ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. వివాద, అవినీతి రహిత పాలన అందించేలా ఈ వ్యవస్థను మలచాలని భావిస్తున్న సర్కారు.. భూ వివాదాలను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. అక్రమాలు, అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్న రెవెన్యూ శాఖను సంస్కరించాలని సీఎం కేసీఆర్ పట్టు్టదలగా ఉన్నారు. కేశంపేట, కీసర, షేక్‌పేట తదితర తహసీల్దార్ల అవినీతి లీలలు, కొన్నాళ్ల కిందట అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సజీవ దహనం çఘటన తో అవాక్కయిన ప్రభుత్వం.. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది.
20 కీలక నియమాలతో..
ప్రస్తుతం మనుగడలో ఉన్న 144 చట్టాలు/నియమాల్లో కాలం చెల్లినవాటికి మంగళం పాడి.. కేవలం 20 చట్టాలను క్రోడీకరిస్తూ కొత్త చట్టం రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు శివశంకర్, బలరామయ్య, రంగారెడ్డి జిల్లా మాజీ జేసీ సుందర్ అబ్నార్ తదితర రెవెన్యూ, న్యాయ నిపుణులతో కూడిన కమిటీ వారం రోజులుగా కొత్త చట్టం తయారీపై సంప్రదింపులు జరుపుతోంది. ఉద్యోగుల సర్దుబాటు, హోదాల మార్పులు, చేర్పులు తదితర అంశాలపై చర్చిస్తున్న ప్రభుత్వ పెద్దలు.. రెవెన్యూ వివాదాల పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితిని నయా చట్టంలో చేర్చనున్నారు. తహసీల్దార్ స్థాయిలో 45 రోజుల్లో పరిష్కారం కాని అర్జీని నేరుగా కలెక్టర్‌కు పంపాలని, అక్కడా పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ట్రిబ్యునల్‌కు నివేదించాలని, అది ఇచ్చే తీర్పు సంతృప్తికరంగా లేదని భావిస్తే.. రెవెన్యూ కోర్టుకు అప్పీల్ చేసుకునేలా కొత్త విధానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.
దరఖాస్తు పురోగతి వివరాలు
భూ వివాదాలు సకాలంలో పరిష్కరించేందుకు కొత్త విధానం దోహదపడుతుందని భావిస్తోంది. ఈ క్రమంలోనే సమస్యల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవాలని నిర్ణయించింది. దరఖాస్తుదారు అర్జీ దాఖలు చేసింది మొదలు... దాని పురోగతి (స్టేటస్) ఎలా ఉంది? ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉందనే సమాచారాన్ని కూడా ఆన్‌లైన్‌లోనే చూసుకునేలా ఏర్పాట్లు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment