొందించుకునే ప్రయత్నం రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే మొదలైంది. నాటికి ఉన్న రెవెన్యూ చట్టాలన్నింటినీ సమీక్షించి కొత్త చట్టాన్ని రూపొందించే బాధ్యతను నల్సార్ విశ్వవిద్యాలయానికి అప్పగిస్తూ 2015లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవో మేరకు రెవెన్యూ చట్టాలను పునఃసమీక్షించిన నల్సార్ వర్సిటీ 30 పేజీలతో కూడిన సమగ్ర భూచట్టాల ముసాయిదాను ప్రభుత్వానికి అందజేసింది. ప్రస్తుతం ఈ ముసాయిదా కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో.. భూ వి వాదాలు తగ్గేలా, పాలన సులభతరం చేసేలా, గందరగోళానికి తావులేకుండా ఉండే సమగ్ర భూచట్టాన్నిరూపొందించాలనే డిమాండ్ వినిపిస్తోంది. హక్కుల చిక్కులు తీర్చేదిశగా.. భూచట్టాల నిపుణులు చేస్తున్న సూచనలివీ.. భూసమస్యలు పరిష్కారం కావాలంటే సర్వే తప్పనిసరి. ఒకప్పుడు సర్వేకు ఏళ్లు పట్టేది. కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చాలా తక్కువ సమయంలోనే సర్వే చేయవచ్చు. ఇందుకోసం సర్వే, హద్దుల చట్టం–1923 స్థానంలో కొత్త చట్టం తేవాలి. ఈ సర్వే పూర్తయ్యేలోపు భూలావాదేవీ జరిగిన ప్రతిసారీ సంబంధిత భూమిలో సర్వే జరగాలి. సర్వేయర్ల కొరతను నివారించేందుకు లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి.. వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న కమ్యూనిటీ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలి. – భూమి హక్కులకు ప్రభుత్వమే పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తేవాలి. కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ కొత్త చట్టం చేయాలి. – భూసంబంధిత అంశాల విషయంలో ఒకే చట్టం ఉండి.. ప్రజలకు అర్థమయ్యే విధంగా సరళంగా ఉన్నప్పుడే ప్రయోజనం ఉంటుంది. అమలు చేసే వారికీ సులభంగా ఉంటుంది. అన్ని భూచట్టాలను కలిపి రెవెన్యూ కోడ్‌గా రూపొందించాలి. – ధరణి పోర్టల్‌లో సమస్యలు పరిష్కారం కావాలంటే ఆ రికార్డులన్నింటినీ కాగితాల్లోకి ఎక్కించాలి. ప్రజల భాగస్వామ్యంతో సర్వే నంబర్ల వారీగా సమస్యలు గుర్తించి.. గ్రామంలోనే రెవెన్యూ కోర్టు పెట్టి వాటిని పరిష్కరించాలి. – భూవివాదాల పరిష్కార చట్టాన్ని తెచ్చి జిల్లాకో శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. రిటైర్డ్ జడ్జి లేదా రెవెన్యూ నిపుణుల నేతృత్వంలో అవి పనిచేయాలి. – కౌలు రైతుల కష్టాలు తీరాలంటే కచి్చతంగా చట్టాల్లో మార్పు రావాలి. పోడు సాగు చేస్తున్న గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలి. – పేదలకు భూసమస్యలు, వివాదాలు వచ్చినప్పుడు వాటిని కోర్టుల్లో పరిష్కరించుకోవడంలో సాయం అందించేందుకు పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. – భూమిలేని నిరుపేద కుటుంబాలకు భూములు ఇచ్చే మార్గాలు వెతకాలి. భూవిధానం, వినియోగం ప్రజలకు మేలు కలిగేలా ఉండాలి. ఇందుకోసం భూపరిపాలనను మెరుగుపర్చాలి. భూఅకాడమీ ఏర్పాటు చేసి భూపరిపాలనలో సిబ్బంది కొరత లేకుండా నియామకాలు జరపాలి. – ఈ అన్ని చర్యలు తీసుకునేందుకు వీలుగా భూకమిషన్ను ఏర్పాటు చేయాలి. రైతులు, సామాన్య ప్రజల డిమాండ్లు ఇవీ.. – భూములను రీసర్వే చేయాలి. భూరికార్డులను సవరించి అందరికీ అందుబాటులో ఉంచాలి. – పేదలకు భూములను పంపిణీ చేయాలి. కౌలు దారులకు రుణఅర్హత కార్డులు ఇవ్వాలి. – సాదాబైనామా భూములను క్రమబదీ్ధకరించాలి. పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి. – రెవెన్యూ, అటవీ శాఖల మధ్య ఉన్న భూవివాదాలను పరిష్కరించి సాగులో ఉన్న వారికి పట్టాలివ్వాలి. ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ అధికారి ఉండాలి. – అన్యాక్రాంతమైన గిరిజన, అసైన్డ్ భూములను తిరిగి ఇప్పించాలి. మహిళలకు భూహక్కులు కలి్పంచాలి. పారాలీగల్ వ్యవస్థను బలోపేతం చేయాలి. ధరణితోపాటు ఇతర సమస్యలూ ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తుంటే కేవలం ధరణి పోర్టల్‌ను సరిచేస్తే భూవివాదాలన్నీ సమసిపోతాయనే అభిప్రాయం కనిపిస్తోంది. కానీ ధరణి మాత్రమే సర్వరోగ నివారిణి కాదు. దాని చుట్టూనే చర్చ జరగడం సమంజసం కాదు. తెలంగాణ ఏర్పాటవుతున్న సమయంలోనే ‘ల్యాండ్ క్యారవాన్’ పేరుతో రాష్ట్రంలో దాదాపు మూడువేల కిలోమీటర్లు ప్రయాణించి పదివేల మందికిపైగా రైతులను, భూయజమానులను కలిసి నివేదిక రూపొందించాం. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలన్నింటినీ కలిపి ఒకే చట్టం (రెవెన్యూ కోడ్)గా రూపొందించడం, భూములను రీసర్వే చేయడం, జిల్లాకో శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం, టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావడం ఈ నివేదికలో ప్రధానమైనవి. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. – భూమి సునీల్, భూ చట్టాల నిపుణుడు -
గవర్నర్ తమిళిసై విషయంలో వెనక్కి తగ్గిన కేసీఆర్ సర్కార్..
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై విషయంలో తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గింది. గవర్నర్‌పై దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ తరఫు లాయర్ దుశ్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. గవర్నర్‌ను విమర్శించొద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు మొదలవుతాయని ఆయన పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో బడ్జెట్ తేదీ మార్పుపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. 3వ తేదీ బదులు 6వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది. కాగా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వర్సెస్ తెలంగాణ సర్కార్ వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. బడ్జెట్ సిఫార్సులకు ఇంకా గవర్నర్ ఆమోద ముద్ర పడని నేపథ్యంలో.. ఆమెకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ నాటకీయ పరిణామల నడుమ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌కు సోమవారం హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే లంచ్ మోషన్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం గమనార్హం. చదవండి: కేసీఆర్ సర్కార్ Vs గవర్నర్.. మండలి ఛైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు గతంలో ఏం జరిగింది? రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుండగా, ఇందుకు విరుద్ధంగా గతేడాది బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. అసెంబ్లీని ప్రొరోగ్ చేయకపోవడంతో గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి సాంకేతికంగా వెసులుబాటు ఉంది. దీనిని ఉపయోగించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడానికి సిద్ధమైంది. తనను అవమానించడానికే రాష్ట్ర ప్రభుత్వం తన ప్రసంగాన్ని రద్దు చేసుకుందని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సిఫారసు చేశానని గతేడాది గవర్నర్ పేర్కొన్నారు. తాను తలుచుకుంటే సిఫారసు చేయకుండా పెండింగ్‌లో ఉంచగలనని కూడా అప్పట్లో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విబేధాలు మరింత తీవ్రమైన నేపథ్యంలో.. ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలను తక్షణమే సిఫారసు చేయకుండా గవర్నర్ పెండింగ్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. దీనిపై సోమవారం రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. గవర్నర్ ప్రసంగం ఉంటుందని టీఎస్ సర్కార్ హైకోర్టుకు తెలిపింది. -
రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల ధన్యవాదాలు
ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 75 ఏళ్ల భారత స్వతంత్ర్య వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల కోసం థియేటర్లలో గాంధీ సినిమాను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) ఉదయం ఆటను శేఖర్ కమ్ముల విద్యార్థులతో కలిసి దేవి థియేటర్లో చూశారు. అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ.. వందల మంది విద్యార్థులతో కలిసి గాంధీ సినిమా చూడటం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నారు. చదవండి: మంచు లక్ష్మికి అరుదైన గౌరవం, 100 మంది మహిళల్లో ఒకరిగా.. ‘ఈ రోజు ఉదయం దేశి థియేటర్లో గాంధీ సినిమాను వందల మంది విద్యార్థులతో కలిసి చూశాను. ఇదోక మర్చిపోలేని అనుభవం. గాంధీజీ చేపట్టిన సత్యాగ్రాహంలో భాగంగా ఈ చిత్రంలో వచ్చే సన్నివేశాలకు దేశభక్తితో పిల్లలు స్పందిస్తుంటే గర్వంగా అనిపించింది. లాంటి కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది. మీరూ గాంధీ సినిమాను చూడండి’ అని పిలుపునిచ్చారు. అలాగే భారత స్వతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: Anasuya Bharadwaj: ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి: అనసూయ సంచలన వ్యాఖ్యలు -
మరోసారి చాన్స్! ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు ఓకే
2014 జూన్ 2 నాటికి ముందు ఆక్రమణలో ఉన్నట్టు రుజువులున్న స్థలాలనే క్రమబద్ధీకరిస్తారు. దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్‌కార్డు/ఏదైనా డాక్యుమెంట్)తోపాటు.. స్థలం తమ అధీనంలో ఉన్నట్టు నిరూపించే ఆస్తిపన్ను రశీదు/విద్యుత్ బిల్లు/తాగునీటి బిల్లు/రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వంటివాటిలో ఏదైనా ఒకటి జత చేయాలి. ఖాళీ భూములను క్రమబద్ధీకరించరు. నివాసేతర వినియోగంలో ఉన్న స్థలాల్లో కూడా ఏదో ఒక నిర్మాణం ఉండాలి. ఎలాంటి వివాదాల్లేని ప్రభుత్వ భూములు, పట్టణ భూగరిష్ట పరిమితి చట్టంలోని మిగులు భూములను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అవకాశం కల్పించింది. 2014 డిసెంబర్లో జారీ చేసిన జీవో నంబర్.58, 59కు అనుగుణంగా.. భూముల అసైన్మెంట్, క్రమబద్ధీకరణ, హక్కుల బదలాయింపు కోసం దరఖాస్తులకు గడువిస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ సోమవారం జీవో నంబర్ 14ను జారీ చేశారు. దీనికి అనుగుణంగా భూపరిపాలన ప్రధాన కమిషనర్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఈ నెల 21 నుంచి మార్చి 31 వరకు మీసేవ కేంద్రాల్లో క్రమబద్ధీకరణ దరఖాస్తు చేసుకోవచ్చు. 2014 జూన్ 2వ తేదీకి ముందే ఆక్రమణకు గురైన స్థలాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. పెండింగ్‌తోపాటు కొత్తగా కూడా.. గతంలో జారీచేసిన నంబర్ 58, 59 జీవోల కింద రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 2లక్షల వరకు దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం రెండు వాయిదాల్లో నిర్దేశిత ఫీజును చెల్లించకపోవడం, తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో మిగతా 1.5 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. అయితే.. ఎన్ని దరఖాస్తులు, ఏయే కారణాలతో పెండింగ్‌లో పడ్డాయన్న వివరాలను ప్రభుత్వం ఇటీవలే అన్ని జిల్లాల నుంచి సేకరించింది. పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం ఆ వివరాలను పరిశీలించి.. మరోమారు క్రమబద్ధీకరణ అవకాశం కల్పించాలని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెండింగ్‌లో ఉన్నవాటిని పరిష్కరించడంతోపాటు గతంలో దరఖాస్తు చేసుకోలేనివారు కూడా జీవో 14 ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చని.. వ్యక్తిగత ధ్రువీకరణతోపాటు సదరు భూమి కబ్జాలో ఉన్నట్టు తగిన ఆధారాలను సమర్పించాలని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమని పేర్కొన్నాయి. 58, 59 జీవోల్లోని అంశాలివే.. – 125 చదరపు గజాల్లోపు స్థలాలను ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమద్ధీకరిస్తారు. – 250 చదరపు గజాల్లోపు ఆక్రమణలకు ప్రభుత్వ కనీస ధరలో 50శాతం.. 250–500 చదరపు గజాల స్థలాలకు కనీస ధరలో 75 శాతం సొమ్మును ఫీజుగా కట్టాలి. – 500 నుంచి 1000 చదరపు గజాల స్థలాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకున్నవారు ప్రభుత్వ కనీస ధరను పూర్తిగా చెల్లించాలి. – విస్తీర్ణంతో సంబంధం లేకుండా.. నివాసేతర వినియోగ భూములకు ప్రభుత్వ కనీస ధర పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. – ఈ భూముల క్రమబద్ధీకరణ కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. – క్రమబద్ధీకరణపై ఆర్డీవో చైర్మన్‌గా, సంబంధిత తహశీల్దార్ సభ్యులుగా ఉండే కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. – తహసీల్దార్లు సదరు దరఖాస్తుదారుల కుటుంబాల్లోని మహిళల పేరు మీదే కన్వేయన్స్ డీడ్‌ను చేసి ఇవ్వాల్సి ఉంటుంది. – ఏవైనా సమస్యలు తలెత్తితే జాయింట్ కలెక్టర్ సంబంధిత కమిటీకి తగిన సూచనలు చేస్తారు. – ఏ దరఖాస్తునైనా ఎలాంటి కారణం చూపకుండానే తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని జీవోల్లో పేర్కొన్నారు. చార్జీలు/ఫీజులపై స్పష్టత కరువు! 2014 నాటి 58, 59 జీవోల ప్రకారం తాజా క్రమబద్ధీకరణ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించినా.. చార్జీలు/ఫీజుల విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. గతంలో పెండింగ్‌లో పడ్డ 1.5 లక్షల దరఖాస్తులకు అప్పటి ధరలే వర్తింపజేయవచ్చని అధికారవర్గాలు చెప్తున్నా.. ఒకవేళ ప్రస్తుత మార్కెట్ ధరలను ఏమైనా పరిగణనలోకి తీసుకుంటారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక కొత్తగా చేసుకునే దరఖాస్తులకు సంబంధించి.. ఇటీవల పెంచిన భూములు/స్థలాల ధరలే వర్తిస్తాయని అధికారులు అంటున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదని పేర్కొంటున్నారు. -
హైదరాబాద్‌లో రూ. 1,14,000.. ములుగులో రూ. 1,700
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఖాళీ స్థలాల విలువలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. హైదరాబాద్‌కు, ములుగుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తాజాగా నిర్ధారించిన గజం భూమి ప్రభుత్వ విలువ మధ్య ఉన్న తేడా..‘భూమికీ ఆకాశానికీ..’ అనే నానుడిని గుర్తుతెస్తోంది. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ నడిబొడ్డున గజం విలువ రూ.1.14 లక్ష లుగా నిర్ధారణ కాగా, ములుగు జిల్లాలో అత్యధి కంగా గజానికి రూ.1,700గా మాత్రమే నిర్ధారిం చారు. అంటే ఈ రెండు ప్రాంతాల నడుమ ఏకంగా 67రెట్ల వ్యత్యాసం ఉండటం గమనార్హం. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ప్రభుత్వ విలువలను జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ల శాఖ ఖరారు చేసి ఆయా జిల్లాలకు పంపింది. ఈ వివరాలను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ములుగు తర్వాత భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా రూ.2,400 గజం విలువ కాగా, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, చార్మినార్, నయాపూల్‌లో రూ.1.05 లక్షలుగా ఖరారయిం ది. హైదరాబాద్ దూద్‌బౌలీలో రూ.87,800గా విలువ ఖరారయితే, రంగారెడ్డి జిల్లా మియా పూర్, చందానగర్, రాయ్‌దుర్గ్ లాంటి ప్రాం తాల్లో రూ. 52,700గా నిర్ధారించారు. మరిన్ని ఆసక్తికర విషయాలివే.. ► హైదరాబాద్ దూద్‌బౌలీలో ప్రస్తుతం రూ.65 వేలుగా ఉన్న గజం విలువను రూ.87,800కు పెంచారు. అదే ఇక్కడ అపార్ట్మెంట్లకు సంబంధించి చదరపు అడుగుకు ప్రస్తుతం రూ. 6,200 ఉండగా దాన్ని రూ.7,800 మాత్రమే పెంచారు. ► బంజారాహిల్స్ రోడ్ నం:3, 1, పంజాగుట్ట ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.84,500 ఉన్న చదరపు గజం విలువను రూ. 1,14,100కు పెంచారు. ఇక్కడ అపార్ట్మెంట్లకు గాను చదరపు అడుగుకు రూ.7,600 ఉండగా దాన్ని రూ.9,500కు పెంచారు. ► మాసాబ్‌ట్యాంక్, క్రాస్‌రోడ్స్, ఎస్ఆర్నగర్, ఖైరతాబాద్ అయోధ్య హోటల్, సంత్ నిరంకారి టూ రవీంద్రభారతి (లక్డీకాపూల్), ఏజీ ఆఫీస్ సర్కిల్ (సైఫాబాద్), అమీర్‌పేట క్రాస్‌రోడ్స్, పంజాగుట్ట రాజీవ్‌గాంధీ సర్కిల్, ఎర్రగడ్డ థెరెస్సా చర్చి, భరత్‌నగర్ ఫ్లైఓవర్, ఉమేశ్‌చంద్ర విగ్రహం తదితర ప్రాంతాల్లోనూ రూ.1.14 లక్షలుగా చదరపు గజం ఖాళీ స్థలం విలువలను నిర్ధారించారు. ► శ్రీనగర్ కాలనీలో రూ.78 వేలుగా ఉన్న విలువలను చదరపు గజానికి రూ. 1,05,300కు సవరించారు. ఫ్లాట్ల విలువ చదరపు అడుగుకు రూ. 7వేల నుంచి రూ.8,800కి సవరించారు. ► చార్మినార్ సమీపంలోని నయాపూల్‌లో కూడా ప్రభుత్వ విలువను భారీగానే పెంచారు. ఇక్కడ చదరపు గజానికి ఖాళీ స్థలం ప్రస్తుతం రూ. రూ.78 వేలు ఉండగా, దాన్ని రూ.1.05,300కు పెంచారు. ఫ్లాట్ల విలువ చదరపు అడుగుకు రూ. 7వేల నుంచి రూ.8,800కి సవరించారు. ► రంగారెడ్డి జిల్లాలో శంకరపల్లి, కేశంపేట, చౌదరిగూడ, ఫారూఖ్‌నగర్, కొందుర్గ్, మాడ్గుల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఓ మోస్తరుగానే ధరలు ఖరారు చేశారు. నగర శివార్లలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు చోట్ల భారీ ఎత్తున ధరలు నిర్ధారణ అయ్యాయి. ► సూర్యాపేట పట్టణంలోని కుడకుడ రోడ్డులో గజం భూమి విలువను అత్యధికంగా రూ.26,400గా నిర్ధారించగా, హుజూర్నగర్, కోదాడల్లో రూ.17,600, నేరేడుచర్లలో రూ.5,800గా అత్యధిక ధరలను ఖరారు చేశారు. ► యాదాద్రి జిల్లాలో భువనగిరిలో ఎక్కువ ధర ఉండగా, యాదగిరిగుట్టతో సహా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగానే ధరలను ఖరారు చేశారు. -
మద్యం ప్రియుల్లో ‘నయా’ జోష్ .. తాగండి.. ఊగండి..! కానీ
సాక్షి, పెద్దపల్లి (కరీంనగర్): మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. డిసెంబర్ 31 సందర్భంగా మద్యం షాపులకు ఆంక్షలను ఎత్తివేసింది. పైగా అర్ధరాత్రి వరకు మద్యంషాపులు తెరిచి ఉంచవచ్చని, బార్లు ఒంటిగంట వరకూ నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ఈవెంట్లు కూడా చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ కావడంతో మద్యంప్రియుల్లో జోష్ నెలకొంది. జిల్లావ్యాప్తంగా 77 మద్యం షాపులు ఉన్నాయి. గోదావరిఖని, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌లో బార్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఒక్కషాప్ నుంచి రూ.రెండు లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వరకు అమ్మకాలు జరుగుతాయి. శుభకార్యాలు ఉంటే మరింత పెరుగుతాయి. అయితే డిసెంబర్ 31 అంటేనే యువతలో తెలియని జోష్ ఉంటుంది. మద్యంతో విందులు చేసుకుంటూ సరదాగా గడుపుతారు. దీనిని సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేసింది. సాధారణ రోజుల్లో రాత్రి 10 గంటల వరకే వైన్స్‌షాపులు మూసివేయాలి. కానీ.. ఈ 31న మాత్రం అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంటే వెసులుబాటు కల్పించింది. ఈవెంట్లు నిర్వహించుకునేవారు మాత్రం ఎక్సైజ్ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. బయటకొస్తే తాట తీస్తారు.. డిసెంబర్ 31 సందర్భంగా మద్యంషాపులపై ఆంక్షలు ఎత్తేసిన ప్రభుత్వం పోలీసులకు మాత్రం కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా గుంపులు, గుంపులుగా కనిపించినా.. తాగి బయటకొచ్చినా పోలీసులు వదలరు. ఎక్కడికక్కడ డ్రంకెన్‌డ్రైవ్ చేపట్టనున్నారు. ఒకవేళ మద్యం తాగి పోలీసులకు చిక్కితే మాత్రం కటకటాల్లోకి పంపించనున్నారు. ఎవరి ఇళ్లలో వారే పార్టీ చేసుకోవాలని, బయటకొస్తే మాత్రం తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే జోరందుకున్న అమ్మకాలు డిసెంబర్ 31 నేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. వైన్స్‌షాపులు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని తెలిసినా.. పోలీసులతో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ మద్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే తనిఖీలు చేపడతామని, ఎవరు పట్టుబడినా.. జరిమానాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటించాలి నిబంధనలు అందరూ పాటించాలి. ఎవరి ఇళ్లలో వారే సెలబ్రేషన్ చేసుకోవాలి. బయటకు రావొద్దు. జనజీవనానికి ఆటంకం కలిగించొద్దు. అర్ధరాత్రి 12గంటల వరకు మద్యం తీసుకెళ్లొచ్చు. అయితే అప్పటికే తాగి ఉండరాదు. ఎక్కడికక్కడ డ్రంకెన్‌డ్రైవ్ ఉంటుంది. అందులో పట్టుబడితే జైలుకు పంపిస్తాం. ఇందులో అనుమానం లేదు. – ఇంద్రసేనారెడ్డి, సీఐ, సుల్తానాబాద్ చదవండి: సాక్షి ఎఫెక్ట్: విష్ణువర్ధన్ వైద్యానికి భరోసా -
తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
-
రంజుగా మారిన తెలంగాణ రాజకీయం
-
9 నెలలు.. 40 మందికి ‘షోకాజ్’లు..
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని, వాటిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేర్చడంతోపాటు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంలో కీలక పాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శులు మాత్రం పనిభారంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జగిత్యాల జిల్లాలో 380 గ్రామ పంచాయతీలకు గాను 380 మంది పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. వీరు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గ్రామాల్లోనే ఉంటూ పరిశుభ్రత, పాలనలో తమదైన పాత్ర పోషిస్తున్నారు. కానీ చిన్నపాటి తప్పిదాలకే షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గత 9 నెలల కాలంలో 40 మందికి జారీ చేశారు. దీంతో కార్యదర్శులు విధులు నిర్వహించేందుకు జంకుతున్నారు. జీపీ కార్యదర్శులు చేసే పనులివే.. జీపీ కార్యదర్శులు నిత్యం గ్రామాల్లో ఉంటూ శానిటేషన్‌తోపాటు హరితహారం, పల్లెప్రగతి, ఉపాధిహామీ, ఇంకుడు గుంతలు, వర్మికంపోస్ట్‌ల షెడ్లు, రైతు కల్లాల నిర్మాణం తదితర పనులు చేయిస్తున్నారు. గ్రామాల్లో చేపట్టిన ప్రతీ పనిని ఫొటో తీసి, పీఎస్ యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఫలితంగా తీవ్రంగా మానసికఒత్తిడికి గురవుతున్నామని వాపోతున్నారు. రికార్డుల కస్టోడియన్‌తో తలనొప్పి.. గ్రామాల్లో రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత పనులు సక్రమంగా నిర్వహించడం లేదని ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో వారు ఆ నోటీసులకు సమాధానాలు ఇస్తూ రికార్డుల కస్టోడియన్ వంటి పనుల్లో తలమునకలవుతున్నారు. జీపీ కార్యదర్శులకు చెక్‌పవర్ లేకున్నా నిధుల దుర్వినియోగంలో రికార్డులు కస్టోడియన్ బాధ్యత ఉండటంతో వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ముగ్గురి సస్పెన్షన్.. గతంలో జాబితాపూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా పని చేసిన శ్రీవాణి ఎంబీ రికార్డులు లేకుండానే నిధులు డ్రా చేసేలా అవకాశం ఇచ్చారని ఆమెను సస్పెండ్ చేశారు. అలాగే ధర్మపురిలో పనిచేసిన చంద్రశేఖర్ 2018లో ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణం చేసుకుంటే ఇంటి నంబరు ఇచ్చారని, నెల రోజుల క్రితం సస్పెండ్ చేశారు. ధర్మపురి మండలం జైన పంచాయతీ నిధుల దుర్వినియోగంలో కార్యదర్శి మహబూబ్ పాషా, సర్పంచ్, ఉపసర్పంచ్ సస్పెండ్ అయ్యారు. చదవండి: తెలుగు అకాడమీలో రూ.64 కోట్ల గోల్మాల్.. -
50 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి
సాక్షి, ముషీరాబాద్(హైదరాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 50 వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యానగర్‌లోని బీసీ భవన్లో బుధవారం బీసీ సంఘం నేత గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీఈడీ, డీఈడీ, పీఈటీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్న మాదిరిగానే టీచర్ పోస్టులను భర్తీకి కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను తీ ర్చిదిద్ది పేద, బడుగు, బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దుతున్నారని, వేలకోట్లను వెచ్చిస్తున్నా రని తెలిపారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల ముందు నో వేకెన్సీ బోర్డులు దర్శనం ఇస్తున్నాయన్నారు. అదే పరిస్థితి తెలంగాణలో కూడా తీసుకురావాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో లాల్‌కృష్ణ, లక్ష్మణ్‌యాదవ్, అంజి, సత్యనారాయణ, అనంతయ్య, సతీశ్, చంటి ముదిరాజ్, సుచిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: దళితబంధును వదులుకున్న సిసలైన శ్రీమంతులు.. -
వారసత్వ రేసులో రామప్ప.. యునెస్కో కీలక సూచనలు
సాక్షి, పాలంపేట(వరంగల్): రుద్రేశ్వరాలయం అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ రామప్ప అంటే చాలా మంది ఇట్టే గుర్తు పట్టేస్తారు. ప్రస్తుతం ప్రపంచ వారసత్వ హోదా గుర్తింపు అంశం చివరి అంకానికి చేరుకుంది. అయితే రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వాలా, వద్దా? అనేది జులై 25న తేలనుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్లను గుర్తించేందుకు చైనాలో యునెస్కో జులై 16 నుంచి 31 వరకు కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. యూనెస్కో సూచనలు ఇప్పటికే రామప్ప ఆలయానికి సంబంధించిన నివేదికను పరిశీలించిన యునెస్కో బృందం పలు సందేహాలు లేవనెత్తి వాటికి సంబంధించి కీలక సూచనలు చేసింది. వీటికి అనుగుణంగా రామప్ప ఆలయం ఉన్న పాలంపేట గ్రామం పేరు మీదుగా పాలంపేట ప్రత్యేక అభివృద్ధి ప్రాథికార సంస్థను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో పాటు యూనెస్కో చేసిన పలు సూచనలకు అనుగుణంగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యునెస్కో సూచనలో మరికొన్ని కీలక అంశాలు, అడిగిన అదనపు సమాచారం ► రామప్ప ఆలయానికి అనుబంధంగా ఉన్న ఇతర ఆలయాలు, కట్టడాలు, రామప్ప సరస్సు, మంచి నీటి పంపిణీ వ్యవస్థలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చట్టపరమైన హక్కులు కల్పించాలి. ► రామప్ప ఆలయం, సరస్సు పరిధిలో జరిగే ఇతర అభివృద్ధి పనులకు హెరిటేజ్ పరిధిలోకి తీసుకురావాలి. ► గతంలో విప్పదీసిన కామేశ్వరాలయం పునర్ నిర్మాణ పనులకు సంబంధించి సమగ్ర నివేదికను సమర్పించాలి ► రామప్ప ఆలయానికి వచ్చే పర్యాటకులు, భక్తుల వల్ల ఆలయ నిర్మాణానికి నష్టం రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ► శిథిలమవుతున్న ఆలయ ప్రహారి గోడల పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి ► ఆలయ పరిరక్షణలో స్థానికులు, ఆయల పూజారులలకు భాగస్వామ్యం కల్పించాలి ► ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలను కాపాడటానికి భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలు ► జాతరలు, పండుగల సమయంలో ఆలయ ప్రాంగణంలో అధిక మొత్తంలో ప్రజలు ఉండకుండా చేపట్టే చర్యలు, పర్యాటకుల పర్యటనలకు సంబంధించి సమీకృత ప్లాను , ఎటునుండి రావాలి, ఎక్కడ ఎం చూడాలి, సూచిక బోర్డు లాంటి వివరాలు, విదేశీ భాషలలో ఆలయ వివరాలు ► కట్టడానికి సమీపంలో భవిష్యత్ లో చేప్పట్టనున్న ప్రాజెక్టుల వివరాలు అద్భుతాల నెలవు రామప్ప ఆలయం అద్భుతాలకు నెలవు. కాకతీయుల కాలం నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి, శిల్ప కళా సౌందర్యానికి చెక్కు చెదరని సాక్ష్యం. -
‘ తెలంగాణ స్కూళ్లు, కాలేజీల ప్రారంభంపై పునరాలోచన’
హైదరాబాద్: తెలంగాణలో స్కూళ్ల ప్రారంభంపై విద్యాశాఖ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత తెలంగాణ కేబినేట్ జులై 1 నుంచి విద్యాసంస్థలు తెరవాలని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తీసుకున్న నిర్ణయం మేరకు.. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ తరగతులను మాత్రం నేరుగా క్లాసులను నిర్వహించనున్నారు. అదే విధంగా, స్కూళ్లు, జూనియర్ కాలేజీల అంశంపై మాత్రం విద్యాశాఖ కాస్త మల్లగుల్లాలు పడుతోంది. దీనిపై నేడో, రేపో కీలక నిర్ణయం తీసుకుంటామని టీఎస్ సర్కారు ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: తెలంగాణలో దళితుల ప్రాణాలకు విలువ లేదా? -
ఎస్ఈసీపై తెలంగాణ హైకోర్టు అసహనం
-
ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాలా?: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘంపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారంటూ హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలు విలువైనవా? అని వ్యాఖ్యానించింది. యుద్ధం వచ్చినా.. ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాలా? అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఏకాభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్ఈసీ తెలిపింది. మరి ఫిబ్రవరిలో కోవిడ్ రెండో దశ మొదలైతే.. ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఎందుకిచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల ప్రక్రియపై ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఏంటని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల వాయిదాకు సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం మీకు లేదా? అని ఎస్ఈసీని ప్రశ్నించింది. ఎస్ఈసీ వివరణ సంతృప్తికరంగా లేదని హైకోర్టు పేర్కొంది. కాసేపట్లో ఎన్నికల సంఘం అధికారులు విచారణకు రావాలని హైకోర్టు ఆదేశించింది. చదవండి: కరోనా బాధితులకు గుడ్ న్యూస్: ఫోన్ కొడితే.. ఇంటి వద్దకే.. కొనసాగుతున్న కరోనా ఉధృతి, రికార్డు స్థాయిలో కేసులు -
కల్యాణలక్ష్మి కోసం కక్కుర్తి.. అడ్డంగా దొరికిపోయారు!
సాక్షి, బయ్యారం(మహబూబబాద్): నిరుపేద యువతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకాన్ని కొందరు అభాసుపాలు చేస్తున్నారు. పథకం ప్రారంభం కాక ముందు జరిగిన వివాహాలు ఇటీవలే జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి డబ్బు కాజేసేందుకు ప్రయత్నించారు. అయితే, విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు దీన్ని అడ్డుకున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేటకు చెందిన ముగ్గురు మహిళలకు ఐదేళ్ల క్రితం, మరో మహిళకు రెండేళ్ల క్రితం వివాహాలు జరిగాయి. వీరిలో ఇద్దరికి ఐదు, నాలుగేళ్ల పిల్లలు కూడా ఉన్నారు. అయితే, తాజాగా వారి పేరున కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరవడంతో అనుమానం వచ్చిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ నలుగురికి సంబంధించిన చెక్కులను నిలిపివేశామని తహసీల్దార్ నాగభవాని మంగళవారం తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అక్రమార్కులను శిక్షించాలని స్థానికులు కోరారు. -
శ్యామ్ కె. నాయుడికి సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: సినీ నటి శ్రీసుధపై వేధింపుల కేసులో టాలీవుడ్ సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె.నాయుడుకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నెలరోజుల్లోగా వీటిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. శ్యామ్ కె.నాయుడుతో తనకు ప్రాణహాని ఉందని... ఆయన బెయిల్ రద్దు చేయాలని శ్రీసుధ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టి శ్యామ్ కె.నాయుడితో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో సహజీవనం చేసి మోసగించాడని శ్రీసుధ గతంలో అతనిపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అతడు నకిలీ పత్రాలతో బెయిల్ తెచ్చుకున్నాడని శ్రీసుధ ఆరోపించింది. పెళ్లి పేరుతో నమ్మించి ఐదేళ్లు తనతో సహజీవనం చేసిన శ్యామ్ కె.నాయుడు.. ఆ తర్వాత తనను మోసం చేశారని గత ఏడాది మేలో శ్రీసుధ మొదటిసారి హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్ కె నాయుడిని అరెస్ట్ చేయగా రెండు రోజుల్లోనే బెయిల్‌పై బయటకొచ్చాడు. అయితే ఈ కేసులో శ్యామ్ కె. నాయుడి తనతో రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి కోర్టును తప్పుదోవ పట్టించడం ద్వారా బెయిల్ పొందాడని శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పత్రాలు నకిలీవని తేలడంతో అప్పట్లో అతని బెయిల్ కూడా రద్దయినట్లు కథనాలు వచ్చాయి. ఈ విషయంపై గత నెలలో మరోసారి ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీసుధ. ఇప్పటివరకూ అతన్ని అరెస్ట్ చేయలేదని ఆమె ఆరోపించారు. కొద్దిరోజుల క్రితం విజయవాడ పోలీసులకు ఫిర్యాదు... కొద్ది రోజుల క్రితం నటి శ్రీసుధ, శ్యామ్ కె నాయుడిపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కనకదుర్గ ఫ్లైఓవర్‌పై తన కారును ఢీకొట్టించి హత్యాయత్నం చేశారని... ఈ కుట్ర వెనుక శ్యామ్ కె నాయుడు ఉన్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తాను శ్యామ్ కె నాయుడుపై పెట్టిన కేసుకు, ఈ యాక్సిడెంట్‌కు లింకు ఉందని ఆరోపించారు. తనను అడ్డు తొలగించుకునేందుకు యాక్సిడెంట్ చేసి చంపేసేలా కుట్ర చేసి ఉంటాడని శ్రీసుధ అనుమానం వ్యక్తం చేశారు. శ్యామ్ కె.నాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరారు. చదవండి: నాపై ఉన్న కేసులన్నింటిని సిమ్లాకు మార్చండి -
ఏరివేత తర్వాతే కొత్త రేషన్ కార్డులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేత మళ్లీ తెరపైకి వచ్చింది. అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులు జారీ చేస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన నేపథ్యంలో.. కొత్త కార్డుల కంటే ముందుగా బోగస్ కార్డుల ఏరివేతపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టనుంది. రాష్ట్రంలో సుమారు 8 లక్షలకు పైగా బోగస్ కార్డులు చెలామణీలో ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో ముందుగా వాటిని తొలగించాకే కొత్తవాటిపై దృష్టి పెట్టాలని యోచిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో సీఎం స్థాయిలో జరిగే సమీక్ష అనంతరం కార్యాచరణ సిద్ధం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో మాదిరే మళ్లీ ఏరివేత.. రాష్ట్రంలో ప్రస్తుతం 87.56 లక్షల రేషన్ కార్డులు ఉండగా, వీటి ద్వారా 2.8 కోట్ల మంది లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున రూపాయికి కిలో బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇందులో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద గుర్తించిన వారు 1.91 కోట్ల మంది ఉన్నారు. రాయితీ బియ్యం పంపిణీకి ప్రభుత్వం ఏటా రూ.2,200 కోట్ల మేర ఖర్చు చేస్తోంది. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే బోగస్ కార్డుల ఏరివేతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించిన ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ కోసం సేకరించిన ఐరిస్, వేలిముద్రలతో పాటు ఆధార్ కార్డుల జారీకి తీసుకున్న కుటుంబాల వివరాలను కూడా ప్రత్యేక సర్వర్ ద్వారా క్రోడీకరించి బోగస్ కార్డులను తొలగించింది. వలస వెళ్లిన కుటుంబాలు, ఒకే కుటుంబంలో రెండు, అంతకంటే ఎక్కువ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, ఒకే కుటుంబంలో తెలుపు, గులాబీ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, నివాసంలో లేకుండా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, చనిపోయిన వారి వివరాలను సేకరించి సుమారు 10 లక్షల కార్డులను తొలగించింది. ప్రస్తుతం కొత్త కార్డులు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో బోగస్ కార్డుల ఏరివేత మళ్లీ కానుంది. రాష్ట్రంలో ఈ ఏడేళ్లలో చనిపోయిన వారు, ఇతర రాష్ట్రాల్లో కార్డులు కలిగి ఉన్న వారు సుమారు 8 లక్షల వరకు ఉంటారని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. ఈ కార్డులన్నింటినీ ఆధునిక పరిజ్ఞానం ద్వారా తొలగించాలని చూస్తోంది. కొత్త కార్డుల కోసం ఎదురు చూపులు బోగస్ కార్డుల ఏరివేత తర్వాతే కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో చాలా ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది. ప్రతి జిల్లాలో కుప్పలు తెప్పలుగా రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు రాగా, వీటిల్లో కొన్ని పరిశీలనలోనే నిలిచిపోగా, మరికొన్ని మంజూరు కాకుండా ఆగిపోయాయి. మీ–సేవ ద్వారా, ఆహార భద్రతా కార్డు వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా కొత్త కార్డులు, రద్దయిన కార్డుల పునరుద్ధరణ, కార్డుల్లో మార్పుచేర్పులు చేసుకునేందుకు భారీగా దరఖాస్తులు వచ్చినా చాలా వరకు పరిష్కారం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా పౌర సరఫరాల వద్ద కనీసం 5.5 లక్షల కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో గ్రేటర్ పరిధిలోనే 1.65 లక్షల దరఖాస్తులు, రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో లక్ష దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా వేస్తున్నా రు. ప్రస్తుతం కొత్త కార్డుల జారీ మొదలు పెడితే పాత దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం కొత్తగా మళ్లీ వచ్చే దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంటుంద ని పౌర సరఫరాల వర్గాలు చెబుతున్నాయి. ఇక అర్హులందరికీ గతంలో మాదిరి లామినేషన్ చేసిన కార్డును కాకుండా యూవిక్ పేపర్‌తో కూడిన కార్డును అందజేయాలనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
మూడు కాదు.. రెండేళ్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు కనీస సర్వీసు వ్యవధిని ప్రభుత్వం మూడేళ్ల నుంచి రెండేళ్లకు తాత్కాలికంగా కుదించింది. ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సంతకం చేశారు. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక కేటగిరీ/ క్లాస్/ గ్రేడ్ నుంచి మరో కేటగిరీ/ క్లాస్/ గ్రేడ్‌కు పదోన్నతి, లేదా పదోన్నతి ద్వారా బదిలీ కోసం కనీసం 2 ఏళ్ల సర్వీసు వ్యవధి ఉండాలనే తాత్కాలిక నిబంధన(అడ్‌హక్ రూల్)ను అమల్లోకి తెస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2020–21 ప్యానెల్ సంవత్సరం ముగిసే వరకు అనగా.. 2021, ఆగస్టు 31 వరకు ఈ తాత్కాలిక నిబంధన అమల్లో ఉంటుందని తెలిపారు. అర్హులైన వ్యక్తులు లేక చాలా వరకు ఖాళీగా ఉన్న పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయలేకపోతున్నామని, అందుకే కనీస సర్వీసు వ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. త్వరగా నివేదిక ఇవ్వండి.. ఉద్యోగుల వేతన సవరణ నివేదిక(పీఆర్సీ)పై అధ్యయనం, ఉద్యోగ సంఘాలతో చర్చల ప్రక్రియలను సత్వరంగా పూర్తి చేసి తనకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. టీఎన్జీవోల సంఘంఅధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, త్రిసభ్య కమిటీ సమక్షంలో సోమవారం ఆయన ప్రగతిభవన్‌లో పదోన్నతులకు కనీస సర్వీసు వ్యవధిని రెండేళ్లకు కుదిస్తూ సంబంధిత ఫైల్‌పై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎస్ సోమేశ్‌కుమార్‌కు పలు సూచనలు చేశారు. ఈ నెల మూడో వారంలో వేతన సవరణ, పదవీ విరమణ వయస్సు పెంపుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ దగ్గర పడిందని, వీటిపై నివేదిక ఇవ్వాలని కోరారు. నివేదిక వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటానని సీఎం పేర్కొన్నారు. -
మరోసారి బీఆర్ఎస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమ, అనధికార భవనాల క్రమబద్ధీకరణకు చివరిసారిగా అవ కాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచి స్తోంది. భవనాల క్రమబద్ధీకరణ పథకాన్ని (బీఆర్ఎస్) మరోసారి ప్రవేశపెట్టి కొత్త దరఖాస్తులు స్వీకరించాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప డ్డాక 2015 అక్టోబర్ 31న బీఆర్ఎస్ను ప్రవేశ పెడుతూ ప్రభుత్వం జీవో నం. 145 తీసుకురాగా దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలు గత ఐదేళ్లుగా రాష్ట్ర హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసు విచారణ చివరి దశకు చేరుకోవడంతో త్వరలో తీర్పు వచ్చే అవకాశాలున్నాయి. ఈ కేసులో అను కూలంగా తీర్పు వస్తే మరోసారి కొత్త బీఆర్ ఎస్‌ను ప్రవేశపెట్టి దరఖాస్తులు స్వీకరించా లని ప్రభుత్వం భావిస్తోంది. బీఆర్ఎస్ 2015–16 కింద దరఖాస్తు చేసుకోలేక పోయిన వారికి మరో అవకాశం ఇవ్వడంతో పాటు ఆ తర్వాత కాలంలో నిర్మించిన అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు చివరి సారిగా అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. పెండింగ్‌లో ఉన్న బీఆర్ఎస్ 2015–16 దరఖాస్తులతో పాటు కొత్తగా తీసుకురానున్న బీఆర్ఎస్ కింద వచ్చే దరఖాస్తులను కలిపి పరిష్కరించే అవకాశాలున్నాయి. ప్రభుత్వానికి విజ్ఞప్తులు... బిల్డింగ్ ప్లాన్‌ను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాల క్రమబద్ధీకరణ కోసం హైదరాబాద్ ప్రజలతోపాటు బిల్డర్ల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. బిల్డింగ్ ప్లాన్ ఉల్లంఘనల విషయంలో క్రమబద్ధీకరణ జరగక నగరంలోని వేలాది ఫ్లాట్ల విక్రయాలు జరగట్లేదు. ఎల్ఆర్ఎస్–2020 కింద అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 25 లక్షలకుపైగా దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ. 20 వేల కోట్లకు ఆదాయం రానుందని అంచనా వస్తున్నారు. కొత్తగా తేవాలనుకుంటున్న బీఆర్ఎస్ ద్వారా భారీ ఆదాయం వచ్చే అవకాశముంది. ఈ నిధులతో ఆయా నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కఠిన నిబంధనలతో అమలు.. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు చివరి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠిన నిబంధనలతో గతేడాది ఆగస్టులో ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇదే తరహాలో కఠిన నిబంధనలతో అక్రమ కట్టడాలు, గృహాల క్రమబద్ధీకరణకు చివరి అవకాశం కల్పిస్తూ కొత్త బీఆర్ఎస్ను తేవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఎల్ఆర్ఎస్ తరహాలోనే బీఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణను తప్పనిసరి చేసేలా నిబంధనలు ఉండనున్నాయని, క్రమబద్ధీకరణ ఫీజులు సైతం గతంలోకన్నా అధిక మొత్తంలో ఉండవచ్చని రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అక్రమ ఇళ్లను క్రమబద్ధీకరించుకోకుంటే ఇప్పటికే ఉన్న మున్సిపల్ చట్ట నిబంధనల ప్రకారం జరిమానాగా 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులను అధికంగా వసూలు చేయడం, నల్లా బిల్లులను సైతం కొంత వరకు పెంచి వసూలు చేయడం, నోటీసులు లేకుండా కూల్చేయడం వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
మ్యుటేషన్ చార్జీ ఎకరాకు రూ. 2,500
సాక్షి, హైదరాబాద్: భూ హక్కుల బద లాయింపు (మ్యుటేషన్)నకు ప్రత్యేక చార్జీలు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాగు భూముల హక్కుల బదిలీకి ఎకరాకు రూ. 2,500 చొప్పున వసూలు చేయనుంది. భూ విస్తీర్ణానికి అనుగుణంగా ఈ ఫీజును తీసుకోనుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 29వ తేదీ నుంచి భూ హక్కులు, పట్టాదార్ పాస్పుస్త కాల చట్టం–2020 అమల్లోకి రావడంతో అం దుకు అనుగుణంగా ప్రభుత్వం చార్జీలను ప్రకటించింది. మ్యుటేషన్‌కు ఎకరాకు రూ.2,500 నిర్దేశించిన రెవెన్యూ శాఖ.. కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం ముద్రణతోపాటు కొరియర్ చార్జీల రూపేణా రూ. 300 వసూలు చేయనుంది. ఇన్నాళ్లూ మ్యుటేషన్‌కు నయా పైసా వసూలు చేయని ప్రభుత్వం తాజాగా చార్జీలను వడ్డించడంతో రిజిస్ట్రేషన్ల కోసం ధరణి పోర్టల్‌లో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారు చలానా సమయంలో కొత్త చార్జీలు కనిపించడంతో ఆశ్చర్యపోయారు. సోమ వారం నుంచి సాగు భూముల రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం కానున్నాయి. కాగా, ‘ధరణి’ని ప్రారంభించిన 24 గంటల్లోనే ఏకంగా 33 లక్షల మంది వీక్షించారు. -
సిద్దిపేటలాగా.. దుబ్బాక ఎందుకు లేదు?
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను అభివృద్ధి చేసుకున్న కేసీఆర్, హరీశ్, కేటీఆర్‌లు దుబ్బాకను ఎందుకు పట్టించు కోలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. రామలింగా రెడ్డి దుబ్బాకలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా చేశారని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయ లేకపోతున్నానని ఆయనే అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. శనివారం దుబ్బాక నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడుతూ.. అధికార పార్టీలో ఉన్నా అధి కారులు తనకు సహకరించడం లేదని రామ లింగారెడ్డి అసెంబ్లీలోనే ఆవేదన వ్యక్తం చేశా రని చెప్పారు. నాలుగుసార్లు గెలిచిన రామలింగారెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని, హరీశ్‌రావు ఎందుకు తప్పుకోలేదని ప్రశ్నించారు. అలాంటి హరీశ్ ఏం మొహం పెట్టుకుని దుబ్బాకలో ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై రేప్ కేసు ఆరోపణలు ఉన్నాయని, సొంత పార్టీ నేతలే ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. హరీశ్‌రావు–రఘునందన్‌రావు ఒకే సామాజిక వర్గం వారని, ఇద్దరూ బంధువులని తెలిపారు. రఘునందన్ గెలిస్తే టీఆర్ఎస్లోకి వెళ్తారని చెప్పారు. దుబ్బాకను అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు చెరుకు ముత్యంరెడ్డి అని, ఏ గ్రామానికి వెళ్లినా ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందని ఉత్తమ్ పేర్కొన్నారు. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందాయని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించి ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు.. శ్రవణ్‌కుమార్ అనే డాక్టర్ తన సొంత వ్యాపారం నిమిత్తం డబ్బులు తీసుకెళ్తుంటే పట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఉత్తమ్ అన్నారు. తనిఖీలు, సోదాల పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రగతిభవన్, కేసీఆర్ ఫామ్‌హౌస్, టీఆర్ఎస్ నేతల ఇళ్లలో పోలీసులు ఎందుకు సోదాలు చేయడం లేదని ప్రశ్నించారు. ఓ రిటైర్డ్ అధికారికి ప్రత్యేక బృందం ఇచ్చి తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, దీనిపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఒక సామాజిక వర్గం వారు రిటైర్ అయినా మళ్లీ పదవులు ఇస్తూ రాష్ట్ర నిధులన్నీ వారి చేతుల్లో పెడుతున్నారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ కార్యకర్తలు వెనక్కు తగ్గరని ధీమా వ్యక్తం చేసిన ఉత్తమ్ ఆదివారం సాయంత్రం వరకు ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త విశ్రమించకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. నో ఎల్ఆర్ఎస్... నో టీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్– నో టీఆర్ఎస్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉత్తమ్ కోరారు. రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదని చెప్పారు. పంట బీమా కల్పించకపోవడంతో రైతులకు అన్యాయం జరిగిన విషయాన్ని ప్రజలకు చెప్పాలని టీపీసీసీ చీఫ్ సూచించారు. -
రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 570 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటినుంచి అమల్లోకి రానున్న తెలంగాణ భూమి హక్కులు మరియు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం –2020లో భాగంగా మండల కేంద్రాల్లోని తహసీల్దారు కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు వీలుగా రిజిస్ట్రేషన్ల శాఖను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ల చట్టం –1908 ప్రకారం రాష్ట్రంలోని 32 జిల్లాలను (హైదరాబాద్ మినహా) 10 కొత్త సబ్ జిల్లాలుగా పరిగణిస్తూ ఒక్కో సబ్ జిల్లాలో తహసీల్దార్ కార్యాలయాల వారీగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 570 తహసీల్ కార్యాలయాలను రిజిస్ట్రేషన్ల చట్టం–1908లోని సెక్షన్ 5 ప్రకారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా నోటిఫై చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా రిజిస్ట్రేషన్ల చట్టం–1908 లోని సెక్షన్ 7(1) ప్రకారం తహశీల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పించారు. తహశీల్దారు అందుబాటులో లేని సమయాల్లో జిల్లా కలెక్టర్ అనుమతితో నాయబ్ తహశీల్దార్లు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ విధులు నిర్వహిస్తారని, తెలంగాణ భూమి హక్కులు మరియు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం –2020 పరిధిలోనికి వచ్చే భూములను రిజిస్ట్రేషన్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్ల నుంచి తప్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకోసం 2018లో రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసిన 94,95 జీవోలు రద్దవుతాయని, తాజా ఉత్తర్వులు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని, ఈ మేరకు ప్రభుత్వ గెజిట్‌లో నోటిఫై చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. మ్యుటేషన్ ఫీజు ఖరారు రిజిస్ట్రేషన్ విలువలో 0.1 శాతం.. లేదా పురపాలికల్లో రూ. 1000.. కార్పొరేషన్లలో రూ. 3 వేలు.. ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో ఆటో మ్యుటేషన్ కోసం వసూలు చేయాల్సిన రుసుమును ఖరారు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. సదరు ఆస్తి రిజిస్ట్రేషన్ విలువలో 0.1 శాతం లేదా పురపాలికల్లో రూ.1000, మునిసిపల్ కార్పొరేషన్లలో రూ.3 వేలు.. రెండింటిలో ఏది ఎక్కువ అయితే దానిని మ్యుటేషన్ ఫీజుగా వసూలు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని పురపాలికల్లో నిర్దేశిత మ్యుటేషన్ ఫీజులు లేకపోవడంతో కొత్త ఫీజులను ఖరారు చేసినట్టు పేర్కొన్నారు. -
పక్కాగా ‘సాగునీటి’ ఆస్తుల లెక్క
సాక్షి, హైదరాబాద్: సాగునీటి శాఖ పరిధిలోని ఆస్తుల లెక్కలు పక్కాగా తేల్చి, వాటి నిర్వహణ సమర్థంగా ఉండేలా నీటిపారు దల శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. శాఖకు చెందిన భవనాలు, క్యాంపు కాలనీలు, వాటిల్లో క్వార్టర్లు, కాల్వలు, టన్నెళ్లు, పంపులు, మోటార్లు, గేట్లు, ట్రాన్స్ఫార్మర్లు, రిజ ర్వాయర్లు, లిఫ్టులు, చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు, వాహనాలు, మెషినరీ, ఫర్నిచర్, భూముల వివరాలను ఇప్పటికే సేకరించిన శాఖ, వాటి నిర్వహణ పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఈ ఆస్తుల సమగ్ర వివరాలన్నింటినీ ప్రాజెక్ట్ మానిటరింగ్ సిస్టమ్ (పీఎంఎస్)లో అందుబాటులో ఉంచనుంది. ప్రస్తుతం పొందు పరుస్తున్న వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే అంశాలపై అన్ని స్థాయిల ఇంజనీర్లకు శాఖ ఉన్నతాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా భూసేకరణ, తర్వాత ఆ భూముల మ్యుటేషన్, రికార్డుల నిర్వహణతో పాటు, వాటి పర్యవేక్షణ, రెవెన్యూ శాఖతో సమన్వయం వంటి అంశాలపై వివిధ స్థాయిల ఇంజనీర్లకు బాధ్యతలు కట్టబెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రాజెక్టుల ఇన్వెంటరీ నివేదికను తయారుచేసే పనిలోపడ్డ ఇంజనీర్లు ప్రాజెక్టుల నిర్మాణాలకు, వాటి కింది కాల్వలకు సేకరించిన భూముల లెక్కలు తేల్చారు. దీనిపై మంగళవారం సాగునీటి శాఖ ఆస్తుల ఇన్వెంటరీ నిర్వహణపై జలసౌధలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, హరిరామ్, నల్లా వెంకటేశ్వర్లు, అనిల్‌కుమార్, సీఈలు శ్రీనివాస్‌రెడ్డి, శంకర్, మధుసూధన్‌రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రజత్‌కుమార్ మాట్లాడుతూ, గడిచిన యాభై ఏళ్లుగా సాధించలేని పనిని ఆరు నెలల్లో సాగునీటి శాఖ ఇంజనీర్లు సాధించారని ప్రశంసించారు. సాగునీటి వనరుల ప్రధాన లెక్కలు ఇలా.. పీఎంఎస్లో పొందుపరచిన వివరాలను గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్‌రావు ఈ సందర్భంగా వెల్లడించారు. వివిధ అవసరాల కోసం సాగునీటి శాఖ సేకరించిన భూమి 12.80 లక్షల ఎకరాలను ఆధారాలతో సహా పొందుపరచగా, ఈ భూమి మొత్తం రెవెన్యూ అధికారులు సాగునీటిశాఖ పేరు మీదకు బదిలీ చేశారని అన్నారు. ఇరిగేషన్ శాఖ పరిధిలో 125 జలాశయాలు, 8,661 కి.మీ ప్రధాన కాలువలు, 13,373 కి.మీ డిస్ట్రిబ్యూటరీలు, 17,721 కి.మీ మైనర్లు, 910 కి.మీల పైపులు, 125 మేజర్ ఎత్తిపోతలు, 20 మధ్యతరహా ఎత్తిపోతలు, 13 చిన్న తరహా ఎత్తిపోతలు, 38,510 చెరువులు, కుంటలు, 8,021 చెక్ డ్యాంలు, ఆనకట్టలు, 175 కి.మీ సొరంగాలు, కాలువల మీద 1,26,477 స్ట్రక్చర్లు, 108 విద్యుత్ సబ్ స్టేషన్లు, 64 రెయిన్ గేజులు, 21 రివర్ గేజులు ఉన్నాయని ఆయన వివరించారు. అనంతరం ఇన్వెంటరీ నిర్వహణపై విస్తృత చర్చ జరిగింది. -
ఏకపక్షంగా బోర్డు పరిధి నిర్ణయించొద్దు
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్ ప్రాజెక్టులను తన పరిధిలోకి తెచ్చుకునేలా సిద్ధం చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రతిపాదనలను కేంద్రానికి పంపొద్దని తెలంగాణ ప్రభుత్వం గోదావరి బోర్డుకు విన్నవించింది. ఏక పక్షంగా బోర్డు పరిధిని నిర్ణయించడం సమంజసం కాదని, ఇది పునర్విభజన చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం బోర్డుకు లేఖ రాసింది. గోదావరి బేసిన్లో తెలంగాణ, ఏపీల మధ్య ఎలాంటి ఉమ్మడి ప్రాజె క్టులు లేవని, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు లేక ఇరు రాష్ట్రాల మధ్య సంయుక్తంగా నిర్మించిన ప్రాజెక్టుల్లేవని పేర్కొంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్–87 ప్రకారం గతంలో ఉన్న అవార్డులు, అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం–1956 మేరకు ఏర్పడ్డ ట్రిబ్యునల్ల తీర్పులకు లోబడి కేంద్రం బోర్డుల పరిధిని నోటిఫై చేయాల్సి ఉంటుందని గుర్తు చేసింది. అయితే గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకోవడానికి సంబంధించి ఎలాంటి అంశాల్లేవని పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త మార్గదర్శకాలను తెలంగాణ, ఏపీలోని గోదావరి ప్రాజెక్టులపై రుద్దరాదని స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్–85 ప్రకారం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బోర్డు సమావేశంలో చర్చించాలని, అయితే గోదావరి బోర్డు చైర్మన్ ఏకపక్షంగా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించడం సమంజసం కాదని పేర్కొంది. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని తెలిపింది. వీటిని పరిగణనలోకి తీసుకొని తక్షణమే బోర్డు పరిధిని ఖరారు చేయాలని పంపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విన్నవించింది. -
వీకే సింగ్ వీఆర్ఎస్కు టీ సర్కార్ బ్రేక్
సాక్షి, హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ అధికారి వినోయ్‌కుమార్ సింగ్(వీకే సింగ్) వీఆర్ఎస్కు తెలంగాణ సర్కార్ బ్రేక్ వేసింది. రెండు కేసుల్లో శాఖపరమైన పెండింగ్‌లో ఉన్న కారణంగా వీఆర్ఎస్ను రద్దు చేస్తున్నట్లు వీకే సింగ్‌కు ప్రభుత్వం తెలిపింది. కాగా జూన్ 26న వీకే సింగ్ వీఆర్ఎస్ అభ్యర్థన పెట్టుకున్నారు. అయితే వీకే సింగ్ పెట్టుకున్న వీఆర్ఎస్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్టు అక్టోబర్ 2న తెలంగాణ సర్కార్ ఆయనకు నోటీస్ పంపించింది. ఈ ఏడాది నవంబర్ 30న వీకే సింగ్ సర్వీసు ముగియనుంది. అయితే తనకు అక్టోబర్ 2న ప్రీ రిటైర్మెంట్ ఇవ్వాలని ఆయన తన లేఖలో కోరారు. జైళ్లశాఖ డీజీగా పనిచేసిన ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. (చదవండి : డీజీపీగా పదోన్నతి ఇవ్వకుంటే రాజీనామా) అయితే కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వటం లేదని ప్రభుత్వంపై కినుక వహించారు. తన సేవలకు తగిన గుర్తింపు లేదంటూ వీకే సింగ్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాగా వీకే సింగ్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే జూన్ 26న వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్ఎస్ పెట్టుకున్న కొద్దిరోజుల్లోనే ఆయనను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. స్టేట్ పోలీస్ అకాడమీ నుంచి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలంటూ వీకే సింగ్‌కు అప్పట్లో ప్రభుత్వం ఆదేశించింది. కానీ దీనికి ఒప్పుకోని వీకే సింగ్ రాజీనామాకు కూడా సిద్దపడ్డారు. -
ఉస్మానియా కూల్చివేతపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత, నూతన భవన నిర్మాణంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఉస్మానియా పురాతన కట్టడం అని దానిని కూల్చివేయకుండా అడ్డుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరిందని, దానిని తొలగించి నూతన భవనం నిర్మిస్తామని ప్రభుత్వం ఈ సందర్భంగా కోర్టుకు వివరించింది. కొత్త నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే ఎర్రమంజిల్ భవనంపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన పిటిషనర్లు ఈ తీర్పు ఉస్మానియాకు కూడా వర్తిస్తుందని వాదించారు. పురాతన కట్టడాన్ని కూల్చివేయకుండా పక్కన ఉన్న16 ఎకరాల స్థలంలో నూతన నిర్మాణం చేపట్టాల్సిందిగా పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఉస్మానియా ఆసుపత్రి సైట్‌కి సంబంధించిన మొత్తం గూగుల్ మ్యాప్‌ను కోర్టుకు సమర్పించాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 8కి హైకోర్టు వాయిదా వేసింది. (‘యాంకర్ ప్రదీప్‌కు ఈ కేసుతో సంబంధం లేదు’) -
మై చాయిస్..మై ఫ్యూచర్ అంటున్న విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేసే కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టింది. తొలుత రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలోని 18 వేల మంది విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ప్రారంభించింది. ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం ప్రారంభించింది. మై చాయిస్, మై ఫ్యూచర్ పేరుతో విద్యార్థుల ప్రతిభ, ఆసక్తులు, వారి భవిష్యత్తు అంచనాలపై నిర్వహించిన సైకోమెట్రిక్ టెస్టు ఫలితాల ఆధారంగా విద్యార్థులను సరైన దిశలో నడిపించే కార్యక్రమాన్ని గురువారం నుంచి అమల్లోకి తెచ్చినట్లు మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్ సత్యనారా యణరెడ్డి వెల్లడించారు. ఐఐటీ మద్రాసు ప్రొఫెసర్లు రూపొందించిన ఈ ప్రత్యేక కార్యాచరణను పైలట్ ప్రాజెక్టుగా 194 మోడల్ స్కూళ్లలోని 18 వేల మంది విద్యార్థులకు వారి భవిష్యత్తుపై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి అమల్లోకి తెచ్చిన విద్యాశాఖ, ఆయా పాఠశాలల్లోని మిగతా విద్యార్థులకు త్వరలోనే నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. అంతేకాదు విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారి భవిష్యత్‌పై మార్గదర్శనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు మార్గదర్శిగా.. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా పేద కుటుంబాలకు చెందినవారే. వ్యవసాయ పనులు, రోజువారీ కూలి చేసుకొని బతికే కుటుంబాలకు చెందిన ఆయా విద్యార్థులు ఏ రంగంపై దృష్టి సారించాలో, దానికోసం ఎలాంటి కృషి చేయాలో, అందులో ఎలాంటి భవిష్యత్ ఉంటుందో తెలియదు. వారిని సరైన దిశలో వెళ్లేలా ప్రోత్సహించే వారు తక్కువ. అలాంటి వారెలా ముందుకెళ్లాలి.. తమకున్న ప్రతిభాపాటవాలేంటి? ఏ రంగంలో కృషి చేస్తే తొందరగా సక్సెస్ అవుతామన్న అంశాలపై అవగాహన కల్పించి, వారిని ఆ వైపు పోత్సహించేందుకు ‘మై చాయిస్.. మై ఫ్యూచర్’ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమల్లోకి తెచ్చింది. క్రమంగా దీనిని విద్యాశాఖ పరిధిలోని 26 వేల పాఠశాలల్లోని 29 లక్షల మంది విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చే కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందులో ఏం చేశారంటే.. వ్యక్తిత్వం, కెరీర్ సంబంధమైన 12 కేటగిరీల్లో 72 ప్రశ్నలతో విద్యార్థులందరికీ సైకోమెట్రిక్ టెస్టు (మై చాయిస్.. మై ఫ్యూచర్) నిర్వహిస్తారు. అందులో ఫలితాల ఆధారంగా ప్రతి విద్యార్థి ఆసక్తుల్ని తెలుసుకుంటారు. మోడల్ స్కూళ్లలో నిర్వహించిన ఈ టెస్టులో.. 27 శాతం మంది బాలురు పోలీసు కావాలని, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ రంగంలో స్థిరపడాలని 15 శాతం మంది ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. ఇక బాలికల్లో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ రంగాల్లో స్థిరపడాలని 20 శాతం మంది, మెడిసిన్ అండ్ హెల్త్‌కేర్ వైపు వెళ్లాలని 17 శాతం మంది లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడైంది. ఇప్పుడేం చేస్తారంటే... ప్రతి విద్యార్థిపై చేసిన సైకోమెట్రిక్ టెస్టు ఆధారంగా ఆ విద్యార్థి ఎంచుకున్న కెరీర్‌కు సరిపడా సామర్థ్యాలుంటే అందుకోసం పాఠశాల స్థాయి నుంచే చేయాల్సిన కృషిని వివరించడం, ఆ రంగంలో పరిస్థితులను తెలపడం, వాటిని ఎదుర్కొని ముందుకుసాగేలా ప్రోత్సహించడం వంటి చర్యలు చేపడతారు. కెరీర్ గైడెన్స్‌పై ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్ వారికి ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తుంటారు. అయితే ఆసక్తి ఉన్న రంగానికి సరిపడా సామర్థ్యాలు లేకపోతే వాటిని సాధించేలా విద్యార్థికి కౌన్సెలింగ్‌తోపాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. దీనిపై విద్యార్థి తల్లిదండ్రుల్లోనూ అవగాహన కల్పించి, అందుకు అనుగుణమైన పరిస్థితులను ఏర్పరచేలా కృషి చేస్తారు. ఇక విద్యార్థికి ప్రభుత్వోద్యోగంపై ఆసక్తి ఉన్నా అతనికి స్కిల్స్ మాత్రం ప్రైవేటు మార్కెటింగ్‌లో రాణించేలా ఉంటే.. వాటిని ఆ విద్యార్థికి వివరించి, ఆ స్కిల్స్, ప్రతిభ ఆధారంగా ఆ రంగంలోకి వెళ్లేలా ప్రోత్సహిస్తామని మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి వివరించారు. -
తెలంగాణ భూ చట్టం!
సాక్షి, హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టం అమలుతోపాటు రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది. ప్రస్తుతం అమ ల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తేవాలని భావిస్తున్న సర్కారు.. కొత్త చట్టం అమల్లో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది. కొత్త రెవెన్యూ చట్టానికి ‘తెలంగాణ భూ చట్టం’గా నామకరణం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న రెవెన్యూ చట్టాలను ఏకీకృతం చేసేందుకు ప్రస్తుతం మనుగడలో ఉన్న చట్టాలతోపాటు కొత్త చట్టం తీరుతెన్నులు ఎలా ఉండాలనే కోణంలో కలెక్టర్ల నుంచి సమాచారాన్ని కోరింది. అసైన్డ్, ఇనాం, రక్షిత, కౌలుదారు, ప్రభుత్వ భూములు ఇలా ఒక్కో కేటగిరీకి సంబంధించి కలె క్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకుంది. కొత్త చట్టం రూపకల్పనపై నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నిపుణుల అభిప్రాయాన్ని కూడా కోరింది. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయాలా లేక ఇతర శాఖల్లో విలీనం చేయాలా అనే అంశం పైనా సర్కారు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ముందు మూడు మార్గాలు..! ప్రస్తుతం అమలులో ఉన్న 124 చట్టాలు/నియమాలను ఒకే గొడుగు కిందకు తేవడంతోపాటు కాలం చెల్లిన వాటిని తొలగించడం, గజిబిజిగా ఉన్న చట్టాలను సరళతరం చేస్తూ ఒకే చట్టం తీసుకువస్తారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన టైటిల్ గ్యారంటీ చట్టం అమలు అంశాన్ని పరిశీలిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 1999లో అప్పటి రెవెన్యూ మంత్రి దేవేందర్‌గౌడ్ 196 చట్టాలను ఏకీకృతం చేస్తూ ‘ఏపీ ల్యాండ్ రెవెన్యూ కోడ్’ను ప్రవేశపెట్టడమేగాకుండా రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం ఫైలును ఢిల్లీకి పంపారు. తరువాత ఆ ఫైలు అటకెక్క గా రాష్ట్ర పునర్విభజన తర్వాత తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా రెవెన్యూ కోడ్‌ను రూపొందించాలనే అభిప్రాయాన్ని రెవెన్యూ వర్గాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్... ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్–2019ను ప్రవేశపెట్టాలనే వాదన కొందరు అధికారుల్లో వినిపిస్తోంది. ఈ కోడ్ ద్వారా ఇబ్బడిముబ్బడిగా ఉన్న చట్టాల స్థానంలో ఒకే చట్టం అందుబాటులోకి రానుంది. ఈ రెండింటితోపాటు భూ పరిపాలనకు మూలాధారంగా భావించే ల్యాండ్ రెవెన్యూ యాక్ట్–1907ను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ భూ చట్టానికి రూపకల్పన చేస్తే ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చ సాగుతోంది. భూ పరిపాలనకు సంబంధించిన ప్రతి అంశాన్ని స్పృశించే ఈ పాత చట్టం కొలబద్ధగా కొత్త చట్టం రూపొందించడం ఉత్తమమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు... కొత్త చట్టానికి తుదిరూపు ఇచ్చేందుకు పలు మార్గాల్లో అభిప్రాయ సేకరణ జరుపుతున్న ప్రభుత్వం.. న్యాయపరమైన అవరోధాలు రాకుండా నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నిపుణుల అభిప్రాయాలను తీసుకుంది. పీఓటీ, ఇనాం, రక్షిత కౌలుదారు, భూ ఆక్రమణ, భూ దురాక్రమణ, ఎల్టీఆర్, అసైన్డ్, సర్వే, హద్దులు తదితర అంశాలపై సమాచారాన్ని సేకరించింది. మరోవైపు రెవెన్యూశాఖలో కొందరు ఉద్యోగుల అవినీతిపై గుర్రుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. వీఆర్వో, వీఆర్ఏల రెవెన్యూ సేవలకు ఫుల్స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్లు కనబడుతోంది. ఇదే అంశంపై శాసనసభ సాక్షిగా స్పష్టమైన సంకేతాలిచ్చారు. అయితే వారిని పంచాయతీరాజ్, వ్యవసాయశాఖలలో విలీనం చేయలా లేదా పనితీరు, మెరిట్ ఆధారంగా రెవెన్యూలోనే సర్దుబాటు చేయాలా? అనే దానిపై కొత్త చట్టంలో స్పష్టత రానుంది. అలాగే బ్రిటిష్ కాలంలో శిస్తు వసూలు చేయడానికి నియమించిన కలెక్టర్ల వ్యవస్థను ఇప్పటికీ కొనసాగిస్తుండటాన్ని తప్పుబడుతున్న సీఎం.. కలెక్టర్ల హోదాను పునఃనిర్వచించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హోదాల మార్పు కలెక్టర్లకే పరిమితం చేయకుండా ఆర్డీఓ, తహసీల్దార్లకు కూడా వర్తింపజేసే అవకాశం ఉంది. -
హెచ్ బ్లాక్‌ను ఎందుకు కూలుస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ప్రభత్వం వాదించింది. అందుకే నూతన సచివాలయం నిర్మిస్తున్నామని హైకోర్టుకు తెలిపింది. సచివాలయ భవనాల టెక్నికల్ రిపోర్ట్‌ను ధర్మాసనానికి సమర్పించింది. సుమారు 10 లక్షల ఎసేఫ్టీతో ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్‌ను నిర్మిస్తామని హైకోర్టుకు వివరించింది. ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం.. ఏడేళ్ల క్రితం నిర్మించిన హెచ్ బ్లాక్‌ను ఎందుకు కూల్చి వేస్తున్నారని ప్రశ్నించింది. విధానపరమైన నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోరాదని ప్రభుత్వం వాదించింది. అయితే దినిపై స్పందించిన ధర్మాసనం.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము ఎలా జోక్యం చేసుకోవాలో తెలపాలని పిటిషనర్‌ను కోరింది. తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. -
సచివాలయం కూల్చివేతపై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం భవనాల కూల్చివేత పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. భవనాల కూల్చివేతకు సంబంధించి ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. పిటిషనర్ అభ్యంతరాలను ఆయన తరఫున లాయర్ చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలియజేశారు. నూతన సచివాలయ నిర్మాణంపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని.. సచివాలయం నిర్మాణం, భవనాల కూల్చివేతపై ఇప్పటికే కమిటీ వేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న సచివాలయంలో ఫైర్ సెఫ్టీ నిబంధనలు సరిగాలేవని, సరైన పార్కింగ్ సదుపాయం కూడా లేదని చెప్పారు. కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికను కోర్టు సమర్పించారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో కొనసాగిన సచివాలయ భవనాలను ఇప్పుడు ఎందుకు కూల్చివేస్తున్నారని పిటిషనర్ తరుఫున న్యాయవాది ప్రశ్నించారు. సచివాలయంలో సుమారు ఏడు ఏళ్ల కిందట నిర్మించిన భవనాలను కూడా కూల్చివేస్తున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. నూతన సచివాలయ నిర్మాణం వలన వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పలేదు: తలసాని
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శనివారం టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ భవిష్యత్తుపై జరుగుతున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని, సంస్థను కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ఆర్టీసీపై ఉన్న ప్రేమతోనే సీఎం కేసీఆర్ ఉద్యోగులకు 44శాతం ఫిట్మెంట్ సహా అనేక సానుకూల నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ప్రతీ అంశంపైనా విపక్ష పార్టీలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నాయని, పండుగ సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే కొందరు అత్యు త్సాహంతో సమ్మెకు దిగారని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో ఆర్టీసీని బీజేపీ ప్రైవేటు పరం చేయగా.. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ ఏకంగా రద్దు చేసిందని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తలసాని వారికి సవాలు విసిరారు. -
మహిళా మంత్రి లేకపోవడం వల్లే ఇదంతా..
సాక్షి, హైదరాబాద్ : బొమ్మల రామారం హాజీపూర్ ఘటన దేశ ప్రజలని దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ నరసింహన్‌ను కోరినట్లు తెలిపారు. బుధవారం రాజ్‌భవన్‌లో ఆయనను కలిసిన సందర్భంగా.. గత నాలుగు మాసాలుగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి వివరించినట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో వెయ్యికి పైగా మహిళలు అపహరణకు గురయ్యారన్నారు. వారి ఆచూకీ ఇప్పటివరకు దొరకకపోవడం చాలా బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు అమ్మాయిలను ఒక వ్యక్తి అత్యాచారం చేసి, హత్య చేసిన దారుణ ఘటన అందరినీ కలచివేసిందన్నారు. అలాంటి నిందితులకు ఉరి శిక్షే సరైందని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయడంతో పాటుగా.. ప్రభుత్వం వారి కుటుంబాలకు రూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణా ప్రభుత్వంలో మహిళా మంత్రి లేకపోవడం వల్లే మహిళలకు సరైన న్యాయం జరగడం లేదని విమర్శించారు. హాజీపూర్ హత్యోందంతంపై ఢిల్లీ వెళ్లి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని దత్తాత్రేయ వెల్లడించారు. -
బీసీ హాస్టళ్లలో నిఘా నేత్రం
సత్తుపల్లిటౌన్: ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. బీసీ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు మెనూ సక్రమంగా అందేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఖమ్మం జిల్లాలోని 24 బీసీ హాస్టళ్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 26 హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని 18 హాస్టళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసింది. మిగతా బీసీ హాస్టళ్లలో వారం రోజుల్లో అమర్చేందుకు చర్యలు చేపట్టింది. ఒక్కో హాస్టల్లో ఆరు సీసీ కెమెరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీసీ హాస్టళ్లు ఇక సీసీ నిఘాతో పని చేయనున్నాయి. బీసీ హాస్టల్లోని విద్యార్థులకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించేందుకు ఏర్పాటు చేసింది. ఒక్కో హాస్టల్లో ప్రధాన ద్వారం, వెనుక ద్వారం, మరుగుదొడ్లు, కిచెన్, ఆఫీస్రూం, డైనింగ్ హాల్ ఆరు చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా బీసీ హాస్టల్లో ఎంత మంది విద్యార్థులు ఉంటున్నారు..? సంక్షేమ అధికారులు, సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారానే పర్యవేక్షించే అవకాశం లభిస్తుంది. జిల్లా బీసీ డెవలప్మెంట్ అధికారి కార్యాలయంతో పాటు హైదరాబాద్‌లోని బీసీ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయంతో సీసీ కెమెరాలను ఆన్లైన్ అనుసంధానం చేశారు. సెట్విన్ కంపెనీ ఆధ్వర్యంలో బీసీ హాస్టల్స్‌లో సీసీ కెమెరాలు చేపడుతున్నారు. అక్రమాలకు చెక్ హాస్టళ్లలో సంక్షేమ అధికారుల పర్యవేక్షణ, సిబ్బంది పనితీరు, విద్యార్థుల హాజరును ఇకపై ఉన్నతాధికారులు నిఘా నేత్రాల సహకారంతో ఆన్లైన్లోనే పర్యవేక్షించే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా హాస్టల్లోకి ఇతర వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా..? హాస్టల్ నుంచి విద్యార్థులు బయటకు వెళ్తున్నారా?, స్టోర్ రూంలో సరుకుల నిల్వలు, కిచెన్‌లో వంట పనుల తీరు, ఇలా సమగ్రంగా పర్యవేక్షించే వీలు కలుగుతుంది. దీనివల్ల హాస్టళ్లలో అక్రమాలకు చెక్ పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. -
రైతు అనే నేను ...
రైతును రాజుగా చూడాలనేది తన ఆశ అని తరచూ చెబుతుండే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఆ వైపుగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకవైపు బంజరు భూముల్లో సిరులు పండించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతూనే.. మరోవైపు నుంచి సాగులోకి వచ్చే భూముల్లో ఎలాంటి పంటలు పండుతాయో వ్యవసాయ శాస్త్రవేత్తలతో పరిశోధనలు చేయిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పంట కాలనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, మహిళా సంఘాల బలోపేతం వంటి అంశాలపై వారితో చర్చించారు. ఈ క్రమంలో రైతుల వివరాలు సేకరించి ఆన్లైన్లో పొందుపరచనున్నారు. మొత్తం 30 అంశాల మీద రైతు సర్వే జరగనుంది. సర్వే తర్వాత వచ్చిన రిపోర్టు ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు. సాక్షి, సిద్దిపేట : రాష్ట్రంలో మెజారిటీ భాగం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనంసాగిస్తారు. వర్షాలు కురిస్తేనే పంటలు పండే పరిస్థితి. పంటలు పండిస్తేనే చాలా మందికి కూలీ దొరికేంది. లేదంటే ఉపాధి కోసం పరాయి రాష్ట్రాలు, గల్ఫ్ దేశాలకు వలసపోవడం తప్ప మరో దారిలేదు. తెలంగాణలో ఇలాంటి దుస్థితిని లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చాలనే కసితో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. బంజరు భూములను సాగులోకి తేవడం తెచ్చి వ్యవసాయాన్ని పండగ చేయాలని తపన పడుతున్నారు. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ తీరు, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. అందుకోసం రైతుల పూర్తి వివరాలు ఆన్లైన్లో పొందు పరచాలని, భూసారం, నీటివనరులు, పంటల సాగు, మార్కెటింగ్ వివరాలు మొత్తం అందుబాటులోకి వస్తాయని, తద్వారా ద్వారా అసలు రైతులకు ఏం అవసరమో తేలిపోతుందనే ఆలోచనకు వచ్చారు. ఇందులో భాగంగానే ఈనెల 23 రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతోపాటు, డీఆర్డీఏ, సెర్ప్, పరిశ్రమలు, మార్కెటింగ్ అధికారులతోపాటు అన్ని జిల్లాల వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించి రైతు సమగ్ర సర్వే అవసరం, ఆవశ్యకతను వివరించారు. ఇందుకుసంబంధించిన ప్రొఫార్మను తయారు చేసి అందచేశారు. 30 అంశాలపై సమాచార సేకరణ రైతు పేరు నుంచి మొదలుకొని మొత్తం 30 అంశాల ద్వారా రైతు పూర్తి సమాచారం తీసుకునేందుకు అధికారులు సిద్దమయ్యారు. రైతు పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్, రైతు పేరు, ఆధార్ నెంబర్, తండ్రి లేదా భర్త వివరాలు, జండర్, ధరణీ వెబ్సైట్లో పొందుపరిచిన వివరాలు, పుట్టిన తేదీ, సెల్ నెంబర్‌తోపాటు బ్యాంకు వివరాలు సర్వే ద్వారా సేకరిస్తారు. అదేవిధంగా కులం, భూమి వివరాలు సర్వే నెంబర్లతో సహా, ఇందులో సాగుకు అనుకూలంగా ఉన్న భూమి, లేని భూమి వివరాలు పొందుపరుస్తారు. ఆయా పంటల సాగుకు అందుబాటులో ఉన్న ప్రధాన నీటి వనరులైన బావులు, బోర్లు, చెరువు, కాల్వలు, వర్షాధారం ఇలా మొత్తం వనరుల వివరాలు తీసుకుంటారు. అదేవిధంగా సూక్ష్మ, బిందు, తుంపర సేద్యం మొదలైన వివరాలు, భూసార పరీక్షల కార్డు నెంబర్ వంటి వివరాలతోపాటు భూమి రకం నల్లరేగడి, ఎర్ర నేలలు మొదలైన నేలల వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదుచేస్తారు. వీటితోపాటు గత ఖరీఫ్‌లో సాగు చేసిన పంట వివరాలు, దిగుబడి, అదేవిధంగా రబీ పంట సాగు, దిగుబడి వివరాలు పొందుపరుస్తారు. ఇవే కాకుండా పండ్లు, కూరగాయలు, మల్బరీ మొదలైన పంటలు సాగు చేస్తే వాటి వివరాలు నమోదు చేస్తారు. వచ్చే వానాకాలం, యాసంగిలో ఏం పంటలు వేస్తారో వివరాలు తెలుసుకుంటారు. అదేవిధంగా వ్యవసాయ పరికరాల వినియోగం, క్రాప్‌లోన్ వివరాలు, పంటల బీమా, పండిన పంటలను విక్రయించేందుకు మార్కెటింగ్ సౌకర్యం, విత్తనాల ఉత్పత్తి మొదలైన వివరాలు సేకరిస్తారు. వీటితోపాటు ఇప్పటికే మీ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉంటే వాటి వివరాలు, అదేవిధంగా రైతు స్మార్ట్ ఫోన్ వాడితే అందులో వ్యవసాయ సమాచారం కోసం ఏం యాప్ వినియోగిస్తారో కూడా సర్వే సందర్భంగా నమోదు చేస్తారు. ఫిబ్రవరి ఒకటి నుంచి సర్వే మొదలు ఈ వివరాలు సేకరిస్తే కానీ ఏ ప్రాంతంలో రైతులు ఏ పంటలు పండిస్తారు. నీటి వసతి, మార్కెటింగ్ మొదలైన వివరాలు రావు. దీంతోనే పంటల కాలనీ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయవచ్చు. అందుకోసం ఈ సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మార్చి నెల చివరి వరకు ప్రతీ రైతు చిట్టాను సేకరించాలి. జిల్లా వ్యాప్తంగా 5.66 లక్షల ఎకరాల భూమిని సాగుచేసే 2.6లక్షల రైతుల వివరాలు సేకరించాలి. ఇందుకోసం ఇప్పటికే జిల్లా స్థాయిలో మండల వ్యవసాయ అధికారులకు, మండల, డివిజన్ స్థాయిల్లో వ్యవసాయ విస్తరణ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే వచ్చే వ్యవసాయ సీజన్ జూన్ నాటికి రైతుల వివరాలు, పంటల కాలనీ మొదలైన సమాచారంతో నూతన వ్యవసాయా పద్ధతికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. -
పదవీ విరమణ వయసు 60?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై వివాదాలకు తావు లేని రీతిలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రివర్గ విస్తరణ తరువాత ఏర్పాటయ్యే తొలి కేబినెట్ సమావేశం నాటికి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పదవీ విరమణ వయసు పెంపును అమలు చేయాలని భావిస్తున్నారు. ఎటువంటి షరతులు లేకుండా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 60 ఏళ్ల వయసును పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నతాధికారుల బృందం ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలిసింది. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రస్తుతం ఉన్న 58 ఏళ్లను 61 సంవత్సరాలకు పెంచడం వల్ల న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నదని ఉన్నతాధికారవర్గాలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్లు అమలు చేస్తున్నందున ఇక్కడ కూడా యథా తథంగా అమలు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది ఆ వర్గాల అభిప్రాయంగా ఉంది. ఒకవేళ 61 సంవత్సరాలకు పెంచితే దానికి ప్రామాణికం ఏమిటని న్యాయస్థానాలు ప్రశ్నించే వీలుందని, అలా కాకుండా కేంద్రం అమలు చేస్తున్న విధానమే మేలన్నది ఉన్నతాధికారవర్గాల అభిప్రాయం. ఒకవేళ 61 ఏళ్లకు పెంచి 33 ఏళ్ల సర్వీసు లేదా 61 ఏళ్లు ఏది ముందయితే దాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదన ఆచరణయోగ్యం కాదని ఉన్నతాధికారులు అంటున్నారు. ఎవరైనా 20 ఏళ్లకు ఉద్యోగంలో చేరితే 33 ఏళ్ల సర్వీసు తరువాత అంటే 53 ఏళ్లకు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో 60 ఏళ్లు ఉద్యోగానికి అర్హమైనప్పుడు అంతకు ఏడేళ్ల ముందు పదవీ విరమణ ప్రతిపాదన బాగుండదన్నదే ఉన్నతాధికారుల వాదన. ఈ నేపథ్యంలో పదవీవిరమణ వయసును 60 ఏళ్లకు పరిమితం చేయాలన్నదానిపైనే ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఇళ్లు.. ఇంకెప్పుడు?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. డబుల్ ఇళ్లను కేటాయించి.. టెం డర్లు పూర్తి చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలతో నిర్మాణాలు నెమ్మదిగా నడుస్తున్నాయి. వీటిలో కొన్నింటి పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిరుపేదలు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టడంతో నిర్మాణాల వేగం పుంజుకుంటుందనే ఆశతో ఉన్నారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం పూర్తికావడం ఒక ఎత్తయితే.. వాటిని లబ్ధిదారులకు కేటాయించడం మరో ఎత్తయింది. జిల్లాలో నిరుపేదలకు కేటాయించే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు ఒక అడుగు ముందు కు.. రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. ఖమ్మం, మధిర, పాలేరు, సత్తుపల్లి, వైరాతోపాటు ఇల్లెందులోని కామేపల్లి మండలానికి ప్రభుత్వం 14,490 డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించింది. వీటిలో 8,969 నిర్మాణాలను అనుమతించగా.. 7,374 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఇంకా 1,876 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. 994 ఇళ్లు పెంత్‌బీమ్ స్థాయిలో ఉండగా, 827 ఇళ్లకు శ్లాబ్ పూర్తయింది. 722 గృహాలకు ప్రహరీ నిర్మించారు. 891 ఇళ్లకు ప్లాస్టింగ్ పూర్తి చేశారు. ఇక 2,064 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. సవాలక్ష సమస్యలు.. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం విషయంలో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. మండలాలవారీగా డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరైనా.. వాటిని నిర్మించడం అధికారులకు తలనొప్పిగా మారింది. మొదటగా మండలంలో ఇళ్లు మంజూరైన ప్రాంతంలో స్థల సమస్య తీవ్రంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండడంతో అక్కడ మాత్రమే నిర్మాణాలు ప్రారంభించారు. అనేక ప్రాంతాల్లో స్థలాల లభ్యత లేకపోవడంతో నిర్మాణాలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో అధికారులు ఇళ్ల నిర్మాణం కోసం మళ్లీ స్థలాన్వేషణ చేయాల్సి వస్తోంది. ఈ కారణంగానే చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. అలాగే గతంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5,05,000 కేటాయించగా.. ఈ నగదుతో నిర్మాణాలు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో కూడా చాలా వరకు నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో ఇసుక లభించకపోవడంతో సగంలో నిలిచిపోయిన ఇళ్లు చాలా వరకు ఉన్నాయి. అలాగే లబ్ధిదారుల ఎంపిక తలనొప్పిలా మారింది. ఇన్ని ఇబ్బందులుపడి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినా.. వాటి కేటాయింపు అధికారులకు ఇబ్బందిగా మారింది. గ్రామాల్లో ఇళ్లు కావాల్సిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడం.. మంజూరై.. నిర్మించిన ఇళ్లు తక్కువగా ఉండడంతో వీటిని ఎవరికి కేటాయించాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. కొన్నిచోట్ల ఇళ్ల కేటాయింపులో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తుండడంతో ఇళ్ల కేటాయింపు నిలిచిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. లాటరీ పద్ధతిలో ఇళ్ల కేటాయింపు జరుగుతున్నా.. అధికారుల తీరుపై మాత్రం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణాలతో నిర్మాణం పూర్తయిన ఇళ్లను కూడా ఎవరికీ కేటాయించని పరిస్థితులు కొన్నిచోట్ల ఉన్నాయి. వేగవంతమయ్యేనా.. రెండోసారి అధికారం చేపట్టాక టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందనే ఆశాభావంతో నిరుపేదలు ఉన్నారు. నిర్మాణాలు జరగాల్సిన వాటిని వేగవంతం చేయడం.. నిర్మాణంలో ఉన్న వాటి విషయంలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, నిరుపేదలకు సొంత స్థలం ఉంటే రూ.6లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు. దీంతో నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తమ సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేందుకు అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత అధికారులు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసే అవకాశం ఉంది. -
సాగు నీరు.. నిధుల జోరు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించే క్రమంలో భాగంగా వచ్చే బడ్జెట్లోనూ భారీగా నిధులు పారించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రెండున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరు అందించాలన్నదే తమ ముందున్న ప్రధాన లక్ష్యమంటున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అందుకు తగ్గ్గట్టే నిధుల కేటాయింపు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గడిచిన రెండు, మూడు బడ్జెట్ల్లో కేటాయించిన మాదిరే ఈసారి కూడా రూ.25 వేల కోట్లకు తగ్గకుండా కేటాయింపులు చేసి సాగునీటికి అగ్రపీఠం కట్టబెట్టాలని, అందుకు తగ్గట్లే పనులు చేయించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రూ.26,452 కోట్లతో ఇప్పటికే ప్రాథమిక బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని ప్రభుత్వ పరిశీలనకు పంపిన అనంతరం రూ.25 వేల కోట్లకు సర్దుబాటు చేసే అవకాశాలున్నాయని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. రుణాలతో గట్టెక్కారు... 2018–19 ఆర్థిక ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో సాగునీటి రంగానికి రూ.25వేల కోట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటికే రూ.18,450 కోట్ల మేర ఖర్చు చేశారు. మరో రూ.5,535 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా సుమారు రూ.24 కోట్ల మేర పనులు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఎక్కువగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా రూ.10,476 కోట్ల రుణాలు తీసుకొని బిల్లులు చెల్లించారు. ఇక సీతారామ, దేవాదుల, ఎఫ్ఎఫ్సీ, ఎస్సారెస్పీ–2లను కలిపి ఏర్పాటు చేసిన మరో కార్పొరేషన్ ద్వారా రూ.2,439 కోట్ల రుణాలు తీసుకున్నారు. మొత్తంగా సుమారు రూ.13 వేల కోట్లు రుణాల ద్వారా సేకరించగా, రాష్ట్ర ప్రభుత్వం తన పద్దు నుంచి కేవలం రూ.5,535కోట్లు కేటాయించింది. మొత్తంగా రుణాల ద్వారానే ఈ ఏడాది బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులన్నీ గట్టెక్కాయి. మొదటి ప్రాధాన్యత కాళేశ్వరానికే... సీఎం ఆలోచనలకు తగినట్లుగా ప్రస్తుత బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొత్తంగా రూ.26,452 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇందులో మళ్లీ తొలి ప్రాధాన్యం కాళేశ్వరం ప్రాజెక్టుకే దక్కనుంది. ప్రాజెక్టుకు గత ఏడాది రూ.6,157 కోట్ల మేర నిధులు కేటాయించారు. అందుకు తగ్గట్లే పనులు జరుగుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఖరీఫ్ నాటికి నీళ్లందించాలని సీఎం లక్ష్యంగా నిర్ణయించారు. ఆ మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌజ్‌లతో పాటు ఎల్లంపల్లి దిగువన మల్లన్నసాగర్ వరకు ఉన్న అన్ని బ్యారేజీల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీని కోసం వచ్చే బడ్జెట్లో ఏకంగా రూ. 9,205 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తర్వాతి స్థానంలో పాలమూరు–రంగారెడ్డికి రూ.3,214 కోట్లు కేటాయించాలని కోరారు. దేవాదుల పరిధిలో లింగంపల్లి బ్యారేజీతో పాటు ఇతర పైప్లైన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నందున ఇక్కడ రూ.2,052 కోట్లు, ఖమ్మం జిల్లాలోని సీతారామ సహా ఇతర చిన్న తరహా ప్రాజెక్టులకు కలిపి రూ.1,346 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా వంటి ప్రాజెక్టులను వంద శాతం పూర్తి చేసేందుకు రూ.1,346 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. ఇక మైనర్ ఇరిగేషన్ కింద చిన్న నీటి వనరుల అభివృద్ధి, మిషన్ కాకతీయకు రూ.2,727 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. సీతారామ, పాలమూరుపై ఫోకస్.. ఇక కొత్త ఏడాదిలో జనవరి నుంచి పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఏడాదిన్నరలో ఈ ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టిన ముఖ్యమంత్రి అందుకు తగ్గట్టే ఆర్థిక వనరులను సమకూర్చేలా ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రాజెక్టు పరిధిలో ఈ ఏడాది మార్చి నుంచి సుమారు రూ.1,500 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దృష్ట్యా నిధుల కొరత లేకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.17వేల కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు నిర్ణయం జరగ్గా, చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ చర్చలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి ఏప్రిల్ నుంచి పనులను వేగిరం చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. ఇక సీతారామ ఎత్తిపోతలకు రుణాల ప్రక్రియ కొలిక్కి వచ్చినందున ప్రాజెక్టును వేగిరం చేసే దిశగా కేసీఆర్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరికొన్ని రోజుల్లో స్వయంగా ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్నారు. ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో ప్రతిపాదనలు ఇలా..(రూ.కోట్లలో) ప్రాజెక్టు బడ్జెట్ ప్రతిపాదన కాళేశ్వరం 9,205 పాలమూరు–రంగారెడ్డి 3,214 కంతనపల్లి 845 ఖమ్మం జిల్లా ప్రాజెక్టులు 1,346 ఆదిలాబాద్ ప్రాజెక్టులు 922 వరద కాల్వ, ఎల్లంపల్లి 1,121 దేవాదుల 2,052 నల్లగొండ ప్రాజెక్టులు 1,621 ఎస్సారెస్పీ 338 మైనర్ ఇరిగేషన్ 2,727 -
అక్కడ సాదా బైనామాకు నో
సాక్షి, హైదరాబాద్: కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని విలీన గ్రామాల్లో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతకు వచ్చింది. 2011, 2012లో సమీప నగరాలు, పట్టణాల్లో విలీనమైన గ్రామాల్లో సాదా బైనామా క్రమబద్ధీకరణ విషయంలో నెలకొన్న గందరగోళానికి తెర దించుతూ ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తెల్ల కాగితాలపై రాసుకున్న వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామాకు చట్టబద్ధత కల్పించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రైట్స్ ఇన్ ల్యాండ్, పట్టాదార్ పాస్‌బుక్స్ చట్టంలోని 22(2) సెక్షన్ మేరకు సాదా బైనామాపై ఉన్న ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ 2016 జూన్ 3న ఉత్తర్వులిచ్చింది. 2014లోపు రాసుకున్న సాదా బైనామాలను క్రమబద్ధీకరిచేందుకు అనుమతించింది. దరఖాస్తుల ఆమోదం అధికారాన్ని జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. ఐదెకరాలలోపు భూమికి సంబంధించి సాదా బైనామాల రిజిస్ట్రేషన్‌కు స్టాంపు డ్యూటీనీ మినహాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. హెచ్ఎండీఏ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లోని భూములకు వర్తించదని స్పష్టం చేసింది. సాదా బైనామా ఉత్తర్వుల సమయంలో రాష్ట్రంలో ఆరు నగరపాలక సంస్థలు, 58 మున్సిపాలిటీలు ఉండేవి. అయితే 2011లో పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సమీపంలోని వందల గ్రామాలను వాటిలో విలీనం చేశారు. వరంగల్ మహానగరపాలక సంస్థలో ఏకంగా 42 గ్రామాలు విలీనమయ్యాయి. ఇలాంటి గ్రామాల్లో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అనుమతించాలని డిమాండ్లు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ దశలో ఇందుకు సానుకూలత వ్యక్తం చేసింది కానీ తర్వాత పక్కనబెట్టింది. ఇటీవల పలు వర్గాల నుంచి దీనిపై విజ్ఞప్తులు వచ్చాయి. ఇటీవల సీఎం కేసీఆర్ వద్ద జరిగిన రెవెన్యూ శాఖ సమావేశంలోనూ విలీన గ్రామాల్లో సాదా బైనామా అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. అయితే విలీన గ్రామాల్లో సాదా బైనామా క్రమబద్ధీకరణకు అనుమతిస్తే భూముల విషయంలో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని, ప్రభుత్వానికి ఆదాయ పరంగా నష్టం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయపరంగా నష్టం జరుగుతుందని అధికారులు సూచించడంతో విలీన గ్రామాల్లో సాదా బైనామా క్రమబద్ధీకరణ ఉండదని స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. ఇప్పటిదాకా 6 లక్షలు పూర్తి సాదా బైనామాల క్రమబద్ధీకరణకు రాష్ట్రవ్యాప్తంగా 11.19 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో 15.68 లక్షల సర్వే నంబర్లకు సంబంధించిన భూములున్నాయి. రెవెన్యూ శాఖ ఒక సర్వే నంబర్‌ను ఒక కేసుగా పరిగణించి ఈ ప్రక్రియను నిర్వహించింది. 6.18 లక్షల సర్వే నంబర్ల పరిధిలో దరఖాస్తులను ఆమోదించారు. 9.49 లక్షలకుపైగా దరఖాస్తులను తిరస్కరించారు. కబ్జాలో లేకపోవడం, విక్రయ లావాదేవీ జరిగినా వారసులు అంగీకరించకపోవడం, కొన్ని ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు ఉండటం, కోర్టుల్లో కేసుల పెండింగ్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని దరఖాస్తులను తిరస్కరించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఎలాంటి అభ్యంతరాలు లేని దరఖాస్తులను ఆమోదించామని చెప్పారు. -
తల్లిపాలు శిశువుకు ప్రాణాధారం
తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం గణనీయంగా పెరిగి 91.5 శాతానికి చేరుకుందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–4, 2015–16) సూచిస్తోంది. కానీ పుట్టిన గంటలోపే పసిపిల్లలు తల్లిపాలు తాగడం ప్రారంభించడానికి సంబంధించిన కీలక సూచిక మాత్రం 37 శాతంగానే నమోదవడం ఆందోళనకరం. కేసీఆర్ కిట్లు, లేబర్ రూమ్‌ల ప్రామాణీకరణ వంటి చర్యల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు, జననాల పెరుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా మదుపు పెట్టింది. కానీ రాష్ట్రంలో శిశువులకు తల్లిపాలు పట్టే అంశంలో ఇదే స్థాయిలో పెరుగుదల నమోదు కావడం లేదు. ప్రసవానంతరం తొలి 28 రోజుల్లో పిల్లలు బతికి బట్టగట్టడం పిల్లల జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. తెలంగాణలో ప్రతి వెయ్యి జననాల్లో 21 శిశువులు పుట్టిన తొలి 28 రోజుల్లోనే చనిపోతున్నారు. తల్లి పాలు పట్టడం ఎంత ఆలస్యమైతే, శిశు మరణాల రేటు అంత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం 8.2 లక్షలమంది పిల్లలు పుట్టిన 28 రోజులకే చనిపోతున్నారు. పిల్లలు పుట్టిన గంటలోపే తల్లి పాలు పట్టడం ద్వారా ఈ రకం మరణాల రేటును గణనీయంగా తగ్గించవచ్చు. బిడ్డపుట్టిన తర్వాత తల్లి పాలు పట్టే సమయం ఎంత ఆలస్యమైతే అంత ఎక్కువగా శిశుమరణాల రేటు పెరుగుతూ పోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. తల్లి బిడ్డకు పట్టే తొలి పాలు అతి ముఖ్యమైన యాంటీబాడీస్‌ని కలిగి ఉంటాయి. వైరస్లు, బాక్టీరియాతో పోరాడే రోగనిరోధక వ్యవస్థ పెంపుదల విషయంలో బిడ్డకు ఇవి చాలా అవసరం. పైగా తల్లిపాలు పట్టడం అనేది పిల్లల ఐక్యూని 3 పాయింట్లు అదనంగా పెంచుతుంది. ఇది భారత స్థూల జాతీయ ఆదాయానికి రూ.4,300 కోట్లను అదనంగా చేరుస్తుందని ఒక అంచనా. పుట్టిన బిడ్డకు తొలి ఆరు నెలలనుంచి రెండేళ్లవరకు తల్లిపాలు పట్టడంలోని ప్రాధాన్యత గురించి గత రెండు దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. కానీ భారత్‌లో మాత్రం ఈ దిశగా పురోగతి ఏమంత సంతృప్తికరంగా లేదు. దేశంలోని 93 శాతం గర్భిణీస్త్రీలకు తల్లిపాలు పట్టడం గురించి సకాలంలో సూచనలు చేస్తున్నప్పటికీ, ఇంట్లో, కమ్యూనిటీలో లేక పని స్థలంలో ఎక్కడ ప్రసవం జరిగినా అలా తల్లి తన బిడ్డకు తానే పాలు పట్టడానికి అవకాశమిచ్చే వాతావరణ కల్పనపై తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. తల్లి బిడ్డకు తన పాలు పట్టడాన్ని పలురకాల సామాజిక, సాంస్కృతిక ఆచారాలు, భయాలు అడ్డుకుంటున్నాయి. దీనికి తోడుగా తల్లి సొంతంగా బిడ్డకు పాలు పట్టేలా చేయడంలో ఎవరూ చొరవ తీసుకోవడం లేదు. మురుగుపాలు పట్టడంపై సమాజంలో విశ్వాసాలు ఎలా ఉన్నప్పటికీ, బిడ్డ పుట్టిన వెంటనే వారికి తల్లిపాలు పట్టడం చాలా మంచిదని నిపుణుల వ్యాఖ్య. ప్రతి సంవత్సరం ఆగస్టు తొలి వారంలో ప్రపంచమంతటా తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. తల్లిపాలు అనేవి అన్ని రకాల పోషక విలువల లేమిని నిరోధిస్తాయి. పిల్లల ఆహార భద్రతకు, మంచి ఆరోగ్యానికి తల్లి పాలు అత్యంత శ్రేయస్కరమైనవి. ఒక్కమాటలో చెప్పాలంటే తల్లిపాలు జీవితం మొత్తానికి మూలాధారం వంటిది. ఇంటిలో ఉన్నా, కమ్యూనిటీలో ఉన్నా, పనిస్థలంలో ఉన్నా తమ బిడ్డలకు తామే పాలు పట్టేవిషయంలో మహిళలను ప్రోత్సహించాలని ఈ సంవత్సరం తల్లి పాల వారోత్సవం పిలుపునిస్తోంది. ఈ విషయంలో తండ్రులు, యజమానులు, కమ్యూనిటీ, ఎకోసిస్టమ్‌లు సమాన భాగస్వామ్యం చేబూనాలని ఈ వారోత్సవం పేర్కొంటోంది. తల్లి పాల విధానంలో మంచి ఫలితాలు రావాలంటే రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవగాహన, విధానాలలో మార్పు రావలసిన అవసరముంది. ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సులు, రాష్ట్ర స్థాయిలో ఏఎన్ఎమ్లు బిడ్డ పుట్టిన గంటలోపే పాలు పట్టేలా తల్లులను ప్రోత్సహించాలి. తల్లి పుట్టిన బిడ్డలకు పాలు పట్ట డంలో కుటుంబంలోని తల్లులు, భర్తలు, అత్తలకు తప్పనిసరిగా కౌన్సెలింగ్ ఇవ్వాల్సి ఉంది. దీని కోసం ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ వంటి వేదికలను ఉపయోగించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తల్లిపాలకు ప్రోత్సాహం ఇవ్వడానికి సంబంధించి ప్రయత్నాలు చేపట్టింది. దీన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అమలు చేయాల్సి ఉంది. పిల్లల్లో పోషక విలువలు దెబ్బతినకుండా చేయడానికి ఇలాంటి కార్యాచరణ చక్కగా ఉపయోగపడుతుంది. (ఆగస్టు తొలివారం ప్రపంచ తల్లిపాల వారోత్సవం) విజయేందిర బోయి, ఐఏఎస్, డైరెక్టర్, మహి ళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ -
‘దమ్ముంటే వారిని అరెస్ట్ చేయండి’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం ప్రభుత్వం పౌర హక్కులను కాలరాస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్ ఆరోపించారు. రాజకీయ నాయకులు, ఇతర సంఘాలు నిరసన, ధర్నా చేసే హక్కు లేకుండా చేస్తోందని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామి పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. చరిత్ర గురించి మాట్లాడితే స్వామీజీని నగర బహిష్కరణ చేస్తారా అని ప్రశ్నించారు. పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. శనివారం ర్యాలీ చేస్తామంటే తనను గృహనిర్బంధం చేశారని మండిపడ్డారు. రెచ్చ గొట్టే వాఖ్యలు చేసే వారిని ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకుల్లో ఆరుగురిపై కేసులున్నాయని దమ్ముంటే వారిని అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. ఎంఐఎం నాయకులు రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తే వారిని పట్టించుకోకుండా వదిలేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అపాయిట్మెంట్ తీసుకొని వివరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి అనుమతి ఇవ్వకుంటే అక్కడే ఉండి అనుమతి తీసుకుని వివరిస్తామని ఎమ్మెల్యే ప్రభాకర్ పేర్కొన్నారు. -
‘జోనల్’కు కేబినెట్ ఆమోదం; ఢిల్లీకి సీఎం కేసీఆర్
హైదరాబాద్: నూతనంగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఎల్ఐసీ ద్వారా రైతులకు జీవిత బీమా కల్పించే పథకానికి కూడా పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో కేబినెట్ సమావేశం జరిగింది. విస్తృత చర్చ అనంతరం జోనల్ వ్యవస్థ, బీమా పథకాలను మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రత్యేక ఆహ్వానం మేరకు టీఎన్జీవోల సంఘం గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్, గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు వి. శ్రీనివాస గౌడ్, టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డిలు కూడా ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. జోన్ల వ్యవస్థకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని ప్రధానమంత్రిని కోరడానికిగానూ సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కేబినెట్ ఆమోదించిన అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ► తెలంగాణలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటవుతాయి. ►తెలంగాణలో ఇకపై ఉద్యోగుల నియామకానికి జిల్లా, జోన్, మల్టీ జోన్, స్టేట్ కేడర్లు ఉంటాయి. ►స్టేట్ కేడర్ పోస్టులను ఖచ్చితంగా పదోన్నతి ద్వారానే భర్తీ చేస్తారు. ► ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు విద్యాబ్యాసంలో కనీసం నాలుగు సంవత్సరాలు ఎక్కడ విద్యాబ్యాసం చేస్తారో, ఆ ప్రాంతాన్నే సదరు అభ్యర్థి స్థానిక ప్రాంతం (లోకల్ ఏరియా)గా గుర్తిస్తారు. ►అన్ని పోస్టులకు 95 శాతం లోకల్, 5 శాతం ఓపెన్ కేటగిరిగా ఉంటుంది. ►రాష్ట్రంలోని 18-60 ఏండ్ల వయస్సున్న ప్రతీ రైతుకు రూ.5 లక్షల జీవితబీమా వర్తిస్తుంది. ►ఎల్ఐసీ ద్వారా జీవిత బీమా అమలు చేస్తారు. ప్రతీ రైతుకు రూ.2,271 చొప్పున ప్రతీ ఏడాది ప్రీమియం కడతారు. బీమా ప్రీమియానికి సంబంధించిన సొమ్మును ప్రభుత్వం బడ్జెట్లోనే కేటాయిస్తుంది. జూన్ 2 నుంచి రైతుల నుంచి నామినీ ప్రతిపాదన పత్రాలు సేకరిస్తారు. ఆగస్టు 15 నుంచి బీమా సర్టిఫికెట్లు అందిస్తారు. ►వైద్య ఆరోగ్య శాఖలో టీచింగ్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 65 సంవత్సాలకు పెంచుతారు. ► రాష్ట్ర రైతు సమన్వయ సమితికి ఎండీతో పాటు ఇతర వైద్యసిబ్బందిని నియమిస్తారు. -
బ్రిక్స్ సదస్సులో తెలంగాణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఢిల్లీ: బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సదస్సుకు దాదాపు 20 దేశాలల నుంచి ప్రతినిథులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, పారిశ్రిమిక రంగంలో తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్, రైతు బంధు పథకం గురించి ప్రత్యేక ప్రతినిథి వేణుగోపాలచారి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరామని, 24 గంటల విద్యుత్, నీరు, మౌళిక సదుపాయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కృషిని వారు స్వాగతించారని తెలిపారు. బ్రిక్స్ సమావేశంలో దాదాపు 45 నిమిషాల పాటు తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వేణుగోపాల చారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ప్రభుత్య సిబ్బంది, ఉద్యోగులకు ప్రత్యేకంగా క్రీడలను నిర్వహిస్తున్నామని, తెలంగాణ బజారును ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ ఆట, పాట ప్రత్యేక ఆకర్షణగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. -
4 లక్షల మందికి రంజాన్ కానుక
సాక్షి, హైదరాబాద్: సుమారు 4 లక్షల నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకగా కొత్త దుస్తులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 800 మసీదు కమిటీల ఆధ్వర్యంలో రం జాన్ కానుకల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 400, హైదరాబాద్‌లో 400 మసీదులను గుర్తించింది. ప్రతిమసీదు పరిధిలో 500 పేద కుటుం బాలను ఎంపిక చేసి మూడు జతల కొత్త దుస్తులు గల ప్యాకెట్లను పంపిణీ చేయనుంది. ఒక్కోదానిలో రూ.525 విలువ గల కుర్తా, పైజామా, సల్వారు, కమీజు, చీర, బ్లౌజ్ అందించనుంది. కానుకల పంపిణీ కార్యక్రమాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ, వక్ఫ్‌బోర్డు అధికారులు పర్యవేక్షిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం తెలంగాణ హ్యాండ్లూమ్ అండ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ(టెస్కో)తో రంజాన్ దుస్తుల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త దుస్తుల కోసం సుమారు రూ.21 కోట్లను వెచ్చిస్తోంది. 800 మసీదుల్లో దావతే ఇఫ్తార్ విందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 400, జీహెఎంసీ పరిధిలో 400 మసీదుల్లో దావతే ఇఫ్తార్ విందు ఏర్పాట్లకు చర్యలు చేపట్టింది. ప్రతి నియోజకవర్గానికి 4 మసీదుల చొప్పున ఎంపిక చేసి 4 లక్షల మందికి విందు ఏర్పాటు చేస్తోంది. ఇందు కోసం మసీదుకు లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.8 కోట్లు వెచ్చిస్తోంది. జూన్ మొదటి వారంలో .. నిరుపేద ముస్లింలకు రంజాన్ కానుక పంపిణీ ప్రక్రియను జూన్ మొదటివారంలో పూర్తి చేసేవిధంగా మైనారిటీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాలకు దుస్తుల సరఫరా ప్రక్రియ ప్రారంభమైంది. రంజాన్ కానుక, దావతే ఇఫార్త్‌కు కలిపి ప్రభుత్వం రూ.30 కోట్లను మంజూరు చేసిన విషయం విదితమే. -
తెలంగాణ తొలి పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతన సవరణకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ అధ్వర్యంలో త్రిసభ్య కమిషన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బిశ్వాల్‌ను చైర్మన్‌గా, రిటైర్డ్ ఐఏఎస్‌లు సి.ఉమామహేశ్వరరావు, డాక్టర్ మహ్మద్ అలీ రఫత్‌లను సభ్యులుగా నియమించింది. ఉద్యోగుల వేతన సవరణపై అధ్యయనం చేసే బాధ్యతలను సంఘానికి అప్పగించింది. కమిషన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలంటూ నిర్ణీత గడువు విధించింది. ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన పదో పీఆర్సీయే ఇప్పటికీ అమల్లో ఉంది. ఈ వరుసలో తాజా పీఆర్సీ పదకొండోది. అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే తొలి పీఆర్సీ కావటంతో తెలంగాణ తొలి పీఆర్సీ ఇదేనని ప్రభుత్వం ప్రకటించింది. ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది జులై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలను సవరించాల్సి ఉందని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే పీఆర్సీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్‌కు అప్పగించిన బాధ్యతల వివరాలను జీవోతో పాటు పొందుపరిచింది. హైదరాబాద్ కేంద్రంగా కమిషన్ పని చేస్తుందని, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, వ్యక్తులు, సంస్ధలు, ఎవరి నుంచైనా సమాచారం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, జేఎన్టీయూ, జయశంకర్ వ్యవసాయ విద్యాలయం సహా వర్సిటీల బోధనేతర సిబ్బంది, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, వర్క్ చార్జ్డ్ ఉద్యోగులకు సంబంధించిన పే స్కేళ్లను రూపొందించి, విభాగాలవారీగా సర్వీసు నిబంధనలను కమిషన్ అధ్యయనం చేస్తుంది. ప్రస్తుతమున్న డీఏ (కరువు భత్యం)ను ఎంతమేరకు వేతనంలో విలీనం చేయాలి, విలీనమైన డీఏ ప్రకారం సవరించిన వేతనాలను ఎలా స్థిరీకరించాలో కూడా పరిశీలిస్తుంది. సీఎం వెల్లడించిన అంశాలపై ఫోకస్ ఆటోమేటిక్ అడ్వాన్సుడ్ స్కీమ్‌ను యథాతథంగా కొనసాగించాలా, మార్పులు చేయాల్సి ఉంటే ఏం చేయాలో సూచనలు అందించాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. ప్రత్యేక అలవెన్సులు, స్పెషల్ పేలు, నష్ట పరిహార అలవెన్సులు కొనసాగించాలా, మార్పులు అవసరమా సిఫార్సు చేయాలని సూచించింది. ప్రభుత్వ క్వార్టర్లకు రెంట్ ఫ్రీ విధానాన్ని అధ్యయనం చేయాలని కోరింది. పట్టణీకరణ, పెరిగిన రవాణా సదుపాయాలు, కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో షెడ్యూలు ఏరియా, ప్రాజెక్టుల పరిధిలోని ఉద్యోగులకు అదనపు హెచ్ఆర్ఏ కొనసాగించాలా, వద్దా సమీక్షించాలని సూచించింది. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించిన పలు అంశాలను జీవోలో ప్రభుత్వం ప్రస్తావించింది. షెడ్యూలు, మారుమూల ప్రాంతాల ఉద్యోగులకు అదనంగా ఎలాంటి ప్రోత్సాహకాలు, ఏ రూపంలో ఇవ్వాలో సిఫార్సు చేయడంతో పాటు మారుమూల ప్రాంతాలను గుర్తించాలని కోరింది. ఉద్యోగుల లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) పద్ధతికి కొత్తగా ఎలాంటి మార్పులు చేయాలో అధ్యయనం చేయాలని సూచించింది. పెన్షన్ విధానాన్ని సమీక్షించి సిఫార్సులు చేయాలని కోరింది. ఉద్యోగుల సంఖ్యపై సమీక్ష రాష్ట్రంలో అన్ని విభాగాల్లో ఉన్న ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సంఖ్యను పరిశీలించి, ప్రస్తుత అవసరాల మేరకు సమీక్షించాలని సూచించింది. కొన్ని పోస్టులకున్న గెజిటెడ్ హోదాను కొనసాగించాలా, ప్రత్నామ్నాయమేమైనా ఉందా, నాన్ గెజిటెడ్ హోదాలో ఉన్న వాటికి గెజిటెడ్ హోదా ఇవ్వాలా అనే విషయంలో పదో పీఆర్సీ సిఫార్సులను సమీక్షించాలని కోరింది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న లోన్లు, అడ్వాన్సులు కొనసాగించాలో, లేదో ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా సూచనలు చేయాలని నిర్దేశించింది. సిఫార్సులు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకోవాలని కోరింది. -
క్రీడారంగ రిజర్వేషన్లు భేషైన నిర్ణయం
విద్యా ఉద్యోగాల్లో క్రీడాకారులకు రెండు శాతం రిజర్వేషన్లను వర్తింపచేస్తూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు క్రీడాభివృద్ధికి దోహదం చేస్తుంది. క్రీడాకారులకు ఎంతో మేలు చేసే నిర్ణయమిది. తమ ప్రతిభ ద్వారా దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టే క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం ప్రభుత్వం బాధ్యత. ర్యాంక్‌లు, మార్కులకోసం పోటీపడే ప్రస్తుత కాలంలో ఆటలు ఆడితే పిల్లలు పాడవుతారని, చదువుల్లో వెనకబడతారనే తల్లిదండ్రులు ఆలోచిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు క్రీడా సాంస్కృతిక కళల పట్ల ఆసక్తి చూపించడంలేదు. విద్యా సంస్థలు సైతం వీటిని ప్రోత్సహించడంలేదు. క్రీడా పోటీలలో పాల్గొన్న విద్యార్థులు ఏక కాలంలో చదువులపై, ఆటలపై దృష్టి సారించలేరు. అటువంటి విద్యార్థులకు ఉన్నత చదువులలో రిజర్వేషన్ సౌకర్యం ఉండాలి. ఉద్యోగాలలో రిజర్వేషన్ల వల్ల క్రీడాకారులకు భవిష్యత్ ఉపాధి హామీ ఉంటే క్రీడల్లో తమ పిల్లల్ని ప్రోత్సహించే తల్లిదండ్రుల సంఖ్య క్రమంగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. క్రీడలకు సరైన ప్రోత్సహకాలు లేక ఎంతోమంది భావి క్రీడాకారులు మట్టిలో మాణిక్యాలవలే మిగిలిపోయారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు కూడా దినసరి కూలీలాగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తున్న దీనగాథలు రోజు వినపడుతూనే ఉన్నాయి. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఎయిడెడ్ సంస్థల్లో దాదాపు 29 క్రీడాంశాలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఈ రిజర్వేషన్ సౌకర్యం వర్తించే విధంగా ఉత్తర్వులు జారీ చేసారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత పలు సందర్భాల్లో క్రీడారంగ రిజర్వేషన్లపై అనేక విజ్ఞప్తులు వచ్చాయి. చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు కూడా. అయతే క్రీడా రిజర్వేషన్లను అమలు చేయడంలో అసలు గొప్పతనం ఉంటుంది. అర్హులైన వారికి అవకతవకలు లేకుండా విమర్శలకు తావు లేకుండా అమలు జరగాలి. దొంగ సర్టిఫికెట్లకు అవకాశం లేకుండా నిజమైన క్రీడాకారులకు రిజర్వేషన్ల ఫలాలు దక్కేలా అన్ని శాఖలు సమిష్టి కృషి చెయ్యాలి. ఈ ఫలితాలు పొందిన క్రీడాకారులు భావి క్రీడాకారులను ప్రోత్సహించాలి. - సురేష్ కాలేరు, రాష్ట్ర సహాధ్యక్షులు, తెలంగాణా ఉద్యోగుల సంఘం -
25 నుంచి బదిలీలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీల కసరత్తు మొదలైంది. ఈ నెల 25 నుంచి జూన్ 15 లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. బదిలీల మార్గదర్శకాల రూపకల్పనకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా సభ్యుడిగా, ఆర్థిక ముఖ్య కార్యదర్శి ఎన్.శివశంకర్ మెంబర్ కన్వీనర్‌గా ఉన్నారు. బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను పది రోజుల్లో సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సంప్రదింపులు జరిపి మార్గదర్శకాలు సిద్ధం చేయాలని నిర్దేశించింది. కమిటీ గురువారం నుంచే కసరత్తు ప్రారంభించింది. అజయ్ మిశ్రా అందుబాటులో లేకపోవటంతో అధర్ సిన్హా ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సచివాలయంలో కాసేపు సమావేశమయ్యారు. బదిలీల మార్గదర్శకాలకు అనుసరించాల్సిన రూట్ మ్యాప్‌పై చర్చించారు. గతంలో ఉన్న నిబంధనలు కట్టుదిట్టంగా ఉన్నాయని, వాటినే ఈసారి అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రతిపాదించారు. శుక్రవారం అజయ్ మిశ్రా నేతృత్వంలో జరిగే సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. వారంలోనే మార్గదర్శకాలు! పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీ శాఖ అధికారులతోనూ కమిటీ సంప్రదింపులు జరపనుంది. ఎన్నికల షెడ్యూల్ అంచనాలను దృష్టిలో పెట్టుకొని బదిలీ తేదీలు ఖరారు చేయనుంది. పది రోజుల గడువిచ్చినా వారం రోజుల్లోనే బదిలీల మార్గదర్శకాలు రూపొందించేందుకు కమిటీ కసరత్తు చేస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా జూన్ 15 లోపు బదిలీలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పారదర్శకతకు పెద్దపీట వేయాలని, అవినీతికి ఆస్కారం లేకుండా బదిలీలు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ఏడాది ఉపాధ్యాయుల బదిలీల సందర్భంగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇది పలువురు అధికారులను సస్పెండ్ చేసేంత వరకు వెళ్లింది. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, అప్పట్నుంచీ బదిలీలపై నిషేధం విధించింది. తాజాగా సీఎం బదిలీలకు పచ్చజెండా ఊపడంతోపాటు తప్పు జరిగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కమిటీ సత్వర సాధారణ బదిలీలపైనే దృష్టి కేంద్రీకరించనుంది. ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలను ఆన్లైన్లో నిర్వహించే ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉంది. -
త్వరలోనే పీఆర్సీ..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి నిర్ణీత గడువు లోపలే పదకొండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటుతోపాటు అమలు కూడా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా వచ్చే జూన్ 2న కొత్త పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని యోచిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పదో పీఆర్సీ గడువు ఈ ఏడాది జూన్ 30న ముగుస్తుంది. పదకొండో పీఆర్సీ ఎప్పుడు వేసినా దానిని ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జూన్ 2న పీఆర్సీ అమలును ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. శరవేగంగా ప్రక్రియ.. గతంలో ఉన్న ఆనవాయితీ ప్రకారం వేతన కమిషన్ ఏర్పాటు, అధ్యయనం, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు వంటి ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు దాదాపు ఏడాది కాలం పట్టేది. దీనికి భిన్నంగా వీలైనంత వేగంగా పీఆర్సీ ప్రక్రియ పూర్తి చేసేలా సీఎం కేసీఆర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో పీఆర్సీ అధ్యయనాన్ని, వివిధ సంఘాలతో చర్చలను కేవలం 15 రోజుల్లో పూర్తి చేసేందుకు ఉన్న అవకాశాలను మంత్రులు, అధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రికి నివేదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జూన్ రెండో తేదీనే పీఆర్సీ తీపి కబురు అందించాలని సీఎం యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పదో పీఆర్సీకి సంబంధించి బకాయిల చెల్లింపు ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుంది. దీంతో కొత్త పీఆర్సీ చెల్లింపులను జూలై నుంచే చేయాలా.. నవంబర్ తర్వాత నుంచి ఇవ్వాలా అన్నదిశగా ఆర్థిక శాఖ తమ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. నేడు స్పష్టత వచ్చే అవకాశం ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఉద్యోగ సంఘాలతో సమావేశమై చర్చలు జరపనున్నారు. ఇదే వేదికగా పలు కీలక నిర్ణయాలను సీఎం ప్రకటిస్తారని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులతో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. ఉద్యోగుల డిమాండ్లు, తమ సిఫారసుల నివేదికను మంగళవారం సీఎంకు అందించింది. ఇక ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ గడువు గతేడాది మార్చి నెలాఖరుతోనే ముగిసింది. 50 శాతానికిపైగా ఫిట్మెంట్ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి స్వయంగా జరిపే చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక బుధవారం నాటి భేటీ సందర్భంగా ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న రెండు డీఏల చెల్లింపు, ఉద్యోగుల బదిలీలు, ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వుల రద్దు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దు, రిటైర్మెంట్ వయో పరిమితి పెంపు తదితర అంశాలపై సీఎం ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. కాస్మోపాలిటన్ నగరాల తరహాలో హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ఏను 40 శాతం పెంచడం, కార్పొరేషన్ల పరిధిలో 30 శాతానికి, తదుపరి కేటగిరీని 20 శాతానికి పెంచే ప్రతిపాదన కూడా సీఎం పరిశీలనలో ఉంది. -
నిరుద్యోగ యువతకు శుభవార్త
సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు ప్లేస్మెంట్ గ్యారంటీతో వివిధ వృత్తుల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. మొత్తం 18 వృత్తి నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 1,627 మంది నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించించి. మొత్తం అభ్యర్థుల్లో 702 మంది మైనారిటీ, 625 మంది ఎస్సీ, 300 మంది ఎస్టీ యువతకు శిక్షణ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. గురుకుల విధానంలో రెండు నుంచి ఆరు నెలల కాల పరిమితి శిక్షణ ఉచితంగా అందించనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణత, ఆపైన చదివిన అభ్యర్థులు శిక్షణకు అర్హులు. ప్రస్తుతం 512 మంది ఆయా కేంద్రాల్లో శిక్షణ పొందుతున్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ అందించేం దుకు ఈ సీఐఎల్ అలీఫ్, సెట్విన్, ఏస్, డైలాగ్ ఇన్డార్క్, క్యాబ్ ఫౌండేషన్, సీపెట్, డాన్వాస్కో టెక్నాలజీ, టీఎస్ ఆర్టీసీ సంస్థలతో అధికార యంత్రాంగం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాంతాల వారీగా కోర్సులు ఇలా.. రియాసత్‌నగర్: ట్యాలీ,జీఎస్టీ, డీటీపీ, డిజైనింగ్ కోర్సులు అమీర్‌పేట: డీటీపీ, నెట్వర్కింగ్, హార్డ్‌వేర్ మలక్‌పేట, అంబర్‌పేట, నషేమాన్‌నగర్, హేజ్ బాబానగర్: టైలరింగ్ కోర్సులు విద్యానగర్, మీరాలం ట్యాంక్, బహదుర్ పురా, జూపార్క్: ఏసీ రిపేరింగ్, మొబైల్ సర్వీసింగ్, బ్యూటిషియన్. పెద్ద అంబర్‌పేట: లైఫ్ స్కిల్స్ (అంధులకు మాత్రమే) కోటి, దూద్‌బౌలి, బండ్లగూడ, గాగిల్లాపురం, రామాంతపూర్: హాస్పిటాలిటీ, బెడ్‌సైడ్ నర్సింగ్, రిటైల్ మార్కెటింగ్, ఎలక్ట్రానిక్, వెల్డింగ్, ఏసీ సర్వీసింగ్ తదితర 70 రకాల ట్రేడ్స్. హకీంపేట: లైట్ మోటార్ వెహికిల్, హెవీ వెహికిల్ డ్రైవింగ్ శిక్షణ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి: 86397 87489 ఎస్సీ కార్పొరేషన్ ఈడీ: 94899 05999 ఈసీఐఎల్ ప్రోగామింగ్ ఆఫీసర్: 99857 98828 అలీప్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 98498 02970 సెట్విన్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 98666 53908 ఏసీఈ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 94408 04858 పాలిటెక్నిక్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 99123 42001 క్యాప్ ఫౌండేషన్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 87989 69698 సీఐసీఈటీ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 99593 33415 డాన్బాస్కోటెక్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 99005 46572 టీఎస్ఆర్టీసీ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 73828 10023 టీఎస్ ఆర్టీసీ ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 73828 00936 -
ఈ నెల 14న పీఆర్సీ..!
-
‘వాటా’ర్ వార్!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల నీటి లెక్కలపై ఇంకా స్పష్టత రావడం లేదు. జూన్ నుంచి వాటర్ ఇయర్ మొదలయ్యేందుకు మరో 20 రోజుల గడువే ఉన్నా కృష్ణా జలాల పంపిణీపై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కృష్ణాలో ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న తాత్కాలిక ఒప్పందాలను సవరించాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కృష్ణా జలాల నీటి వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎడతెగని వివాదాల నేపథ్యంలో.. 2015లో జూన్ 21, 22న ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశమైన కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున పంపిణీ చేస్తూ తాత్కాలిక కేటాయింపు చేశారు. దీనికి మొదట ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరినా మరుసటి ఏడాది నుంచే ఇరు రాష్ట్రాలు దీనిపై అభ్యంతరాలు తెలిపాయి. తెలంగాణకు మళ్లీ అన్యాయం.. పట్టిసీమ ద్వారా తరలిస్తున్న నీటి వాటాలో తమకు న్యాయంగా దక్కే 45 టీఎంసీలు పెంచి తమ కోటా 299 టీఎంసీలకు జత చేయాలని తెలంగాణ కోరుతోంది. అయితే దీనిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. దీనికి తోడు పోలవరం ద్వారా ఎగువన రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలను ఇప్పటికే కర్ణాటక వినియోగిస్తున్నందున తమకు వాటా పెంచాలని కోరుతున్నా అదీ పెండింగ్‌లోనే ఉంది. దీంతో కృష్ణా నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణకు మళ్లీ అన్యాయం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై తెలంగాణ ఏ మేరకు ఒత్తిడి తెస్తుందన్నది కీలకంగా మారింది. తేలని టెలీమెట్రీ ఏర్పాటు.. ఇక నీటి లెక్కలు పక్కాగా ఉండేందుకు సాగర్, శ్రీశైలం పరిధిలో గుర్తించిన ప్రాంతాల్లో టెలీమెట్రీ వ్యవస్థ ఏర్పాటు ఇంత వరకు జరగలేదు. తొలి విడతలో 18 చోట్ల ఏర్పాటుకు రెండేళ్ల కింద స్పష్టత వచ్చినా వాటిని అమల్లోకి తేలేదు. ఇక రెండో విడతలో మరో 29 చోట్ల కృష్ణా బోర్డు ప్రతిపాదించగా, ఇరు రాష్ట్రాల నుంచి అనేక అభ్యంతరాలున్నాయి. దీంతో వీటి ఏర్పాటు 20 రోజుల వ్యవధిలో పూర్తయ్యేలా కనిపించడం లేదు. కృష్ణాబోర్డు చైర్మన్‌గా ఉన్న వైకే శర్మ 4 రోజుల కిందటే బదిలీ కావడంతో ఆయన స్థానంలో కొత్త చైర్మన్ వచ్చే వరకు టెలిమెట్రీ ఏర్పాటుపై స్పష్టత తేవడం సాధ్యమ్యేది కాదని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
ఓసారి భూ.. రికార్డులు తిరగేస్తే..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో భూ రికార్డుల నవీకరణను ప్రభుత్వం చేపడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సంస్థానంలో రెవెన్యూ శాఖ ఏర్పాటు ఎలా జరిగింది ? నిజాం కాలం నాటి భూ రికార్డులు నేటికీ ఎలా ఆధారమయ్యాయి? అప్పటి భూముల స్థితిగతులు, రికార్డులు, పన్ను వసూలు ఎలా ఉండేవి తదితర వివరాలను ఓ సారి చూద్దామా.. సాలార్ జంగ్ హయాంలో రెవెన్యూ వ్యవస్థ .. ప్రధానమంత్రి సాలార్ జంగ్ నేతృత్వంలో రెవెన్యూ బోర్డును 1864లో ఏర్పాటు చేశారు. అప్పటికే దే«శవ్యాప్తంగా షేర్షా సూరి ఏర్పాటు చేసిన రెవెన్యూ వ్యవస్థ కొనసాగేది. నిజాం పాలనలో ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు వసూలు. అప్పటికే భూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీంతో తొలిసారి 1864– 1880 మధ్య కాలంలో భూములను గొలుసుల ద్వారా కొలిచి గుంటలుగా లెక్కగట్టి ఎకరాలుగా నిర్ధారణ చేశారు. ఇలా భూముల సర్వే, భూ రికార్డుల పునర్వ్యవస్థీకరణ, రెవెన్యూ రికార్డుల క్రమబద్ధీకరణ జరిగింది. హైదరాబాద్ స్టేట్‌లో తొలి భూముల సర్వే 1940–1950 మధ్య కాలంలో మహారాష్ట్ర బ్రాహ్మణులతో ప్రతి గ్రామంలో రైత్వారీ పట్టా భూములు, ప్రభుత్వ భూముల సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో భూముల కొలతలు, హద్దులు, యాజమాన్యపు హక్కులు సరిచేసి వసూల్ బాకీ, సేత్వార్ రికార్డులను తయారు చేశారు. ఈ రికార్డుల్లో సర్వే నంబర్ విస్తీర్ణం, పట్టాదారుడి వివరాలు, యోగ్యమైన భూమి... పూట్ కరాబ్ (వ్యవసాయానికి పనికిరాని భూమి), ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల వివరాలు నమోదు చేశారు. వసూలు బాకీ రికార్డు పాత సర్వే నంబర్, పాత విస్తీర్ణం, కొత్త సర్వే నంబర్, కొత్త విస్తీర్ణం నమోదు చేసి దీని ఆధారంగా వసూలు బాకీ రికార్డులు రూపొందించారు. సర్వే నంబర్ వారీగా నిర్ణీత విస్తీర్ణంతో హద్దు రాళ్లు పాతి, టిప్పన్ ఆధారంగా సేత్వార్ రికార్డు తయారు చేశారు. వసూల్ బాకీ, సేత్వార్ ఆధారంగా 1953–56 వరకు మూడేళ్లకు ఒకే కాస్రా పహాణీ రాశారు. భూ రికార్డుల ప్రక్షాళన ఎందుకంటే... 62 ఏళ్లుగా రెవెన్యూ రికార్డుల్లో ఎన్నో మార్పులు జరిగాయి. (ఉదాహరణకు పట్టాదారు చనిపోవడం, భూముల క్రయ విక్రయాలు, వంశపారంపర్యంగా వారసుల పేర మార్పిడి). సేత్వార్ ప్రకారం సర్వే నంబర్ నిర్ణీత విస్తీర్ణంలో మార్పులు చేర్పులు, పట్టాదారుల, కబ్జాదారుల పేర్లు, యాజమాన్యపు ఆధారాలు, సంబంధం లేని వ్యక్తుల పేర్లు పహాణీలోని తప్పుగా నమోదు చేయడంతో రికార్డుల ప్రక్షాళన అనివార్యమైంది. కాస్రా పహాణీ రికార్డు రైతులకు రుణాలు, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం విషయంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. గతంలో ఉన్న రికార్డుల ఆధారంగానే భూముల దగ్గరకు వెళ్లి సేత్వార్ ప్రకారం సర్వే నంబర్ విస్తీర్ణం ఉందా లేదా చూసి, ఆ భూమి పట్టాదారుడు, అనుభవదారుడు పేరిట సరికొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నారు. మారిన భూమి శిస్తు వసూలు విధానం గతంలో ప్రతి వ్యవసాయ భూమికి నీటి వనరుల పారకం ఆధారంగా శిస్తులు జమాబందీలో నిర్ణయించి వసూలు చేసేవారు. దీనికి అదనంగా మెట్ట పంటలకు లోకల్ సెస్ పేరుతో శిస్తు ఉండేది. ప్రస్తుత విధానంలో ప్రభుత్వ నీటి వనరుల ద్వారా పారకం ఉన్న మాగాణి, మెట్ట భూములకు నీటి పన్ను మాత్రమే వసూలు చేస్తున్నారు. పాత భూమి శిస్తు విధానంలో పహాణీలో పట్టాదారు, కబ్జాదారుడి వివరాలు సరిగా నమోదయ్యేవి. ప్రస్తుత విధానంలో కేవలం నీటి పన్ను (వాటర్ సెస్ ) చెల్లించే వారి పేర్లు మాత్రమే నమోదు చేస్తున్నారు. ఇతర వ్యవసాయ భూముల పట్టాదారు, కబ్జాదారు, ఇతర వనరులతో సేద్యం చేసిన భూముల వివరాలు పహాణీల్లో సరిగా నమోదు కావడం లేదు. రాగితో తయారు చేసిన భూ రికార్డు రెవెన్యూ సంవత్సరం ఎప్పటి నుంచి అంటే.... ఇప్పటికీ ఫసలీ సంవత్సరం ప్రకారం జూన్ మొదటి తేదీ నుంచి మే చివరి తేదీ వరకు రెవెన్యూ వ్యవస్థ కొనసాగుతోంది. వర్షాకాలం మొదటి పంట(ఆది) జూన్ నుంచి నవంబర్ వరకు, రెండో పంట (తాబి) డిసెంబర్ నుంచి మే వరకు. దీని ఆధారంగానే నేటికీ భూమి శిస్తులు వసూలు చేస్తున్నారు. -
ఈ నెల 14న పీఆర్సీ..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సర్కారు తీపి కబురు వినిపించబోతోంది. ఈ నెల 14న వేతన సవరణ సంఘం(పీఆర్సీ) ఏర్పాటుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటన చేయనున్నారు. ఉపాధ్యాయులు, టీచర్ల డిమాండ్లపైనా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 14న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్నారు. పీఆర్సీ, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్), బదిలీలు, పదవీ విరమణ వయసు పెంపు సహా ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన మొత్తం 18 డిమాండ్లను చర్చించనున్నారు. అలాగే ఉపాధ్యాయ సంఘాల 36 డిమాండ్లపైనా ఈ భేటీలో చర్చించి అదేరోజు నిర్ణయాన్ని వెలువరించనున్నారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు, నివేదిక గడువు, వేతన సవరణను అమల్లోకి తేనున్న కాలవ్యవధిపై సీఎం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే ఆన్లైన్ విధానంలో టీచర్ల బదిలీలు, ఏకీకృత సర్వీస్ రూల్స్, పదోన్నతుల వంటి అంశాలపై ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి చర్చిస్తారు. నివేదిక సిద్ధం చేస్తున్న ఉపసంఘం ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి మంత్రి ఈటల రాజేందర్, కె.తారకరామారావు, జి.జగదీశ్‌రెడ్డితో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం గత శుక్ర, శనివారాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. సీపీఎస్ రద్దు మినహా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రధాన డిమాండ్లపై మంత్రివర్గ ఉప సంఘం సానుకూలత వ్యక్తం చేసింది. సీపీఎస్‌పై నిర్ణయాన్ని ముఖ్యమంత్రికి అప్పగిస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాల డిమాండ్ల సాధ్యాసాధ్యాలపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సిద్ధం చేస్తోంది. ఈ నెల 11న సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించనుంది. అనంతరం ఖజానాపై పడనున్న అదనపు భారాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులతో సీఎం చర్చించనున్నారు. ఈ కసరత్తు ముగిసిన తర్వాత 14న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఆయన నేరుగా సమావేశమై చర్చలు జరుపుతారు. సీపీఎస్‌పై సర్వత్రా ఆసక్తి సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని గత కొంత కాలంగా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం వెలువరించనున్న నిర్ణయంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం నుంచి సానుకూల స్పందన రావొచ్చని ఆయా వర్గాలు ఆశిస్తున్నాయి. గత మార్చిలో జరిగిన రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో సీపీఎస్ రద్దు చేయాలని విపక్షాల నుంచి వచ్చిన డిమాండ్‌కు కేసీఆర్ ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో సీపీఎస్ అమలును అంగీకరిస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఒప్పందం చేసుకుందని, ఈ నేపథ్యంలో సీపీఎస్ రద్దుపై నిర్ణయాధికారం కేవలం కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉందని సీఎం అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. సీపీఎస్ రద్దు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పడం గమనార్హం. -
సమ్మర్ క్యాంపులకు బియ్యం ఇయ్యం!
సాక్షి, హైదరాబాద్ : గురుకుల సొసైటీలు సంకటంలో పడ్డాయి. సమ్మర్ క్యాంపు(వేసవి శిబి రం)లకు బియ్యం కోటా ఇవ్వలేమని పౌర సరఫరాలశాఖ తేల్చి చెప్పడంతో ఆందోళన చెందుతున్నాయి. గురుకుల విద్యాలయాల సొసైటీలు ఏటా సమ్మర్ క్యాంపుల్లో భాగంగా గురు కుల పాఠశాలల్లోని చురుకైన విద్యార్థులకు పలు కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వ హిస్తాయి. క్రీడలు, నృత్యాలతోపాటు సబ్జెక్ట్‌కు సంబంధించి అవగాహన, భావ వ్యక్తీకరణ నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటికి రోజంతా సమ యం పడుతుండడంతో విద్యార్థులకు వసతితోపాటు భోజన సదుపాయాన్ని కూడా గురుకుల సొసైటీలే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా బియ్యం కోటా ఇవ్వాలని గురుకుల సొసైటీలు కోరగా ఇవ్వలేమని పౌర సరఫరాల శాఖ తేల్చి చెప్పింది. -
‘డబుల్’ కల నెరవేరేనా..?
సంస్థాన్ నారాయణపురం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం పేదలు ఎదురుచూస్తున్నారు. మండలంలో 14 గ్రామాలు ఉంటే, మొదటి విడత సర్వేల్లో రెండు ఎకరాల భూమిలో 64, సంస్థాన్ నారాయణపురం గ్రామానికి సంబంధించి కంకణాలగూడెం గ్రామా రెవెన్యూ పరిధిలో మూడు ఎకరాల భూమిలో 138 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. సర్వేల్లో గతేడాదే.. నిర్మాణ పనులు ప్రారంభం కాగా.. సంస్థాన్ నారాయణపురంలో నేటికీ పనులు ప్రారంభం కాలేదు. మిగతా 12 గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. సర్వేల్లో పురోగతి.. నియోజకవర్గంలో సర్వేల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి మొట్టమొదట నిర్వహించారు. రూ.3.78కోట్లతో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దసరా నాటికి గృహప్రవేశాలు చేసేలా పనులు సాగుతున్నాయి. కానీ సంస్థాన్ నారాయణపురంలో పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఇక్కడ ఇళ్లు ఎప్పుడు పూర్తవుతాయోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని మిగతా గ్రామాల్లో కూడా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. -
గొర్రెలకు ఏదీ బీమా ధీమా..!
ఇతడి పేరు అల్వాల నాగరాజు(40). సిరిసిల్ల పట్టణ శివారులోని మార్కట్‌పల్లెకు చెందిన ఇతను వ్యవసాయం చేసేవాడు. కులవృత్తిగా వచ్చిన గొర్రెలు కాస్తూ జీవనం సాగించాడు. రాష్ట్ర ప్రభుత్వం 75శాతం రాయితీతో గొర్రెలు ఇస్తుందని సంతోషపడ్డాడు. యాదవ సంఘం సమక్షంలో డ్రా తీయగా నాగరాజు పేరు వచ్చింది. గొర్రెల కోసం రూ.31,250 డీడీ కట్టాడు. 20 గొర్రెలు, ఒక పొట్టేలు వస్తుందని ఆశతో కడపకు వెళ్లాడు. 12 గొర్రెలు, 9 పిల్లలు వచ్చాయి. వచ్చిన పదిహేను రోజులకే పుర్రుకొడుతూ ఐదు గొర్రెలు చనిపోయాయి. రూ.4వేలు మందులు వేసినా గొర్రెలు దక్కలేదు. మరో వారం రోజులకు ఆరు చిన్నవి, నాలుగు పెద్దవి కూడా మృత్యువాత పడ్డాయి. ఇక చిన్నాపెద్ద గొర్రెలు అన్నీ కలిపి 11 మిగిలాయి. పది గొర్రెలు చనిపోయి నాలుగు నెలలు అవుతున్నా.. నాగరాజుకు ఒక్క పైసా పరిహారం రాలేదు. ఇది ఒక్క నాగరాజు పరిస్థితే కాదు.. జిల్లాలోని 446 మంది గొర్రెలకాపరుల దుస్థితి ఇదే.. సిరిసిల్ల : గొర్రెలకాపరులకు 75 శాతం సబ్సిడీతో నేరుగా ఒక్కొక్కరికి 21 గొర్రెలు అందజేసింది. ఒక్కో యూనిట్‌కు రూ.1.25 లక్షలు కాగా ఇందులో 25 శాతం.. అంటే రూ.31250 లబ్ధిదారు చెల్లిస్తే.. రూ.93,750 ప్రభుత్వం భరించింది. గొర్రెలకు బీమా, రవాణా ఖర్చులు సైతం ఇందులోనే ఉండేలా పథకం రూ పొందించారు. వీటిని బ్యాంకులతో సంబం ధం లేకుండానే నేరుగా పంపిణీ చేశారు. గొర్రెలకాపరులకు ధీమా ఇవ్వాలనే లక్ష్యంతో గొర్రెలకు బీమా చేయించారు. 20 గొర్రెలు, ఒక్క పొట్టేలుకు బీమా కంపెనీకి చెందిన ట్యాగ్స్(పోగులు) వేశారు. అన్ని గొర్రెలకు కలిపి యూని ట్‌గా బీమా ప్రీమియంగా బీమా కంపెనీకి రూ.3,240 చెల్లించారు. ఏడాదిలోగా ఆ యూ నిట్‌లోని ఏ గొర్రె చనిపోయినా రూ.5,200, పొట్టేలు చనిపోతే రూ.7,000 పరిహారంగా గొర్రెలకాపరికి అందించాల్సి ఉంది. కానీ జిల్లాలోని 446 మంది గొర్రెల కాపరులకు చెందిన 2,161 గొర్రెలు మరణించగా.. ఒక్కరికి కూడా పరిహారం రాలేదు. బీమా..ధీమా దక్కలేదు. జిల్లాలో 2161 గొర్రెలు వివిధ కారణాలతో మరణించగా.. ఇప్పటి వరకు 577 గొర్రెలకు సంబంధించిన బీమా పత్రాలు(డాకెట్స్) కంపెనీకి చేరాయి. అందులో 524 గొర్రెలకు బీమా చెల్లిస్తామని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. మరో 53 గొర్రెల డాకెట్స్ సరిగా లేవని తిరస్కరించారు. ఇంకా 1,584 గొర్రెల బీమాపత్రాలు సమర్పించలేదు. వాటికి సంబంధించిన ఆనవాళ్లు కరువయ్యాయి. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. గొర్రెలకాపరులకు నష్టం తప్పడం లేదు. కారణాలేమిటీ..? ప్రతీగొర్రెను సజీవంగా ఉండగానే ట్యాగ్‌తో సహా ఫొటో తీయాల్సి ఉంటుంది. ఆ గొర్రె చ నిపోయినప్పుడు ఆ సమాచారాన్ని సంబంధిత మండల పశువైద్యాధికారికి సమాచారం అం దించాలి. ఆయన క్షేత్రస్థాయిలో చనిపోయిన గొర్రెను చూసి పోస్టుమార్టం నిర్వహించి మృ తికి గల కారణాలను విశ్లేషిస్తూ.. డాక్టర్ నివేదిక ఇవ్వాలి. చనిపోయిన గొర్రెను ట్యాగ్ కని పించే విధంగా ఒక్కటి, మొత్తం గొర్రెతో మరో టి, ట్యాగ్ నంబరు కనిపించే విధంగా మూడు ఫొటోలు తీయాలి. ఈ ఫొటో ప్రింట్లు, డాక్టర్ పోస్టుమార్టం నివేదికతో కలిపి బీమా కంపెనీకి పంపించాల్సి ఉంటుంది. కంపెనీకి అన్ని పత్రాలు సవ్యంగా ఉన్నట్లు చేరితో మూడు నెలల్లో పరిహారం చెక్కు లేదా, డీడీ రూపంలో గొర్రెలకాపరికి బ్యాంకు ఖాతాకు చేరుతుంది. ఈ మొత్తం విధానంపై అవగాహన లేకపోవడంతో చనిపోయిన గొర్రెలను పాత బావుల్లో పడేయడం, లేదా పూడ్చివేశారు. దీంతో ఆనవాళ్లు కనిపించక బీమా కంపెనీలు పరిహారం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. దీనిపై అవగాహన కల్పించాల్సిన పశువైద్యాధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో రూ.85.12 లక్షల నష్టం జిల్లావ్యాప్తంగా 212 గ్రామాల్లో తొలివిడత 8,153 మందికి 1,71,213 గొర్రెలను పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 6,931 మందికి 1,45,551 గొర్రెలను పంపిణీ చేశారు. దీని కోసం ప్రభుత్వం రూ.64.97 కోట్లు వెచ్చించింది. గొర్రెలకాపరులు వాటా ధనంగా రూ.21.65 కోట్లు చెల్లించాలి. చనిపోయిన గొర్రెల మూలంగా రూ.85.12 లక్షలు నష్టపోయారు. బీమా కంపెనీ నిర్ధారించిన 524 గొర్రెలకు రూ.27.24 లక్షల పరిహారం వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకైతే ఒక్క క్లెయిమ్ చెల్లింపులు జరగలేదు. బీమా పరిహారం ఇప్పిస్తాం జిల్లాకు సరఫరా అయిన గొర్రెలకు బీమా చేయించాం. చనిపోయిన వాటికి పరిహారం ఇప్పించేందుకు బీమా కంపెనీతో మాట్లాడుతున్నాం. నిర్దేశిత డాకెట్లను పంపిస్తాం. ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలకు ఇక్కడికి వచ్చాక 30,608 గొర్రెల పిల్లలు పుట్టాయి. మనజిల్లా వీటి సంపద పెరిగినట్లే. కాపరులు గొర్రె చనిపోతే వెంటనే సమాచారం ఇవ్వాలి. వారు నష్టపోకుండా పరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ టీవీ రమణమూర్తి, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి -
‘హరీ’తహారం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): అట్టహాసంగా ప్రారంభించిన హరితహారం లక్ష్యం అభాసుపాలవుతోంది.. ప్రారంభంలో మొక్కలపై ఉన్న శ్రద్ధ ప్రస్తుతం లేకపోవడంతో పెరిగిన మొక్కలు నర్సరీల్లో బిక్కుబిక్కుమంటున్నాయి. పట్టించుకునే నాథులే లేకపోవడంతో చాలామొక్కలు నర్సరీల్లోనే చనిపోతున్నాయి. గతేడాది హరితహారం కార్యక్రమం కింద ఉత్తునూర్ గ్రామంలోని ఎల్లమ్మగుడి ఆలయ ప్రాంగణంలో ఏడాది క్రితం అటవీశాఖ ఆధ్వర్యంలో లక్ష మొక్కలతో వన నర్సరీని ఏర్పాటు చేశారు. నర్సరీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో ఏర్పాటు చేసిన లక్ష మొక్కలకు నీరు పట్టే వారు లేక నర్సరీలోనే ఎండిపోయాయి. నర్సరీని ఏర్పాటు చేయడానికి తీసుకున్న స్థల నిర్వహకులకు కూడా ఇప్పటికీ డబ్బులు కూడా చెల్లించలేదు. ఇవన్ని కలిపి హరితహారం పథకానికి తూట్లు పొడుస్తున్నాయి. ప్రస్తుతం సగానికి పైకా మొక్కలు చనిపోయాయి. రికార్డుల్లో ఘనం.. గ్రామాల్లో హరితహారం కింద లక్షల్లో మొక్కలు నాటినట్లు రికార్డులు సృష్టించారే తప్పా గ్రామాల్లో మొక్కలు నాటలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరిత తెలంగాణగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం అడుగడుగున నిర్వీర్యం అవుతుంది. వన నర్సరీల్లో ఏర్పాటు చేసిన మొక్కలు చెట్లుగా మారుతున్నా. పట్టింపు లేదు. అధికారుల నిర్లక్షం కూడా తోడవుతుంది. దీనంతటికి కారణం క్షేత్ర స్థాయిలో అధికారులు పట్టించుకోక పోవడం, ఏర్పాటు చేసిన నర్సరీలపై కనీసం దృష్టి సారించక పోవడంతో హరిత లక్ష్యం హరీమంటుంది. గ్రామాల్లో 40 వేల చొప్పున మొక్కలు నాటాలని విధించిన నిబంధన ఏ మాత్రం ప్రయోజనం లేకుండా ఉందని తెలుస్తోంది. మొక్కల సంరక్షణకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో పథకం అభాసుపాలవుతుంది. పథకం అమలులో సరైనా ప్రణాళిక లేకపోవడంతో హరితహారం పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికైన అధికారులు స్పందించి హరితహారం పథకాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మొక్కలను వృథా చేశారు.. గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో పెంచిన లక్ష మొక్కలను వృథా చేశారు. ఎండిపోయిన మొ క్కలను అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తయారైంది. – వెంకట్రావ్, ఉత్తునూర్ ఎండబెట్టారు హరితహారంలో నాటాల్సిన మొక్కలను ఎండబెట్టారు. దీంతో ప్రభుత లక్ష్యం నీరుగారింది. నర్సరీని ఏర్పాటు చేసిన అధికారులు నర్సరీపై దృష్టి పెట్టకపోవడంతో మొక్కలు ఎండుముఖం పట్టాయి. అధికారులు దృష్టి సారించి పథకాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. – రాజు, ఉత్తునూర్ -
కరెంట్ సరే.. నీరెక్కడ..?
వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరాతో రైతుల ఇక్కట్లు తీరుతాయనుకుంటే మరింత పెరిగాయి. నిరంతర విద్యుత్‌తో రైతులందరూ విచ్చలవిడిగా విద్యుత్ మోటార్లను ఉపయోగిస్తుండడంతో బావుల్లోని నీరు అడుగంటింది. నీటి కోసం రైతులు గంటల తరబడి బావుల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ ఉన్నా.. బావుల్లో నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి. కరీంనగర్ (రూరల్) : కరీంనగర్ మండలంలో ఈ రబీ సీజన్లో 6500 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఎస్సారెస్పీ కాలువ నీటి విడుదలతో పలువురు రైతులు ఆరుతడి పంటలకు బదులుగా వరి పంటను సాగు చేసేందుకు మొగ్గు చూపారు. ఒకవైపు కాలువ నీరు, మరోవైపు నిరంతర విద్యుత్ సరఫరాతో ఈ రబీ సీజన్లో పంటలు పండుతాయని ఆశించిన రైతాంగానికి ఆదిలోనే అడ్డంకి ఏర్పడింది. గత నెల 25నుంచి మొదటి విడత కాలువ నీరు విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 4విడతలుగా ఆయకట్టు చివరి రైతులకు నీరందని దుస్థితి. గతేడాది వర్షభావ పరిస్థితులతో బావుల్లో భూగర్భజలాలు అడుగంటాయి. ఉపయోగపడని నిరంతర విద్యుత్ గత నెల 1నుంచి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. నిరంతర విద్యుత్ సరఫరాను చేసేందుకు వీలుగా 10సబ్స్టేషన్లలో ప్రత్యేకంగా పీటీఆర్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ మండలంలో మొత్తం 8వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. గతేడాది వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో ప్రస్తుతం భూగర్భజలాలు అడుగంటాయి. విద్యుత్ ఉన్నా.. పలువురు రైతుల వ్యవసాయ బావుల్లోని నీరు రెండు,మూడు గంటలకే సరిపోతున్నాయి. మళ్లీ నీటి కోసం ఐదారు గంటలపాటు వేచి చూడాల్సిన పరిస్థితి. బావుల్లో సరిపడే నీరు లేక పొలాలన్నీ ఎండిపోతున్నాయి. కొందరు రైతులు పొలమంతా పారే పరిస్థితి లేక ఉన్న నీటితో సగం పొలానికి మాత్రమే ఉపయోగిస్తూ పంటను కాపాడుకుంటున్నారు. కొందరు రైతులు చివరి ప్రయత్నంగా పంటలను కాపాడుకునేందుకు బావుల్లో పూడిక తీయిస్తుండగా.. మరికొందరు సైడ్బోర్లు వేయిస్తున్నారు. గొర్రెలు మేపుతున్నా ఎకరం పొలంలో వరి నాటు వేశా. బావిలో నీరు లేక పొలాలన్నీ ఎండుతున్నాయి. వంతులవారీగా సరిపడే నీరందకపోవడంతో 30గుంటలు విడిచిపెట్టి మిగిలిన 10గుంటలకు నీరు పెడుతున్నా. గొర్రెలకు మేత లేక ఎండిన పొలంలో వారం రోజుల నుంచి గొర్రెలను మేపుతున్నా. – కూకట్ల ఎల్లయ్యయాదవ్, రైతు, మొగ్ధుంపూర్ బావిలో నీరు లేక.. ఎకరం 20గుంటల్లో వరి నాటేశా. నీరు సరిపోవడం లేదు. కరెంట్ ఉన్నా బావిలో నీరు లేదు. మోటార్ పెట్టిన రెండు గంటలకే అయిపోతున్నాయి. పొలమంతా పారక 20గుంటలు విడిచిపెట్టా. చివరి వరకు మిగిలిన ఎకరం పొలం కూడా పారుతదో లేదో తెలుస్తలేదు. – మైలారం నాగరాజు, రైతు, మొగ్ధుంపూర్ -
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయిలో రైతు రుణ విమోచన కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవడంపై ఉమ్మడి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడు నెలల్లోగా ఏర్పాటు చేస్తామన్న హామీని అమలు చేయడంలో ఇబ్బంది ఉంటే ఆ విషయాన్ని హైకోర్టు దృష్టికి ఎందుకు తీసుకురాలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని శుక్రవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కె.విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. హామీని అమలు చేయకపోవడం కోర్టు ధిక్కార చర్యగా ఎందుకు పరిగణించరాదో తెలపాలని పేర్కొంది. రైతు రుణ విమోచన కమిషన్ ఏర్పాటు చేయాలన్న వ్యాజ్యాన్ని దాఖలు చేసిన బీజేపీ సీనియర్ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి తరఫు న్యాయవాది గత హామీని అమలు చేయకపోవడాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మరికొంత సమయం ఇస్తే కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ నవంబర్ 21తో ముగిసిందని, ఇంతవరకు కనీస సమాచారం లేకుండా గడువు కోరడంలో ఔచిత్యం ఏమిటో అర్థం కావడం లేదని ధర్మాçనం వ్యాఖ్యానించింది. అనంతరం విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. -
శిశుగృహపై చిన్నచూపు!
మంకమ్మతోట : తల్లిదండ్రులు వదిలేసిన.. అనాథలుగా దొరికిన శిశువులను చేరదీసి సంరక్షించే శిశుగృహ భవన నిర్మాణంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నట్లు కనిపిస్తోంది. శిశుగృహలోని పిల్లలకు మరిన్ని వసతులు, సౌకర్యాలు, మెరుగైన సంరక్షణ అందించాలనే సంకల్పంతో చేపట్టిన భవనం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలో శిశుగృహ కు ప్రత్యేక భవనమంటూ లేకపోవడంతో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గృహాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని బాలసదన్‌లో రెండుగదుల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో పిల్లల ఆలనాపాలన చూసేందుకు సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శిశువులకు గాలి, వెలుతురుతోపాటు ఆహ్లాదరకమైన వాతావరణం ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని భావించిన సర్కారు.. మెరుగైన వసతుల కోసం ప్రత్యేక భవన నిర్మాణానికి సంకల్పించింది. బాలసదన్ ఆవరణలోని ఖాళీస్థలంలో పనులు చేపట్టేందుకు ఉపక్రమించింది. పనులు పూర్తిచేసినప్పటికీ అందులో సౌకర్యాలు మాత్రం పూర్తిగా కల్పించడంలో విఫలమైంది. దాదాపు ఆర్నెల్లుగా ఇదే పరిస్థితి ఉన్నా.. అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. భవనానికి నిధులు బాలసదన్ ఆవరణలోగల స్థలంలో శిశుగృహ భవన నిర్మాణానికి రూ.13లక్షలు మంజూరు చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ భవన నిర్మాణం చేపట్టింది. ఆగస్టుకు ముందే పూర్తయింది. భవనం లోపల పనులతోపాటు మరుగుదొడ్డి పైప్‌లైన్, సెప్టిక్ ట్యాంక్ వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ఈ సౌకర్యాలు కల్పించేందుకు ఎస్టిమేషన్ నివేదిక అందించారు. ఈ పనులు పూర్తికావాలంటే మరో 9లక్షలు అదనంగా మంజూరు చేయాలని కోరారు. నివేదిక పరిశీలించిన కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సెప్టెంబర్ 23న స్వయంగా శిశుగృహభవనాన్ని సందర్శించి పనులు పరిశీలించారు. అధికారులు తెలిపిన వాటిలో కొన్ని తగ్గించి రూ.4లక్షలు మంజూరు చేశారు. అయినా.. ఇప్పటివరకు పనులు పూర్తికావడం లేదు. కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతున్న శిశుగృహ భవనం ఆలస్యం కావడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అనుమతి ఉందా..? శిశుగృహా భవన నిర్మాణానికి సంబంధించి నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందలేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. నగర పాలక సంస్థ సంబంధిత శాఖ అధికారులు వారంక్రితం అనుమతి తీసుకోలేదని తెలుపుతూ నిర్మాణం చుట్టకొలతలు తీసుకున్నట్లు సమాచారం. పూర్తి చేయాల్సిన పనులు మరుగుదొడ్డి పైప్‌లైన్ నిర్మాణం, సెప్టిక్ ట్యాంక్, పిల్లలు కిందపడకుండా భవనం ముందు అరుగుకు ఫెన్సింగ్, పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేంలా భవనం ముందు స్థలంలో గార్డెన్, లోపల బయట రంగులు వేయడం, ఏసీ లేదా కూలర్స్ ఏర్పాటు పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తిచేసి చిన్నారులకు ఆహ్లాదకరమైన సంరక్షణ అందించాలని ప్రజలు కోరుతున్నారు. -
ముహూర్తం కుదిరింది
కల్హేర్(నారాయణఖేడ్) : జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగుకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రాజెక్టు కాల్వల ఆధునికీకరణ పనులు ప్రారంభించేందుకు అధికారులు ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం పనులు ప్రారంభించనున్నారు. సీఏం కేసీఆర్ పనులను ప్రారంభించాల్సి ఉండగా అప్పట్లో భారీ వర్షాలతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. నల్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలని గత అసెంబ్లీ సమావేశల్లో స్థానిక ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించి నల్లవాగు ప్రాజెక్టు రూపురేఖలు మారుస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు అప్పట్లో అధికారులు నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ క్రమంలో ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం ప్రభుత్వం రూ.24.14 కోట్లు కేటాయించింది. దీంతో రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే సీజన్‌నాటికి మహర్దశ.. నల్లవాగు ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆధునికీకరణ పనులు చేపడితే వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి మహర్ధశ పట్టనుంది. దెబ్బ తిన్న కాల్వల రూపురేఖలు మారనున్నాయి. కాల్వల మధ్యలో తూ ములు, షట్టర్లు, సైఫాన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు పరిధిలోని నిర్ధారిత ఆయకట్టు 6,030 ఎకరాలకు పూర్తిగా సాగు నీరందిం చేందుకు ప్రభుత్వం రూ.24.14 కోట్లు కేటాయించడంతో ఆధునికీకరణ పనులు పూర్తై ఆయ కట్టు రైతుల కష్టాలు తీరనున్నాయి. వెంటనే పనులు ప్రారంభం.. నల్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపట్టేం దుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తి చేశాం. వచ్చే ఖరీఫ్‌లో జూన్ మాసం చివరి వరకు పనులు పూర్తిచేస్తాం. కాల్వల ఆధునికీకరణ, తూములు, షట్టర్లు, గైడ్‌వాల్స్, ఇతర ప్రధాన పనులు చేపడతాం. చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించే దిశగా పనులు చేస్తాం. కుడి, ఎడమ కాల్వల పరిధిలోని 2,500 ఎకరాలకు అదనంగా సాగు నీరందుతుంది. – రాములుగౌడ్, ఈఈ నీటి పారుదల శాఖ -
బలవంతపు భూసేకరణ!
‘రైతు ప్రభుత్వం అంటూనే మోసం చేస్తున్నారు.. వారి పొట్టగొట్టేందుకు ముఖ్యమంత్రి జీఓ 123 తీసుకొచ్చిండ్రు.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఎక్కడా మాట్లాడటంలేదు.. కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు.. మల్లన్నసాగర్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల లక్ష్యాన్ని నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నరు.. న్యాయస్థానాల ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు’ అంటూ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ రైతుపోరు సభలో ఆయన ప్రసంగించారు. మహబూబ్‌నగర్ న్యూటౌన్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని, ప్రాజెక్టుల నిర్మాణానికి రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తుందని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ రైతుపోరు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు అతితక్కువ నష్టపరిహారం చెల్లిస్తూ.. ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. జీఓ నెం. 123 ప్రకారం భూములు తీసుకుంటూ రైతులను ముంచుతున్నారని మండిపడ్డారు. మల్లన్నసాగర్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు పథకాల లక్ష్యాన్ని నీరుగార్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తూ, రైతు సంక్షేమాన్ని విస్మరిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.791కోట్లు విడుదల చేస్తే నిధులు పక్కదారి పట్టించి రైతుల నోట్లో మట్టికొట్టారని మండిపడ్డారు. నిధుల ఖర్చుపై కౌన్సిల్లో తాను ప్రశ్నించినా.. సమాధానం చెప్పకుండా దాటవేస్తుందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగానే రాష్ట్రంలో 24గంటల కరెంటు వచ్చిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. జిల్లాలో పత్తి రైతులు, ఇతర పంటలను సాగు చేసిన రైతులు దళారుల బారినపడి మోసపోతుంటే కళ్లప్పగించి చూడటం తప్పా.. గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవడంలేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు రైతులు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో బీజేపీ రావడం ఖాయమన్నారు. సమావేశంలో రాష్ట్ర సంపర్క్ అభియాన్ చైర్మన్ కొండయ్య, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ ప్రేమ్‌రాజ్‌యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నింగిరెడ్డి, రతంగ్‌పాండురెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల్‌రాజ్, రాజేందర్‌రెడ్డి, ఎగ్గని, సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలమూరుపై చిత్తశుద్ధిలేదు వెనుకబడిన పాలమూరు జిల్లాపై ప్ర భుత్వానికి, పాలకులకు ఏమాత్రం చిత్త శుద్ధిలేదని బీజేపీ జి ల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి ఆరోపిం చారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చారని ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో కాంట్రాక్టర్లు, ప్రభుత్వంలోని పెద్దలు దోచుకుంటున్నారు తప్ప పాలమూరుకు సాగు, తాగునీరు ఇచ్చేందుకు చిత్తశుద్ధి కనిపించడంలేదని ఆరోపించారు. -
పహాణీ కుదింపు
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల నిర్వహణలో కీలక పాత్ర పోషించే పహాణీని కుదించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. పహాణీలో ఇప్పటివరకు రాస్తున్న వాటిలో ఉపయోగం లేని కాలమ్‌లను తొలగించి ప్రత్యేక ఫార్మాట్‌ను తయారు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెవెన్యూ యంత్రాంగం దీనిపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు 31 కాలమ్‌లుగా ఉన్న పహాణీలను 14–15 కాలమ్‌లకు తగ్గించే కోణంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం వచ్చిన వివరాలను పాత ఫార్మాట్లోనే పహాణీలు చేస్తున్నా.... భవిష్యత్తు భూ రికార్డుల నిర్వహణ కోసం ఉపయోగించేందుకు ధరణి వెబ్సైట్లో కొత్త పహాణీ కోసం ప్రత్యేక డిజైన్ చేయాలని నిర్ణయించారు. ఆ 15 అప్డేట్ కావడం లేదు... ప్రస్తుతం పహాణీలో 31 కాలమ్‌లున్నా పంటల సాగు వివరాలతో కూడిన 15 కాలమ్‌లను కొంతకాలంగా అప్డేట్ చేయడం లేదు. దీంతో మిగిలిన 16 కాలమ్‌లలోనే పహాణీలోని వివరాలను పొందుపరుస్తున్నారు. అయితే ఆ 16 కాలమ్‌లలో కూడా కొన్ని కాలమ్‌లు ఉపయోగం లేదనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ భూములకు శిస్తు ఎప్పుడో రద్దయినా అందుకు సంబంధించిన కాలమ్ కొనసాగుతోంది. దీంతోపాటు పొజిషన్ (కబ్జా) కాలమ్, జలాధారం లాంటి కాలమ్‌లను తొలగించాలనే అభిప్రాయం రెవెన్యూ వర్గా ల్లో వ్యక్తమవుతోంది. టైటిల్, సీరియల్ నంబర్, సర్వే నంబర్, సబ్ డివిజన్, అనుభవదారుని పేరు తదితర వివరాలుంటే సరిపోతుందని, వాటికితోడు ఆ సర్వే నంబర్లోని ఎంత భూమిలో ఏ పంట సాగుచేశారనే వివరాలను కూడా నమోదు చేస్తే సరిపోతుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అందరికీ అర్థమయ్యేలా పహాణీని తయారు చేయడం ద్వారా పారదర్శక విధానాన్ని అందుబాటులోకి తేవాలని రెవెన్యూ వర్గాలంటున్నాయి. సీఎం కేసీఆర్ కూడా పహాణీలోని కాలమ్‌ల కుదింపు, మార్పులకు అంగీకారం తెలపడంతో కొత్త పహాణీ రూపకల్పనకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం వచ్చిన వివరాలను మాత్రం పాత ఫార్మాట్లోని పహాణీలోనే మాన్యువల్‌గా రాస్తున్నారు. అయితే దీనిని కంప్యూటరీకరించి «వ్యవసాయ భూముల రికార్డుల నిర్వహణకుగాను తయారు చేసే ‘ధరణి’వెబ్సైట్లో నమోదు చేసే సమయంలో కొత్త పహాణీ ఆధారంగా చేస్తామని, ఇందుకోసం ప్రత్యేకంగా పహాణీని డిజైన్ చేస్తున్నామని రెవెన్యూశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. -
21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు
సాక్షి, హైదరాబాద్ : నగరాలు, పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణ అనుమతుల జారీలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను 21 రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించింది. అనుమతి పొందిన/క్రమబద్ధీకరణ పొందిన లే అవుట్లలోని ప్లాట్ల విషయంలో తనిఖీలు అవసరం లేకుండానే దరఖాస్తుల పరిశీలన ప్రారంభించాలని సూచించింది. అనుమతుల జారీ/తిరస్కరణపై నిర్ణయాన్ని దరఖాస్తుదారులకు 21 రోజుల్లోగా రాతపూర్వకంగా తెలపని పక్షంలో సంబంధిత భవన నిర్మాణ ప్లాన్లతోనే సదరు దరఖాస్తులకు అనుమతి జారీ చేసినట్లు పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ విధంగా అనుమతులిచ్చినా, నియమ నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు జరపడానికి అనుమతిచ్చినట్లు కాదని పేర్కొంది. 21 రోజుల గడువులోగా దరఖాస్తులకు అనుమతి జారీ/తిరస్కరణలో విఫలమైతే సంబంధిత అధికారులు, సిబ్బందిని బాధ్యులను చేసి జరిగిన జాప్యంలో రోజుకు రూ.1,000 చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దరఖాస్తుల్లో ఏవైనా పత్రాలు, సమాచారం కొరవడితే (షార్ట్‌ఫాల్) దరఖాస్తుదారులకు 10 రోజుల గడువులోగా సమాచారమివ్వాలని, 21 రోజుల గడువులోగా ఈ దరఖాస్తులను పరిష్కరించేందుకు కృషి చేయాలని స్పష్టం చేసింది. శనివారం ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇతర అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీలు, రాష్ట్రంలోని ఇతర అన్ని మునిసిపాలిటీలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. షార్ట్‌ఫాల్ గడువును అమలు చేయడంలో విఫలమైతే అందుకు కారణమైన అధికారులు, సిబ్బందిని బాధ్యులుగా చేసి జరిగిన జాప్యంలో రోజుకు రూ.1,000 చొప్పున జరిమానా విధిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పైన పైర్కొన్న గడువులను కచ్చితంగా అమలు చేసేందుకు 7 రోజుల్లోగా తనిఖీలు/పరిశీలనలు పూర్తి చేయాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ/జీహెచ్ఎంసీలోని ల్యాండ్ సెక్షన్ కూడా సమాంతరంగా 7 రోజుల గడువులోగా భూ యాజమాన్య హక్కుల పరిశీలన జరిపి అభిప్రాయాన్ని తెలపాలని సూచించారు. దరఖాస్తుదారులను వేధింపులకు గురి చేయకుండా, సమగ్ర రూపంలో భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు దాఖలు అయ్యేలా చేసేందుకు లైసెన్స్డ్ టెక్నికల్ పర్సనల్స్‌ను బాధ్యులను చేయాలని పేర్కొన్నారు. అసమగ్రంగా/చెక్ లిస్ట్ పాటించకుండా/తప్పుడు సమాచారంతో దరఖాస్తులు సమర్పిస్తున్న లైసెన్స్డ్ టెక్నికల్ పర్సనల్స్ మూడు పర్యాయాలు తప్పులు చేస్తే లైసెన్స్‌లు రద్దు చేసి వారి పేర్లను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వెబ్సైట్లలో బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు. గడువులు ఎందుకంటే.. సరళీకృత వ్యాపార (ఈఓడీబీ) సంస్కరణల్లో భాగంగా ఏడాదిన్నర కింద లే అవుట్లు, భవన నిర్మాణాలకు ఆన్లైన్లో అనుమతుల జారీ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సత్వరంగా అనుమతుల జారీ కోసం పలు ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల్లోపు తనిఖీ నివేదికలు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, అనుమతులు పొందిన/క్రమబద్ధీకరణ పొందిన లే అవుట్లలోని ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతుల విషయంలో రిస్క్ బేస్డ్ క్లాసిఫికేషన్ ప్రక్రియ జరపాల్సిన అవసరం లేదని గతంలోనే తెలిపింది. అన్ని శాఖల అధికారులు ఒకేసారి తనిఖీలు జరపాలని సూచించింది. ఇలా అనుమతుల జారీ ప్రక్రియను ప్రభుత్వం సరళీకరించినా దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన/తనిఖీల విషయంలో ఆలస్యం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం 30 రోజుల్లో అనుమతులు జారీ చేయాల్సి ఉండగా.. ఆ గడువుకు రెండు మూడు రోజుల ముందు అదనపు సమాచారం, పత్రాలు కావాలని దరఖాస్తుదారులను కోరుతున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల్లోని ల్యాండ్ విభాగం దరఖాస్తుల పరిశీలనకు ఓ నిర్దేశిత సమయం అంటూ పాటించడం లేదు. మరి కొన్ని కేసుల్లో లైసెన్స్డ్ టెక్నికల్ పర్సనల్స్ నిబంధనలకు అనుగుణంగా ఇంటి ప్లాన్స్‌ను సమర్పించకపోవడంతో దరఖాస్తులను తిరస్కరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా భవన నిర్మాణాల అనుమతుల జారీలో జాప్యాన్ని నివారించేందుకు గడువులు విధించింది. -
24న ఇంటర్వ్యూలు
సాక్షి, హైదరాబాద్: కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకు నాంపల్లిలోని తమ కార్యాలయంలో ఈ నెల 24న ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జాబితాను తమ వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపింది. -
విరసం నేత వరవరరావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలని పిలుపునిచ్చి నిరసన కార్యక్రమాన్ని తలపెట్టిన విప్లవ రచయితల సంఘం(విరసం), తెలంగాణ ప్రజా ఫ్రంట్(టీపీఎఫ్) నేతలను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. గాంధీనగర్‌లో విరసం నేత వరవరరావు, టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమాస కృష్ణ, హిమా యత్ నగర్లో ‘వీక్షణం’ఎడిటర్ వేణుగోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో విప్లవ రచయితలు పాణి, గీతాంజలి, రాంకి, కాశిం, కూర్మనాథ్, ‘మా భూమి’సంధ్య, సాగర్, అరవింద్ తదితరుల్ని అరెస్టులు చేశారు. దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకుని నార్త్‌జోన్‌లోని వివిధ ఠాణాలకు తరలించారు. తెలుగు మహాసభల ప్రారంభ వేడుకలు ముగిసిన అనంతరం సొంత పూచీకత్తుపై వీరిని విడిచిపెట్టారు. ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్వహిస్తోందని ఆరోపిస్తూ ట్యాంక్‌బండ్‌పై శ్రీశ్రీ విగ్రహం వద్ద విరసం, టీపీఎఫ్ నిరసన తలపెట్టడంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. అక్కడికి వచ్చిన వారిని వచ్చినట్లే అరెస్టు చేశారు. తెలుగు భాషను ధ్వంసం చేసేవాళ్లే సంబరాలు జరుపుతారా.. అని వరవరరావు విమర్శించారు. -
ఇటు సూరీడు.. అటు సర్కారు..
సాక్షి,సిటీబ్యూరో: మహానగర తాగునీటి అవసరాలు తీర్చే జలమండలి విద్యుత్ చార్జీల భారంతో కుదేలవుతోంది. ప్రస్తుతం పరిశ్రమల విభాగం కింద కరెంట్ చార్జీలతో బోర్డు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే రూ.150 కోట్ల పెండింగ్ విద్యుత్ బిల్లులు చెల్లించలేక బోర్డు ఆపసోపాలు పడుతోన్న విషయం విదితమే. దీనికి తోడు ప్రతినెలా రూ.68 కోట్ల మేర విద్యుత్ బిల్లులు చెల్లించడం గుదిబండగా మారింది. నవంబరు నెలలో ఏకంగా రూ.80 కోట్ల బిల్లు రావడంతో బోర్డు వర్గాలు ఇంత మొత్తం ఎలా చెల్లించాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. ఈ విద్యుత్ భారం నుంచి బయట పడేందుకు సౌరవిద్యుత్ వినియోగించే అంశంపై జలమండలి దృష్టిసారిస్తోంది. ఇక వందల కిలోమీటర్ల దూరం నుంచి గ్రేటర్‌కు తరలిస్తోన్న కృష్ణా, గోదావరి జలాల పంపింగ్, స్టోరేజీ రిజర్వాయర్ల నుంచి 9.65 లక్షల నల్లా కనెక్షన్లకు నీటి సరఫరాకు నెలకు సుమారు 100 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోంది. ఈ స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పేందుకు ఏకమొత్తంలో దాదాపు రూ.600 కోట్లు అవసరమవుతాయని లెక్క తేల్చింది. సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు జలమండలికి సంబంధించి కృష్ణా, గోదావరి జలాల నీటిశుద్ధి, పంపింగ్ కేంద్రాల వద్ద సుమారు 989 ఎకరాల విస్తీర్ణంలో భూములుండడం గమనార్హం. అయితే ఈ ప్రాజెక్టుకయ్యే నిధులను రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రైవేటు ఆర్థిక సంస్థల నుంచి రుణంగా సేకరిస్తేనే ఈ ప్రాజెక్టు సాకారమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కనీసం యాన్యుటీ విధానంలోనైనా చేపడితే బోర్డు నష్టాల నుంచి గట్టెక్కే అవకాశముంది. తాగునీటికి కరెంట్ బిల్లుల షాక్.. జలమండలికి నెలవారీగా నీటిబిల్లుల వసూలు, ట్యాంకర్ నీళ్ల సరఫరా, నూతన నల్లా కనెక్షన్ల జారీతో రెవెన్యూ ఆదాయం కనాకష్టంగా రూ.100 కోట్ల వరకు సమకూరుతోంది. కానీ నెలవారీ వ్యయం రూ.112 కోట్లు దాటుతోంది. ప్రధానంగా నెలవారీగా విద్యుత్ బిల్లుల రూపేణా రూ.68 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. మిగతా మొత్తంలో ఉద్యోగుల జీతభత్యాలు, గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన వాయిదాలు, వడ్డీ చెల్లింపులు, నిర్వహణ వ్యయాలు, మరమ్మతులు, నీటిశుద్ధి తదితర ప్రక్రియలకు సుమారు రూ.44 కోట్లు వ్యయమవుతోంది. ఇలా ప్రతినెలా బోర్డు రూ.10 నుంచి రూ.12 కోట్ల లోటుతో నెట్టుకొస్తోంది. దీనికి తోడు గత కొన్ని నెలలుగా రూ.150 కోట్ల మేర విద్యుత్ బిల్లులు కొండలా పేరుకుపోవడంతో బోర్డు ఖజానాపై భారీ భారం పడినట్టయింది. ఖజానాపై మోయలేని భారం ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం జలమండలికి పేరుకు రూ.1,420 కోట్లు కేటాయింపులు చేసినా.. రెండో త్రైమాసికానికి బోర్డుకు అందిన నిధులు కేవలం రూ.367 కోట్లే. ఇందులోనూ రూ.167 కోట్లు రుణ వాయిదాల చెల్లింపునకే సరిపోయాయి. మిగతా బడ్జెటరీ నిధుల విడుదలపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడం గమనార్హం. పులిమీద పుట్రలా హడ్కో సంస్థ నుంచి గతంలో జలమండలి తీసుకున్న రూ.700 కోట్ల రుణాన్ని గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఏకమొత్తంగా ఇతర అవసరాలకు దారి మళ్లించింది. ఇందులో ఏడాదిగా రూ.300 కోట్లు మాత్రమే బోర్డుకు చెల్లించింది. మిగతా రూ.400 కోట్లు చెల్లించే విషయంలో రిక్తహస్తం చూపించింది. దీంతో కీలకమైన తాగునీటి పథకాల పూర్తికి నిధుల లేమి శాపంగా పరిణమిస్తుండడం గమనార్హం. -
ఎన్జీటీపై సుప్రీంను ఎందుకు ఆశ్రయించలేదు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్ని నిలిపివేయాలని ఆదేశిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్జీటీ ఉత్తర్వులపై హైకోర్టుకు న్యాయ సమీక్ష చేసే అధికారం ఉందని, అయితే, ఆ ఉత్తర్వులపై సుప్రీంకోర్టులోనే అప్పీల్ చేయాలని ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్జీటీ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదో తెలియజేయాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం తెలంగాణ సర్కార్‌ను వివరణ కోరింది. ఎన్జీటీ మధ్యంతర ఆదేశాల్ని తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసిన వ్యాజ్యాలని మంగళవారం ధర్మాసనం విచారించింది. తొలుత ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ.. తీర్పు పూర్తి కాపీ సిద్ధమయ్యాక కోర్టులో ప్రకటించాలని, అయితే తీర్పు ప్రతి పూర్తికాకుండానే ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినందున దానిని కొట్టేయాలని కోరారు. వాదనల అనంతరం హైకోర్టు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
వైద్య శాఖలో 4,540 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ కింద ఉన్న ఆసుపత్రులకు ప్రభుత్వం కొత్తగా 4,540 పోస్టులు మంజూరు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ఆమోదం తెలిపారు. ప్రస్తుతం వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఏరియా ఆసుపత్రుల్లో కొత్తగా 3,900 పోస్టులు అవసరం కాగా, అప్‌గ్రేడ్ చేసిన 13 ఏరియా ఆసుపత్రుల్లో మరో 640 పోస్టులు అవసరమని అధికారులు సీఎంకు నివేదించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన రోగుల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని పెంచాల్సి ఉన్నందున వెంటనే ఈ నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. -
ఇసుక మార్గం..ఇష్టారాజ్యం..!
రాష్ట్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఇసుక అక్రమ వ్యాపారం మూడు లారీలు.. ఆరు ట్రాక్టర్లుగా సాగిపోతోంది. కొందరు అధికారులు, కాంట్రాక్టర్ల మిలాఖత్‌తో ఇసుక దందా కొత్తపుంతలు తొక్కుతోంది. తెల్లవారింది మొదలు రాత్రి పొద్దుపోయే వరకు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా అవుతోంది. దీన్ని నియంత్రించాల్సిన కొందరు అధికారులు కళ్లు మూసుకోవడంతో వేల టన్నుల ఇసుక పక్కదారి పడుతోంది. దోచుకునే వారికి దోచుకున్నంత అన్న చందంగా.. కళ్లముందే అక్రమ దందా సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టార్గెట్ కోసం మొక్కుబడిగా కేసులు పెట్టి అధికారులు ‘మమ’అనిపిస్తున్నారు. ఫలితంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్రమార్కులకు ఇసుక కాసులు కురిపిస్తోంది. రాష్ట్రంలో ఇసుక అక్రమ దందాపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్.. – గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ ఇసుక మాఫియా అక్రమ దందాకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) ముసుగు వేసి టన్నుల కొద్దీ ఇసుకను అక్రమమార్గం పట్టిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఏటా రూ.వందల కోట్ల ఆదాయం వస్తోందని ప్రభుత్వం చెబుతున్నా.. అంతకు నాలుగింతలు ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్తోంది. పాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో గోదావరి, మంజీరా, కృష్టా నదీతీరాలు ఇసుక తవ్వకాలకు నిలయాలుగా మారాయి. ప్రభుత్వం గత వేసవిలో పాత ఏడు జిల్లాల్లోని 56 చోట్ల టీఎస్ఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలకు అధికారికంగా అనుమతులు ఇచ్చింది. ఈ ఇసుకను తరలించేందుకు 289 స్టాకు పాయింట్లను ఏర్పాటు చేసింది. ఇసుక అవసరం ఉన్నవాళ్లు మీసేవ, ఆన్లైన్ కేంద్రాల ద్వారా టీఎస్ఎండీసీ పేరిట డబ్బులు చెల్లించి రశీదులు పొందితే.. వారి అవసరాన్ని బట్టి లారీల్లో ఇసుక నింపాల్సి ఉంది. అయితే ఇదేమీ పట్టని కాంట్రాక్టర్లు, సూపర్వైజర్లు రశీదులకు మించి ఒక్కో లారీలో రెండు నుంచి నాలుగు టన్నుల వరకు అధికంగా ఇసుక నింపుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టింది. అయితే తెలంగాణ జిల్లాల్లో ఈ విధానం గందరగోళంగా తయారైంది. సామాన్యుడు తమ అవసరాల కోసం తక్కువ ధరకే ఇసుకను పొందే సరళ విధానం ఇందులో లేదు. ఆన్లైన్ విధానం కొందరు స్వార్థపరులకు మాత్రమే ఉపయోగపడుతోంది. ఫలితంగా ఇసుక వ్యాపారం ద్వారా ప్రభుత్వానికి బాగానే ఆదాయం వస్తున్నట్లు కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయి అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాయడంతో ప్రభుత్వం ఉద్దేశం నీరుగారిపోతోంది. నిబంధనలకు మంగళం.. ఇసుక తవ్వకాలకు నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదల వల్ల రైతుల పంట పొలాల్లో వేసే ఇసుక మేటల తొలగింపు పేరిట వ్యవసాయ శాఖ ద్వారా అనుమతికి దరఖాస్తు చేస్తారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆయా జిల్లాల్లో జిల్లా స్థాయి శాండ్ కమిటీ(డీఎల్ఎస్సీ) దరఖాస్తులను పరిశీలించి వ్యవసాయ, గనులు, భూగర్భజల, రెవెన్యూ శాఖల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన మీదట.. ఆయా ప్రాంతాలను బట్టి ఎన్ని రోజులు? ఎంత లోతు? ఎన్ని క్యూబిక్ మీటర్లు? ఎలా ఇసుక తీయాలి (మాన్యువల్/యంత్రాలు)? అన్న మార్గదర్శకాలను సూచిస్తుంది. పట్టా భూములు కాకుండా ప్రభుత్వ అవసరాలకు కూడా నదీ పరీవాహక ప్రాంతాల్లో టెండర్ల ద్వారా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఈ మేరకు సూచించిన మార్గదర్శకాల ప్రకారం తవ్వకాలు చేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా 1.5 మీటర్ల నుంచి 2.5 మీటర్ల లోతుకు మించి ఇసుక తవ్వకాలకు అనుమతి ఉండదు. ఒకచోట అనుమతులు తీసుకుని.. మరోచోట తవ్వకాలు చేపడుతున్న అక్రమార్కులు.. నిబంధనలకు విరు ద్ధంగా 5 మీటర్ల నుంచి 8 మీటర్ల వరకు ఇసుక తవ్వేస్తున్నారు. పట్టా భూములను వదిలి గోదావరి, మంజీరాల్లో సైతం తవ్వకాలు కానిచ్చేస్తున్నారు. ఉద యం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అదీ సీసీ కెమెరాల నీడలోనే ఇసుక తవ్వకాలు, రవా ణా చేయాలన్న నిబంధనలను పట్టించుకోకుండా సీసీ కెమెరాలు లేకుండా రాత్రింబవళ్లు తవ్వకాలు సాగిస్తున్నారు. ఇసుక మేటల తొలగింపునకు అనుమతులిచ్చిన ప్రభుత్వం.. ఇసుక నింపేందుకు సైతం నిబంధనలు పెట్టింది. 10 టన్నుల కెపాసిటీ గల లారీలో 6 క్యూబిక్ మీటర్ల ఇసుకను, 17 టన్నుల లారీలో పది క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే లోడింగ్ చేయాల్సి ఉంటుంది. పది టైర్ల లారీల్లో 20 టన్నులు(10.5 క్యూబిక్ మీటర్లు), 12 టైర్ల లారీలో 22.5 టన్నులు(13 క్యూబిక్ మీటర్లు), ఒక్కో వేబిల్లుపై లారీలో 21 టన్నులకు మించి(12 క్యూబిక్ మీటర్లు) ఇసుకను నింపకూడదు. ఇసుక మాఫియా 14 టైర్ల లారీల ద్వారా ఏకంగా 60 టన్నుల(37.50 క్యూబిక్ మీటర్లు) వరకు ఇసుకను నింపి నిబంధనలను ఉల్లంఘిస్తోంది. ఇసుక తవ్వకం, రవాణాలను పర్యవేక్షించాల్సిన వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు, గనులు, భూగర్భ జల, రవాణా శాఖలు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నాయి. ఈ ఇసుకకు ‘మహా’డిమాండ్.. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని పలుగుల 1, 2, 3 క్వారీలకు, ఇదే మండలంలోని కుంట్లం 1, 2, 3, కుదురుపల్లి, అన్నారం, మహదేవ్ పూర్ల్లో ఉన్న క్వారీల్లోని ఇసుకకు రాష్ట్రవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. టీఎస్ఎండీసీ ఆన్లైన్లో కూపన్లు ఓపెన్ చేసిన రెండు నిమిషాల్లోనే ఈ క్వారీ ల్లో ఇసుక కూపన్లు బుక్కయిపోతాయి. ఇక క్వారీల వద్ద ఒకే కూపన్‌పై రెండు మూడు లారీలను వదులు తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక అధిక లోడు షరా మామూలే. ఉదయం 6 గంటల నుంచి సాయ త్రం ఆరు గంటల వరకు లారీలను అనుమతిం చాల్సిన అధికారులు 24 గంటలు తిరుగుతున్నా మిన్నకుండిపోవడంతో ఇసుక దందా జోరుగా సాగుతోంది. అధిక లోడ్ల కారణంగా ఈ ఏరియాల్లోని రోడ్లపై మోకాలిలోతు గుండలు ఏర్పడ్డాయి. ‘ఆన్లైన్’ బాగున్నా.. అక్రమాలు ఆగట్లేదు..! పాత ఏడు జిల్లాల్లో 56 చోట్ల టీఎస్ఎం డీసీ ద్వారా ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ ఇసుకను తరలించేందుకు 289 స్టాకు పాయింట్లను ఏర్పాటు చేసింది. ఇసుక అవసరం ఉన్నవాళ్లు మీ – సేవ, ఆన్లైన్ కేంద్రాల ద్వారా టీఎస్ఎండీసీ పేరిట డబ్బులు చెల్లించి రశీదులు పొందితే.. వారికి అవసరాన్ని బట్టి లారీల్లో నింపాల్సి ఉంది. ఇక్కడ పెద్దఎత్తున అవినీతి జరుగుతోంది. టీఎస్ఎండీసీ ఇసుక బుకింగ్‌లకు తెర తీసిన రెండు మూడు నిమిషాల్లోనే హైదరాబాద్ కేంద్రంగా దళారులు హైస్పీడ్ ఇంటర్నెట్ సిస్టం ద్వారా బుకింగ్ చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్టర్లు, లారీ ఓనర్ల పాత్రే కీలకం. ఇలా స్పీడ్‌గా బుక్ చేసిన ఆపరేటర్‌కు ఒక్కో బుకింగ్‌కు రూ. వెయ్యి వరకు ముట్టచెబుతున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో సుమారు వంద మంది వరకు బ్రోకర్లు నిత్యం ఇదే పనిలో ఉంటున్నట్టు తెలిసింది. గతంలో జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఉన్న నెట్ సెంటర్ల ద్వారా బుక్ చేసేవాళ్లు. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగానే బుకింగ్ దందా కొనసాగుతోంది. హైదరాబాద్ వెలుపల నెట్ స్పీడ్ తక్కువ ఉండడంతో అక్కడ బుకింగ్‌లు కావడం లేదని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టింది. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా ఇసుక మాఫియానే ఉపయోగించుకుంటుండటంతో సామాన్యు లకు ఇసుక కష్టాలు ‘షరామామూలు’గా మారాయి. ఇదిలాఉంటే మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించే లారీలకు సంబంధించి సరైన వేబిల్లులు, టీఎస్ఎండీసీకి అంతర్రాష్ట్ర పన్ను చెల్లించి పొందే వేబిల్లులు చెక్‌పోస్టులలో విధిగా పరిశీలించాలి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ రశీదుల పేరిట పట్టించుకోకపోవడంతో ఇసుక అక్రమదందా ఈ తరహాలో కూడా ‘మామూలు’గా మారింది.. అన్ని జిల్లాల్లోనూ అక్రమాలే.. - కరీంనగర్ జిల్లా ఖాజీపూర్, కొత్తపల్లి ఇసుక క్వారీల నుంచి నిబంధన లకు విరుద్ధంగా ఇసుకను తోడేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా కాంట్రాక్టర్లు రేయింబవళ్లు ఇసుక వ్యాపారం చేస్తు న్నారు. వీరికి రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖల అధికారుల అండదండలు ఉంటున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ రెండు క్వారీల నుంచి రోజుకు వందలాది లారీలు, వేలాది ట్రాక్టర్ల ఇసుక తరలిపోతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాక, కొడిముంజ క్వారీల్లో కూడా గతంలో ప్రభుత్వం టీఎస్ఎండీసీ ద్వారా ఇసుక విక్రయాలు జరిపింది. అయితే ఇటీవల కొదురుపాక నుంచి ఇసుకను తరలిస్తున్న సమ యంలో నేరేళ్ల వద్ద ప్రమాదం జరిగి వివాదస్పదమైన నేప థ్యంలో తవ్వకాలను నిలిపివేశారు. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 38 చోట్ల నుంచి ఇసుక అక్రమ దందా సాగుతోంది. - పాత నిజామాబాద్ జిల్లాలో ఏడాది క్రితం 104 హెక్టార్ల నుంచి 14,27,400 క్యూబిక్ మీటర్ల ఇసుకను తీసేందుకు అనుమతులిచ్చారు. పాత జిల్లాలో 16 రీచ్‌లకు అనుమతి ఉండగా.. అనధికారికంగా మరో 8 నడుస్తున్నాయి. వాగులు, వంకలు కలిపితే 42 చోట్ల నుంచి ఇసుక అక్రమమార్గం పడుతోంది. దీనికి తోడు మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దుగా ఉన్న మంజీరా నది నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మందర్న, హున్సా, ఖాజాపూర్, సాలూరు, తగ్గెల్లి, కలుదుర్గి గ్రామాలు మంజీరా నదికి ఆంధ్ర సరిహద్దు గ్రామాలు ఉండగా గంజిగావ్, కార్ల, మసునూరు, హున్ కుందా, సగ్రోళి, బోలెగామ్, చెల్గాం, చౌరాలు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. గత కొంతకాలంగా మన సరిహద్దు ప్రాంతాల్లో ఇసుక క్వారీలను నిషేధించినప్పటికీ.. ఇక్కడి నుంచి హైదరాబాద్, కర్ణాటక తదితర ప్రాంతాలకు అక్రమంగా మాఫియా ఇసుకను తరలిస్తోంది. - మెదక్ జిల్లా రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండటంతో పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో ఇక్కడ ఇసుకకు డిమాండ్ పెరిగింది. మంజీరాతో పాటు వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా సరిపోవడంలేదు. మంజీరాతోపాటు పటాన్చెరు, గిన్నారం, సంగారెడ్డి మండలాల్లో నక్కవాగు, ఊడవెల్లి వాగుల్లో మట్టిని జల్లెడ పట్టి ఫిల్టర్ ఇసుకను తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. - పాత మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో ఎలాంటి ఇసుక రీచ్‌లు లేవు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ చొరవ కారణంగా శాండ్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా లోకల్‌గా ఏడు ఇసుక రీచ్‌లను గుర్తించారు. ఈ రీచ్‌ల ద్వారా ఇసుక స్థానిక అవసరాలకు వినియోగించుకునేందుకు ‘పాలమూరు శాండ్’పేరిట ఆన్లైన్ విక్రయాలకు రూపకల్పన చేశారు. గత రెండు నెలలుగా ఆన్లైన్ ద్వారా ఇసుక అమ్మకాలను చేపడుతున్నారు. ఇసుక అమ్మకాలకుగానూ కేవలం ట్రాక్టర్ల ద్వారానే, వాటికి జీపీఎస్ అమర్చి నిర్వహిస్తున్నారు. అయితే నాగర్‌కర్నూల్ ప్రాంతంలోని సిర్సవాడ నుంచి మేడిపూర్, లక్ష్మాపూర్, మొల్గర, చారకొండ తదితర ప్రాంతాల నుంచి ఇసుకను నిరంతరం తరలిస్తున్నా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. -
టీజేఏసీది హింసాత్మక చరిత్ర
-
టీజేఏసీది హింసాత్మక చరిత్ర
- నిరుద్యోగ ర్యాలీకి అనుమతివ్వడం కుదరదు..హైకోర్టుకు నివేదించిన పోలీసులు - వారి సభకు వామపక్ష ఉగ్రవాద గ్రూపుల మద్దతు ఉంది - మేం సూచించిన ప్రదేశాల్లో సభ పెట్టుకుంటే అభ్యంతరం లేదు - విచారణ నేటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ బుధవారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి, బహిరంగ సభకు అనుమ తినివ్వడం సాధ్యం కాదని పోలీసులు తేల్చి చెప్పారు. శాంతిభద్రతల సమస్య సృష్టించే ఉద్దేశంతోనే అనుమతి కోరుతున్నారని, అందుకు తాము ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. తాము సూచించిన ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో బహిరంగ సభ నిర్వహించుకుంటా మంటే మాత్రం అందుకు అనుమతినిస్తామన్నారు. ఈ మేరకు పోలీసుల తరఫున అడ్వొ కేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి సోమవారం హైకోర్టుకు తెలిపారు. టీజేఏసీ గతాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. గతంలో కూడా టీజేఏసీ ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిందని, అప్పుడు జంట నగరాల్లో విధ్వంసానికి, హింసకు, ఆస్తి నష్టానికి పాల్పడిందని, ఆ ఘటనల్లో పలువురు ప్రజలు, పోలీసులు గాయపడ్డారని కోర్టుకు వివరించారు. జనాలను పోగుచేసి నగరంలో జనజీవనాన్ని స్తంభింప చేసేందుకు వ్యూహరచన చేశారని, ఇందుకు వామపక్ష ఉగ్రవాద గ్రూపులు కూడా మద్దతు పలికినట్టు తమకు అత్యంత విశ్వస నీయ సమాచారం ఉందని కోర్టుకు నివేదిం చారు. శాంతిభద్రతలను పరిగణనలోకి తీసుకునే.. టీజేఏసీకి నగరంలో ర్యాలీ, బహిరంగ సభకు అనుమతినివ్వడం లేదన్నారు. అంతేకాక సభ నిర్వహిస్తున్నది పనిదినాన అని, దీంతో ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉందని వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ ఆదివారం రోజున సభ నిర్వహిం చుకునేందుకు ఇబ్బంది ఏంటని టీజేఏసీ తరఫు న్యాయవాది రచనారెడ్డిని ప్రశ్నించారు. దీనిపై జేఏసీ చైర్మన్‌తో మాట్లాడి చెప్పాల్సి ఉందని ఆమె చెప్పడంతో, అయితే మంగళవా రం ఉదయం 10.30 గంటలకు కేసు విచారణ చేపడతామని, అప్పటికల్లా ఆదివారం సభ నిర్వహణపై స్పష్టతనివ్వాలని చెప్పారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వ రరావు ఉత్తర్వులు జారీ చేశారు. సభలో తీవ్రవాద సంఘాలు పాల్గొనే అవకాశం?: ఏజీ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో అనుమతిని ఎం దుకు ఇవ్వకూడదని న్యాయమూర్తి ఏజీని ప్రశ్నించగా సదరు కాలేజీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని, ఇందులో ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదని ఏజీ అన్నారు. ఇక్కడ సభ నిర్వహణ వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రం గా ఉంటుందన్నారు. ‘‘అసలు ఇవన్నీ కాదు.. సభలో తీవ్రవాద సంఘాలు కూడా పాల్గొనే అవకాశం ఉందని మాకు విశ్వస నీయ సమాచారం ఉంది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది’’ అని ఏజీ చెప్పారు. సభలో పాల్గొన్న వారు పక్కనున్న భవనాలపై రాళ్లేయవచ్చని, పరిస్థితులు అదుపు తప్పడానికి అదొక్కటి చాలన్నారు. 5 వేల మంది అని వారు చెబు తున్నారని, అయితే, 15 వేల నుంచి 20 వేల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తాము సూచించిన ప్రత్యామ్నాయ ప్రదే శాలు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయని వివరించారు. ఈ సమయంలో రచనారెడ్డి జోక్యం చేసుకుంటూ తాము రోజంతా సభ నిర్వహించబోమని ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటలకల్లా సభను పూర్తి చేస్తామన్నారు. కోర్టు ఎలాంటి షరతులు విధించినా పాటిస్తామన్నారు. స్వామీజీలకు ఎల్బీ స్టేడియం ఇచ్చిన సర్కారు.. తమ సభకు మాత్రం అనుమతినివ్వకుండా రాజ్యాంగ హక్కులను హరిస్తోందని రచనారెడ్డి పేర్కొన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ... ఇలాంటి రెచ్చగొట్టే వాదనలు చేయవద్దని సున్నితంగా ఆమెకు సూచించారు. ఉగ్రవాద సంఘాలు పాల్గొంటాయన్నది కేవలం ఆరో పణ మాత్రమేనని, అందుకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. తమ గత చరిత్ర ఎన్నడూ హిం సాత్మకం కాదన్నారు. అయితే ఈ వాదనలను ఏజీ తోసిపుచ్చారు. గతంలో టీజేఏసీ హింసాత్మక ఘటనలకు పాల్ప డిందని, దీనికి సంబంధించి వారిపై 31 కేసులు నమోదయ్యాయని తెలిపారు. తమ వద్ద ఉన్న ఆధారాల ఆధారంగానే వారికి అనుమతినివ్వడం లేదన్నారు. ఈ సమ యంలో న్యాయమూర్తి పనిదినం రోజున కాకుండా ఆదివారం సభ నిర్వహిం చుకునేందుకు ఇబ్బంది ఏమిటని రచనా రెడ్డిని ప్రశ్నించారు. దీనిపై స్పష్టతనివ్వాలం టూ తదుపరి విచారణను మంగళవారం ఉదయానికి వాయిదా వేశారు. ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది: జేఏసీ న్యాయవాది రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఈ నెల 22న తాము తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి పోలీసులు అనుమతినివ్వడం లేదంటూ టీజేఏసీ చైర్మన్ కోదండరామ్, అధికార ప్రతినిధి వెంకటరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు విచారణ జరిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ... దరఖాస్తుపై నిర్ణయం వెలువరించడానికి ఇబ్బందేమిటని హోంశాఖ తరఫు న్యాయవాది హెచ్.వేణు గోపాల్‌ను ప్రశ్నించారు. నిర్ణయం వెలు వరిస్తామని ఆయన చెప్పడంతో.. విచార ణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. సాయంత్రం 4 గంటలకు విచారణ మొదలు కాగానే.. ఇందిరా పార్క్ వద్ద ర్యాలీ, బహిరంగ సభకు అనుమతినివ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు రాతపూర్వక నిర్ణయం వెలువరించా మంటూ, దానికి సంబంధించిన కాపీని పోలీసుల తరఫున హాజరైన ఏజీ రామకృ ష్ణారెడ్డి న్యాయమూర్తి ముందుంచారు. ఈ సమయంలో రచనారెడ్డి స్పందిస్తూ.. ఇందిరాపార్క్ ధర్నాలు, ర్యాలీలు, సభలకు ఉద్దేశించిన ప్రదేశమని అన్నారు. ర్యాలీ సందర్భంగా హింసాత్మక ఘటనలు జరగ కుండా అన్ని జాగ్రత్త లు తీసుకుంటామని స్పష్టమైన హామీనిచ్చినట్లు తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘‘ఎందరిని ఆహ్వానించారు? చలో హైదరాబాద్ పేరుతో పిలుపునిచ్చినప్పుడు ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది కదా..? సంఖ్యపై ఏమైనా స్పష్టత ఉందా..?’’ అని రచనారెడ్డిని ప్రశ్నించారు. సంఖ్యపై నిర్దిష్టంగా చెప్పలేమని, అయితే 5 వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని రచనారెడ్డి తెలిపారు. పోలీసులు చూపిన ప్రత్యామ్నాయ ప్రదేశాలు వేరే జిల్లాల్లో ఉన్నాయన్నారు. అవి తమకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. తమ సభకు అనుమతినిచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో అర్థం కావడం లేదన్నారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్, ఎల్బీ స్టేడియం, ఎన్టీఆర్ స్టేడియం, నెక్లెస్ రోడ్లలో ఎక్కడ సభ నిర్వహణకు అనుమతినిచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. ర్యాలీ వెనుక రాజకీయ ఎజెండా: ఎంపీ బాల్క సుమన్ ఆరోపణ సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ ర్యాలీ వెనుక టీజేఏసీ చైర్మన్ కోదండరాం రాజకీయ ఎజెండా దాగి ఉందని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. అందుకే ఆయన అన్ని రాజకీయపార్టీల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. కోదండరాం ర్యాలీ వెనక తెలంగాణ వ్యతిరేకశక్తుల హస్తం కూడా ఉందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. కొత్తరాష్ట్రంలో ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నారని, హైదరా బాద్, తెలంగాణ ప్రశాంతంగా ఉండడం ఆయనకు ఇష్టం లేదని ఆరోపించారు. -
అక్రమమా.. ఆస్తిపన్ను బాదుతాం!
►జరిమానాగా 25% నుంచి 100 % ఆస్తి పన్ను ►కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలపై జరిమానా విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా కట్టడాలపై 25 శాతం నుంచి 100 శాతం ఆస్తి పన్నును జరిమానాగా విధించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొ రేషన్(జీహెచ్ఎస్సీ)తో సహా రాష్ట్రం లోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపా లిటీలు, నగర పంచాయతీలను ప్రభు త్వం ఆదేశించింది. ఈ మేరకు కొత్త నిబంధ నలను అమల్లోకి తెస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఈ నెల 20న ఉత్తర్వులు జారీ చేశా రు. అక్రమ కట్టడాలను కూల్చివేసే వరకు సదరు కట్టడాలపై పెనాల్టీలను విధించాలని మున్సిపల్ కమిషనర్లను కోరారు. జరిమానా విధింపు ఇలా... బిల్డింగ్ ప్లాన్‌లో అనుమతించిన అంతస్తుల సెట్‌బ్యాక్‌ను 10 శాతం ఉల్లంఘిస్తే 25 శాతం ఆస్తి పన్నును జరిమానాగా విధిస్తారు. ప్లాన్‌లో అనుమతించిన అంతస్తుల సెట్‌బ్యాక్‌ను 10 శాతానికి మించి ఉల్లంఘిస్తే 50 శాతం ఆస్తి పన్నును జరిమానాగా వేస్తారు. అనుమతి లేని అంతస్తులను నిర్మిస్తే.. సదరు భాగానికి గాను 100 శాతం జరిమానా పడుతుంది. పూర్తిగా అక్రమ కట్టడాన్ని నిర్మిస్తే 100 శాతం ఆస్తి పన్నును జరిమానాగా విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. పెనాల్టీ కట్టినా అక్రమమే... ప్రభుత్వ భూములు, వక్ఫ్, దేవాదాయ శాఖ భూములను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలతో పాటు స్థానిక నగర, పురపాలిక నుంచి బిల్డింగ్ ప్లాన్ అనుమతి లేకుండా అడ్డగోలుగా నిర్మించిన కట్టడాలపై కొరడా ఝుళిపించడానికి ప్రభుత్వం తాజాగా పెనాల్టీ నిబంధనలను జారీ చేసింది. పెనాల్టీ కట్టినా సదరు అక్రమ భవనాల క్రమబద్ధీకరణ జరగదని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్థానిక నగర, పురపాలికలు సదరు భవనాలకు నల్లా, డ్రైనేజీ, రోడ్డు, వీధి దీపాలు తదితర సౌకర్యాన్ని స్థానిక మున్సిపాలిటీలు కల్పిస్తున్నందున పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుందని పురపాలక శాఖ అధికారవర్గాలు తెలిపాయి. సదరు అక్రమ భవనాల కూల్చివేత వరకు పెనాల్టీలు వసూలు చేయనున్నారు. అక్రమ కట్టడాలపై ప్రతి నెలా నివేదిక... ప్రతి నెలా తమ వార్డు/డివిజన్ల పరిధిలోని అక్రమ కట్టడాల జాబితాతో తమ విభాగాధిపతికి నివేదికలను సమర్పించాలని క్షేత్ర స్థాయిలో పనిచేసే టౌన్‌ప్లానింగ్ ఓవర్సీయర్స్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ జాబితాలోని భవనాలపై పెనాల్టీలను నిర్ణయించి యజమానులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్లను కోరింది. నోటీసులు జారీ చేసిన 30 రోజుల తర్వాత నిర్ణీత పెనాల్టీ మొత్తాలను ఆస్తి పన్నులతో కలిపి కట్టాలని భవన యజమానులకు డిమాండ్ నోటీసులు జారీ చేయాలని సూచించింది. పెనాల్టీలకు ప్రత్యేక రశీదు జారీ చేయాలని, ప్రత్యేక రిజిస్టర్‌ను నిర్వహించాలని కోరింది. ‘కబ్జా’ భవనాలకు గులాబీ నోటీసులు ప్రభుత్వ, వక్ఫ్, దేవదాయ, అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములను ఆక్రమించి నిర్మించిన భవనాలను 100 శాతం అక్రమం అని నిర్ధారించి పెనాల్టీల వసూళ్ల కోసం గులాబీ రంగు నోటీసులు జారీ చేయను న్నారు. ఈ భవనాలకు సంబంధించి ప్రత్యేక రిజిస్టర్‌ను కూడా నిర్వహిస్తారు. -
హన్మకొండ జిల్లా రద్దు!
- ప్రజాభిప్రాయంపై సీఎంకు నివేదికలు - కొత్తగా వరంగల్ రూరల్ జిల్లా - కాకతీయ లేదా భద్రకాళి పేరు పెట్టే యోచన - అధికారులతో కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష - జిల్లాలపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు - ఇప్పటికే 30 వేలు దాటిన వైనం సాక్షి,హైదరాబాద్: కొత్త జిల్లాల ముసాయిదాపై వెల్లువెత్తుతున్న ప్రజాభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటోంది. వరంగల్ జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలపై పునరాలోచనలో పడింది. వరంగల్ సిటీ కేంద్రంగా ఉన్న వరంగల్, హన్మకొండలను రెండు జిల్లాలుగా విభజించడంపై అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత పెల్లుబికింది. వరంగల్, హన్మకొండ, ఖాజీపేట నగరాలు మూడూ ఒకే జిల్లాలో ఉండాలనే అభిప్రాయాలకు ఎక్కువ మంది మొగ్గుచూపారు. ఇంటెలిజెన్స్‌తో పాటు వివిధ వర్గాల నుంచి ఈ సమాచారాన్ని సేకరించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మతో పాటు ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా వరంగల్ జిల్లా అంశమే చర్చకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హన్మకొండకు బదులు వరంగల్‌ను జిల్లాగా కొనసాగించాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సమక్షంలో సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం. భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు మినహాయిస్తే వరంగల్‌లో దాదాపు 30 మండలాలు, 23 లక్షలకుపైగా జనాభా ఉంటాయి. వైశాల్యమూ పెద్దగా ఉంటుందని, దాంతో చిన్న జిల్లాల దృ క్పథమే దెబ్బతింటుందని సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలో 27 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించడం తెలిసిందే. సగటున ఒక జిల్లాలో 18 మండలాలు, 13.33 లక్షల జనాభా ఉంటాయి. కానీ వరంగల్ 30 మండలాలు, 23 లక్షల జనాభాతో రాష్ట్రంలోనే పెద్ద జిల్లాగా ఏర్పడుతుంది. తద్వారా పాలనా సౌలభ్యానికి చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తున్న స్ఫూర్తి దెబ్బ తింటుందనే చర్చ జరిగినట్లు సమాచారం. తెరపైకి ‘వరంగల్ రూరల్’ వరంగల్ నగరాన్ని విడదీయకుండా ఉండేందుకు వరంగల్ రూరల్ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అందుకు అనుగుణంగా మార్పుచేర్పుల కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతిపాదిత హన్మకొండ జిల్లాను రద్దు చేసి, అందులో ప్రతిపాదించిన మండలాలన్నిటినీ వరంగల్ జిల్లాలో కలుపుతారు. దాంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు ప్రస్తుతం హన్మకొండ జిల్లాగా ప్రతిపాదించిన మండలాలన్నీ కొత్త వరంగల్ జిల్లాలోనే ఉంటాయి. వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం మినహా వరంగల్‌లో ప్రతిపాదించిన ఇతర మండలాలతో కొత్తగా వరంగల్ రూరల్ జిల్లా ఏర్పడుతుంది. ఇలా రెండు జిల్లాలు చేస్తే వరంగల్ సిటీ మొత్తం ఒకే జిల్లాలో ఉంటుందని, చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తున్న ప్రయోజనమూ నెరవేరుతుందని సీఎం పేర్కొన్నట్టు తెలిసింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. కొత్తగా ఏర్పడే వరంగల్ రూరల్ జిల్లాకు కాకతీయ జిల్లా, లేదా భద్రకాళి జిల్లా అని పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 30 వేలు దాటిన అభ్యంతరాలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన పన్నెండు రోజుల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ద్వారా 29,411 మంది ఆన్లైన్లో తమ విజ్ఞప్తులను నమోదు చేశారు. వీటికి తోడు జిల్లా కలెక్టరేట్లలో, సీసీఎల్ఏలో మరో రెండు వేలకు పైగా అర్జీలు అందినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆన్లైన్ అర్జీల ప్రకారం అత్యధికంగా వనపర్తి జిల్లా ఏర్పాటుపై 7,738, యాదాద్రి జిల్లాపై 4,386 విజ్ఞప్తులు అందాయి. కొత్త డివిజన్లకు సంబంధించి అత్యధికంగా జగిత్యాల జిల్లాపై 5,168 ఫిర్యాదులు నమోదయ్యాయి. కోరుట్లను రెవిన్యూ డివిజన్ కేంద్రం చేయాలని అత్యధికంగా విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. కొత్త ప్రతిపాదనల స్వరూపం వరంగల్ జిల్లా (21 మండలాలు): వరంగల్ కార్పొరేషన్, హన్మకొండ, ఖిలా వరంగల్, హసన్‌పర్తి, ఖాజీపేట, ధర్మసాగర్, చిల్పూర్, వేలేరు, స్టేషన్ ఘన్పూర్, రాయపర్తి, జఫర్‌గఢ్, నర్మెట్ట, రఘునాథపల్లి, పాలకుర్తి, కొడకండ్ల, ఇల్లంతకుంట, హుజూరాబాద్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, జమ్మికుంట వరంగల్ రూరల్ జిల్లా (14 మండలాలు) : ఐనవోలు, వర్ధన్నపేట, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం, పర్వతగిరి, నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట, ఖానాపూర్, దుగ్గొండి, నల్లబెల్లి, శాయంపేట, పరకాల