notary
-
నోటరీ ‘క్రమబద్ధీకరణ’పై సర్కారుకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నోటరీ ఆస్తుల క్రయవిక్రయాలను చట్టబద్ధం చేసి, క్రమబద్ధీకరించడంపై పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్లను ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. రాష్ట్రంలోని నోటరీ ఆస్తుల క్రయవిక్రయాలను చట్టబద్ధం చేసి, క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా పలువురు వ్యక్తులు చట్టవిరుద్ధంగా ఇలాంటి భూములను క్రమబద్ధీకరణ చేయించుకునే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. కష్టపడి డబ్బు కూడబెట్టుకుని తక్కు వ మొత్తంలో భూమి కొన్న పేదలకు ఇలాంటి చర్యలు తప్పుడు సంకేతాలనిస్తాయన్నారు. 125 చదరపు గజాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో నిర్మించిన ఆస్తులకు స్టాంప్ డ్యూటీ, పెనాల్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తే రాష్ట్ర ఖజానా ఆదాయం కోల్పోతుందని చెప్పారు. నోటరీ భూ విక్రయ లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి సంబంధించి జూలై 26న ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 84 కొట్టివేయాలని ‘ది భాగ్యనగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్’పిల్లో కోరింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన ఈ సడలింపు అక్రమ మార్గాల్లో ఆస్తులు సంపాదించే వారికి మార్గం సుగమం చేస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. -
నోటరీ ఆస్తుల క్రమబద్ధీకరణ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో నోటరీల ద్వారా క్రయవిక్రయాలు జరిగిన వ్యవసాయేతర ఆస్తుల క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రకారం.. నోటరైజ్డ్ డాక్యుమెంట్లు ఉన్న ఆస్తుల క్రమబద్ధీకరణ కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు నోటరీ డాక్యుమెంటు, సదరు ఆస్తికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు, ఆస్తిపన్ను రశీదు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, లేదంటే ఆ ఆస్తి స్వాదీనంలో ఉన్నట్టు నిరూపించే ఇతర ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఈ దరఖాస్తుల్లో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఆస్తులు ఉంటే వాటికి జీవోలు 58, 59 (ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల క్రమబద్ధీకరణ) ద్వారా పరిష్కారం చూపిస్తారు. లేదంటే నేరుగా పరిష్కరిస్తారు. ఈ విధంగా రిజిస్టర్ చేసేందుకు 125 గజాల లోపు ఉన్న ఆస్తులపై ఎలాంటి స్టాంపు డ్యూటీ వసూలు చేయరు. అంతకు మించితే మాత్రం మార్కెట్ రేటు ప్రకారం స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు రూ.5 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో వివరించారు. ఇందుకు సంబంధించి ఎలాంటి గడువును పేర్కొనలేదు. -
ఆన్లైన్లో నోటరీల సమాచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నోటరీల వివరాలు ప్రజలకు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇందుకోసం నోటరీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో పెడుతున్నారు. నోటరీల ఫొటోలు, అడ్రస్, లొకేషన్లతో పాటు వారు ఎంతకాలం నుంచి ఉంటున్నారు, రెన్యువల్ అయ్యారా? లేదా (ఫోర్స్‌లో ఉన్నారా? లేదా?) వంటి వివరాలని్నంటినీ త్వరలో వెబ్సైట్లో చూసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా ఎవరికీ నోటరీని ఇచ్చే అవకాశం లేదు. జనాభానుబట్టి కేంద్రం రాష్ట్రాలకు నోటరీలు కేటాయిస్తుంది. రాష్ట్రానికి ఇచ్చిన కోటా గతంలోనే పూర్తయింది. ఉన్న నోటరీలను ఐదేళ్లకోసారి రెన్యువల్ చేస్తారు. మొదటి రెన్యువల్ రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ, రెండో రెన్యువల్‌ను కమిషనర్ అండ్ ఐజీ, మూడు ఆ తర్వాత జరిపే రెన్యువల్స్‌ను ప్రభుత్వం చేస్తుంది. ఎక్కువ మంది నోటరీలు ఫోర్స్‌లో ఉన్నారా లేదా అనే విషయం ప్రజలకు తెలియడంలేదు. ఫోర్స్‌లో లేకపోయినా చాలామంది నోటరీలు చేస్తుండటంతో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరిచి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. మరోపక్క సొసైటీలు, ఫర్మ్ రిజిస్ట్రేషన్ల సేవలను కూడా ఆన్లైన్లో ఆధునీకరిస్తున్నారు. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి మళ్లీ ప్రారంభిస్తున్నారు. -
నోటరీ విధానం ఇక పక్కా: తప్పుడు స్టేట్మెంట్లకు చెక్!
సాక్షి, అమరావతి: నోటరీలు పారదర్శకంగా పనిచేసేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. కొందరు నోటరీలు తప్పుడు స్టేట్మెంట్లను నోటిఫై చేస్తున్నారనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. మరికొందరు లైసెన్సు లేకపోయినా నోటరీ చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. వీటివల్ల నోటరీలు చేయించుకున్న వ్యక్తులు ఇబ్బందులు పడటంతోపాటు వివాదాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నోటరీ వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ నడుం బిగించింది. నోటరీలు ఇచ్చే అఫిడవిట్లు, ఇతర సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. ఇకపై ప్రతి నోటరీకి వెబ్సైట్లో లాగిన్ అయ్యేందుకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి వారు జారీ చేసే సర్టిఫికెట్లను అప్లోడ్ చేయించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే లైసెన్సు ఉన్న ప్రతి నోటరీకి ఒక యూనిక్ ఐడీ ఇవ్వనున్నారు. నోటరీలు జారీచేసే అఫిడవిట్లపై ఈ యూనిక్ ఐడీ ఉంటుంది. దీనివల్ల ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించేందుకు, విచారించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖకు అవకాశం ఉంటుంది. నోటరీలను పర్యవేక్షించేందుకు ఈ రెండు చర్యలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. అవతవకలకు ఆస్కారం ఉండదని చెబుతున్నారు. రెండు నెలల్లో వీటిని అమల్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. నోటరీ లైసెన్సులు పెంచేందుకు చర్యలు మరోవైపు నోటరీ లైసెన్సుల్ని పెంచేందుకు చర్యలు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 1,906 మంది నోటరీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతకుముందు 13 జిల్లాల్లో సుమారు 2,400 మంది నోటరీలు ఉండేవారు. తక్కువ మంది నోటరీలకే అవకాశం ఉండటంతో దానికి అనుగుణంగా లైసెన్స్ పీరియడ్ ముగిసిన వారికి రెన్యువల్ చేయడం నిలిపివేశారు. కొత్తగా నోటరీ లైసెన్సుకు దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వలేకపోతున్నారు. దీంతో నోటరీల అవసరం, న్యాయవాదుల ఉపాధి వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని మరో 500 మందికి నోటరీ లైసెన్సులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని రిజిస్ట్రేషన్ల శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అనుమతి వస్తే కొత్తగా మరికొందరు న్యాయవాదులకు నోటరీ లైసెన్సులు జారీ చేసే అవకాశం ఉంది. లోపాలను సరిదిద్దేందుకు చర్యలు నోటరీ వ్యవస్థ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అక్కడక్కడా కొందరిపై ఫిర్యాదులు వస్తున్నాయి. అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు యూనిక్ ఐడీ విధానం, వారు జారీ చేసిన అఫిడవిట్లను ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేయించేలా కొత్త వ్యవస్థను తీసుకురాబోతున్నాం. – ఎంవీ శేషగిరిబాబు, కమిషనర్ అండ్ ఐజీ, రిజిస్ట్రేషన్ల శాఖ -
ఉచితంగా నోటరీ
అనంతపురం రూరల్ : నగరంలోని పేద ప్రజలకు, విద్యార్థులకు ఉచితంగా నోటరీ అందజేయడానికి శ్రీకారం చుట్టినట్లు న్యాయవాది వై శేఖర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టాంప్ తీసుకువస్తే ఉచితంగా నోటీరీ అందజేస్తానన్నారు. నోటరీ కావాల్సినవారు 9392330176 నెంబర్లో సంప్రదించాలన్నారు.