సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో నోటరీల ద్వారా క్రయవిక్రయాలు జరిగిన వ్యవసాయేతర ఆస్తుల క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రకారం.. నోటరైజ్డ్ డాక్యుమెంట్లు ఉన్న ఆస్తుల క్రమబద్ధీకరణ కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుతో పాటు నోటరీ డాక్యుమెంటు, సదరు ఆస్తికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు, ఆస్తిపన్ను రశీదు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, లేదంటే ఆ ఆస్తి స్వాదీనంలో ఉన్నట్టు నిరూపించే ఇతర ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఈ దరఖాస్తుల్లో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఆస్తులు ఉంటే వాటికి జీవోలు 58, 59 (ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల క్రమబద్ధీకరణ) ద్వారా పరిష్కారం చూపిస్తారు.
లేదంటే నేరుగా పరిష్కరిస్తారు. ఈ విధంగా రిజిస్టర్ చేసేందుకు 125 గజాల లోపు ఉన్న ఆస్తులపై ఎలాంటి స్టాంపు డ్యూటీ వసూలు చేయరు. అంతకు మించితే మాత్రం మార్కెట్ రేటు ప్రకారం స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు రూ.5 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో వివరించారు. ఇందుకు సంబంధించి ఎలాంటి గడువును పేర్కొనలేదు.
Comments
Please login to add a commentAdd a comment