
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలని పిలుపునిచ్చి నిరసన కార్యక్రమాన్ని తలపెట్టిన విప్లవ రచయితల సంఘం(విరసం), తెలంగాణ ప్రజా ఫ్రంట్(టీపీఎఫ్) నేతలను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. గాంధీనగర్‌లో విరసం నేత వరవరరావు, టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమాస కృష్ణ, హిమా యత్ నగర్‌లో ‘వీక్షణం’ఎడిటర్ వేణుగోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో విప్లవ రచయితలు పాణి, గీతాంజలి, రాంకి, కాశిం, కూర్మనాథ్, ‘మా భూమి’సంధ్య, సాగర్, అరవింద్ తదితరుల్ని అరెస్టులు చేశారు.
దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకుని నార్త్‌జోన్‌లోని వివిధ ఠాణాలకు తరలించారు. తెలుగు మహాసభల ప్రారంభ వేడుకలు ముగిసిన అనంతరం సొంత పూచీకత్తుపై వీరిని విడిచిపెట్టారు. ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్వహిస్తోందని ఆరోపిస్తూ ట్యాంక్‌బండ్‌పై శ్రీశ్రీ విగ్రహం వద్ద విరసం, టీపీఎఫ్ నిరసన తలపెట్టడంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. అక్కడికి వచ్చిన వారిని వచ్చినట్లే అరెస్టు చేశారు. తెలుగు భాషను ధ్వంసం చేసేవాళ్లే సంబరాలు జరుపుతారా.. అని వరవరరావు విమర్శించారు.