సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నోటరీ ఆస్తుల క్రయవిక్రయాలను చట్టబద్ధం చేసి, క్రమబద్ధీకరించడంపై పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్‌లను ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
రాష్ట్రంలోని నోటరీ ఆస్తుల క్రయవిక్రయాలను చట్టబద్ధం చేసి, క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా పలువురు వ్యక్తులు చట్టవిరుద్ధంగా ఇలాంటి భూములను క్రమబద్ధీకరణ చేయించుకునే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. కష్టపడి డబ్బు కూడబెట్టుకుని తక్కు వ మొత్తంలో భూమి కొన్న పేదలకు ఇలాంటి చర్యలు తప్పుడు సంకేతాలనిస్తాయన్నారు. 125 చదరపు గజాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో నిర్మించిన ఆస్తులకు స్టాంప్ డ్యూటీ, పెనాల్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తే రాష్ట్ర ఖజానా ఆదాయం కోల్పోతుందని చెప్పారు.
నోటరీ భూ విక్రయ లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి సంబంధించి జూలై 26న ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 84 కొట్టివేయాలని ‘ది భాగ్యనగర్ సిటిజన్ వెల్‌ఫేర్ అసోసియేషన్’పిల్‌లో కోరింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్పించిన ఈ సడలింపు అక్రమ మార్గాల్లో ఆస్తులు సంపాదించే వారికి మార్గం సుగమం చేస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment