
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) పేస్కేల్ అంశాన్ని పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. వీఆర్‌ఏల విద్యార్హతలను పరిగణనలోకి తీసుకోవాలని.. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన వీఆర్‌ఏలకు పేస్కేల్ ఇవ్వాలని, మిగతా వారందరికీ గౌరవ వేతనంతోనే సరిపెట్టాలనే ప్రతిపాదన సిద్ధమైందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఫైల్‌పై సీఎం సంతకం పెట్టడమే తరువాయి అని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో దాదాపు 25 వేల మంది వీఆర్‌ఏలు పనిచేస్తుండగా.. అందులో 3–6 తరగతుల మధ్య, 7–9 తరగతుల మధ్య, పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారి వివరాలను రెవెన్యూ శాఖ సేకరించింది.
ఇదే సమయంలో 1 నుంచి 9వ తరగతి వరకు.. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారి వివరాలనూ తీసుకుంది. ఈ కేటగిరీల మేరకు పదో తరగతి, ఆపై చదివినవారు 5 వేల మంది వరకు ఉంటారని, వారికి పేస్కేల్ ఇచ్చే అవకాశం ఉందని అంచనా. రెవెన్యూ సంఘాలు ఈ ప్రతిపాదనల విషయంగా ఉన్నతాధికారులను సంప్రదించినా.. విద్యార్హతల ఆధారంగా ప్రతిపాదనలు పంపుతున్నామని, తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని పేర్కొన్నట్టు తెలిసింది.
పోస్టింగ్ ఎక్కడెక్కడ?
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్‌ఏలలో ఎంత మందిని ఏయే శాఖలకు పంపుతారనే దానిపై రెవెన్యూ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. అందరినీ రెవెన్యూ శాఖలోనే కొనసాగిస్తారని.. అయితే డిప్యూటేషన్‌పై ఇతర శాఖలకు పంపుతారనే వాదన ప్రధానంగా వినిపిస్తోంది. అలాకాకుండా పేస్కేల్ వర్తించేవారు, డైరెక్ట్ రిక్రూటీలను మాత్రమే రెవెన్యూలో కొనసాగించి.. మిగతా వారిని వివిధ శాఖలకు పంపుతారనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు డైరెక్ట్ రిక్రూటీలలో కొందరిని వ్యవసాయశాఖకు కూడా పంపే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని అధికారులు అంటున్నారు. గౌరవ వేతనం కేటగిరీలోకి వచ్చే వీఆర్‌ఏలను ప్రభుత్వం తన అవసరాలను బట్టి వివిధ శాఖల్లో ఉపయోగించుకుంటుందని, ఈ మేరకు నీటిపారుదల శాఖలోకి లష్కర్లుగా వెళ్లేవారికి గౌరవ వేతనమే ఉంటుందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది.
అంతా గప్‌చుప్‌గా..!
వీఆర్‌ఏలు, వీఆర్వోల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై నోరు మెదిపేందుకు ఉన్నతాధికారులెవరూ ముందుకు రావడం లేదు. సీసీఎల్‌ఏ అధికారులను ఎప్పుడు అడిగినా.. తమకేం తెలియదంటూ దాటవేస్తున్నారని, కనీసం ఏం జరుగుతుందో కూడా చెప్పడం లేదని వీఆర్‌ఏల సంఘాలు వాపోతున్నాయి. మరోవైపు కొన్ని వీఆర్‌ఏ సంఘాలు ఈనెల 23న పేస్కేల్ కోసం సీసీఎల్‌ఏ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఇప్పుడే వీఆర్‌ఏ పేస్కేల్ అంశం పరిష్కారం కావాలని.. లేకుంటే ఎన్నికల సమయం వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంటుందనే ఆందోళన వీఆర్‌ఏలలో కనిపిస్తోంది.
ఐదేళ్లుగా నాన్చుడే..
అర్హతల మేరకు సర్వీసు క్రమబద్ధీకరణ, డ్యూటీ చార్ట్, పేస్కేల్ ఇస్తామని సీఎం స్పష్టంగా మూడుసార్లు ప్రకటించారు. దేవుడు వరమిచ్చినా పూజారి అనుగ్రహించ నట్టు.. అధికారులు మా సమస్యను ఐదేళ్లుగా నాన్చుతున్నారు. డైరెక్ట్ రిక్రూటీలకు వీలైనంత త్వరగా న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది.
– రమేశ్ బహదూర్, వీఆర్‌ఏ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
ఆందోళన బాట వీడం
న్యాయమైన మా సమస్యను పరిష్కరించాలని అధికారులను వేడుకుంటున్నాం. వేల మంది వీఆర్‌ఏలకు సంబంధించిన అంశాన్ని వీలైనంత త్వరగా సానుకూలంగా పరిశీలించాలి. ఈనెల 23న సీసీఎల్‌ఏ వద్ద నిరసన చేపడతాం. అవసరమైతే సమ్మెలోకి వెళ్తాం.
– వెంకటేశ్ యాదవ్, వీఆర్‌ఏ అసోసియేషన్ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment