
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్ పేపర్ లీకేజీ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించా లని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. గత కొన్ని నెలలుగా ఇంటర్ బోర్డ్‌లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈసారి పరీక్షలపై అప్రమత్తత అవసరమని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించినట్టు తెలిసింది. దీంతో పరీక్షల నిర్వహణపై బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ మంగళవారం సాయంత్రం ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు అవసరమైన సూచనలు చేశారు.
ఇంటర్ బోర్డ్‌కు ప్రత్యామ్నాయ వ్యవస్థ నడుస్తోందని కొన్ని నెలల క్రితం ఇంటర్ బోర్డ్ కార్యదర్శి మిత్తల్ సందేహం వెలిబుచ్చారు. డేటా ట్యాంపరింగ్ జరిగిందని పోలీసులకు బోర్డ్ గతంలో ఫిర్యాదు చేసింది. ప్రైవేటు ఇంటర్ కాలేజీలతో బోర్డ్‌లోని కొంతమంది అధికారులే కలిసి పనిచేస్తున్నారనే అనుమానాలతో కొంతమందిని కీలకమైన స్థానాల నుంచి తప్పించారు. ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్ మూల్యాంకన చేపట్టాలని నిర్ణయించడం, దీన్ని కొంతమంది ఆక్షేపిస్తూ వివాదాస్పదం చేసే ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ పరీక్షల నిర్వహణలో అప్రమత్తతను సూచిస్తున్నాయి.
పేపర్ల పంపిణీ దగ్గర్నుంచి...
డేటా చోరీ వ్యవహారం తెరమీదకొచ్చిన తర్వాత ఇంటర్ బోర్డ్‌లో ప్రతీ వ్యవహారంలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు. కీలకమైన అంశాలపై చర్చించేందుకు ముఖ్యులను మాత్రమే అనుమతిస్తున్నారు. బోర్డ్‌లోని కొందరి సెల్‌ఫోన్లపైనా నిఘా పెట్టినట్టు తెలిసింది. ప్రస్తుత పరీక్షల నిర్వాహకులే లక్ష్యంగా బోర్డ్ లోని వ్యక్తులు, ప్రైవేటు కాలేజీలు, మరికొంత మంది కలిసి పరీక్షల్లో అవాంతరాలు సృష్టించే వీలుందనే అనుమానాలు ఉన్నత వర్గాల్లోనూ ఉన్నాయి.
దీంతో పరీక్ష పేపర్లు పంపే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అన్ని పరీక్ష కేంద్రాల్లో విధిగా సీసీ కెమెరాల ముందే ప్రశ్నపత్రాలు ఓపెన్ చేయాలని ఆదేశాలిచ్చారు. అదే విధంగా జవాబు పత్రాలు సురక్షితంగా చేరే వరకూ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. పరీక్ష లపై అసత్య ప్రచారం చేసేందుకు కొంతమంది సామాజిక మాధ్యమాలను వాడుకునే అవకాశముందని, ఈ అంశాలపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు.